Read more!

దృష్టికోణం గురించి భగవద్గీతలో ఏముంది?

 

దృష్టికోణం గురించి భగవద్గీతలో ఏముంది?

మనకు సాధారణంగా ఈ ప్రపంచంలోని వస్తువులు అన్నీ 2డి 3డి లో కనిపిస్తాయి. వాటినే మనం చూడగలం. అవే ఎప్పటికీ ఉంటాయి అనుకుంటూ ఉంటాము. అవీ కొద్దిదూరం మాత్రమే కనిపిస్తాయి. మన వెనుక ఉన్నవి మనకు కనిపించవు. ఇదీ మన పరిమితి. ఇటువంటి పరిమితి కలిగిన చూపు ఉన్న మనం ఈ అనంత విశ్వాన్ని ఎలా చూడగలము. దానికే దివ్య నేత్రములు ఇచ్చాను అని అన్నాడు గీతలో కృష్ణుడు. అంటే మూడో నేత్రము అంటే మనో నేత్రము. ఈ మనో నేత్రంతోనూ మనం ఎన్నో వస్తువులను చూస్తాము. అంటే కళ్లుమూసుకుంటే మనం అమెరికాకు, అమలాపురానికి ఒకేసారి వెళ్లగలం. రష్యాలో ఉన్న మన బంధువులను అరక్షణంలో చూడగలం. అంటే మనం వాటిని ఇంతకు ముందేచూచి ఉండాలి లేక వాటి గురించి విని ఉండాలి. కృష్ణుడు విభూతి యోగంలో అన్నిటి గురించి చూచాయగా చెప్పాడు. విభూతి యోగంలో చెప్పిన వాటి విజుయల్సు ఇప్పుడు చూపిస్తున్నాడు. కాబట్టి ఉభయ సేనల మధ్యలో కృష్ణుడు, అర్జునుడు రథం మీద నిలబడి ఉన్నారు. అర్జునుడి మనసులో ఈ అనంత విశ్వం క్షణం సేపు కనిపించింది. అదే విశ్వరూప సందర్శనం.


కృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టి ఇచ్చాడు అని చెబుతారు. మనకు కూడా ఈ దివ్యదృష్టి ఏమిటో తెలుసు, లాబొరేటరీలలో మైక్రోస్కోప్ అనే పరికరం ఉంటుంది. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులను వైరస్ లును ఆ పరికరం మన కంటికి స్పష్టంగా చూపిస్తుంది. అదే బైనాక్యులర్స దూరంగా ఉండి మన కంటికి చూపుకు అందని వాటిని మనకు చూపిస్తూ ఉంది. ఈ వస్తువులను శాస్త్రజ్ఞుడు ధరించినా, ధనికుడు ధరించినా, దరిద్రుడు ధరించినా ఒకే విధంగా చూపిస్తాయి. కాని ఇవి కూడా ఒక పరిమితికి లోబడి ఉంటాయి. అపరిమితమైన ఈ అనంత విశ్వాన్ని మనకు చూపించగలిగేది దివ్యదృష్టి, దానిని మనో నేత్రము అంటారు. ఆ దివ్యదృష్టి మనకు ధ్యానంలో లభిస్తుంది. బైనాక్యులర్సు లో కానీ మైక్రోస్కోప్ లో గానీ ఎవరు చూచినా వారికి సూక్ష్మవస్తువులు, దూరంలో ఉన్న వస్తువులు ఎలా కనిపిస్తాయో అలాగే ఏకాగ్రతతో, ధ్యానం చేస్తే మనకూ విశ్వరూపం కనపడుతుంది. ఆ శక్తినే అర్జునుడికి ఇచ్చాడు పరమాత్మ. కాకపోతే మనకు బయట ప్రపంచంలో ఉన్న వస్తువులను చూడటానికి చూపించే ఆసక్తి ఆత్మ సందర్శనానికి, విశ్వరూప సందర్శనానికీ చూపించము. అర్జునుడు ఆ ఆసక్తి చూపించాడు. అంతే తేడా.


అర్జునుడు అలా ఆసక్తి చూపించినప్పుడు ఏమి జరిగింది?? అర్జునుడు కళ్లు మూసుకొని కృష్ణుడు ప్రసాదించిన దివ్యదృష్టితో అనంతమైన ఈ విశ్వం యొక్క దివ్యమైన రూపాన్ని దర్శిస్తున్నాడు. ఇక్కడ అర్థమైన విషయం ఏమిటంటే దేంట్లో అయినా ఉన్న విషయాన్ని స్పష్టంగా చూడాలంటే మొదట ఆసక్తి అవసరం. అది ఉన్నప్పుడు చాలా బాగా గమనించి చూడగలుగుతాము. అది లేకపోతే ఎంత గొప్ప విషయన్ని అయినా అందులో ఏమి ప్రత్యేకత లేదులే అన్నట్టు చూస్తుంటాము. అదే దృష్టికోణం అనబడుతుంది కూడా.

          ◆వెంకటేష్ పువ్వాడ.