అష్ట వినాయకుల ప్రదేశాలు
మహారాష్ట్రలో వివిధ ప్రదేశాలలో గల ఎనిమిది గణపతి దేవాలయాలు గురించి ఈ వారం. ఈ ఎనిమిది దేవాలయాలు మోర్గాంవ్ లోని మయూరేశ్వార్, సిద్ధాటెక్ లోని సిద్ధి వినాయక, బల్లలేశ్వర్ లోని పాలి, లేన్యాద్రి లోని గిరిజుత్ముక్, చింతామణి లోని ధేయూర్, ఒజార్ లోని విగ్నేశ్వర్, రంజన్ గాంవ్ లోని మహా గణపతి, మహాద్ లోని వినాయక దేవాలయాలు. ఈ ఎనిమిది దేవాలయాలు పురాతనమైనవి, ప్రాచీనకాలం నాటివి. ఈ దేవాలయాల విశిష్ట గురించి గణేష, ముద్గాల పురాణాలలో వివరించబడింది. ఈ దేవాలయాల శిల్పశైలి ఎంతో అందంగా ఉంటుంది. గణపతి ఆరాధ్యులైన పేష్వా పాలనలో వీటి పునర్నిర్మాణాలు అమోఘంగా జరిగాయి. ఈ దేవాలయాలన్నింటికీ ఉన్న ఉమ్మడి అంశం ఏమిటంటే ప్రతి ఒక్కటీ స్వయంభూ దేవాలయాలే, అంటే విగ్రహాలు మానవ నిర్మితమైనప్పటికీ దేవాలయాలున్న ప్రదేశాలు ఒకప్పుడు గణపతి వెలసిన ప్రదేశాలే.
గణపతి విగ్రహంలో ఉన్న భంగిమ అంటే ఆయన తొండము వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. కాని సిద్దాటెక్ లోని సిద్ధి వినాయక దేవాలయంలో మాత్రం గణపతి తొండం కుడివైపుకు తిరిగి కనబడుతుంది. మోర్గాంవ్ లోని దేవాలయానికి యాభై అడుగుల ఎత్తుగల మండపం నాలుగు స్తంభాల ఆధారంగా ఉంటుంది. సమీపంలో ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది. సిద్దాటెక్ లోని దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేవాలయం ఒక కొండకు ఆనుకొని ఉంటుంది. పూర్తీ ప్రదక్షిణ చేయాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు ఉంటుంది. పాలి గ్రామంలోని బల్లాలేశ్వర్ దేవాలయానికి బ్రాహ్మణ రూపంలో సాక్షాత్కరించిన ఒక భక్తుని పేరు పెట్టారు.
గిరిజూత్మక దేవాలయం గుహలతో కూడుకున్న కొండపై ఉంటుంది. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే సుమారు 300 మెట్లు ఎక్కాలి. ఓజార్ లోని విఘ్నేశ్వర్ దేవాలయ గోపురం బంగారంతో చేయబడింది. మహాగణపతి దేవాలయం తూర్పు ముఖంగా ఉంటుంది. ఈ దేవాలయం ప్రవేశద్వారం వద్ద జయ, విజయులు ద్వారపాలకులుగా ఉన్నారు. మహాడ్ లోని వరద వినాయక దేవాలయంలోని విగ్రహం సరస్సు ఒడ్డున లభిస్తే దాన్ని దేవాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయాన్ని పేష్వా పాలకులే నిర్మించారు. ఎనిమిది దేవాలయాలలో ఆరు దేవాలయాలు పూణే జిలాలో ఉండగా మరి రెండు దేవాలయాలు రాయ్ ఘడ్ జిల్లాలో ఉన్నాయి.