కాశీ యాత్రకన్నా గురువింద గింజంత పుణ్యం ఎక్కువ ఇచ్చే తిరుమకూడలు నర్సీపూర్

 

 

 

కాశీ యాత్రకన్నా గురువింద గింజంత పుణ్యం ఎక్కువ ఇచ్చే తిరుమకూడలు నర్సీపూర్  

 


                                                                                     
హిందువులకి కాశీ పరమ పుణ్య క్షేత్రం.  జీవితంలో ఒక్కసారి కాశీ దర్శించి విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణలను సేవించుకోవాలనీ, గంగా స్నానం చేసి పునీతులవ్వాలనీ భావించని హిందువు వుండడంటే అతిశయోక్తికాదేమో.  కాశీలో మరణించినవారికి పునర్జన్మ వుండదని హిందువులందరి నమ్మకం.  అలాంటి కాశీ క్షేత్ర దర్శనంకన్నా గురివింద గింజంత పుణ్యం ఎక్కువే వస్తుంది నన్ను సేవించటంవల్ల అని సాక్షాత్తూ ఆ నరసింహస్వామే సెలవిస్తే, దానికి నిరూపణగా చేతిలో గురివింద గింజ తీగతో స్వామి వెలిస్తే ఆ ప్రదేశం పుణ్య క్షేత్రమై అలరారుతుందికదా.  ఆ ప్రసిధ్ధ క్షేత్రమే కర్ణాటక రాష్ట్రంలోని టీ. నరసీపూర్

 

 

టీ.నరసీపూర్ అంటే తిరుమకూడలు నరసీపూర్.  తిరుమకూడలు అంటే మూడు నదుల కూడలి ప్రదేశం.  ఇక్కడ కావేరి, కపిల, స్ఫటిక సరోవరం (స్ఫటిక సరోవరం సరస్వతీ నదిలా గుప్త సరోవరం) కలుస్తాయి.  దక్షిణ భారత దేశంలో మూడు సంవత్సరాలకొకసారి కుంభమేళా జరిగే ప్రదేశం ఇదే.  స్కంద పురాణంలో మూడు నదుల సంగమ ప్రదేశాలను పేర్కొనేటప్పుడు ఈ క్షేత్ర ప్రస్తావన జరిగింది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ప్రయాగ అంత పవిత్ర ప్రదేశమిది.   అందుకే దీనిని దక్షిణ కాశీ  అనే పేరు వచ్చింది.ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత వున్నది.  ఇది హరి హర క్షేత్రం.  కపిల నదికి ఒక ఒడ్డున అగస్త్యేశ్వరస్వామి ఆలయం అయితే ఇంకో ఒడ్డున గుంజి నరసింహస్వామి ఆలయం.  ఈ ఆలయ నిర్మాణాల వెనుక  వున్న కధలను పరిశీలిద్దాము.

 

 

గుంజి నరసింహస్వామి ఆలయం
 ఈ ఆలయం వున్న ప్రదేశానికి ఎదురుగా వున్న కపిల నదిలో ఒక చాకలి అతను బట్టలు ఉతుకుతూ వుండేవాడు.  ఒకసారి నరసింహస్వామి ఆ చాకలతని కలలో కనబడి నువ్వు రోజూ బట్టలు వుతికే రాతికింద నా విగ్రహం వున్నది, దానిని బయటకుతీసి ఆలయం నిర్మించమని ఆదేశించాడు. ఆ చాకలతను, స్వామీ, నేను బట్టలుతుక్కుని బతికేవాడను, ఆలయం కట్టించటం నావల్ల అవుతుందా అంటే స్వామి  అదే రాతికింద బంగారు నాణెములుకూడా వున్నాయి, వాటితో ఆలయ నిర్మాణం కావించమని చెప్పాడు.  ఆ చాకలతనికి ఎన్నాళ్ళనుంచో కాశీ యాత్ర చెయ్యాలనే కోరిక.  అదే స్వామికి నివేదించాడు.  స్వామి తనకి ఆలయం నిర్మించి పూజించినదానివల్ల కాశీ యాత్ర చేసినదానికన్నా గురివింద గింజంత పుణ్యం ఎక్కువే వస్తుందని చెప్పాడు.  ఆ కధకి నిదర్శనంగా నరసింహస్వామి చేతిలో ఒక గురివింద గింజ ఆకులతోసహా వుంటుంది.  అందుకే స్వామికి గుంజ (కన్నడంలో) నరసింహస్వామి అనే పేరు వచ్చింది.  ఈ స్వామిని సేవించటంవల్ల కాశీ క్షేత్ర సందర్శనంకన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఈ నరసింహస్వామి ఆలయం విజయనగర రాజుల సమయంలో నిర్మింపబడింది.  కృష్ణదేవరాయల సమయంనుంచి రాయించిన శిలా శాసనాలు ఇక్కడ చూడవచ్చు.

 

 

 

శ్రీ ఆగస్త్యేశ్వరస్వామి ఆలయం
అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు  ఈ సంగమ ప్రదేశాన్ని చూసి ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీగా అభివర్ణించాడు.  ఆ సమయంలో ఇదంతా అడవీ ప్రాంతం.  ఈ సంగమ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడైన అగస్త్య మహర్షి అక్కడ ఒక శివ లింగాన్ని స్ధాపించాలనే అభిలాషతో కాశీనుంచి శివ లింగాన్ని తెచ్చి పెట్టమని ఆంజనేయస్వామిని కోరాడట.  ఆంజనేయస్వామి అంగీకరించి, కాశీ వెళ్ళాడు కానీ ముహూర్త సమయంలోపల లింగాన్ని తీసుకు రాలేకపోయాడు.  ముహూర్తం మించిపోతోందని అగస్త్యుడు సైకత లింగం చేసి ప్రతిష్టించాడు.  ఆంజనేయ స్వామి ముహూర్తమయ్యాక శివ లింగంతో వచ్చాడు.  అప్పటికే ప్రతిష్ట జరిగిపోవటంతో ఆగ్రహించిన ఆంజనేయస్వామి అగస్త్యుడు ప్రతిష్టించిన సైకత లింగం పై భాగాన్ని నరికేశాడు.  ఆ లింగం పైనుంచి స్ఫటిక సరోవరం నీరు బయటకు వస్తూంటుంది ఇప్పటికీ.  భక్తులకు దానిని తీర్ధంగా ఇస్తారు.  సరే, ఆంజనేయస్వామిని శాంతపరిచి, ఆయన తెచ్చిన లింగాన్ని సమీపంలో ప్రతిష్టించారు.  దానినే హనుమాన్ లింగం అంటారు.

 

 

1500 సంవత్సరాల క్రితం నిర్మింపబడ్డ ఈ ఆలయంలో,  లోపలి ప్రాకారం చుట్టూ అనేక శివలింగాలు ప్రతిష్టించబడి వున్నాయి.  అమ్మవారి పేరు శ్రీ పూర్ణ మంగళ కామాక్షమ్మ.

 

ఇక్కడ మూడు సంవత్సరలకొకసారి  కుంభమేళా జరుగుతుంది.   దేశం నలుమూలలనుంచి అనేకమంది భక్తులతోపాటు ఈ పుణ్య సంగమంలో స్నానం చేసి తరించటానికి ఎక్కడెక్కడినుంచో  అనేకమంది సాధువులుకూడా  కుంభమేళాకు వస్తారు.
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో, జిల్లా ముఖ్య పట్టణమైన మైసూరుకు 29 కి.మీ. ల దూరంలో నేషనల్ హైవే 212 మీద వున్నది టీ.నరసీపూర్.  ఇది తాలూకా కేంద్రము.  బెంగుళూరు నుంచి 130 కి.మీ. ల దూరం వుంటుంది.  మైసూరు నుంచి బస్సు సౌకర్యం వున్నది.  రైలు మార్గం మైసూరుదాకా, లేకపోతే నంజన్ గూడా టౌన్ రైల్వే స్టేషన్ దాకా.


.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)