అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమే కాదు.. ఇంకా ఎన్నో ఉన్నాయ్..!
అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమే కాదు.. ఇంకా ఎన్నో ఉన్నాయ్..!
భారతీయ హిందూ పంచాంగంలో ప్రతి తిథికి ఓ ప్రత్యేకత ఉండనే ఉంటుంది. పండుగలు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక సందర్బాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. వాటిలో ధన త్రయోదశి, అక్షయ తృతీయలకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందువులు ఈ తిథులలో బంగారం కొనడాన్ని శుభప్రదంగా పేర్కొంటారు. మే 10 వతేదీన అక్షయ తృతీయ సందర్భంగా ప్రజలు బంగారం కొనడంలో ఆసక్తిగా ఉన్నారు. అయితే అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే కాదు.. బంగారంతో పాటూ మరెన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. ఇంతకీ అక్షయతృతీయ తిథి సమయం ఎప్పుడు? ఈరోజున ఏం చేస్తే మంచిది? తెలుసుకుంటే..
వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి రోజును అక్షయ తృతీయగా పేర్కొంటారు. అక్షయ తృతీయకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉన్న విషయం తెలిసిందే.. మే 10 వ తేదీ ఉదయం 5:33 నుండి మధ్యాహ్నం 12:18 వరకు ఈ ఏడాది అక్షయ తృతీయ పూజ సమయం ఉంటుంది. అక్షయ తృతీయ పూజ ఇంట్లో చేసేవారు ఈ సమయంలో పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది.
అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం అనే ప్రత్యేకత తప్ప చాలా మందికి ఈరోజుకు ఉన్న ఇతర ప్రముఖ విషయాలు తెలియవు. అక్షయ తృతీయ రోజున పరశురాముడు జన్మించాడు. అంతే కాదు.. మహాభారతం రాయడాన్ని ఇదే రోజున వేద వ్యాస మహర్షి మొదలుపెట్టాడు.
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదని నమ్ముతారు. అయితే ఐశ్వర్యాన్ని, సిరిసంపదలను పొందాలంటే అక్షయ తృతీయ రోజు మహావిష్ణువును, లక్ష్మీ దేవిని పూజించాలి.
అక్షయ తృతీయ రోజు దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈరోజు చేసే దానం వల్ల కలిగే పుణ్యఫలం జీవితాంతం కాపాడుతుందని పురాణ కథనాలు చెబుతున్నాయి.
సాధారణంగా పుణ్య తిథులలో చేసే స్నానం పవిత్రమైనదిగా పరిగణింపబడినట్టే అక్షయ తృతీయ రోజు గంగా నది లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం, ఆ తరువాత దానం చేయడం ఎంతో పుణ్యఫలితాన్ని ఇస్తుంది.
ప్రాణ భయం ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు అక్షయ తృతీయ రోజున మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలు, ప్రాణ భయాలు తగ్గి దీర్ఘాయుష్షు కలుగుతుంది.
ఇక అక్షయ తృతీయ అయినా, ధన త్రయోదశి అయినా బంగారం, వెండి కెనాలనే పద్దతి పాటించేవారు చాలామంది ఉంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం శుభప్రదం. ఇలా ప్రతి ఏడాది కొంటూ ఉంటే ఇంట్లో ఐశ్వర్యం అభివృద్ది చెందుతుంది.
*రూపశ్రీ.