లక్ష్మీదేవిని శుక్రవారమే పూజించడానికి గల కారణం ఏమిటి...
లక్ష్మీదేవిని శుక్రవారమే పూజించడానికి గల కారణం ఏమిటి...
వారంలో ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజించడం పరిపాటి. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు. శుక్రవారం రోజు సాధారణ రోజుల కంటే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవడం, ఇంట్లో ధూప దీపాలు, నైవేద్యాలు, ఇంటి ముందు చాలా ఆకర్షణగా ఉండే ముగ్గులు, గడపకు పసుపు, తులసి కోట దగ్గర అలికి ముగ్గు పెట్టడం.. ఇవన్నీ ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. అయితే అసలు లక్ష్మీదేవిని శుక్రవారమే పూజించడానికి గల కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే..
లక్ష్మీదేవిని శుక్రవారమే ఎందుకు పూజిస్తారు?
శుక్రగ్రహం.. లక్ష్మీదేవి..
జ్యోతిషశాస్త్ర ప్రకారం శుక్రగ్రహానికి అధిపతి అసురగురువు అయన శుక్రాచార్యుడు, అయితే శుక్రుడు ఒక గ్రహంగా లక్ష్మీదేవి ఆధీనంలో ఉంటాడట. అందుకే శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ధనం, సౌభాగ్యం, కళ, సుఖాలు అన్నీ లభిస్తాయి. ఈ కోణంగా చూస్తే శుక్రగ్రహానికి అధిపతి శుక్రాచార్యుడు అయినా.. లక్ష్మీదేవి అనుగ్రహంతోనే అన్నీ లభిస్తాయి. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.
వారదేవతా ప్రాధాన్యం..
ప్రతి వారానికి ఒక దైవాధిపత్యం ఉంటుంది. అలా శుక్రవారానికి లక్ష్మీదేవి అధిపత్యం ఉంటుంది.. అందువల్ల సాధారణ రోజుల్లో కంటే.. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది.
శుక్రవారం వ్రతం..
చాలామంది మహిళలు శుక్రవారం రోజు శుక్రవారం వ్రతం చేస్తుంటారు. శుక్రవారం వ్రతం చేసేవారికి ధనాభివృద్ధి, సౌభాగ్యం, సంతోషం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆడవారికి శుక్రవారం వ్రతం ఎంతో శ్రేయస్కరం.
శుక్రవారం కనకధార స్తోత్రం..
ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని చాలా భక్తితో పూజించారు. ఆయన వెంట ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుందని ప్రతీతి. ఒక పేద ఇంటి ముందు నిలబడి ఆయన బిక్షం అడిగినప్పుడు ఆ ఇల్లాలు తినడానికి ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న ఒక్క ఎండిన ఉసిరికాయను ఆయనకు దానం చేస్తుంది. దీంతో చలించిన ఆయన చాలా అశువుగా లక్ష్మీదేవిని స్తుతిస్తూ చెప్పినదే కనకధార స్తోత్రం. శంకరాచార్య స్వామివారు రచించిన మహాశక్తివంతమైన ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో శుక్రవారం చదివితే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది. ఎలా పారాయణ చేస్తే మంచిది.. ప్రభాతకాలం స్నానం చేసి పూజా గది శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన తెల్లని లేదా పసుపు వస్త్రాలు ధరించాలి. లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రం ముందు కుంకుమ, పసుపు, పుష్పాలు, దీపం, ధూపం అర్పించాలి. ఇలా చేస్తే పంచోపచార పూజ చేసినట్టు.
తెల్లని పూలు (జాజి, మల్లె), తులసి దళాలు సమర్పిస్తే అత్యంత ప్రీతికరం. అప్పుడు దీపం వెలిగించి, మనసును అమ్మవారి మీద ఉంచి కనకధార స్తోత్రం పారాయణం చేయాలి.
1 సారి పఠిస్తే ఫలప్రదం.
3 సార్లు పఠిస్తే శ్రేయోభివృద్ధి.
11 సార్లు పఠిస్తే ప్రత్యేక కటాక్షం కలుగుతుందని చెబుతారు.
పారాయణం పూర్తయ్యాక నైవేద్యంగా పాలు, పాయసం, క్షీరాన్నం సమర్పించాలి. ఈ విధంగా శుక్రవారం కనకధార స్తోత్రాన్ని శ్రద్ధతో పారాయణం చేస్తే, దారిద్ర్యం తొలగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, కుటుంబంలో సంతోషం నెలకొంటుంది, లక్ష్మీదేవి శాశ్వత కటాక్షం లభిస్తుంది.
*రూపశ్రీ.