ఆరోగ్యం బాగుండాలంటే సూర్యుడిని ఇలా ఆరాధించాలి..!
ఆరోగ్యం బాగుండాలంటే సూర్యుడిని ఇలా ఆరాధించాలి..!
సూర్యుడి ఆరాధన కూడా శివారాధన లాగే తేలికగా ఉంటుంది అంటారు. అలాగని శివుడిని, సూర్యుడిని మిగిలిన దేవతలతో పోల్చడం సరికాదు. శివుడు నిరాడంబరుడు అని అంటారు. అలాగే సూర్యుడు కూడా అంతేనట. అదే దీని అర్థం. సూర్యుడిని ఆరాధించడానికి చాలా కష్టపడక్కర్లేదని, కాసింత ఏకాగ్రతతో కొన్ని సులభమైన దశలలో సూర్యుడి ఆరాధన చేయవచ్చునని పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు. ఆరోగ్యానికి సూర్యుడి ఆరాధన చాలా సహాయపడుతుందట. సూర్యుడిని ఈ కింది విధంగా ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు తొలగుతాయని, ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుందని అంటారు. దీని గురించి తెలుసుకుంటే..
జీవుల శరీరంలో ఉండే ఎముకల నిర్మాణానికి సూర్యుడే మూలం. కాస్త సైన్స్ పద్దతిలో చెప్పాలంటే సూర్య కాంతి వలలనే శరీరానికి విటమిన్-డి లభిస్తుంది. శరీరానికి విటమిన్-డి లభించకపోతే శరీరంలో ఎముకల ఎదుగుదల సరిగా ఉండదు. విటమిన్-డి లేకపోతే శరీరం కాల్షియం ను గ్రహించలేదు. అందుకే ఇలా అన్నారు. అశ్వినీ కుమారుల ఆరాధన వల్ల కూడా దీర్ఘకాలం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండగలుగుతారు. జంతువులు, మొక్కలు, మనుషులకు ఇలా సకల జీవరాశికి ఎలాంటి పక్షపాతం లేకుండా తన వెలుగును ప్రసాదించేవాడు సూర్యుడే.. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అన్నారు.
రాశుల స్థానం మారడాన్ని బట్టి సూర్యుడి శక్తి బలహీన పడటం, బలంగా మారడం వంటివి జరుగుతాయి. అయితే ఆరోగ్యం బాగుండాలన్నా, అనారోగ్య సమస్యలు తగ్గాలన్నా సూర్యుడి ఆరాధన చాలా మంచిది. ఉదయాన్నే సూర్యుడు ఉదయించకనే లేవాలి. దీనినే బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత సూర్యుడు ఉదయిస్తుండగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే సూర్యుడి అనుగ్రహం ఉంటుందట. తరువాత ప్రతి రోజూ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలోనే ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. కనీసం మూడు సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ఇది కూడా సూర్యుని కాంతి సమక్షంలో కూర్చుని చేయాలి. కుదిరిన వారు బెల్లం పొంగలి ప్రసాదాన్ని చేసి సూర్యుడికి ఎదురుగా ఉంచి అప్పుడు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి.
అభిజీత్ ముహూర్తం..
తరచుగా గాయాలు అవుతున్నవారు, శరీరంలో కాల్షియం లోపం ఎక్కువగా ఉన్నవారు, తరచుగా ప్రమాదాల బారిన పడేవారు, హత్య భయం, పరువు నష్టం వంటివి ఎదుర్కునే వారు అభిజీత్ ముహూర్తంలో సూర్యుడిని పూజించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మద్యాహ్నం సమయంలో సూర్యుడిని ఆరాధించాలి. అభిజీత్ ముహూర్తం చాలా బలమైనది, శక్తివంతమైనది. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ చేసినప్పుడు అభిజీత్ ముహూర్తాన్నే ఎంచుకున్నారు. ఉదయం 11.45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.30 వరకు గల కాలాన్నే అభిజీత్ ముహూర్తం అంటారు. శివుడు త్రిపురాసురుడిని వధించినది కూడా ఈ అభిజీత్ ముహూర్తంలోనే. అర్థమయ్యేలా చెప్పాలి అంటే.. మధ్యాహ్నం కావడానికి ముందు 24 నిమిషాల కాలం.. ఆ తరువాత 24 నిమిషాల కాలాన్ని కలిపి అభిజీత్ ముహూర్తం అంటారట. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అభిజీత్ ముహూర్తంలో సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.
*రూపశ్రీ.