సోమవారం చతుర్దశి రోజులలో బిల్వపత్రాన్ని కోయకూడదా.. శివ పురాణం ఏం చెబుతోందంటే..!

 

సోమవారం చతుర్దశి రోజులలో బిల్వపత్రాన్ని కోయకూడదా.. శివ పురాణం ఏం చెబుతోందంటే..!


శివారాధనలో బిల్వపత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివ భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివపూజ సమయంలో బిల్వపత్రాన్ని సమర్పించడం చాలా ముఖ్యం అని, బిల్వ పత్రి లేకుండా శివ పూజ అసంపూర్ణం అని చెబుతారు. శివుడికి కూడా బిల్వ పత్రం చాలా ప్రీతికరం. సాధారణ రోజుల్లోనే కాకుండా.. సోమవారాల్లోనూ,  చతుర్థశి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, త్రయోదశి వంటి రోజుల్లో శివారాధనలో బిల్వ పత్రం సమర్పించడం చాలా శ్రేష్టం అని చెబుతారు. అయితే ఏకాదశి, శనివారం, సాయంత్రం సమయం..వంటి సందర్బాలలో తులసిని కోయకూడదని ఎలాగైతే నియమం పెట్టారో.. సోమవారం,  చతుర్దశి రోజు బిల్వపత్రాన్ని కోయకూడదు అని నియమం ఉందట. శివపురాణంలో కూడా ప్రస్తావన ఉందని అంటున్నారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

ఏ రోజులలో బిల్వ పత్రి కోయకూడదు?

సోమవారాలు, చతుర్దశి, అమావాస్య, అష్టమి , నవమి రోజులలో మారేడు ఆకులను కోయకూడదని చెబుతారు. సోమవారాలు ఉపవాసం పాటించే భక్తులు ముందురోజే అంటే..  ఆదివారాలలో మారేడు ఆకులను కోసి సోమవారం పూజకు ఉపయోగించుకోవాలని  చెబుతారు. ఎందుకంటే సోమవారాలు శివునికి ప్రత్యేకం.  ఈ రోజున మారేడు ఆకులను కోయడం శాస్త్రాలలో అనుచితంగా పరిగణించబడుతుందట.

శివపురాణంలో ఏం చెప్పారు?

హిందూమతంలో ప్రతి రోజుకు,  తేదీకి దాని ప్రత్యేక  ప్రాముఖ్యత ఉంది. సోమవారం శివునికి అత్యంత ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది, భక్తులు ఈ రోజున శివుడికి  బిల్వ పత్రాలను సమర్పిస్తూ, పూజలు చేస్తూ ఉపవాసం ఉంటారు.

ఈ రోజున పొరపాటున కూడా మారేడు ఆకును కోయకూడదు. ఒకవేళ సోమవారం శివలింగానికి సమర్పించాలనుకుంటే, ఒక రోజు ముందుగానే దాన్ని కోసుకోవాలి. మారేడు ఆకులు ఎప్పటికీ వాడిపోవని, వాటిని ముందుగానే కోసుకోవచ్చని అంటారు.

శివపురాణంలో బిల్వ పత్ర ప్రాముఖ్యత..

శివ పురాణం బిల్వ పత్రాన్ని పవిత్రమైనదిగా వర్ణిస్తుంది. బిల్వ పత్రంలోని మూడు ఆకులు శివుని మూడు గుణాలైన సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకలని నమ్ముతారు.  భక్తుడు నిజమైన హృదయంతో శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పిస్తే అతని కోరికలను నెరవేర్చి, జీవితంలో సుఖశాంతులను శివుడు ప్రసాదిస్తాడని చెబుతారు.


                           *రూపశ్రీ.