శని గ్రహం మరణానికి కారణం అవుతుందా... లఘు పరాశరి గ్రంథంలో ఏం చెప్పారంటే!

 

శని గ్రహం మరణానికి కారణం అవుతుందా... లఘు పరాశరి గ్రంథంలో ఏం చెప్పారంటే!


భారతీయులు జ్యోతిష్యాన్ని చాలా బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గ్రహాల ప్రభావం,  గ్రహాల సంచారం జాతకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.  గ్రహాలలో శని దేవుడిని లేదా శని గ్రహాన్ని కర్మ ప్రదాతగా పరిగణిస్తారు. చాలామంది శని ప్రభావం ఉన్నప్పుడు.. జీవితంలో కష్టాలు, అనారోగ్య సమస్యలు,  ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వంటివి ఎదురవుతూ ఉంటాయి. అయితే లఘు పరాశర అనే గ్రంథం మాత్రం శని గ్రహం గురించి చాలా విస్తుపోయే విషయాలు చెబుతుంది.  శని గ్రహం మారక గ్రహంగా ఉన్నప్పుడు.. శని గ్రహం కారణంగా మనిషి మరణానికి కూడా దగ్గరవుతాడని ఈ గ్రంథం చెబుతోంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

శని గ్రహం..

లఘు పరాశరి అనే జ్యోతిష్య గ్రంథం ప్రకారం,  శని గ్రహం,  బలహీనంగా ఉన్న మరొక గ్రహంతో  సంబంధం ఏర్పరచుకుంటే, అది మిగతా బలహీన గ్రహాలన్నింటి ప్రభావాన్ని అధిగమించి, ప్రధాన మరణ కారక గ్రహంగా మారుతుందట. శనికి ఉన్న ఈ ప్రత్యేక పాప ప్రభావం కారణంగా, చాలా మంది విద్వాంసులైన జ్యోతిష్యులు శనిని పాపగ్రహాలకు రాజు అని కూడా పిలుస్తారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జనన కుండలిలో శని మారక గ్రహం పాత్రలో ఉంటే, ఇతర మారక గ్రహాల ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ శనికి మారక గ్రహాలతో సంబంధం లేకపోతే, జాతకంలోని అత్యంత శక్తివంతమైన మారక గ్రహమే ఆ వ్యక్తి మరణానికి కారణమవుతుందట. అంతేకాకుండా, శనికి కొద్దిపాటి మారక గుణం వచ్చినా అది అశుభ గ్రహమైతే, అదే మరణానికి కారణమవుతుందట.

ఉదాహరణకు.. కర్కాటక లగ్నంలో శని ఏడవ , ఎనిమిదవ భావాలకు అధిపతిగా ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో, శనికి ఒక మారక గ్రహంతో సంబంధం ఉండటం, లేదా ఆ గ్రహమే ఒక శక్తివంతమైన మారక గ్రహంగా మారుతుంది.

పాపగ్రహ స్థానం  ప్రభావాలను నిర్ధారించే ముందు, జ్యోతిష్య గణనల ప్రకారం వ్యక్తి  వయస్సు విభాగాన్ని అంచనా వేయడం చాలా అవసరం అవుతుందని చెబుతారు. వయస్సును స్థూలంగా మూడు విభాగాలుగా విభజిస్తారు: దీర్ఘాయువు, మధ్యవయస్సు , స్వల్పకాలం. ముందుగా వ్యక్తి  వయస్సు విభాగాన్ని నిర్ధారించుకుని, ఆ తర్వాతే పాపగ్రహం గురించి ఆలోచించాలని  జైమిని మహర్షి నిర్ణయించారు.

ఒక వ్యక్తి మధ్య వయస్సులో లేదా దీర్ఘాయువులో ఉన్నప్పుడు మారక దశ సంభవిస్తే, సాధారణంగా మరణం సంభవించదు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి మరణం వంటి బాధను మాత్రమే అనుభవించవచ్చు. అయితే, శాస్త్రాలు మారక దోషానికి పరిహారాలను కూడా అందిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని మారక దశలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం చాలా మంచిది.

గమనిక.. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చిన విషయం.
                               

*రూపశ్రీ.