Auspicious Akasha Ganga Bath

 

సర్వ దోషాలనూ హరింపచేసే ఆకాశగం స్నానం

Auspicious Akasha Ganga Bath

ఆంధ్రదేశంలో అతి పెద్ద పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం వచ్చే లక్షలాదిమంది భక్తుల రద్దీతో, అమూల్యమైన కానుకలతో ఈ తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తిరుమలలోని పవిత్ర దర్శనీయ స్థలాల్లో ఆకాశ గంగ ఒకటి. పాపవినాశనం మాదిరిగానే ఆకాశ గంగ కూడా అధ్బుత సెలయేరు. ఇది స్వామి పుష్కరిణి తీరంలో ఉంది. శ్రీ వేంకటేశ్వరుని ఆలయానికి దక్షిణాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆకాశ గంగ. స్వామివారికి అభిషేకం చేసేందుకు ఆకాశ గంగ నీటినే ఉపయోగిస్తారు. భక్తులు తెలిసీతెలీక చేసిన తమ పాపాలను కడిగేసుకునేందుకు ఆకాశగంగలో స్నానం చేస్తారు. ఆకాశగంగ జలంతో స్నానం చేయలేనివారు లేదా చేసే అవకాశం లేనివారు కనీసం ఆకాశగంగ నీటిని తలపై జల్లుకుంటారు. శ్రీవేంకటేశ్వరుని నామాన్ని స్మరించుకుంటూ ఆకాశగంగ జలాన్ని తలపై చిలకరించుకుంటే చేసిన పాపాలు ప్రక్షాళన అయి పుణ్యం లభిస్తుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉద్యానవనం, ఆస్థాన మండపం ఒకవైపున అలరిస్తూ ఉండగా భువినుండి దివికి ఎగసిపడుతున్న ఆకాశ గంగ మరోవైపు మనసును దోచుకుంటుంది. పవిత్రతకు చిహ్నమైన ఈ ఆకాశ గంగ ఎటుచూసినా సౌందర్యంతో అలరారుతూ భూలోక స్వర్గంగా గోచరిస్తుంది. ఇక వర్షాకాలంలో అయితే ఎటు చూసినా పచ్చటి చెట్లు, పూలమొక్కలు, సొగసైన సెలయేళ్ళతో దివ్య శోభను సంతరించుకుంటుంది. ఆకాశ గంగలో స్నానం చేస్తే ఎలాంటి దోషాలు ఉన్నా నశిస్తాయని, సర్వ శుభాలూ చేకూరుతాయని పురాణ కథనాలు చాటి చెప్తున్నాయి.

తిరుపతి వెళ్ళిన భక్తులు ఆకాశ గంగను తప్పక దర్శించుకుంటారు. ఆకాశ గంగలో స్నానం చేస్తారు. లేదా కనీసం కొన్ని నీళ్ళను తలపై జల్లుకుంటారు. తెలిసీ తెలీక తాము గతంలో చేసిన తప్పులన్నిటినీ క్షమించమని, భవిషత్తులో ఎలాంటి పొరపాట్లూ చేయకుండా రక్షించమని, తమకు సర్వదా సుఖశాంతులు కలిగించమని వేడుకుంటారు.

తిరుమలలో ఉదయం వేళ పవిత్ర ఆకాశ గంగను చూసేందుకు భక్తులు బారులు తీరి ఉంటారు. స్వామి వారి దర్శనానికి వెళ్ళేముందు భక్తులు ఆకాశగంగ జలంతో స్నానం చేస్తారు.తాము చేసిన పాపాలు, తప్పులు ఆకాశ గంగలో ప్రక్షాళన చేసుకుని పునీతులై స్వచ్చమైన మనసుతో స్వామివారిని దర్శించుకుంటారు. ఆకాశగంగ నీటితో స్నానం చేయలేకపొతే, కొన్ని నీటిని అరచేతిలోకి తీసుకుని తలపై జల్లుకుని తిరుమలేశుని దర్శనానికి వెళ్తారు. గంగాజలం మాదిరిగా ఆకాశగంగ జలాన్ని పుణ్యతీర్థంగా భావించి ఇళ్ళకు తీసికెళ్తారు.

మన రాష్ట్రం నుండేగాక దేశం నలుమూలల నుండీ ఇతర దేశాల నుండీ కూడా వచ్చే భక్తులు శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుంటారు. తిరుమల వెళ్ళిన భక్తులు ఆకాశ గంగను తప్పనిసరిగా దర్శించుకుంటారు. అలా ఆకాశగంగను చూట్టానికి వెళ్ళే భక్తులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. పైనుండి నీళ్ళు ఉధ్రుతంగా పడుతుంటాయి కనుక కాలు జారి పడిపోయే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే దుస్తులు తడిచే అవకాశం ఉంది. కనుక మరో జత దుస్తులు అదనంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే వారిని పట్టుకుని, లేదా ఎత్తుకుని అప్రమత్తంగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే అక్కణ్ణించి పడిపోయే ప్రమాదం ఉందని మర్చిపోకూడదు.

 

Akasha ganga tirumala, sacred waterfall akasha ganga, auspicious place akasha ganga, saptagirulu akasha ganga