కోటివరాల దేవుడు శ్రీమన్నారాయణుడు!

 

కోటివరాల దేవుడు శ్రీమన్నారాయణుడు!

అనంతస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు కోరుకున్నవారికి కోరినన్ని వారాలను ఇచ్చే  దయామయుడు. అందుకే ఆ స్వామిని 'కోటివరాలదేవుడు' అని పిలుస్తున్నారు. ఆ స్వామి నామస్మరణ సకల శుభకరం. అందుకే పోతనామాత్యుడు ఆ స్వామిని ఇలా కీర్తించాడు.

కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జితించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిం జేరుమనియెడి తండ్రి తండ్రి

ఆ స్వామి 'నారాయణ' నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, అన్ని రకాలైన దుఃఖాలను నేలమట్టం చేసి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించి, పరమపదానికి చేరుస్తుంది. ఇందుకు ఓ చక్కని ఉదాహరణ అజామిళుని ఉదంతమే.

పూర్వం కన్యాకుబ్జనగరంలో అజామిళుడనే పండితుడు ఉండేవాడు. అతను కులాచారాన్ని, ధర్మాన్ని వీడి జూదము, దొంగతనము, వ్యభిచారం, దుష్కార్యాలు వంటి పనులతో భ్రష్టు పట్టాడు. కాస్తంత మంచివాళ్ళు అతని కంటబడితే చాలు, వారిని పీడించేవాడు. అతనికి పదిమంది సంతానం. వారిలో చివరివాడు నారాయణుడు. చిన్నకొడుకు నారాయణుడంటే అజామిళునికి చాలా ఇష్టం. కాలగమనంలో వృద్ధుడైన అజామిళుడు మంచాన పడ్డాడు.

అతనిని కొడుకులంతా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ, అజామిళుడు ప్రతి విషయానికి చిన్న కొడుకు నారాయణునినే పిలుస్తుండేవాడు. చివరకు అజామిళుడు తుదిశ్వాసనువిడిచే సమయం ఆసన్నమవడంతో, అతడిని నరకానికి తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చి నిలబడ్డారు. యమభటులను చూడగానే గజగజ వణికిపోయిన అజామిళుడు భయకంపితుడై తన చిన్న కుమారుని ''నారాయణా!" అని బిగ్గరగా పిలిచి ప్రాణాలను వదిలాడు. అజామిళుడు ఎంతో పాపాత్ముడైనపట్టికీ అంత్యకాలంలో "నారాయణా!" అంటూ విష్ణునామాన్ని స్మరించినందున అక్కడకు విష్ణుభటులు కూడ వచ్చి చేరారు. ఆ మరుక్షణమే యమభటులకు, విష్ణుభటులకు మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. అజామిళుని ఎవరు తీసుకెళ్ళాలన్న విషయమై కీచులాట మొదలైంది. యమభటులు, విష్ణుభక్తులతో, "అయ్యలారా! ఈ పండితుడు మహాపాపి. చెప్పలేనన్ని నీచపు పనులను చేసాడు. ఒక్కరోజైనా ఓ చిన్నపుణ్యకార్యమైనా చేసి ఎరుగడు. కనీసం పూజలు, పునస్కారాలు కూడ చేసి ఎరుగడు. అటు వంటివానికి ఎలా వైకుంఠప్రాప్తి కలుగుతుంది? అతన్ని వైకుంఠానికి తీసుకెళ్ళేందుకు మీరు రావడం విచిత్రంగా ఉంది" అని అన్నారు.

యమభటుల వాదనలను విన్న విష్ణుభటులు, "యమదూతలారా! ఎంతటి పాపాత్ములైనప్పటికీ, అంత్యకాలంలో నోరారా హరినామస్మరణం చేసినట్లైతే, అప్పటివరకు అతడు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ అజామిళుడు మిమ్ములను చూడగానే, తన కొడుకును పిలిచే క్రమంలో హరినామస్మరణం చేసాడు. ఆ సంఘటన పట్ల ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు, అజామిళునికి పరమపదాన్ని అనుగ్రహించదలచి మమ్ములను పంపాడు. కనుక, మీరు అతనిని తీసుకెళ్ళడానికి కుదరదు. మీకా అధికారం లేదు. మా మాటల పట్ల నమ్మకం లేకపోతే, ఈ విషయమై మీ ప్రభువు యమధర్మరాజునే అడిగి తెలుసుకోండి" అని బదులు చెప్పారు. ఈ విషయాన్ని యమభటులు, యమధర్మ రాజుకు వినిపించడంతో సావధానంగా విన్న యముడు, విష్ణుతత్త్వాన్ని గురించి, విష్ణుభక్తిని తన భటులకు వివరించడమే కాక, ఇకపై విష్ణుభక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. ఆవిధంగా ఒక్కసారి 'నారాయణా!' అంటూ విష్ణు నామమును ఉచ్చరించినందుకే అజామిళునికి పరమపద ప్రాప్తి కలిగింది. ఆ నామం అంతటి మహిమాన్వితమైనది.

మానవులే కాదు, దేవతలు సైతం తమకు సమస్యలు ఎదురైనప్పుడు స్వామి నామాన్ని ధ్యానించి ఆయా సమస్యల నుండి బయట పడిన సందర్భాలు ఉన్నాయి.

భక్తజనవత్సలుడైన ఆ సర్వేశ్వరుడు, తన భక్తుల కోసం అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటాడు. భక్తుల కోరికలనునెరవేర్చడమే ఆయనపని! 

అటువంటిదే వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల కథ. ఒకానొక్కపుడు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు శ్రీమన్నారాయణుని దర్శనానికై వైకుంఠానికి వచ్చారు. అప్పుడు విష్ణువు, లక్ష్మీదేవిలు అంతఃపురంలో ఉండటంతో ద్వారపాలకులైన జయవిజయులు మునీశ్వరులను అడ్డుకుని, లోనికి పోనివ్వలేదు. అప్పుడా మునీశ్వరులు కోపోద్రిక్తులై జయవిజయులను, "పాపాలకు నిలయమైన భూలోకంలో జన్మించ"మని శపించారు. మునుల శాపాన్ని విని భయకంపితులైన జయవిజయులు, వారి పాదాలపై పడి క్షమించి, రక్షించమని వేడుకున్నారు. వారి ప్రార్థనలను మన్నించిన మునీశ్వరులు, తామిచ్చిన శాపానికి విమోచనం లేదని, అయితే మూడు జన్మలపాటు రాక్షసులై పుట్టి, శ్రీహరిని ద్వేషించి, ఆయన ద్వారానే తిరిగి వైకుంఠానికి చేరుకుంటారని చెప్పారు. ఆ మునుల శాపాన్ని అనుసరించి మొదటి జన్మలో హిరణ్యాక, హిరణ్యకశిపులుగా, రెండవజన్మలో రావణ, కుంభకర్ణులుగా, మూడవజన్మలో శిశుపాల దంతవక్తృలుగా జన్మించి, శ్రీహరిని ద్వేషిస్తూ తద్వారా నిరంతరం హరినామస్మరణం చేస్తూ, తిరిగి వైకుంఠాన్ని చేరుకున్నారు.