అక్షయ తృతీయ ఈ ఆలయాలకు ప్రత్యేకం

 

 

అక్షయ తృతీయ ఈ ఆలయాలకు ప్రత్యేకం

 

 

అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కొనేందుకు మంచి రోజు అన్న ప్రచారం మాత్రమే జరుగుతోంది. అక్షయ తృతీయకు అంతకుమించిన ధార్మికమైన విలువ ఉందని చెబుతున్నారు పెద్దలు. అందుకే పలు ఆలయాలలో అక్షయతృతీయ నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కావాలంటే చూడండి...

 

బదరీనాథ్: ఉత్తరాది దివ్యక్షేత్రమైన బదరీనాథ్లో ఆలయాన్ని చలికాలంలో మూసివేస్తారు. ఈ ఆరునెలల సమయంలో బదరీనాథుని దేవతలు కొలుచుకుంటారని ఓ నమ్మకం. అందుకు రుజువుగా లోపల అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందనీ, పూలు వాడిపోకుండా ఉంటాయనీ అంటారు. ఇలా మూసివేసిన ఆలయాన్ని ఎప్పుడు తెరవాలన్నది ఆలయ పూజారులు నిర్ణయిస్తారు. ఇది సామాన్యంగా అక్షయతృతీయకి సమీపంలోనే ఉంటుంది. బదరీనాథ్ సమీపంలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలైతే అక్షయతృతీయనాడే తిరిగి తెరుస్తారు.

 

సింహాచలం: సింహాచలంలోని ఉగ్రమూర్తి నరసింహస్వామిని శాంతింపచేయడానికి, ఆయనకు నిత్యం చందనాన్ని లేపనం చేస్తారు. అక్షయ తృతీయ సందర్భంగా మాత్రమే స్వామివారి మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. ఆ ఒక్క రోజునే భక్తులు ఆయన నిజరూపాన్ని దర్శించే అవకాశం ఉంటుంది.

 

పూరీ: పూరీ జగన్నాథుని పేరు వినగానే రథయాత్ర గుర్తుకురాక మానదు. ఏటా ఆషాఢ మాసంలో జరిగే రథయాత్రని చూసేందుకు లక్షలాది భక్తులు పూరీకి చేరుకుంటారు. ఈ రథయాత్ర కోసం రథాల నిర్మాణం అక్షయ తృతీయ రోజున మొదలవుతుంది. ఆలయ పూజారుల నేతృత్వంలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుంగలకి ఈ రోజు పూజ చేసి రథనిర్మాణాన్ని ఆరంభిస్తారు.

 

కుంభకోణం: తమిళనాడులోని కుంభకోణం పట్నం అటు వైష్ణవ ఆలయాలతోనూ, ఇటు శివాలయాలతోనూ కన్నులపండువగా ఉంటుంది. అక్షయతృతీయ రోజున కుంభకోణంలో ఉండే 12 వైష్ణవాలయాలలోని ఉత్సవమూర్తులు గరుడవాహనం మీద బయల్దేరతారు. ఇలా ఒకే రోజున 12 ఆలయాల నుంచి ఊరేగింపుగా వచ్చే మూర్తులను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ భక్తులు పోటెత్తుతారు.

 

బృందావనం: శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైన బృందావనంలో ‘బంకే బిహారి’ అనే ఒక ఆలయం ఉంది. బృందావనంలోని ప్రముఖ ఆలయాలలో ఇదీ ఒకటి. ప్రముఖ సంగీతకారుడు స్వామి హరిదాస్ నిర్మించిన ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి మూలవిరాట్టుగా ఉన్న గోపాలుని పాదాలని దర్శించే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.

- నిర్జర.