మరణించినవారి ఫోటోలు ఏ దిక్కున ఉంచాలి...
మరణించినవారి ఫోటోలు ఏ దిక్కున ఉంచాలి...
ప్రతి సంవత్సరం పితృ పక్షం వస్తుంది. మరణించిన పెద్దల ఆత్మను శాంతి పరచడానికి పితృపక్షాలు చాలా మంచి సమయంగా పరిగణించబడతాయి. ఈ యేడాది పితృ పక్షం సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 14 వరకు కొనసాగుతుంది. చాలా సార్లు కొంతమంది తెలిసీ తెలియక తప్పుకు పాల్పడటం వలన పితృ దోషానికి సంబంధించి ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఇంట్లో పూర్వీకుల ఫోటోలను తప్పు దిశలో ఉంచడం కూడా కొన్ని వ్యతిరేక ప్రభావాలను కలిగిస్తుంది. పూర్వీకుల ఫోటోలను ఏయే ఏయే ప్రదేశాల్లో పెట్టకూడదో, అసలు ఫోటోల విషయంలో నియమాలేంటో తెలుసుకుంటే..
మత విశ్వాసాల ప్రకారం, పితృ పక్షంలో పూర్వీకులను స్మరించుకోవడం, పిండదానం, తర్పణం, శ్రాద్ధ కర్మలు మొదలైన వాటి ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఈ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. వాస్తు ప్రకారం పూర్వీకుల ఫోటోలను ఇంట్లో ఉంచేటప్పుడు దిశను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం, లేకుంటే అది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వాస్తు ప్రకారం పూర్వీకుల ఫోటోను పడకగది, వంటగది, పూజ గదిలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల పూర్వీకులకు కోపం రావచ్చు. దీని కారణంగా వ్యక్తి పిత్ర దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. చాలామంది ఇంటి లోపలికి వస్తున్నప్పుడు, వెళ్లేటప్పుడు ఫొటో కనిపించేలా ఫోటో పెడుతుంటారు. ఇది కూడా చాలా తప్పు. అదే విధంగా ఇంట్లో పూర్వీకుల ఫోటోలు ఎక్కువగా ఉండకూడదు.
దక్షిణ దిశను యమరాజుతో పాటు పూర్వీకుల దిశగా పరిగణిస్తారు. కాబట్టి ఇంటి దక్షిణ దిశలో మరణించినవారి ఫోటోలను ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మరణించినవారి ఆశీర్వాదం ఇంటిల్లిపాదిపై ఉంటుంది.
ఏదైనా కారణాల వల్ల పితృ దోషాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, దాన్ని వదిలించుకోవడానికి కొన్ని నివారణలను ప్రయత్నించవచ్చు. పితృ పక్షం సమయంలో పేదవారికి, బ్రాహ్మణులకు ఆహారం ఇవ్వడం, సామర్థ్యం ప్రకారం వారికి దక్షిణ ఇవ్వడం చేయాలి. దీనితో పాటు సాయంత్రం దీపం వెలిగించి నాగ స్తోత్రం, మహామృత్యుంజయ మంత్రం, రుద్ర సూక్తం లేదా పితృ స్తోత్రాలను పఠించాలి. మధ్యాహ్నం రావిచెట్టుకు నీరు పోయాలి. దీనితో పాటు నల్ల నువ్వులను నీటిలో కలిపి దక్షిణ దిక్కున అర్ఘ్యం చేయాలి.