అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా… ఇంకా ఏమేం చేయవచ్చు!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా… ఇంకా ఏమేం చేయవచ్చు!
అక్షయ తృతీయ అనగానే ఆ రోజు ఎంతో కొంత బంగారం కొనితీరాలి అనే… నమ్మకం ఉంది. అది ఎంతవరకు నిజం. ఎలాంటి కొనుగోళ్లు చేయలేని లాక్ డౌన్ పరిస్థితులలో, ఏం చేయవచ్చు? అన్న ఆలోచన వచ్చినప్పుడు పెద్దల మాటలను పరిశీలిస్తే స్పష్టమైన జవాబులు లభిస్తాయి.
వైశాఖమాసంలో శుక్లపక్ష తృతీయ నాడు వచ్చే పండుగే అక్షయ తృతీయ. అక్షయం అంటేనే ‘శాశ్వతం, దైవం, ఆనందం’ అన్న అర్థాలు ఉన్నాయి. ఈ రోజును అలా భావించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. విష్ణుమూర్తి విశిష్ట రూపమైన పరశురాముడు అవతరించింది ఈ రోజునే. కృష్ణుని సరిసమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈ రోజే.
అక్షయ తృతీయకు సంబంధించి మరెన్నో విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. గుప్పెడు అటుకులతో శ్రీకృష్ణుడు, కుచేలుడిని ధనవంతుని చేసిన రోజు అనీ; అరణ్యవాసంలో ఉన్న పాండవులకు, కృష్ణుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన సందర్భం అనీ; లక్ష్మీదేవి, కుబేరునికి సంపదలు అనుగ్రహించిన పుణ్యదినం అనీ ఎన్నో ఘట్టాలు వినిపిస్తాయి. ఇవన్నీ కూడా సంపదను, భాగ్యాన్నీ సూచించేవే!
ఇలాంటి కారణాలతోనే ఈ రోజు బంగారాన్ని కొనడం శుభసూచకం అనే అభిప్రాయం మొదలైపోయింది. పైగా అక్షయ తృతీయ రోజు ఏం చేసినా కూడా దానికి అక్షయమైన (శాశ్వతమైన) ఫలితం వస్తుందనే మాట ఎలాగూ ఉంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు సంగతి అలా ఉంచితే… జపం, తపం, దానం, యజ్ఞం… ఇలా ఏ మంచి పని చేసినా కూడా అది అపారమైన ఫలితాన్నిస్తుందని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి కేవలం బంగారం కొనాలని మాత్రమే లేదు. అంతేకాదు! బాధపడుతూనో, అప్పు చేసో బంగారాన్ని కొంటే… ఆ రుణం, బాధలు కూడా ఎప్పటికీ మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంటారు పెద్దలు. సూర్యుడి తాపం అసాధారణంగా ఉండే ఈ కష్టకాలంలో మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగులు, వస్త్రాలు లాంటివి పేదలకు దానం చేస్తే మంచిది.
అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకం. సింహాచంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది. ఈ రోజునే పురూరవుడు అనే రాజు, స్వామివారి నిజరూపాన్ని సందర్శించాడని చెబుతారు. అందుకని ఏడాది పొడవునా స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లబరుస్తూ పూసే చందనాన్ని, ఇవాల్టి రోజున తొలగిస్తారు. స్వామివారి నిజరూప సందర్శనం కలిగిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తి, స్వామి నుంచి వేరుపడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ.
అక్షయ తృతీయ పర్వదినాన విష్ణుమూర్తిని ఆరాధిస్తే విశేషమైన ఫలితం దక్కుతుందని మత్స్యపురాణం చెబుతోంది. ఈ రోజు సూర్యాదయానికి ముందే నిద్రలేచి, తలార స్నానం చేసి, విష్ణుమూర్తిని ఆరాధించాలని పేర్కొంటోంది. వైశాఖ మాసం అంతా కూడా విష్ణుమూర్తికి ప్రీతికరమే అయినా… ఈరోజు, ఆ అక్షయమైన స్వామికి మరింత ఇష్టమైన సందర్భం! కాబట్టి ఆ స్వామిని కొలిచేందుకు, సాటిమనిషికి తోచినంత సాయం చేసేందుకు, వీటును బట్టి కనక,వస్తు,వాహనాలు ఏవైనా కొనుగోలు చేసేందుకు ఇది అనువైన సందర్భం.
- మణి.