అక్షయ తృతీయకి 7 కారణాలు
అక్షయ తృతీయకి 7 కారణాలు
ఈ రోజులలో అక్షయ తృతీయని కేవలం బంగారం కొనుగోలు చేసేందుకు ఓ మంచి రోజుగానే భావిస్తున్నారు. కానీ ఏ కారణం చేత అక్షయ తృతీయ అంత విశిష్టమైనదో మర్చిపోతున్నారు. మిగతా పండుగలతో సమానంగా అక్షయ తృతీయను గుర్తించేందుకు చాలా కారణాలే కనిపిస్తాయి. వాటిలో కొన్ని ఇవిగో...
- అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ఆరంభం అయిందని చెబుతారు. ఆ రకంగా ఇదీ ఒక ఉగాదే!
- విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించారని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి.
- వైశాఖ మాసంలోని రోహిణి నక్షత్రంనాడు కృష్ణుని సోదరుడైన బలరాముడు జన్మించాడని దక్షిణాదివారి నమ్మకం. సాధారణంగా అక్షయ తృతీయ కృత్తిక లేదా రోహిణి నక్షత్రం ఉన్న రోజునే వస్తుంటుంది. కాబట్టి ఈ రోజుని బలరామ జయంతిగా కూడా జరుపుకొంటారు.
- కృష్ణుని చిన్ననాటి చెలికాడైన కుచేలుడు, గుప్పెడు అటుకులు తీసుకుని అక్షయ తృతీయ రోజునే ద్వారకకు చేరుకున్నాడు. ఆ గుప్పెడు అటుకులకి సంతుష్టి చెందిన గోపాలుడు, కుచేలుడు దరిద్రాన్ని తీర్చిన విషయం విదితమే! ఈ రోజున ఎవరైతే కృష్ణుని ప్రార్థిస్తారో, వారిని కూడా ఆ పరమాత్ముడు కుచేలుని పట్ల చూపిన అనుగ్రహాన్నే ప్రసాదిస్తాడని నమ్మకం.
- వేదవ్యాసుడు చెబుతుండగా గణేశుడు మహాభారతాన్ని రాసిన విషయం తెలిసిందే! ఆ ఘట్టం అక్షయ తృతీయ రోజునే మొదలైందని అంటారు. అలా వ్యాసుడు, గణేశుడు ఇద్దరూ కూడా ఈ రోజున పూజనీయులే!
- జైనుల తీర్థంకరుడైన రిషభనాథుడు ఈ రోజునే తన ఉపవాసాన్ని విరమించాడట. ఆ కారణంగా జైనులు కూడా అక్షయతృతీయను ఘనంగా నిర్వహించుకుంటారు.
- లక్ష్మీదేవి కుబేరుడిని సకలసంపదలతో అనుగ్రహించిన రోజు కూడా ఈనాడే అని కొన్ని చోట్ల పేర్కొన్నారు. బహుశా ఈ నమ్మకంతోనే అక్షయ తృతీయ రోజున సంపదలను కొనుగోలు చేసే సంప్రదాయం మొదలై ఉంటుంది.
- నిర్జర.