Read more!

భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన గొప్ప కథ!

 


భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన గొప్ప కథ!

మహాభారత యుద్ధము ముగిసిన తర్వాత భీష్ముడు శరతల్పగతుడై తాను మరణించదలచిన ఏకాదశికై (భీష్మ ఏకాదశి) ఎదరుచూస్తూ ఉన్నాడు. ఆ పుణ్య దినము ఇంకా రాలేదు. అది వచ్చేవరకు ఆయన మరణించాలని అనుకోలేదు. ఆ క్షణము సమీపించిన తరువాత జీవించుట అనేది లేదు. ఇది అంతా ఆయనే నిశ్చయించుకున్న విషయము. మరణశయ్య పై ఉన్న అతనిని సమీపించి ధర్మరాజు భీష్ముడు చెప్పే ధర్మసూక్ష్మములను వింటూ ఉండేవాడు. మహాభారతంలో శాంతి పర్వము అను పేరు పొందిన అద్భుతమైన ఈ ఉపదేశ పరంపర పూర్తి అయింది. కాని ధర్మరాజు మనసు మాత్రం శాంతించలేదు.


మహాభారత యుద్ధములో జరిగిన సంఘటనలన్ని అతనికి జ్ఞాపకానికి వస్తున్నాయి. యుద్ధంలో  వారి సాహసకృత్యములు, ప్రతీకారము తీర్చుకొన్న విధము, చేసిన ద్రోహ కృత్యములు మనసులో  విజృంభించి క్షోభను కలిగించాయి.


అప్పుడు భీష్మునితో ధర్మరాజు ఇలా.. అడిగాడు. ఇంత గొప్ప శాంతి పర్వమును విన్నాను. అయినా  నా మనసునకు శాంతి లభించడం లేదేంటి? నేనేం చెయ్యాలి? అని ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకు గౌతమి కథ చెప్పాడు. ఆ కథ విన్న తరువాత  ధర్మరాజుకు మనసు శాంతించినది. ఆ కథ ఇలా సాగుతుంది..


ఒక అడవిలో గౌతమి అనే గ్రామీణ స్త్రీ ఉండేది. ఆమెకు ఒకే ఒక కొడుడు. ఒక రోజు ఆ పిల్లవాడిని పాము కరిచింది. వెంటనే ఆ పిల్లాడు చనిపోయాడు. అర్జునకుడు అనే వేటగాడు ఈ ఘోరాన్ని చూసాడు. వెంటనే అతడు ఆ పామును వెతికి పట్టుకొని తాళ్ళతో కట్టి దానిని బంధించి తీసుకొని వచ్చి ఆ బ్రాహ్మణ స్త్రీ ముందుంచాడు. 


'మీ కొడుకుని చంపిన పాము ఇదే. దీన్ని ఎలా చంపాలో చెప్పండి. నిప్పుల్లో పడేయమంటారా? ముక్కలు ముక్కలుగా నరికిపారేయమంటారా? లేదా ఇంకా ఏవిధంగా చెయ్యాలో తొందరగా చెప్పండి' అని అడిగాడు ఆ వేటగాడు.


గౌతమి అతనితో ‘ఓ మూర్ఖుడా! ఆ పాముని విడిచిపెట్టు. దానిని చంపవద్దు. దానిని చంపినంతమాత్రాన చనిపోయిన నా కొడుకు  తిరిగిరాడు. అంతేకాక ఆ కారణంగా నేను, నువ్వు  నరకానికి పోవలసి వస్తుంది అని చెప్పింది. గౌతమికి తన కుమారుని చంపిన పాముని చంపి ప్రతీకారము తీర్చుకోవాలి అనే కోరికే లేదు. ధర్మసూక్ష్మ విషయాలలో గౌతమ వంశస్థులకు తెలియనిది లేదు కదా. పాపం వేటగానికి ఈ విషయం అర్థం కాలేదు.


అతడు ఆమెతో ‘మంచి చెడ్డలు తెలిసిన ఓ అవ్వా! నువ్వు చెప్పిన ఈ ఉపదేశాలు సాధారణ స్థితులలో బాగానే ఉంటాయి. కాని ఇప్పుడు ఒక అసాధారణ స్థితిలో మనం ఉన్నాం. నీ కొడుకుని ఈ పాము అన్యాయంగా చంపేసింది. దానికి ప్రతీకారంగా ఈ పాము ప్రాణాలు తీసి దండించవలసి ఉంది. అందువల్ల ఈ సందర్భంలో నువ్వు సహనాన్ని చూపించడం తగినది కాదు. దీనిని చంపి తీరవలసిందే ' అన్నాడు.


గౌతమి అతనితో ‘దీన్ని చంపకూడదు. నా కొడుకు ఆయుష్షు తీరింది. వాడు చనిపోయాడు. దాన్ని గురించి నాకు కొంచెం కూడా బాధలేదు. అందుకని నాకు ఈ పాముమీద కొంచెం కూడా కోపంలేదు. దీన్ని విడిచిపెట్టు' అంది. ఇలా గౌతమి తన కొడుకును చంపిన పాము మీద ఏమాత్రం కోపం, ద్వేషం పెంచుకోకుండా ప్రవర్తించింది.


                                    ◆నిశ్శబ్ద.