థాయ్‌లాండ్‌లో బ్రహ్మదేవుని ఆలయం
థాయ్‌లాండ్‌లో బ్రహ్మదేవుని ఆలయం
బ్రహ్మదేవునికి పూజలందుకోరాదన్న శాపం ఉందంటారు. అందుకనే మన దేశంలో బ్రహ్మదేవుని ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దేశంలో ఉన్న ఒకటీ అరా బ్రహ్మదేవుని ఆలయాలు గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటాము. అలాంటిది ఎక్కడో థాయ్‌లాండ్‌లో ఓ బ్రహ్మదేవుని ఆలయం అక్కడి భక్తుల విశ్వాసాన్ని చూరగొంటోందంటే ఆశ్చర్యమే కదా!
ప్రా ప్రోం
ఇది థాయ్ సంస్కృతిలో బ్రహ్మదేవుని పేరు. పర బ్రహ్మ అన్న సంస్కృత శబ్దానికి ఇది వికృత పదం. ఈ పరబ్రహ్మ అంటే థాయ్ ప్రజలకు చాలా గౌరవం. అవడానికి అక్కడి జనం బౌద్ధాన్ని ఎక్కువగా నమ్మినా బుద్ధునితో పాటుగా ఇలా పరబ్రహ్మ వంటి దేవతలను కూడా పూజిస్తుంటారు. ప్రా ప్రోంను పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయనీ, సమస్యలన్నీ తీరిపోతాయని థాయ్‌వాసుల నమ్మకం. అందుకే థాయ్‌లాండ్‌లో బుద్ధ విగ్రహాలు, దేవాలయాలు అక్కడక్కడా దర్శనమిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది థాయ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఎరావన్ ఆలయం.
విఘ్నాలను తొలగించేందుకు
1950లలో థాయ్ ప్రభుత్వం ‘ఎరావన్’ పేరుతో ఒక ప్రతిష్టాత్మక హోటల్‌ను నిర్మించ తలపెట్టింది. ఎరావన్ అంటే మరేదో కాదు... మన ఐరావతమే! ఐరావతం వైభవానికి చిహ్నం కాబట్టి హోటల్‌కు ఆ పేరు పెట్టి ఉండవచ్చు. అయితే హోటల్ నిర్మాణం ప్రారంభం అయినప్పటి నుంచీ ఏదో ఒక విఘ్నం ఎదురవసాగింది. కూలీలకు గాయలవ్వడం, ఖర్చులు పెరిగిపోవడం, నిర్మాణసామాగ్రి నాశనం అయిపోవడం... ఇలా ఏదో ఒక విఘ్నంతో హోటల్ నిర్మాణం అసాధ్యంగా తోచింది. దాంతో జ్యోతిషుల సలహా మేరకు థాయ్ ప్రభుత్వమే అక్కడ బ్రహ్మదేవుని ఆలయం నిర్మించింది. ఆ తరువాత హోటల్ నిర్మాణం నిర్విఘ్నంగా సాగిందట. 1987లో అక్కడి స్థలంలో వేరే హోటల్‌ను నిర్మించినా... ఎరావన్ ఆలయాన్ని మాత్రం యథాతథంగా ఉంచేశారు.
భిన్నమైన ఆచారాలు
థాయ్‌లాండ్‌లో బ్రహ్మదేవుని ఆరాధన బౌద్ధుల ఆచారాలని తలపిస్తుంది. విగ్రహం ముందు ధూపం వేయడం, కొవ్వొత్తులు వెలిగించడం, కొబ్బరిపాలని నైవేద్యంగా అర్పించడం కనిపిస్తాయి. బ్రహ్మదేవుని ముందు ఏనుగు బొమ్మని పెడితే కోరుకున్న కోరిక నెరవేరుతుందన్న విశ్వాసమూ ఉంది. పరబ్రహ్మకి సంగీతం అంటే ఇష్టమన్నది థాయ్‌వాసుల విశ్వాసం. అందుకే ఆయన ఆయన ముందర థాయ్ సంగీతంతో కూడిన సంప్రదాయ నాట్యం సాగుతుంటుంది.
ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని
ఎరావన్ ఆలయానికి భక్తుల వెల్లువెత్తడంతో పాటుగా దాని మీద అసాంఘిక శక్తుల దృష్టి కూడా పడసాగింది. 2006లో ఒక పిచ్చివాడు అక్కడి ముఖ్య విగ్రహాన్ని తునాతునకలు చేసిపారేశాడు. దాంతో మరో విగ్రహాన్ని ప్రతిష్టించవలసి వచ్చింది. ఇక 2015లో అయితే దేవాలయం వద్ద ఒక భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో విగ్రహానికి పెద్దగా నష్టం జరగకపోయినప్పటికీ 20 మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ బాంబుదాడికి కారణం ఎవరో ఇప్పటివరకూ తేలకపోవడం విచిత్రం.
ఎరావన్ ఆలయానికి ఎన్ని అవాతరాలు ఎదురైనా... అక్కడి బ్రహ్మదేవుని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల వెల్లువలో ఏమాత్రం మార్పు రాలేదు. జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఇక్కడి దైవం తీరుస్తుందని థాయ్ ప్రజల గాఢ నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగానే వారి జీవితాలు సాగుతున్నాయి.
- నిర్జర.