ఆవు గొప్పదనం తెలియజేసిన చ్యవన ముని!
ఆవు గొప్పదనం తెలియజేసిన చ్యవన ముని!
చంద్ర వంశానికి చెందిన పురూరవ చక్రవర్తికి, ఊర్వశికి ఆయువు అనే కుమారుడు పుట్టాడు. ఈ ఆయువుకు నహుషుడు అనే కొడుకు పుట్టాడు. నహుషుడు తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా పాలించేవాడు. ఒకరోజు గంగా యమునా నదుల సంగమ ప్రాంతంలో కొంతమంది చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతుండగా వారికి చేపలతో పాటు ఓ ఋషి కూడా వలలో పడ్డాడు. ఆ ఋషి 12 సంవత్సరాల నుండి నీళ్లలో సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు. అలాంటి ఋషి తపస్సుకు భంగం కలిగించామని ఆ చేపలు పట్టేవాళ్ళు బాధపడ్డారు. అలా నీటిలో తపస్సు చేసుకుంటున్న ఋషి పేరు చ్యవనుడు.
చేపలు పట్టేవాళ్ళంతా చ్యవణుడితో క్షమించమని కోరారు. అయితే చ్యవనుడు మాత్రం వాళ్ళతో "నేను చేపలతో కలిసి ఇన్నాళ్లు బ్రతికాను ఇప్పుడు వాటితో పాటు మీకు దొరికాను. మీరు నన్ను కూడా చేపలతో పాటు అమ్మేసి డబ్బు కూడబెట్టుకోండి" అన్నాడు.
ఋషి ఆజ్ఞను అమలుపరచడం ఎలాగో తెలియక జాలరులు ఆ సమస్యను నహుషుని దృష్టికి తీసుకొని వచ్చారు. నహుషుడు విషయం తెలిసిన వెంటనే మంత్రి పురోహితులు అందరితో కలిసి చ్యవనమహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసాడు. మత్స్యకారులు పొరపాటు చేశారు క్షమించండి అని క్షమాపణ అడిగాడు. అయితే చ్యవనుడు నహుషునితో జాలరులకు చెప్పినమాటే చెప్పాడు. 'చేపలతో పాటు నన్ను కూడా తగిన వెలకు అమ్మండి' అని అన్నాడు.
చ్యవనుడు అలా చెప్పిన తరువాత నహుషుడు చేపలు పట్టేవాళ్లకు వేయి మాడలు ఇవ్వబోయాడు. అయితే చ్యవనుడు 'రాజా! నా వెల వేయి మాడలా? సరియైన వెల ఇవ్వవయ్యా!' అన్నాడు.
చక్రవర్తి లక్షమాడలన్నాడు. చ్యవనమహర్షి సంతృప్తి చెందలేదు. కోటి మాడలన్నాడు. ఋషికి అంగీకారం కాకపోవడంతో సగం రాజ్యమివ్వడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అదీ సరియైన వెల కాదన్నాడు ముని. మొత్తం రాజ్యాన్ని మునికోసం సమర్పించడానికి సిద్ధపడ్డాడు నహుషుడు. అప్పటికీ చ్యవనమహర్షి ఒప్పుకోకపోవడంతో నహుషుడికి ఏం చేయాలో తోచలేదు.
చివరకు చ్యవన మహర్షి నహుషునితో 'రాజా! వెళ్ళి నీ మంత్రులతో సంప్రదించి తగిన వెలనునిర్ణయించు' అని ఆదేశించాడు.
సకలసంపదలు కలిగిన రాజ్యం కూడా చ్యవనుడికి సరితూగకపోవడంతో ఏం చేయాలా అని బాధపడుతున్న నహుషుని వద్దకు గవిజాతుడనే ముని వచ్చి పరిష్కారం చెప్పాడు. 'బ్రాహ్మణుని, గోవును - ఆ బ్రహ్మ దేవుడు సమాన విలువ కలిగినవిగా సృష్టించాడు. బ్రాహ్మణుడు అఖిల మంత్రాలకు అధిష్టానమైతే గోపు హవిస్సుకు మూలం. కనుక చ్యవనునికి సాటి రాగలది గోవు తప్ప మరేదీలేదు. కాబట్టి అతనికి ఆవు నిమ్మను ఇవ్వమని మార్గం చెప్పాడు గవిజాతముని.
నహుషుడు చ్యవనమహర్షి దగ్గరకు వెళ్లి, 'మహాత్మా! తమకు వెల కట్టగల శక్తి మాకెక్కడిది? నన్ను కనికరించి మీకు తగిన మూల్యంగా ఈ ఆవును అంగీకరించండి'. అని ప్రార్ధించాడు. చ్యవనమహర్షి నహుషుని భక్తిశ్రద్ధలకు, వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు. 'రాజా! అవు అగ్నిమయం, అమృత స్వరూపం, స్వర్గానికి సోపానం. దేవతలకైనా పూజ్యనీయమైనది. హోమ విధాన సంపద్వాహినియైన గోవు నాకు తగిన వెల' అని అంగీకరించాడు.
ఆవు గొప్పదనానికి ఇదొక గొప్ప ఉదాహరణ.
◆నిశ్శబ్ద.