నేడు బలరాముడి జయంతి!

 

నేడు బలరాముడి జయంతి!

భాగవతంలో శ్రీకృష్ణుడి పాత్ర ఎంత ఉందో బలరాముడి పాత్ర కూడా అంతే ఉంది. కంసుడిని వధించాలని దేవతలు విష్ణువును శరణు వేడితే తాను బలరామ కృష్ణులుగా జన్మించి కార్యం చేపడతానని చెబుతాడు. 

గమ్మత్తైన జననం

విష్ణువు అన్నట్టుగానే బలరామ కృష్ణులుగా జన్మించడానికి తన తల నుండి తెల్లవెంట్రుకను బలరాముడిగాను, నల్లవెంట్రుకను కృష్ణుడిగానూ భావించి దేవకి గర్భంలోకి చేర్చుతాడు. అయితే పుట్టబోయే శిశువుకు కంసుడి ద్వారా ప్రమాదం అని భావించి ఇంకా బిడ్డ పుట్టకుండానే గర్భ మార్పిడి ద్వారా దేవకి గర్భాన్ని గోకులంలో ఉన్న రోహిణిలోకి చేర్చడం అనే విషయం తెలిస్తే ఆనాటికే వైద్య సాంకేతికత ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగే కౌరవులు కూడా ప్రస్తుతం చెప్పుకునే టెస్ట్ ట్యూబ్ తరహాలో జన్మించిన వారే అనే విషయం తెలియంది కాదు. 

ఆవిధంగా రోహిణి గర్భాన జన్మించిన బలరాముడు, శ్రీకృష్ణుడు పుట్టగానే తిరిగి గోకులం కు చేరాక, తన తమ్ముడైన కృష్ణుడి నీడలాగే ఉంటూ పెరిగాడు.

అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడు అని కృష్ణుడి అల్లరిని కంట కనిపెట్టే దశ నుండి, కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి తీరవలసిందే అంటే యుద్ధంలో ఉండే అందరికి సమయం ఆసన్నమైంది అన్నమాట. ఈ యుద్ధంలో నావాళ్ళు, నా శ్రేయోభిలాషులు, నేను అభిమానించేవాళ్ళు ఇలా ఎందరో ఉన్నారు. వాళ్ళందరిని మృత్యు దశలో నేను చూడలేను అంటూ సరస్వతి నదీ తీరానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. 

బలరాముడి జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే మహాభారతం మొత్తం తెలియాలి, ముఖ్యంగా శ్రీకృష్ణుడి జీవితం గురించి క్షుణ్ణంగా తెలిస్తే బలరాముడి గురించి కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే వీరిద్దరిదీ విడదీయరాని  బంధం.

బలరాముడు ప్రకృతి వంటి వాడు అని భాగవతం చదివితే అర్థమవుతుంది. ఆయన ప్రతి అడుగులోనూ ప్రకృతీ స్పందన ఛాయలు కనబడుతూ ఉంటాయి. నాగలిని తన ఆయుధంగా చేసుకున్న బలరాముడు గొప్ప యుద్ధ యోధుడు, వీరుడు. గదా విద్యలో నిష్ణాతుడు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ కూడా బలరాముడిని గురువుగా భావించి గదా విద్యను అభ్యసించినవారే. ప్రకృతిలా ప్రశాంతగా ఉండటమూ, వైపరీత్యాన్ని సృష్టించడమూ, ప్రేమగా అక్కున చేర్చుకోవడమూ, ఇవ్వడమే తప్ప ఆశించడం తెలియకపోవడం. ఇవన్నీ కూడా బలరాముడిలో కనిపించే పార్శాలు.

శాపం, మరణం

 ఒకసారి నారద మహాముని, కణ్వమహర్షి, విశ్వామిత్ర మహర్షి ద్వారాకకు వస్తారు. అప్పుడు వాళ్ళను హేళన చేయడానికి కొందరు ఒక మగవాడికి చీరకట్టి అతనికి గర్భం ఉన్నట్టు పెద్ద కడుపు ఏర్పాటు చేసి ఆ మహర్షులకు చూపుతూ ఈమెకు పుట్టేది ఏ శిశువో చెప్పండి అని అడుగుతారు. విషయం మొత్తం వాళ్లకు అర్థమై తమను అవమానిస్తున్నారని గ్రహించి కోపంతో  ఒక రోకలి జన్మించి యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపిస్తారు. ఆ శాపం తరువాత మహాభారత యుద్ధం జరగడమూ, యుద్ధం తరువాత యాదవులలోనే ఒకరిని మరొకరు చంపుకోవడం జరుగుతుంది. ఇదంతా చూసిన బలరాముడు వైరాగ్యంతో ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఆయన అలా ధ్యానంలో ఉండగానే శరీరం నుండి ఆత్మ వేరయి పోయి, నిర్యాణ్యం పొందుతాడు.

ఇదీ బలరాముడి కథ!! 

అమ్మా తమ్ముడు మన్ను తినుచున్నాడని, పల్కుకు పల్కిన బాలకుడీ బలరాముడు, ప్రకృతికి ప్రేమికుడు, పరమానంద స్వరూపుడు!!

◆ వెంకటేష్ పువ్వాడ