బుద్ధి స్థిరంగా ఉండటానికి కావలసిన లక్షణాలు!!

 

బుద్ధి స్థిరంగా ఉండటానికి కావలసిన లక్షణాలు!!

 

【దు:ఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః॥ వీతరాగభయక్రోధః స్తితధీర్మునిరుచ్యతే॥

దుఃఖము సంభవించినపుడు కుంగిపోనివాడు, సుఖములు సంప్రాప్తించినపుడు పొంగిపోనివాడు, రాగమును, భయమును, క్రోధమును వదిలిపెట్టినవాడు అయిన ధీరుడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. 】

స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో ఇక్కడ రెండు మూడు లక్షణాలు వివరించాడు పరమాత్మ. అన్నిటికంటే ముఖ్యమైన లక్షణము సుఖం వచ్చినపుడు పొంగి పోకుండా, దుఃఖం వచ్చినపుడు కుంగి పోకుండా, మనస్సును స్థిరంగా ఉంచుకోగలగడం. దీనికి మూలం తన మనస్సును, బుద్ధిని ప్రాపంచిక విషయముల నుండి వెనక్కులాగి, ఆత్మయందు స్థిరంగా ఉంచగలగాలి. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని పిలువబడతాడు. ఇది జరగాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. దుఃఖము వచ్చినపుడు మనసు క్షోభపడకూడదు. కలత చెందకూడదు. ఈ శరీరమే నేను అనే భావన కలిగినపుడే ఇలా జరుగుతుంది. ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకుంటే సుఖదు:ఖములు అతనిని బాధించవు. ఎందుకంటే సుఖము కానీ, దుఃఖము కానీ మనసుకు కలిగే వికారములు మాత్రమే. ఒకదాని వెంట ఒకటి వస్తూపోతూ ఉంటాయి. తానే ఆత్మ అనుకున్నవాడిని ఈ మనోవికారములు ఏమీ ప్రభావితం చేయలేవు.

ఇంకా రాగము అంటే ఆసక్తి, భయము, కోపము ఇవి విడిచిపెట్టాలి. ఇవి కూడా మనోవికారాలే. మొట్టమొదట ప్రాపంచిక విషయాల మీద మనసులో ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి సంకల్పం అవుతుంది. సంకల్పం కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరుతుందో లేదో అనే భయం కలుగుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఇవి ఒకదాని తరువాత ఒకటిగా వచ్చే వికారాలు. వీటికి స్థితప్రజ్ఞుడు ప్రభావితుడు కాడు. కోరికలను ఆసక్తి స్థాయిలోనే తుంచి వేస్తాడు.

మనన శీలుడిని ముని అని అంటారు. ఎల్లప్పుడు భగవంతుని గురించిన విషయములను మననం చేసుకుంటూ ఉంటే, రాగము, భయము, క్రోధము అతనిని ప్రభావితం చేయలేవు. అటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. స్థితప్రజ్ఞుడు తనకు ప్రతికూలమైన పరిస్తితులలో కూడా ఎలా ఉంటాడు, ఎలా వ్యవహరిస్తాడంటే  సుఖదు:ఖములకు అతీతుడు కాదు. అతడికీ మనసు ఉంటుంది. పూర్వజన్మకర్మ వాసనలు ఉంటాయి. వాటిని అనుభవించక తప్పదు. ఆ వాసనలు పుణ్యము పాపము తో కలిసి ఉంటాయి. అవి సుఖము దుఃఖము రూపంలో ఈ జన్మలో వెంటాడుతుంటాయి. వాటిని తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. అటువంటి సుఖము దుఃఖము వచ్చినపుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడంటే, దుఃఖము వచ్చినప్పుడు అతని మనస్సు ఉద్విగ్నత చెందదు. సుఖము కలిగినపుడు ఒళ్లు మరిచిపోయి ఆనందలోకాల్లో విహరించడు. ఎందుకంటే వాళ్ల మనసులు నిశ్చలత్వాన్ని ధృడత్వాన్ని సంతరించుకున్నాయి. వారికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉంటుంది. స్థితప్రజ్ఞులు ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల మీద ఆధారపడరు. దేనికీ అతిగా స్పందించరు. నిశ్చలంగా ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే బుద్ధి దృఢంగా  ఉంచుకోవడమే స్తితప్రజ్ఞుడి లక్షణం. 

రాగం అంటే లేనిది రావాలనే కోరిక, వచ్చింది పోతుందోమో అని భయం ప్రతివాడికీ ఉంటుంది. కోట్లు సంపాదించినా భయం పెరుగుతుంది. 

తరువాతది క్రోధము. క్రోధము అంటే అనవసరమైన ప్రతిస్పందనలు కలిగి ఉండడం.

కొంతమందికి ఊరికినే కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో  తెలియదు. ఎదుటి వాడు ఏ చిన్న మాట అన్నా, ఏ చిన్న ప్రతికూల విషయం సంభవించినా, అంతర్గతంగా అతనిలో విపరీతమైన ప్రతిస్పందనలు కలుగుతాయి. అవి కోపంగా బయటకు వస్తాయి. అప్పుడు అవయవాలు అతని స్వాధీనంలో ఉండవు. ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో అతనికే తెలియదు. పూర్వము మహాఋషులు అయిన విశ్వామిత్రుడు, దుర్వాసుడు కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయారు. శాపాలు ఇచ్చేవాళ్లు. కాబట్టి క్రోధమును అదుపులో పెట్టుకున్నవాడే స్థితప్రజ్ఞుడు.

ఇట్లా రాగము, భయము, క్రోధము ఒకటి వెంట ఒకటి వస్తాయి కాబట్టి, ఇవి లేకపోవడమే స్థితప్రజ్ఞుని లక్షణాలుగా చెప్పబడ్డాయి.

◆ వెంకటేష్ పువ్వాడ