ఇదే బక్రీద్ పండుగ వెనుక కథ!
ముస్లిం సోదరుల బక్రీద్!
భారతదేశం విభిన్న మతాల నిలయం ఇక్కడ కనిపించినన్ని సంప్రదాయాలు మరెక్కడా కనిపించవు. కట్టు బొట్టు దగ్గర నుండి తినే ఆహారం వరకు చాలా ప్రత్యేకతలు, చాలా వ్యత్యాసాలు ఉంటాయి కూడా. మనదేశంలో ఉన్న మతాలలో మహమ్మదీయ మతం కూడా ఒకటి. ముస్లిం మతంగా కూడా పిలవబడే మహమ్మదీయ మతంలో కొన్ని పండుగలు ఉంటాయి. ముస్లిం ముస్లిం సోదరులు జరుపుకునే వారి పండుగలలో బక్రీద్ కూడా ఒకటి.
రంజాన్ పండుగ తరువాత ముస్లిమ్స్ జరుపుకునే పండుగలలో బక్రీద్ ముఖ్యమైనది. ప్రతి పండుగకూ ఏదో ఒక సంఘటన, ఆ సంఘటనలో ఒక కథ, ఆ కథలో ఒక సందేశం ఉండనే ఉంటాయి. అలాగే బక్రీద్ విషయంలో కూడా ఉంది.
పండుగ వెనుక కథ!
రంజాన్ పండుగ జరిగిపోయిన 70 రోజుల తరువాత జరుపుకునే ఈ పండుగ గురించి ఒక ఆసక్తికర కథనం ఉంది. సమాజంలో పెరిగిపోతున్న చెడునుండి ప్రజలందరినీ బయటకు తీసుకురావడానికి, మంచిదారిలో ప్రజలను నడిపించడానికి అల్లాహ్ ఈ భూమి మీదకు 80 వేల మంది ప్రవక్తలను పంపినట్టు ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ లో ఉంది. ఆ 80 వేల మందిలో ప్రవక్త హాజరత్ ఇబ్రహీం కూడా ఒకరు. ఈయన పేరు హజీరా. హాజరత్ ఇబ్రహీం,హజీరాలకు చాలా వయసయ్యాక ముసలితనంలో ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు ఇస్మాయిల్ అనే పేరు పెట్టుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతుంటారు వాళ్ళు. కానీ ఒకరోజు హాజరత్ ఇబ్రహీం కు కలలో తన కొడుకు ఇస్మాయిల్ ను అల్లాహ్ కు బలి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. కొడుకును బలి ఇవ్వమని అల్లాహ్ ఆ కలలో తనకు చెప్పాడు అనుకుని కొడుకును నిజంగానే బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు ఇబ్రహీం.
దేవుడి మీద భక్తి వల్ల ఇస్మాయిల్ కూడా అల్లాహ్ కు బలి కావడానికి సిద్ధమవుతాడు. తండ్రికి తనమీద ప్రేమ ఉంటుంది కాబట్టి బలి ఇవ్వకుండా తండ్రి వెనకడుగు వేస్తాడేమో అని కళ్ళకు గంతలు కట్టుకుని మరీ అల్లాహ్ కు తనని బలి ఇవ్వమని చెబుతాడు. కొడుకు చెప్పినట్టే ఇబ్రహీం కళ్ళకు గంతలు కట్టుకుని బలి ఇవ్వబోతాడు. అయితే సరిగ్గా కత్తి మెడ మీద పడేసమయానికి ఇస్మాయిల్ ను మాయం చేసి ఆ స్థానంలో ఒక పొట్టేలును ఉంచుతాడు అల్లాహ్. తనమీద ఉన్న భక్తికి సంతోషించానని ఇకమీదట ఇదేరోజున బలులు ఇవ్వాలని అది ప్రళయం వచ్చేవరకు సాగాలని చెబుతాడు. ఇదే బక్రీద్ పండుగ వెనుక కథ.
అప్పటి నుండి బక్రీద్ రోజు పొట్టేళ్లను బలి ఇవ్వడం ప్రతి ముస్లిం ఇంట్లో కనబడుతుంది. బలి ఇచ్చిన పొట్టేలు మాంసాన్ని అందరికీ పంచిపెడతారు.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ముస్లింలు పవిత్ర యాత్రగా భావించే మక్కా యాత్ర ఇప్పుడే ప్రారంభం అవుతుంది. బక్రీద్ కు కూడా రంజాన్ పండుగలా ప్రార్థనలు నిర్వహిస్తారు.
◆వెంకటేష్ పువ్వాడ.