ఆదిశంకరులు భారతదేశం నాలుగు దిక్కులు ప్రయాణించి పీఠాలు ఎందుకు స్థాపించారో తెలుసా!
ఆదిశంకరులు భారతదేశం నాలుగు దిక్కులు ప్రయాణించి పీఠాలు ఎందుకు స్థాపించారో తెలుసా!
సనాతన ధర్మ సంరక్షకుడిగా ఆది శంకరాచార్యుల వారిని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు ఆ పరమశివుడే ఆది శంకరులుగా జన్మించి, సనాతన ధర్మాన్ని పరిరక్షించాడని చెబుతారు. ఆదిశంకరాచార్యులు జన్మదినోత్సవాన్ని వైశాఖ శుక్ల పంచమి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 21 న ఈ తిథి వచ్చింది. ఆదిశంకరులు గొప్ప తత్వవేత్త, చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి, దేశం మొత్తం కాలి నడకన ప్రయాణించి, సనాతన ధర్మ పరిరక్షణకు ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా.. భారతదేశానికి నాలుగు దిక్కులలో ఆయన ఆశ్రమాలు స్థాపించారు. అవే ఇప్పుడు పీటాలుగా, మఠాలుగా వర్థిల్లుతున్నాయి. అసలు ఆదిశంకరాచార్యులు ఎవరు? ఆయన వైభవం ఏమిటి? ఆయన ఎక్కడ జన్మించారు? ఆయన ఆశ్రమాలను ఎందుకు స్థాపించారు? తెలుసుకుంటే..
ఆదిశంకరాచార్యులు..
8వ శతాబ్దంలో కేరళలోని కాలడిలో ఆదిశంకరాచార్యులు జన్మించారు. ఆయన తండ్రి శివగురు , తల్లి ఆర్యంబ. ఆయన 8 సంవత్సరాల వయస్సులోనే వేద జ్ఞానాన్ని పొందారు. ఆయన అసాధారణమైన మేధస్సును కలిగి ఉండేవారు. ఆయన చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించి, ఆ తర్వాత జ్ఞానాన్వేషణకు బయలుదేరారు. ఆది శంకరాచార్యులు చాలా తక్కువ సమయంలో , చాలా చిన్న వయస్సులోనే వైదిక ధర్మాన్ని ఏకీకృతం చేశారు. ఇందుకోసం ఆయన భారతదేశంలోని నాలుగు దిక్కులలో నాలుగు ఆశ్రమాలను స్థాపించారు, ఇవి సనాతన సంస్కృతికి అభేద్యమైన , శాశ్వతమైన పునాదిని వేశాయి. సనాతన సంస్కృతి క్షీణదశకు చేరుకుంటున్న సమయంలో ఆయన నాలుగు దిక్కులలోనూ ఆశ్రమాలను స్థాపించారు. ఆయన అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేశారు.
నాలుగు దిక్కులలో ఆశ్రమాలు ఎందుకు స్థాపించారు?
అప్పట్లో సమాజంలో మత పరంగా చాలా గందరగోళం ఏర్పడింది. సనాతన ధర్మం, హిందూ మతం క్రమంగా క్షీణించసాగింది., అభిప్రాయ భేదాలు పెరుగుతూ వచ్చాయి. వేదాలను ఎవరూ సరిగా భోదించలేకపోయారు. ఆది శంకరాచార్యులు ఈ సవాళ్లను గ్రహించారు. అప్పుడు ఆయన సనాతన ధర్మాన్ని రక్షించడానికి దూరదృష్టితో అడుగు వేశారు. ఆయన భారతదేశంలోని నాలుగు దిక్కులలోనూ ఆశ్రమాలను (పీఠాలను) స్థాపించారు. ఈ ఆశ్రమాలు సనాతన ధర్మానికి ధార్మిక కేంద్రాలుగా పనిచేయడానికి , సనాతన ధర్మాన్ని ఏకం చేయడానికి స్థాపించారు.
ఆశ్రమాలను స్థాపించడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే.. అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేయడం. శాస్త్రార్థ సంప్రదాయాన్ని కొనసాగించడం, ప్రతి ప్రాంతం ఒక వేదం , మహావాక్యంతో అనుసంధానించబడిందని నిర్ధారించడం, సనాతన ధర్మానికి శాశ్వతమైన సంస్థాగత నిర్మాణాన్ని అందించడం.
నాలుగు దిక్కులలో స్థాపించిన నాలుగు పీఠాలు..
దక్షిణ కర్ణాటకలోని శృంగేరి..
దక్షిణ కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం, కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలో తుంగ నది ఒడ్డున ఉంది. ఇక్కడ దీక్ష పొందిన సన్యాసులు తమ పేర్ల తర్వాత సరస్వతి, భారతి, లేదా పూరి అని చేర్చుకుంటారు. ఈ సంప్రదాయ నామాలు వారిని ఆ శాఖకు చెందిన సన్యాసులుగా గుర్తిస్తాయి. యజుర్వేదం పరిధిలోకి వచ్చే ఈ మఠం "అహం బ్రహ్మాస్మి" అనే నినాదాన్ని ఇస్తుంది. ఈ మఠం మొదటి మఠాధిపతి ఆచార్య సురేశ్వర.
తూర్పు ఒడిశాలోని గోవర్ధన మఠం..
ఒడిశాలోని పూరీలో ఉంది ఈ మఠం. దీనికి జగన్నాథ ఆలయంతో గాఢమైన సంబంధం ఉంది. ఒడిశా నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు , బీహార్ నుండి రాజమండ్రి వరకు ఉన్న ప్రాంతం ఈ మఠం పరిధిలోకి వస్తుంది, ఇక్కడ దీక్ష తీసుకున్న సన్యాసి పేరు చివర 'అరణ్య' అనే పదం ఉంటుంది. ఈ మఠం పేరులోని ఈ విశేషణం ఆ సన్యాసులను గుర్తిస్తుంది. 'ప్రజ్ఞానం బ్రహ్మ' అనేది ఈ మఠం యొక్క బోధించే సూక్తి. ఈ మఠం 'ఋగ్వేదం' పరిధిలోకి వస్తుంది, దీనికి మొదటి అధిపతి పద్మపాదుడు, ఈయన ఆది శంకరాచార్యుల మొదటి శిష్యుడు కూడా.
పశ్చిమ గుజరాత్ లోని ద్వారకలో శారదా మఠం..
పశ్చిమ గుజరాత్‌లోని ద్వారకా మఠాన్ని శారదా మఠం అని కూడా పిలుస్తారు. సామవేదం ఆధారంగా ఉన్న ఈ మఠం ప్రధాన నినాదం "తత్త్వమ్ అసి". ఇక్కడ దీక్ష తీసుకున్న సన్యాసుల పేర్ల చివర "తీర్థ" , "ఆశ్రమం" అనే పదాలు ఉంటాయి. ఈ ప్రత్యయాలు వారిని ఆ శాఖకు చెందిన సన్యాసులుగా సూచిస్తాయి. ఆది శంకరాచార్యుల నలుగురు ప్రధాన శిష్యులలో ఒకరైన హస్తమాలకుడు శారదా మఠానికి మొదటి అధిపతి.
ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్లో జ్యోతిర్మఠం..
ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో స్థాపించిన ఈ జ్యోతిర్మఠం వేద విజ్ఞానానికి , జ్ఞానానికి ఒక కేంద్రం. ఆచార్య తోటక ఈ మఠానికి మొదటి మఠాధిపతి. అధర్వణ వేదం ఈ మఠంలో భాగంగా ఉంది. జ్యోతిర్మఠంలో దీక్ష తీసుకున్న సన్యాసుల పేర్లకు ముందు "గిరి," "పర్వత్," లేదా "సాగర్" అనే ప్రత్యయాలు ఉంటాయి. ఈ ప్రత్యయాలు కలిగిన వారిని ఆయా శాఖకు చెందిన సన్యాసులుగా పరిగణిస్తారు. "ఆయమాత్మ బ్రహ్మ" ఈ మఠం యొక్క ఆచరించే సూక్తి.
*రూపశ్రీ.