ఇదీ పుష్కరుని కథ!

 

 

 

ఇదీ పుష్కరుని కథ!

 

 

పూర్వం తుందిలుడు అనే మహర్షి పరమేశ్వరుని ప్రస‌న్నం చేసుకునేందుకు ఘోర‌మైన త‌ప‌స్సుని చేశాడు. అత‌ని తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వ‌రాన్ని కోరుకోమ‌ని అడ‌గ‌గానే... `నేను నీలో శాశ్వతంగా ఉండిపోయేలా వ‌రాన్ని ప్రసాదించ‌మ‌ని` వేడుకున్నాడు తుందిలుడు. దానికి ఈశ్వరుడు త‌న‌లోని జ‌ల‌శ‌క్తికి ప్రతినిధిగా తుందిలుని నియ‌మించాడు. అలా ముల్లోకాలలో ఉన్న న‌దుల‌న్నింటికీ తుందిలుడు అధిప‌తి అయ్యాడు.

 

ఈ ప్రపంచంలోని జీవ‌రాశులు అన్నింటికీ నీరే జీవనాధారం కాబట్టి తుందిలునికి, పుష్కరుడు... అంటే `పోషించేవాడు` అన్న పేరు వ‌చ్చింది. కాలం ఇలా సాగుతుండగా బ్రహ్మదేవుడు ప్రాణుల‌ను సృష్టించే ప‌నిని మొదలుపెట్టాడు. అందుకోసం బ్రహ్మదేవునికి పుష్కరుని సాయం కావ‌ల‌సి వచ్చింది! దాంతో ఈశ్వరుని అనుమతితో పుష్కరుడు బ్రహ్మదేవుని ద‌గ్గరకు వెళ్లి, ఆయ‌న‌కు సృష్టిలో సాయ‌ప‌డ్డాడు. బ్రహ్మదేవుని ప‌ని ముగిసిపోయిన తరువాత కూడా పుష్కరుడు ఆయ‌న వ‌ద్దనే ఉండిపోయాడు.

 

ఆ స‌మ‌యంలో దేవ‌త‌ల‌కు గురువైన బృహ‌స్పతి, భూమి మీద జీవులంద‌రికీ సాయ‌ప‌డేందుకు పుష్కరుని త‌న‌తో పంప‌మ‌ని బ్రహ్మదేవుని అడిగాడు. కానీ పుష్కరునికేమో బ్రహ్మదేవుని వదిలి వెళ్లడం ఇష్టం లేదయ్యే! అందుక‌ని ఓ ఉపాయాన్ని ఆలోచించాడు బ్రహ్మదేవుడు. ఒక ఏడాదిలో బృహ‌స్పతి ఏ రాశిలోకి అయితే ప్రవేశిస్తాడో, అనాటి నుంచి 12 రోజుల పాటు పుష్కరుని ఒకో నదిలో ఉండ‌మ‌ని చెప్పాడు. మనకి 12 రాశులు కాబట్టి, 12 ప్రధాన నదులకు పుష్కరాలను చేసుకునే అవకాశం దక్కింది.

 

బృహ‌స్పతి  ఒకో రాశిలో దాదాపు ఏడాదిపాటు ఉంటాడు. అందుక‌ని ఈ 12 రాశుల‌నూ బృహ‌స్పతి చుట్టబెట్టాలంటే దాదాపు 12 ఏళ్ల ప‌డుతుంది. అంటే ఒక న‌దికి పుష్కరాలు జ‌రిగితే, మ‌ళ్లీ అదే న‌దికి పుష్కరాలు జ‌రిగేందుకు 12 ఏళ్ల ఆగాల‌న్నమాట‌. అందుక‌నే 12 ఏళ్ల కాలాన్ని పుష్కర కాలం అని పిలుస్తారు.

 

మ‌న రాష్ట్రంలో ప్రవ‌హించే రెండు ముఖ్య న‌దులు కృష్ణ‌, గోదావ‌రి. 2016 ఆగస్టు 12 నాటికి గోదావరి పుష్కరాలు ముగిసి, కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరుడు ప్రవేశించిన నదిలో స్నానం చేసేందుకు స్వయంగా ముక్కోటి దేవతలూ తరలివస్తారనీ, ఆ సమయంలో ఎవరైతే పుష్కర స్నానం చేస్తారో వారికి సకలశుభాలూ కలిగేలా ఆశీర్వదిస్తారనీ నమ్మకం.

గంగానది మేషరాశి
నర్మద వృషభరాశి
సరస్వతి మిథునరాశి
యమున కర్కాటకరాశి
గోదావరి సింహరాశి
కృష్ణ కన్యారాశి
కావేరి తులారాశి
భీమానది వృశ్చికరాశి
తపతి/బ్రహ్మపుత్ర ధనూరాశి
తుంగభద్ర మకరరాశి
సింధు కుంభరాశి
ప్రాణహిత మీనరాశి