ఏం చేస్తే మోక్షం దొరుకుతుంది
ఏం చేస్తే మోక్షం దొరుకుతుంది!
చాలామంది కేవలం సన్యాసం తీసుకోవడం వల్లే మోక్షం కలుగుతుందన్న అభిప్రాయంతో ఉంటారు. విజ్ఞులు ఎప్పుడూ ఈ అభిప్రాయాన్ని ఖండిస్తూనే వచ్చారు. సంసారంలో ఉంటూ, గృహస్థు జీవనాన్ని గడుపుతూ కూడా భగవంతునికి చేరువ కావచ్చునని పదే పదే చెప్పారు. రమణమహర్షి, రామకృష్ణ పరమహంస వంటివారి బోధలలో సైతం గృహస్థు జీవనం మోక్షానికి ఏమాత్రం అడ్డుకాదన్న మాట కనిపిస్తూ ఉంటుంది. అందుకు పురాణాలలో సైతం ఎన్నో కథలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. కావాలంటే శాంతిపర్వంలోని ఈ కథను గమనించండి.
ఈ లోకంలో అత్యుత్తమ ధర్మం ఏది అన్న అనుమానం కలిగింది ధర్మరాజుకి . దాంతో భీష్ముడి దగ్గరకు వెళ్లి తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఆ సమయంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఇలా బదులిచ్చాడు. ‘‘నాయనా ఈ లోకంలో ఫలానా ధర్మమే గొప్పది. ఫలానా ధర్మం పనికిమాలినది అంటూ ఏమీ ఉండదు. అందుకు సాక్ష్యంగా ఓ ఘటనని చెబుతాను విను.
‘‘పూర్వం నారదుడు ఓసారి ఇంద్రుని చెంతకు వెళ్లాడు. అక్కడ ఆ దేవర్హికి సకల మర్యాదలూ చేసిన ఇంద్రుడు ‘మీరు లోకమంతా చుట్టి వస్తూ ఉంటారు కదా! ఈ మధ్యకాలంలో మీరు గమనించిన అద్భుతమైన విషయం ఏదన్నా ఉందా!’ అని అడిగాడు. దానికి నారదుడు ‘నేను లోకసంచారం చేస్తూ భృగు మహర్షి వద్దకు వెళ్లాను. ఆ సమయంలో భృగు మహర్షి దగ్గరకి ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథిని సేవించిన భృగు మహర్షి ‘బ్రాహ్మణోత్తమా! ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తే నాకు ముక్తి లభిస్తుందో చెప్పగలవా?’ అని అడిగాడు.
‘‘దానికి ఆ బ్రాహ్మణుడు ‘అయ్యా! నాకు కూడా ఈ విషయంలో సందేహమే. కాకపోతే నైమిశారణ్యంలో గోమతీనదీ తీరాన మహాపద్ముడనే సర్పం నివసిస్తోంది. అది సూర్యునికి రథంగా వ్యవహరిస్తోంది. సూర్యునితో పాటుగా లోకసంచారం చేసే ఆ సర్పానికి మహాజ్ఞాని అని పేరు. మీరు వెళ్లి ఆ సర్పాన్ని అడిగి చూడండి’ అని బదులిచ్చాడు.
‘‘ఆ మాటని అనుసరించి భృగు మహర్షి గోమతీ నదీ తీరంలోని మహాపద్ముని నివాసానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మహాపద్ముడు సూర్యునితో పాటుగా లోకసంచారానికి వెళ్లాడనీ, మరో ఎనిమిది రోజులకి కానీ తిరిగి రాడనీ తెలిసింది. దాంతో గోమతీ నదీ తీరానే నిరాహారంగా తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు.
‘‘ఎనిమిది రోజుల తర్వాత తిరిగి వచ్చిన మహాపద్మునికి, భృగు మహర్షి నిరీక్షణ గురించి తెలిసింది. తన భార్య సలహా మేరకు అతని దగ్గరకు వెళ్లి ఆయన వచ్చిన కారణం ఏమిటో కనుక్కొనే ప్రయత్నం చేశాడు. భృగు మహర్షి అనుమానం గురించి విన్న మహాపద్ముడు- ‘ఓ మహర్షీ! నేను ఆ సూర్యభగవానునితో పాటుగా తిరిగే సమయంలో ఓ అద్భుతాన్ని చూశాను. బహుశా ఆ సంఘటనని వివరిస్తే, మీ సందేహం నివృత్తి అవుతుందేమో.
ఒకసారి నేను సూర్యునితో పాటు సంచరిస్తుండగా సూర్యుని మించిన తేజోవంతుడైన వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తిని అలా చూస్తుండగానే, అతను వచ్చి సూర్యునిలో ఐక్యమైపోయాడు. ఇంతా చేసి అతను ఓ పేద బ్రాహ్మణుడని తెలిసింది. తనకి దొరికిన ధాన్యపు గింజలతో తృప్తి పడుతూ, పండ్లతో కడుపు నింపుకొంటూ, తనకి ఉన్నదానిలో ఇతరులకి తోచిన సాయం చేస్తూ గడిపే వ్యక్తని తెలిసింది.
అలాంటి ఉన్నతమైన లక్షణాలతో అతను సూర్యలోకాన్ని పొందాడు’ అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలతో సంతృప్తి చెందిన భృగు మహర్షి సంతోషంగా తన ఆశ్రమానికి తిరిగివచ్చాడు’’ మహాపద్ముని మాటలు విన్న భృగు మహర్షికి ధర్మం ఏదైనా కూడా ఉన్నదాంతో సంతృప్తి పడుతూ, ఎలాంటి వ్యామోహాలకీ లోనుకాకుండా, ఇతరులకి చేతనైన సాయం చేసేవారికి మోక్షం తథ్యమని తేలిపోయింది.
- నిర్జర.