మీకు ముత్యాలంటే ఇష్టమా? అయితే ఇవి మీతో ఉండాల్సిందే..! ఆడవాళ్లు అందంగా కనబడటానికి బోలెడు అలంకారాలున్నాయి. దుస్తులు, ఆభరణాల దగ్గర నుండి చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ ఇలా చాలా ఆడవారి అందంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆభరణాలలో తప్పకుండా నవరత్నాలలో ఏదో ఒకటి పొదిగి ఉంటుంది. అయితే సముద్రపు అట్టడుగున ఏళ్ల తరబడి ఏర్పడే ముత్యాలకు మాత్రం ఎనలేని ప్రాధాన్యత ఉంది. చాలామంది ఆడవారికి ముత్యాలంటే చాలా ఇష్టం. సాధారణం బంగారు, ఇతర రాళ్లు పొదిగిన ఆభరణాలకు బదులు ముత్యాలతో చేసిన ఆభరణాలు వేసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే ముత్యాలంటే ఇష్టపడే మగువలు ఈ కింది నాలుగు రకాల ముత్యాల ఆభరణాలు తప్పనిసరిగా తమ ఆభరణాల లిస్ట్ ఉంచుకోవాలని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. ఈ నాలుగు ఉంటే చాలు.. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ ప్రత్యేకవేడుక అయినా సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. అవేంటో ఓ లుక్కేస్తే.. ముత్యాల చెవి రింగులు.. అమ్మాయిలు చెవికి పెట్టుకునే రింగుల విషయంలో చాలా తర్జభర్జన పడతారు. ముత్యాలు పొదిగిన చెవి రింగులు ధరిస్తే చాలా అందంగా కనబడతారు. ఈ లిస్ట్ లో ముత్యాల డ్రాప్, స్టడ్ లు, హోప్స్ ఇలా.. చాలా రకాల మోడల్స్ మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. ఇవి ప్రత్యేక సందర్భాలలో అయినా, డైలీ ధరించడానికి అయినా ఏ విధంగా అయినా బాగుంటాయి. ఇక ఫ్యాషన్ దుస్తులు అయినా, సంప్రదాయ దుస్తులైన చీర, పట్టు పరికిణి వంటి వాటిలోకి అయినా చాలా బాగా నప్పుతాయి. ఉంగరం.. ముత్యాల మీద ఇష్టం ఉన్నవారు ముత్యం పొదిగిన ఉంగరం ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. ముత్యాలు ధరిస్తే హుందాతనం ఉట్టిపడుతుంది.ఈ ముత్యాల ఉంగరాలు ఇప్పటి కాలం ఫ్యాషన్ దుస్తులకే కాకుండా అమ్మమ్మల కాలం నాటి దుస్తులు, అప్పటి సంప్రదాయ వస్త్రధారణకు కూడా బాగా సెట్ అవుతాయి. ఇక ఈ ముత్యపు ఉంగరాలు డార్క్ కలర్ ఉన్న దుస్తులతోనూ, సింపుల్ గా ఉన్న బ్యాగ్ లు, వాలెట్లతోనూ చాలా అట్రాక్షన్ గా కనిపిస్తాయి. బ్రెస్లెట్.. సాధారణంగా బంగారు, వెండి బ్రెస్లెట్లు అబ్బాయిలకే ఎక్కువగా నప్పుతుంటాయి. అమ్మాయిలు సింవుల్ గా ఉంటూనే గ్రాండ్ లుక్ లో కనిపించాలంటే ముత్యాల బ్రెస్లెట్ చాలా బాగా సెట్ అవుతుంది. దీని వల్ల ధరించిన డ్రస్ మరింత ఆకర్షణగా మారుతుంది. సాంప్రదాయ దుస్తులలోనూ, ఆఫీసుకు వెళ్లే ఔట్ ఫిట్ లోనూ, సాధారణ దుస్తులలోనూ క్లాసీ లుక్ ఇస్తుంది ముత్యాల బ్రెస్లెట్. ముత్యాల లాకెట్.. ఇప్పట్లో చాలా రకాల నెక్ డాలర్స్ అందుబాటులో ఉన్నాయి. అమ్మాయిల సింపుల్ లుక్ తో అందరి మతి పోగాట్టాలంటే మాత్రం ముత్యాల లాకెట్ లు భలే సెట్ అవుతాయి. ఎంత బాగా తయారైనా సరే.. మేకప్, డ్రస్సింగ్ కు మరింత అదనపు లుక్ ఇవ్వడానికి ముత్యాల లాకెట్ హెల్ప్ చేస్తుంది. అయితే ముత్యాలు ధరించేటప్పుడు కెమికల్స్ లేని స్ప్రేలు, పౌడర్లు వాడటం మంచిది. *నిశ్శబ్ద.
ఎరుపురంగు లిప్స్టిక్ అంటే అస్సలు ఇష్టముండదా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి! ఎరుపురంగు చాలా బోల్డ్ గా ఉంటుంది. చాలావరకు ఎరుపు రంగును సెలెక్ట్ చేసుకునేవారు తక్కువ. ఎరుపులో వివిధ రకాల షేడ్స్ అయినా ఎంపిక చేసుకుంటారేమో కానీ పూర్తీ స్పష్టమైన ఎరుపును ఎంపికచేసుకునేవారు అరుదే. ఇక లిప్ స్టిక్ విషయంలో అయితే మరీనూ. చాలామంది లైట్ కలర్స్ ఎంచుకుంటారు. మరికొందరు పెదాలు గులాబీ రేకుల్లా ఉండటానికి పింక్ రంగును ఎంచుకుంటారు. వీటిలో వివిధ షేడ్స్ ట్రై చేస్తారు. కానీ ఎరుపు రంగు లిప్ స్టిక్ వేసుకున్నా ఎబ్బెట్టుగా కనిపించకుండా అందరి కళ్ళకు వావ్ అనిపించేలా చేయాలంటే అసలు ఎరుపు రంగు లిప్ స్టిక్ ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలి. ధైర్యంగా, ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో, ఎలాంటి బెరుకు లేకుండా ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ను అప్లై చేయడానికి కొన్ని టిప్స్ తెలుసుకోవాలి. అవేంటంటే.. లిప్ స్టిక్ ఎంచుకునే ముందు సౌకర్యాన్ని చూసుకోవాలి. మ్యాట్, గ్లోస్, షీర్, క్రీమ్, లిక్విడ్ ఇలా చాలారకాల లిప్ స్టిక్స్ మార్కెట్లో లభ్యమవుతాయి. సౌకర్యాన్ని ఎంచుకోవాలి. లిప్ స్టిక్ అప్లై చేయడానికి ముందు పెదవులు తేమగా ఉండటం అవసరం. అందుకని పెదవులకు మంచి లిప్ బామ్ లేదా ప్రైమర్ అప్లై చెయ్యాలి. ఆ తరువాత టిష్యూ పేపర్ తో సున్నితంగా అద్దుతూ తుడవాలి. అంతే తప్ప టిష్యూతో రుద్దకూడదు. ఆ తరువాత పెదవుల మీద తేలికపాటిగా పౌడర్ అద్దాలి. అలా చేస్తే లిప్స్టిక్ అప్లై చేసిన తరువాత ఒద్దికగా ఉంటుంది. లిప్స్టిక్ అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే పెదవులకు లిప్ స్టిక్ వేస్తే అది ఆకర్షణ పెరుగుతుంది. లిప్ స్టిక్ అప్లై చేసేటప్పుడు చాలామంది పెదవుల మూలలు, షేప్ దగ్గర బోల్తా వడుతుంటారు. ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే మొదట లిప్ లైనర్ తో షేప్ గీసుకోవాలి. ఇందుకోసం లిప్ లైనర్ పెన్సిల్ ఉపయోగించాలి. లిప్టిక్ సెలక్షన్ లో అంతగా అనుభవం లేనివారు అయోమయం చెందుతుంటే కన్ఫ్యూజ్ కాకుండా రష్యన్ రిడ్ వంటి షేడ్ బాగుంటుంది. ఇది ఎలాంటి స్కిన్ టోన్ కు అయినా బాగుంటుంది. పెదవుల మీద పౌడర్ కూడా అప్లై చేశాక లిప్స్టిక్ అప్లై చేయాలి. మొదట ఒక కోటింగ్ ఇచ్చాక టిష్యు పేపర్ ను పెదవుల మధ్య ఉంచుకని పెదవులు రెండూ కలిపి ఒత్తితే పెదవుల మీద ఏవైనా అదనపు నూనెలు ఉంటే అవి తొలగిపోతాయి. ఆ తరువాత టిష్యూ తీసేసి పెదవుల మీద మళ్లీ లైట్ గా ఇంకొక పొర లిప్స్టిక్ వేయాలి. పెదవుల మూలలు ఆకర్షణంగా కనిపించడానికి కొద్దగా కన్సీలర్ ఉన్న బ్రష్ తీసుకుని లిప్స్టిక్ ను మూలలకు అప్లై చెయ్యాలి. లిప్స్టిక్ అప్లై చేసిన తరువాత పెదవులు దట్టంగా కనిపించడం కోసం పెదవుల మీద తేలికగా సెట్టింగ్ పౌడర్ ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల పెదవుల మీది లిప్స్టిక్ వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది. ఎరుపురంగు చాలా తొందరగా అందరికీ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని అప్లై చేసేటప్పుడు పొరపాటున దంతాలకు లిప్స్టిక్ రంగు ఏమైనా అంటుకుని ుందా లేదా చెక్ చేసుకోవడం మాత్రం మరచిపోకూడదు. *నిశ్శబ్ద.
వామ్మో ఈ బ్యాగు కొనే డబ్బుతో మాంచి బుల్లెట్ బైకు కొనేయచ్చు.. అసలు దీని ధరెంతంటే..! ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తగా, ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా అమ్మాయిలు, సెలబ్రిటీలు తాము ప్రత్యేకంగా కనిపించాలని కొత్తగా తయారవుతారు, కొత్త వస్తువుల మీద ఆసక్తి చూపిస్తారు. ఈ ఆసక్తి కొందరికి లాభంగా మారుతుంది. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్ అయిన లూయిస్ విట్టన్ కూడా దీనికేం తీసిపోదు. ఎప్పటికప్పుడు కొత్త తరగా హ్యాండ్ బ్యాగులను ఫ్యాషన్ ప్రపంచంలోకి విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాస్త డబ్బున్న కుటుంబాలకు చెందిన అమ్మాయిల నుండి సెలబ్రిటీల వరకు లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగులు భుజాన వేసుకుని తళుక్కున మెరుస్తుంటారు. ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తూ మరో కొత్త రకం హ్యాండ్ బ్యాగ్ విడుదల చేసింది ఈ దిగ్గజ బ్రాండ్.. ఈ బ్యాగు కొనే డబ్బుతో మాంచి బుల్లెట్ బైకు కొనేయచ్చట. దీని గురించి ఓ లుక్కేస్తే.. సహజంగానే లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగులకు క్రేజ్ ఎక్కువ. దానికి తగ్గట్టే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూంటారు ఇందులోని డిజైనర్లు. తాజాగా శాండ్విచ్ బ్యాగ్ ను తయారుచేసి దాని ధర చెప్పి అందరికీ పెద్ద ఝులక్ ఇచ్చింది. తోలుతో తయారుచేసిన ఈ బ్యాగ్ ధర 3000వేల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా 2లక్షలా 80వేలు. ఈ ఏడాది జనవరి 4న అమ్మకానికి ఈ బ్యాగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ బ్యాగ్ ను ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ చీప్ క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ డిజైన్ చేశారు. ఈ బ్యాగ్ చూడానికి కాగితంతో చేసిన శాండ్విచ్ బ్యాగ్ ను పోలి ఉంటుంది. సడన్ గా చూస్తే అందరూ అదే అనుకుంటారు కూడా. ఈ బ్యాగ్ పొడవు 30 సెం.మీ, ఎత్తు 27సెం.మీ, వెడల్పు 17సెం.మీ ఉంటుందట. ఈ బ్యాగ్ మీద లూయిస్ విట్టన్ అనే బ్రాండ్ నేమ్ మాత్రమే కాకుండా మాసన్ ఫోండి N 1854 అని కూడా రాసి ఉంటుంది. మొత్తానికి చూడ్డానికి ఓ శాండ్విచ్ బ్యాగ్ లా ఉండే బ్యాగ్ తయారుచేసి అందరినీ అయోమయానికి గురిచేయడం లూయిస్ విట్టన్ కే చెల్లిందని ఫ్యాషన్ ప్రపంచంలో పలువురు గుసగుసలాడుతున్నారు. *నిశ్శబ్ద.
చలికాలంలో చేతులను వెచ్చగా ఉంచుకోవడం ఎలాగంటే..! చలికాలంలో వాతావరణం అందరికంటే ఎక్కువగా మహిళలనే ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మహిళలు వంట, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం నుండి చాలా పనులు చేయడానికి నీళ్ళలో ఎక్కువగా చేతులు పెడుతుంటారు. ఇది మాత్రమే కాకుండా శరీరాన్ని మొత్తం దుస్తులతో కప్పి ఉంచినా చేతులు, పాదాలు మాత్రం వాతావరణానికి గురవుతాయి. ఈ కారణంగా మహిళలు చేతులు చల్లగా ఉన్నాయంటూ ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా మహిళల చేతులు ఈ చలికాలంలో వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుంటే.. చలికాలంలో కూడా ఉదయం సాయంత్రం సమయాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కుళాయి ఆన్ చేస్తే ఆ నీళ్లు కూడా ఐస్ లా చాలా చల్లగా అనిపిస్తాయి. అందుకే బట్టలు ఉతకడం, అంట్లు తోమడం వంటి పనులు ఉదయం, సాయంత్రం కాకుండా మధ్యాహ్నం సమయంలో చేసుకుంటే మంచిది. ఉదయాన్నే ఇల్లు ఊడవడం వంటి పనులు చేసేటప్పుడు చేతులు వెచ్చగా ఉండటానికి గ్లౌజులు ఉపయోగించవచ్చు. ఇంట్లో అన్ని వసతులు ఉండి ఇబ్బంది లేదనుకుంటే ఎమర్జెన్సీ సామాన్లు కడగడానికి హీటర్ సహాయంతో నీటిని వేడి చేసి వెచ్చని నీళ్లతో పని ముగించేయవచ్చు. నీళ్లలో చేతులు పెట్టి పనులు ముగించాక తప్పనిసరిగా చేతులను బాగా తుడిచేసుకోవాలి. నీరు చేతుల మీద ఎక్కువసేపు ఉంటే చేతులు చాలా చల్లగా మారిపోతాయి. చేతులకు వెచ్చదనం అందించడానికి గ్లౌజులు మంచి పరిష్కారం. సాధారణ సమయంలో రోజంతా గ్లౌజులు ధరిస్తే బాగుంటుంది. ఈ గ్లౌజులను కూడా ధరించని సమయంలో ఎక్కడంటే అక్కడ పెట్టకుండా వెచ్చగా ఉండే అల్మారా లేదా బట్టల మధ్యలో పెడితే ఇవి కూడా వెచ్చగా వేసుకోగానే చలి నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి. వ్యాయామాలు శరీరాన్ని వేడెక్కించినట్టే చేతి వ్యాయామాలు చేతులను వెచ్చగా ఉంచుతాయి. అరచెతులు రెండూ కలిపి చేసే బోలెడు వ్యాయామాలు ఉంటాయి. వాటిని చేస్తే శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. చలి దరిచేరదు. చలికాలంలో వెచ్చని ఫీల్ ఇవ్వడానికి వేడి ఆహారాలు బాగా సహాయపడతాయి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు కూడా తీసుకోవాలి. హాట్ చాక్లెట్, కాఫీ, అల్లం పాలు, గ్రీన్ టీ, సూప్ వంటివి తీసుకుంటూ ఉంటే చేతులకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా ఊరట లభిస్తుంది. చలిని ఎదుర్కోవడానికి మరొక మార్గం దానికి దూరంగా ఉండటమే. అవసరమైన పనులకోసం మాత్రమే చలికాలంలో బయటకు వెళ్లడం మంచిది. చీటికి మాటికి బయటకు వెళ్ళి ఇబ్బంది పడకూడదు. వేసవిలో ఇల్లు చల్లగా ఉండటానికి కూలర్లు, ఏసీ లు ఎలాగైతే వాడతారో అలాగే చలికాలంలో కూడా ఇల్లు వెచ్చగా ఉండటానికి హీటర్లు వాడాలి. ఇది ఇంటిని వెచ్చగా ఉంచుతుంది. అలాగే ఇంట్లో సువాసనతో కూడిన క్యాండిల్స్, ఎసెంటియల్ ఆయిల్ సహయంతో దీపాలు వెలిగిస్తే ఇల్లంతా మంచి సునాసనతో ఉండటమే కాదు వెచ్చగా ఉంటుంది. చలిగా ఉంది కదా అని బాగా బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తుంటారు చాలా మంది. అయితే బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడం వల్ల శరీరంలో రక్తప్రసరణ దెబ్బ తిని శరీరం మరింత చల్లగా మారుతుంది. కాబట్టి మందంగా ఉన్న దుస్తులు ధరించాలి. *నిశ్శబ్ద.
చలికాలంలో ఫ్యాషన్ గా కనిపించాలంటే ఇలా రెడీ అవ్వండి!! అమ్మాయిలు సీజన్ తో సంబంధం లేకుండా ఫ్యాషన్ గా కనిపించాలని అనుకుంటారు. వేసవిలో మండిపోతున్న ఎండల్లోనూ తమ మేకప్ నుండి డ్రస్సింగ్ వరకు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. ఇక చలికాలం కూడా ఇంతే.. ఎంత చలి ఉన్నా చూపరుల మతి పోయేలా ఫ్యాషన్ తో తళుక్కుమంటారు. అయితే ఫ్యాషన్ గా రెడీ అవ్వడం వెనుక కాసింత అవహాన కూడా ఉండాలి. అలాగైతేనే ఈ చలికి చెక్ పెట్టి ఒకవైపు వెచ్చదనాన్ని, మరొకవైపు ఫ్యాషన్ తో వెలిగిపోతూ భళా అని అనిపించుకుంటారు. ఇంతకీ ఈ చలికాలంలో చలికే ఝులక్ ఇవ్వాలంటే ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి తెలుసుకుంటే.. థర్మల్ టాప్ తో భలే వెచ్చదనం.. చలికాలంలో ప్రతి అమ్మాయి దగ్గరా ఉండాల్సిన టాప్ ఇది. థర్మల్ టాప్ వేసుకుంటే స్టైలిష్ గానూ, వెచ్చగానూ ఉంటుంది. బోల్డ్ రంగులో పొడవాటి చేతులున్న థర్మల్ షర్టులు, లేదా ఉన్నితో కవర్ చేయబడిన థర్మల్ సెట్ ను ఉపయోగించుకోవాలి. ఇవి ఫ్యాషన్ గానూ, శరీరానికి వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. ఇవి ఏ దుస్తులకు అయినా బేసిక్ గా ఉంటాయి. లేయర్ మెథడ్.. చలిగా ఉన్నరోజులలో బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడే అమ్మాయిలు అటు ఫ్యాషన్ గానూ, ఇటు వెచ్చదనాన్ని ఆస్వాదించడానికి లేయర్ మెథడ్ బాగా సహాయపడుతుంది. ఇందులో అందమైన దుస్తులను ఒక దాని మీద మరొకటి స్టైల్ గా కనిపించేలా వేసుకుంటారు. ఇది చూడటానికి అవుట్ స్టాండింగ్ లుక్ ను ఇస్తుంది. శరీర ఆకృతిని బట్టి పొట్టి, పొడవు దుస్తులను ఇందుకోసం వినియోగించవచ్చు. రన్ అవే లెదర్ బూట్స్ చూడగానే వావ్ అనిపించేలా ఉండే రన్ అవే లెదర్ బూట్స్ మోకాలి వరకు ఉంటాయి. చదునుగా, ముదురు రంగులో ఉన్న ఈ బూట్స్ ను ఏ దుస్తులతో అయినా వేసుకోవచ్చు. ఇది హైక్లాస్ లుక్ ను ఇస్తుంది. ఫుల్ గ్లోవ్స్ సాధారణంగా చేతులకు తొడుక్కునే గ్లౌజులు మణికట్టు వరకు ఉంటాయి. అయితే ఫుల్ గ్లౌజులు ప్రయత్నిస్తే కొత్త లుక్ వస్తుంది. స్లీవ్ టీ షర్ట్లు లేదా టాప్స్ కు ఈ ఫుల్ గ్లౌజులు వేసుకుంటే ట్రెండ్ కు కొత్తదనం అద్దినట్టు ఉంటుంది. ఈ గ్లౌజులు నలుపు రంగు లేదా వేసుకునే షూస్, బెల్ట్,జాకెట్ రంగులను బట్టి ఎంపిక చేసుకోవాలి. *నిశ్శబ్ద.
లావుగా ఉన్నా సరే.. సన్నగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..! సన్నగా కనిపిస్తే ఆ కిక్కే వేరు. నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు, నచ్చినంత తినచ్చు, ఎవ్వరూ ఎలాంటి కామెంట్స్ చెయ్యరు. కానీ లావుగా ఉంటే మాత్రం బోలెడు సమస్యలు. ముఖ్యంగా నచ్చిన దుస్తులు వేసుకోలేరు. పైపెచ్చు అందరూ ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు. చాలా చోట్ల బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది మహిళలకు ఇంట్లోనే ఈ సమస్య ఎదురవుతుంది. అయితే లావుగా ఉన్నా సరే.. సన్నగా కనిపించాలంటే తెలివిగా ఆలోచించాలి. లావుగా ఉన్నా సన్నగా కనిపించే దుస్తులు వేసుకోవాలి. ఇంతకీ అలాంటి దుస్తులు ఎలా ఎంచుకోవాలి? ఫలానా దుస్తులు వేసుకుంటే సన్నగా కనబడతామని ఎలా తెలుస్తుంది? మహిళలు ఈ అమేజింగ్ చిట్కాలు తెలుసుకోవాల్సిందే.. ఎంపిక.. లావుగా ఉన్నవారు డ్రస్సులు ఎంపిక చేసుకునేటప్పుడు చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలి. డ్రస్సులు ఎప్పుడూ పిచ్చి పిచ్చి గీతలతోనూ, డిజైన్ల తోనూ ఉండకూడదు. అలాగే చిన్న పువ్వులు, లతలు కూడా ఉండకూడదు. డ్రస్సుల మీద నిలువు గీతలు ఉన్నవి ఫర్పెక్ట్ గా నప్పుతాయి. ఇలాంటివి వేసుకుంటే సన్నగా కనిపిస్తారు. వదులుగా అస్సలొద్దు.. లావుగా ఉన్నవాళ్లు టైట్ గా ఉన్న దుస్తులు వేసుకుంటే శరీరానికి అతుక్కుపోయి వికారంగా కనిపిస్తుందని అనుకుంటారు. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడ భాగాలు, వక్షోజాలు ఎబ్బెట్టుగా కనిపిస్తుంటే చాలా అసౌకర్యం ఫీలవుతారు. అయితే లూజ్ గా ఉన్న దుస్తులు వేసుకోవడం వేరు, కంఫర్ట్ ను చూసుకోవడం వేరు. లూజుగా ఉన్నవి కంఫర్ట్ అనే అపోహ నుండి బయటపడాలి. లావుగా ఉన్నా సరే శరీరానికి మరీ అంటీ అంటనట్టు ఉన్న దుస్తులు వేసుకుంటే చూడ్డానికి సన్నగా కనిపిస్తారు. ప్యాంట్ సెలక్షన్.. లావుగా ఉన్నాం కదా అని చాలా లూజుగా ఉన్న ప్యాంట్లు ఎంపిక చేసుకుంటారు చాలామంది. కానీ ఈ ప్యాంట్లు వేసుకుంటే ఇంకా లావుగా కనిపిస్తారు. కాబట్టి ఎప్పుడూ ఫిట్టింగ్ జీన్స్ ప్యాంట్లు సెలెక్ట్ చేసుకోవాలి. షేప్.. డ్రస్సులలో బోలెడు షేప్ లు కూడా ఉన్నాయి. వీటిలో లావుగా ఉన్నవారికి A లైన్ డ్రస్సులు బాగా నప్పుతాయి. వీటిని వేసుకుంటే లావుగా ఉన్నా సరే స్లిమ్ గా కనిపిస్తారు. ఇవి వేసుకున్నప్పుడు పొడవుగా కనిపించడం వల్ల లావు బయటకు కనిపించదు. దుస్తుల మందం.. దుస్తులు ఎప్పుడూ మందం ఉండకూడదు. మందంగా ఉన్న దుస్తులు వేసుకుంటే సన్నగా ఉన్నవారు కూడా లావుగా కనిపిస్తారు. అందుకని లావుగా ఉన్నవారు మందం దుస్తులు అస్సలు టచ్ చేయకపోవడమే మంచిది. దుస్తులు ఎంత ఖరీదువైనా, ఎంత అందమైన డిజైన్లు అయినా, ఎంత నచ్చినా మందంగా ఉన్న దుస్తులను దూరంగా ఉంచాలి. *నిశ్శబ్ద.
లిక్విడ్ లిప్‌స్టిక్ ఇలా అప్లై చేస్తే అదుర్స్! పెదవుల అందాన్ని పెంచడానికి లిప్స్టిక్ వాడతారు. ఒకప్పుడు లిప్స్టిక్ కోన్ రూపంలో లభించేది. కానీ అన్నీ డవలప్ అయినట్టు ఫ్యాషన్ కూడా డవలప్ అయిపోయింది. లిప్స్టిక్ కాస్తా లిక్విడ్ రూపంలోకి మారింది. పైపెచ్చు లిక్విడ్ లిప్స్టిక్ కూడా వేసుకోవాల్సిన రీతిలో వేసుకుంటే చాలా కాలం పాటు పోకుండా పెదవులను మెరిపిస్తుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు ఈ కింది టిప్స్ పాటిస్తే చాలు.. మేకప్ అంటే అంతగా ఇష్టం లేని మహిళలు కూడా లిప్స్టిక్, కాటుక పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇప్పట్లో వచ్చిన లిక్విడ్ లిప్స్టిక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లిప్స్టిక్ వేసుకోవడానికి ముందు పెదవులకు మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. మాయిశ్చరైజర్ రాయడం వల్ల పెదవులు తేమను కోల్పోకుండా మృదువుగా ఉంటాయి. పైగా లిప్స్టిక్ పెదవులు అంతా బాగా పరచుకుంటుంది. కానీ లిక్వి్డ్ లిప్స్టిక్ కు మాయిశ్చరైజర్ అవసరం లేదు. పెదవులు మరీ గరుకుగా ఉంటే తప్ప మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా చాలా లైట్ గా మాయిశ్చరైజర్ రాస్తే సరిపోతుంది. పెదవులు పర్ఫెక్ట్ షేప్ కనిపించాలంటే మాత్రం లిప్ లైనర్ ఖచ్చితంగా అప్లై చేయాలి. ఏ రంగు లిప్స్టిక్ వాడతారో ఆ రంగు లిప్ లైనర్ ను ఎంచుకోవాలి. ఇద కూడా చాలా సన్నగా ఉండాలి. అలా ఉంటే పెదవుల షేప్ బాగా సెట్ అవుతుంది. మరీ ముఖ్యంగా పెదవుల మూలలను సరిచేయడం మరవకూడదు. సాధారణ లిప్స్టిక్ కు, లిక్విడ్ లిప్స్టిక్ కు తేడా ఉంటుంది. లిక్విడ్ లిప్స్టిక్ క్రీమ్ లాగా ఉంటుంది. దీన్ని సాధారణ లిప్స్టిక్ మాదిరి రెండు మూడు లేయర్లు వెయ్యాల్సిన అవసరం లేదు. అలా వేస్తే పెదవులు చాలా థిక్ గా వికారంగా కనపిస్తాయి. అందుక లిక్విడ్ లిప్స్టిక్ ను కేవలం ఒక లేయర్ మాత్రమే అప్లై చేయాలి. అది వేసాక కూడా కొద్దిసేపు దాన్ని అలాగే వదిలెయ్యాలి అలా చేస్తే లిప్స్టిక్ ఆరిపోతుంది. ఒకవేళ లిక్విడ్ లిప్స్టిక్ ఎక్కువగా అప్లై చేసి ఉంటే టిష్యూ పేపర్ సహాయంతో దాన్ని సెట్ చేసుకోవాలి. ఇందుకోసం టిష్యూ పేపర్ ను పెదవుల మధ్య పెట్టుకుని పెదవులను గట్టిగా ప్రెస్ చేయ్యాలి. ఇలా చేస్తే పెదవుల మీద అదనపు లిక్విడ్ ఈజీ గా తొలగిపోతుంది. లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేయడం గురించి తెలుసుకుని ఉంటారు కానీ కరెక్ట్ రంగు ఎంపిక చేసుకునేవారు చాలా అరుదు. అందుకే లిక్విడ్ లిప్స్టిక్ సరైన రంగు ఎంచుకోవడం ముఖ్యం. ఇలా పెదవుల అందం అదుర్స్. *నిశ్శబ్ద
చిన్నవయసులోనే ఆంటీలా కనబడుతున్నారా... ఇలా చేస్తే టీనేజ్ గర్ల్ అయిపోతారు! వయసును బట్టి పిలుపు అనేవారు. కానీ ఇప్పుడలా కాదు. వయసుతో సంబంధం లేకుండా మనుషుల్ని చూసి ఆటోమెటిక్ గా కొన్ని పిలుపులు వచ్చేస్తాయి చాలామందికి. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే ఇలాంటి మాటల్లో ఆంటీ కూడా ఒకటి. నిండా ముప్పై ఏళ్ళు కూడా నిండకనే ఆంటీ అనే మాట అంటూంటే అమ్మాయిలు చాలా బాధపడుతుంటారు. అయితే దీనివెనుక సరైన కారణమే ఉండి ఉంటుందనే విషయం మహిళలు అర్థం చేసుకోవాలి. ఇతరులు వయసుకు మించిన వరుసలతో పిలుస్తున్నారంటే దానికి కారణం శారీరకంగా ఉన్న వయసు కంటే పెద్దగా కనిపిస్తున్నారనే అర్థం. అలా కాకుండా వయసు పెరిగినా ఈ ఆంటీ అనే ట్యాగ్ మీద పడకూడదు అంటే శారీరకంగా చాలా ఫిట్ గా ఉండాలి. ఇందుకోసం యాంటీ ఏజింగ్ వ్యాయామాలు చాలా సహాయపడతాయి. కేవలం నాలుగే నాలుగు పనులు దినచర్యలో భాగం చేసుకుంటే చాలు సంతూర్ మమ్మీలు నిజంగానే తయారవుతారు. యోగా చేయాలి.. యోగా అనేది వ్యాయామం అని చాలామంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే యోగా అనేది ఒక జీవనశైలి. రోజులో ఏ పని చేసినా ఒక నియమానుసారంగా చేయడం వల్ల మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. ఇక యోగాలో భాగం అయిన ఆసనాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, శరీరాన్ని వంపు తిప్పడం, వివిధ భంగిమలు శరీరాన్ని చాలా ఫిట్ గా ఉంచుతాయి. యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన యోగా వల్ల అటు శారీరక ధృడత్వం, ఇటు మానసిక ఆరోగ్యం రెండూ చేకూరతాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం కొంతసేపు యోగా చేయాలి. బరువులు ఎత్తడం.. రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ లు ఫాలో కావడం వల్ల శరీరం ధృడంగా మారుతుంది. ఇది కండరాలను బలోపేతం చేస్తుంది. బరువులు ఎత్తడం వల్ల కండరాలు మాత్రమే కాదు జీపక్రియ కూడా మెరుగ్గా మారుతుంది. బరువు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. నేటికాలంలో సగం పైగా ఫిట్నెస్ పాడవుతున్నది బరువు నియంత్రణలో లేకపోవడం వల్లనే. కాబట్టి బరువులు ఎత్తడం రోజూ ప్రాక్టీస్ చేస్తే శరీరం మంచి ఆకృతిలోకి మారుతుంది. ఇది యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. నడక.. ఎలాంటి పరికరాలు అక్కర్లేకుండా ఎవరి సహాయం అవసరం లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా చేయగలిగే వ్యాయామం ఏదైనా ఉందంటే అది నడక అనే చెప్పవచ్చు. నడకలో కూడా బ్రిస్క్ వాక్ చేస్తే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజుకు కనీసం వేల నుండి 10వేల అడుగులు నడుస్తుంటే శరీరం ఫిట్ గా మారుతుంది. నడకను దీర్ఘకాలం ఫాలో అయ్యేవారు యవ్వనంగా కనిపిస్తారు. ఈత.. ఈత చాలా మంచి వ్యాయామం. ఇది పూర్తీ శరీరానికి ఫిట్నెస్ ను అందిస్తుంది. సాధారణ వ్యక్తులకే కాదు.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈత ఫాలో అయితే కీళ్ల మీద ఒత్తిడి తగ్గి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పైపెచ్చు ఈత వల్ల గుండె ఆరోగ్యం కూడా బలంగా మారుతుంది. నీటిలో శ్వాస దీర్ఘంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి శ్వాస సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. శరీరం ఫిట్ గా మారడం వల్ల ఈతను దీర్ఘకాలం ఫాలో అయితే యవ్వనంగా ఉంటారు. *నిశ్శబ్ద.
ఆకట్టుకునే లుక్ కోసం వి నెక్ చీర ధర ఎంత అనే రోజులు కావివి. బ్లౌజు ఎలా కుట్టిస్తున్నామన్నదే అసలు విషయం. అందుకే డిజైనర్ బొటిక్ లకు డిమాండ్ మామూలుగా లేదు. అలాని అందరూ హెవీ వర్క్ డిజైన్లకే మొగ్గుచూపుతున్నారని కాదు. ఎందుకంటే ఈ జనరేషన్ అమ్మాయిలను ఒక్కప్పటి వింటేజ్ ట్రెండింగ్...వి నెక్ డిజైన్స్ మెప్పిస్తున్నాయి. ఆ వి నెక్ డిజైన్లను మనమూ ఓసారి చూద్దామా.
బొట్టుకూ ఓ లెక్కుంది.. ఇలా పెట్టుకుంటే కిక్కు ఉంటుంది! ఆడవారి అందానికి బోలెడు అలంకారాలు. నుదుటన పెట్టుకునే బొట్టు నుండి కాళ్లకు వేసుకునే పట్టీల వరకు బోలెడు వైవిద్యాలు. కట్టు బొట్టు మహిళలకు అందం ఇవ్వాలన్నా, వారి అందంగా ఇనుమడింపచేయాలన్నా శరీరానికి తగిన దుస్తులు, రంగులు, బొట్టు వంటివన్నీ చక్కగా ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు పెట్టుకునే బోట్టు వల్ల ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. ముఖం ఆకారాన్ని బట్టి బొట్టు ఆకారం ఉండాలని ఫ్యాషన్ నిపుణులు అంటున్నారు. ఎలాంటి ముఖం ఉన్నవారు ఎలాంటి బొట్టు పెట్టుకోవాలంటే.. వృత్తాకారం.. వృత్తాకారాన్నే రౌండ్ షేప్ అని అంటారు. రౌండ్ షేప్ ఉన్నవారు ముఖానికి ఎంపిక చేసుకునే బొట్టు రౌండ్ గా ఉండకూడదు. ఇలాంటి వారికి చక్కగా పొడవుగా ఉన్న బొట్టు బిళ్లలు భలే ఉంటాయి. ఇలాంటి బొట్టు పెట్టుకుంటే ముఖం లుక్ చాలా అందంగా క్యూట్ గా కనిపిస్తుంది. హృదయాకార ముఖం.. హృదయాకార ముఖాన్నే హార్ట్ షేప్ ఫేస్ అని కూడా అంటారు. ఈ షేప్ ముఖం ఉన్నవారికి నుదురు, గడ్డం ప్లాట్ గా ఉంటుంది. ఇలాంటి ముఖ ఆకారం ఉన్నవారు రౌండ్ షేప్ ఉన్న పెద్ద బొట్టు పెట్టుకోకూడదు. దీని వల్ల నదురు మరీ పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి రౌండ్ షేప్ లోనే చిన్నగా ఉన్న బొట్టు పెట్టుకోవాలి. డైమండ్ షేప్.. డైమండ్ షేప్ ముఖం చిన్నగా ఉంటుంది. ఈ ఆకారం ఉన్నవారి ముఖం, గడ్డం షేప్ చక్కగా ఉంటుంది. వీరు ఎక్కువ డిజైన్ ఉన్న ఉండే బొట్టు కాకుండా సింపుల్ గా ఉన్న బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. ఓవల్ షేప్.. ఓవల్ షేప్ ముఖాకృతి ఉన్నవారికి నుదురు, గడ్డం పొడుగ్గా ఉంటాయి. ఇలాంటి వారికి రౌండ్ గా ఉన్న బొట్టు అయితే చాలా బాగుంటుంది. గుండ్రని ఆకారంలో ఉండే ఎలాంటి బొట్టు అయినా చూడ చక్కగా ఉంటుంది. చతురస్రం షేప్.. కొంతమంది ముఖాకృతి చతురాస్రాకారంలో ఉంటుంది. ఇలాంటి ముఖం ఉన్నవారు అన్ని డిజైన్ల జోలికి వెళ్లకూడదు. ముఖం హైలెట్ గా కనిపించాలంటే రౌండ్ బొట్టు లేక చంద్రుడి ఆకారంలో ఉన్న బొట్టు పెట్టుకోవచ్చు. ఈ బొట్టు వల్ల ముఖం చూడటానికి చాలా అందంగా, ఆకర్షణగా ఉంటుంది. స్టిక్కర్ హ్యాక్స్.. కేవలం బొట్టు ఆకారం విషయమే కాదు వాటి గురించి తెలుసుకోవలసిన చాలా విషయాలున్నాయి. మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకోవడం ఫ్యాషన్ అని తెలిసిందే అయితే ఇప్పుడు కాంట్రాస్ట్ కూడా పెట్టుకోవచ్చు. డ్రస్ కలర్ మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకోవచ్చు. దీనివల్ల రూపం ఆకర్షణగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధమైన స్టిక్కర్లు కాకుండా కొత్త కొత్తగా ట్రై చెయ్యాలి. అలా చేస్తే ట్రెండ్ ను ఫాలో అవ్వడం సులువు. స్టిక్కర్లు కొనుగోలు చేసేటప్పుడు పిచ్చి పిచ్చివి కొనకుండా బ్రాండ్ తీసుకోవాలి. దీనివల్ల స్టిక్కర్లు ఎక్కువ సేపు నుదిటిమీద ఉంటాయి. స్టిక్కర్లు చాలామందికి మధ్యలోనే రాలిపడిపోతుంటాయి. ఇలా జరగకూడదు అంటే టాల్కమ్ పౌడర్ రాయాలి. దీన్ని రాయడం వల్ల స్టిక్ర్ రాలిపోదు. టాల్కమ్ పౌడరే కాదు.. కాంపాక్ట్ పౌడర్ కూడా రాసుకోవచ్చు. ఇలా చేసిన తరువాత స్టిక్కర్ ఎక్కువసేపు ఉంటుంది. *నిశ్శబ్ద.
మేకప్ వేసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. మేకప్ ఒకప్పుడు సెలబ్రిటీలు, సినీ తారలు మాత్రమే వేసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు. సగటు ప్రజలకు కూడా మేకప్ వేసుకోవడం వచ్చు. దానికి తగినట్టుగానే వివిధ బ్యూటీ బ్రాండ్స్ తక్కువ ధరలో మేకప్ ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఈ కారణంగా అమ్మాయిలు చిన్న, పెద్ద శుభకార్యాలనే బేధం లేకుండా ఎంచక్కా మేకప్ వేసుకుని అందంగా తయారై వెళుతుంటారు. అయితే కొందరికి మేకప్ సామాగ్రిని పర్పెక్ట్ ఎలా వాడాలో తెలియదు. మేకప్ సామాగ్రి కొనుగోలు చేసినంత ఈజీగా దాన్ని ముఖానికి అప్లై చేయడం జరగదు. దాని గురించి వివరంగా తెలుసుకోవడం ముఖ్యం. మరీ ముఖ్యంగా మేకప్ సామాగ్రిలో దేని తరువాత ఏది ఉపయోగించాలనే విషయం కూడా తెలియడం ముఖ్యం. మేకప్ వేసుకునేటప్పుడు జరిగే ఈ చిన్న పొరపాట్లు మొత్తం ముఖాన్నే డల్ గా మార్చేస్తాయి. మేకప్ వేసుకునేటప్పుడు పొరపాటున చేయకూడని చిన్న మిస్టేక్స్ తెలుసుకుంటే.. ముఖానికి ఫౌండేషన్ రాసుకుంటే ముఖంలో మెరుపు వస్తుంది. అదే ఫౌండేషన్ విషయంలో తప్పులు చేస్తే మెరుపుకు బదులు ముఖమంతా డల్ గా మారుతుంది. మేకప్ వేసుకునేటప్పుడు చాలామంది ప్రైమర్ వేసుకోవడం అంత అవసరం లేదని అనుకుంటారు. కానీ మేకప్ లో ప్రైమర్ ను చేర్చుకోవడం చాలా అవసరం. మేకప్ కోసం మృదువుగా ఉండే బేస్ అవసరం అవుతుంది. దీనికోసం ప్రైమర్ అప్లై చేయడం తప్పనిసరి. ప్రైమర్ వేసుకోవడం వల్ల ముఖ చర్మం మీద తెరచుకున్న రంధ్రాలు కవర్ అవుతాయి. ముఖ చర్మం మీద మొటిమల వల్ల ఏర్పడిన గుంటలు వంటివి కూడా సెట్ అవుతాయి. మేకప్ సమానంగా వేయడానికి ప్రైమర్ సహాయపడుతుంది. చాలా మంది ముఖం మీద ఉన్న మచ్చలను, వాటి తాలూకు గుర్తులను కవర్ చేయడానికి ఫౌండేషన్ అప్లై చేయడానికి ముందు కన్సీలర్ అప్లై చేస్తుంటారు. అయితే ఫౌండేషన్ కు ముందు కన్సీలర్ అస్సలు వేయకూడదు. కన్సీలర్ అప్లై చేసి, ఆ తరువాత ఫౌండేషన్ వేస్తే ఫౌండేషన్ కన్సీలర్ తో మిక్స్ అయిపోతుంది. దీని వల్ల ముఖం మీది మచ్చలు, వాటి గుర్తులు మళ్ళీ కనిపిస్తాయి. కాబట్టి ఫౌండేషన్ తరువాత కన్సీలర్ అప్లై చేయాలి. ప్రైమర్ వేసిన తరువాత ఫౌండేషన్, ఫౌండేషన్ తరువాత కన్సీలర్ అప్లై చేయాలి. కన్సీలర్ అప్లై చేసిన తరువాత అది సెట్ కావడానికి కొంత సమయం పడుతుంది. దాన్ని చర్మం మీద ఎంత ఎక్కువ సేపు అలాగే వదిలేస్తే అది అంతబాగా సెట్ అవుతుంది. ముఖంలో ముక్కు, దవడలు ఎలా ఉన్నా వాటిని సింపుల్ గా ఎంతో తీరుగా ఉండేలా మేకప్ తో సెట్ చేస్తారు. దీనికోసం ఫౌండేషన్ ను, కన్సీలర్ ను ఈ రెండు భాగాలలో బాగా కలిసేవరకు బ్లెండ్ చేయాలి. చాలామంది మేకప్ ను కేవలం ముఖాకృతి వరకే అప్లై చేస్తుంటారు. కానీ మేకప్ ఎప్పుడు కూడా మెడ వరకు వేసుకోవాలి. *నిశ్శబ్ద.
నార్మల్ మెహందీనే అదిరిపోయే రంగులో పండాలంటే ఇలా చేస్తే చాలు.. గోరింటాకు భారతీయ మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు. పండుగకు, శుభకార్యాలకు, ఆషాడం వచ్చినప్పుడు ఇలా గోరింటాకు పెట్టుకోవడం కామన్. ఒకప్పుడు చెట్టునుండి ఆకు కోసి, దాన్ని రుబ్బి చందమామలు అంటూ చేతిలో చిన్న చిన్న ముద్దలు, చుక్కలు పెట్టుకునేవారు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడంటూ అమ్మాయిల్ని ఆటపట్టించేవారు కూడా. అయితే ఇప్పుడు మెహందీ కోన్ లు అందుబాటులోకి వచ్చాయి. కొందరు వీటిని వాడటానికి భయపడతారు. మరికొందరు గోరింటాకు పొడి తీసుకుని వారి క్రియేటివిటీ ఉపయోగించి సొంతంగా మెహందీ కోన్ లు తయారుచేస్తారు. మెహందీ కోన్ లు సొంతంగా తయారుచేసినా , బయట కొన్నవి అయినా గోరింటాకు ముదురు రంగులో బాగా పండాలి అంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాలి. టీ నీరు.. గోరింటాకు ఇంట్లోనే తయారుచేస్తున్నట్టైతే దాన్ని కలిపేముందు సాధారణ నీటిని కాకుండా టీ నీటిని కలిపితే చక్కని ఫలితం ఉంటుంది. టీ నీటినే టీ డికాక్షన్ అనికూడా అంటారు. టీ పొడి నీళ్ళలో వేసి బాగా ఉడికించి ఈ నీటితో గోరింట పొడికలిపితే గోరింటాకు ముదురు రంగులో పండుతుంది. నిమ్మరసం.. ఇంట్లోనే గోరింటాకు కోన్ తయారుచేసుకునేముందు గోరింట పొడిలో నిమ్మరసం కలపాలి. నిమ్మరసం గోరింట పొడితో చర్య జరిపి గోరింట ఎర్రగా పండేలా చేస్తుంది. విక్స్.. గోరింటాకు పండిన తరువాత దాన్ని తొలగించిన తరువాత చేతులు వెంటనే నీటితో కడిగేయకుండా విక్స్ రాయడం వల్ల మంచి రంగు వస్తుంది. లవంగం.. లవంగాలతో చేతిరంగు ముదురుగా మార్చడం చాలా మందికి తెలిసిన ట్రిక్కే. చేతికి గోరింటాకు తొలగించాక నీటితో కడిగేయకూడదు. రెండుమూడు లవంగాలను పెనం మీద వేసి వేడి చేయాలి. ఆ లవంగాలు పొగ విడుదల చేసినప్పుడు ఆ పొగను చేతులకు తగిలేలా చూడాలి. ఇలా చేస్తే చేతి రంగు బాగా ముదురుగా మారుతుంది. ఆవాల నూనె.. చేతికి గోరింటాకు తొలగించిన తరువాత ఒక కాటన్ బాల్ తీసుకుని దాన్ని ఆవనూనెలో ముంచి ఆ నూనెను చేతికి రాసుకోవాలి. ఇలా చేస్తే గోరింట రంగు దట్టంగా ముదురుగా మారుతుంది. *నిశ్శబ్ద.
దీపావళికి లక్ష్మీదేవి రూపాల్లో ఉన్న చోకర్లతో మెరిసిపోండి..! ఎన్ని నగలు ఉన్నా మగువల మనసు కొత్త వాటికోసం వెతుకుతూనే ఉంటుంది. అసలే పండగల సీజన్. అమ్మవారిని భక్తితో పూజించే మనకు ఆమె రూపాలతో కొలువుదీరిన నగలు మరింత మెప్పిస్తాయి. అందుకే లక్ష్మీదేవి రూపాలతో ఉన్న చోకర్లు ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఆ నగలు మెడలో ధరిస్తే భలే ముచ్చటగా ఉంటుంది. మనకు అందాన్ని తెస్తాయి. కావాలంటే ఈ దీపావళికి మీరూ ప్రయత్నించండి.
రోజంతా తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు! ఉదయం లేచి స్నానం చేసి తయారయ్యాక సాయంత్రం లేదా రాత్రి వరకు కూడ అదే ప్రెష్ నెస్ తో ఉండటం దాదాపు అసాధ్యం. సాయంత్రం వరకు ఎందుకు ఇంటినుండి ఆఫీసుకో, కాలేజీకో వెళ్లేసరికే దుస్తులు చాలావరకు చెమటతో తడిసిపోతాయి. ఇక వేసవికాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. చలికాలంలో అయితే దుస్తులు కాస్త ముతకవాసన కూడా వస్తుంటాయి. అయితే కాలంతో సంబంధం లేకుండా ఉదయం తయారైనప్పటి నుండి తిరిగి ఇల్లు చేరేవరకు శరీరం తాజాగా ఉండాలన్నా, ఇతరులకు మన నుండి ఫ్రెష్ స్మెల్ రావాలన్నా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. అప్పుడే విరబూసిన పువ్వులా తాజాగా ఉండొచ్చు. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం.. సాధారణంగానే శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని కాపాడటమే కాకుండా అంతర్గత శరీరం సరిగా పనిచేయడానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది. అయితే ఉదయం స్నానం చేసిన తరువాత మేలురకం మాశ్చరైజర్ ను రాసుకోవడం వల్ల చర్మం మరింత ఎక్కువసేపు తాజాగా ఉండటమే కాదు, ఎంత సమయం గడిచినా శరీరం తాజా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. దుస్తుల ఎంపిక.. రోజంతా తాజాగా ఉండాలంటే దుస్తుల పాత్ర కూడా ఎంతో ముఖ్యం. వదులుగా, గాలి ప్రసరణ బాగా ఉండే దుస్తులు ఎంచుకోవాలి. బిగుతుగా ఉన్న దుస్తులు వేసుకుంటే చాలా తొందరగా చెమట ఉత్పత్తి కావడం, దుస్తులు చెమటవాసనకు లోనవడం జరుగుతుంది. తేలికగా ఉండే కాటన్ దుస్తులు అన్నివిధాలా మంచి ఎంపిక. ఆహారం.. ఆహారానికి శరీరం తాజాగా ఉండటానికి లింకేటని చాలామందికి అనిపించవచ్చు. కానీ ఘాటు వాసన కలిగిన, తొందరగా వదిలించుకోలేని వాసనలు కొన్ని ఉన్నాయి. వాటిలో పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి చాలా ముఖ్యమైనవి. వీటిని ఆహారంలో తీసుకోకుండా ఉంటే నోటి దుర్వాసన ఇబ్బంది ఉండదు. అదే విధంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ఇకపోతే సిట్రస్ పండ్లైన బత్తాయి, నారింజ, నిమ్మ మొదలైనవి బాగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల అవి శరీరంలో శోషించబడి ఆ తరువాత చర్మం నుండి కూడా విడుదల అవుతాయి. ఈ కారణంగా ఇవి శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచడంలో సహాయపడతాయి. నోటి ఆరోగ్యం.. శరీరం ఎంత తాజాగా ఉన్నా నోటి దర్వాసన ఉంటే మాత్రం అందరూ ఆమడ దూరం పారిపోతారు. అందుకే నోటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రించే ముందు ఖచ్చితంగా పళ్లు తోముకోవాలి. నోటి దుర్వాసన సమస్య ఎదుర్కొంటుున్నట్టు అయితే మౌత్ ఫ్రెషనర్, బ్రీత్ మింట్స్, చూయింగ్ గమ్, ఇలాచి, లవంగం మొగ్గ వంటి ప్రత్యామ్నాయాలు ఉపయోగించడం ద్వారా నోటి దుర్వాసన అధిగమించవచ్చు. పెర్ఫ్యూమ్.. ఇప్పట్లో పెర్ప్యూమ్ లేకుండా బయటకు వెళ్లేవారు తక్కువేనని చెప్పవచ్చు. అయితే రోజంతా తాజాగా ఉండటానికి పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువకాలం పాటు ఉండేలా జాగ్రత్త పడితే దీనికి మించిన సులువైన, పెద్ద పరిష్కారం మరొకటి లేదనే చెప్పవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దుస్తులు ఉతకడానికి ఉపయోగించే సబ్బు, డిటర్జెంట్, లిక్విడ్స్, అలాగే శరీర శుభ్రతకు ఉపయోగించే సబ్బు, బాడీ వాష్, బాడీ లోషన్లు మొదలైనవి మీరు వాడే పెర్ప్యూమ్ కు సమానమైన సువాసన కలిగినవై ఉండాలి. అలా ఉంటే రోజంతా తాజాగా ఉండటం సాధ్యమవుతుంది. మ్యాజిక్ చేసే చిట్కా.. శరీరం రోజంతా తాజాగా అనిపించాలంటే ఉపయోగించే పెర్ప్యూమ్ విషయంలో ఒక మ్యాజిక్ చిట్కా ఫాలో అవ్వాలి. అదే పెర్ప్యామ్ స్ప్రే చేసే ప్రదేశం. శరీరంలో వెచ్చని ప్రాంతాలు, పల్స్ పాయింట్ల దగ్గర పెర్ఫ్యూమ్ ను స్ప్రే చేయడం వల్ల అది దీర్ఘకాలం సువనాసనను నిలిపి ఉంచుతుంది. చెమట పట్టనీయదు. మణికట్టు, గొంతువెనుక భాగం, చెవుల వెనుక భాగం, మోకాళ్ళ వెనుక బాగం, చంకలు మొదలైన ప్రదేశాల్లో పెర్ప్యూమ్ స్ప్రే చేయడం వల్ల చెమట బెడద తగ్గుతుంది. కాఫీ స్క్రబ్.. శరీరాన్ని కాపీ స్ర్కబ్ తో శుభ్రం చేయడం వల్ల శరీరం మంచి సువాసన వెదజల్లుతుంది. కనీసం వారానికి ఒకసారి కాఫీ స్క్రబ్ ఉపయోగించాలి. ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది. సువాసనలు గ్రహించడంలో సహాయపడుతుంది. పాత షూస్ తో జాగ్రత్త.. చాలావరకు పాత షూస్ లేదా చెప్పులువాసన వస్తూంటాయి. ఈ వాసన తాజాగా ఉన్న శరీరాన్ని డామినేట్ చేస్తుంది. అందుకే చెప్పులు, షూస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. *నిశ్శబ్ద.
నవరాత్రుల రెండవరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది.. దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా పండుగ మొదలైపోయింది. తొమ్మిదిరోజులు అమ్మవారు తొమ్మిది అవతారాలలో దర్శనమిస్తుంది. ఈ అవతారాలకు తగ్గట్టే వివిధ పుణ్యక్షేత్రాలలోనూ, ఆలయాలలోనూ అమ్మవారిని ఒక్కొక్కరోజు ఒక్కోవిధమైన రంగు దుస్తులతో, పువ్వులతో అలంకరిస్తారు. ఆయా రోజున ఆయా రంగు అమ్మవారికి ఎంతో ఇష్టమైనదిగా చెబుతుంటారు కూడా. అయితే మహిళలు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగులను ధరించడం, అమ్మను పూజించడం వల్ల అమ్మవారు సంతృప్తి చెందుతారు. నవరాత్రుల రెండవరోజు అమ్మవారి కృపకు ఏ రంగు దుస్తులు ధరించాలంటే.. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణిగా దర్శనమిస్తుంది. బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మవారు తెలుపు రంగు దుస్తులలో ఉంటుంది. అన్ని చోట్లా అమ్మవారికి రెండవరోజున తెలుపు రంగు దుస్తులే అలంకరిస్తారు. అమ్మవారిని పూజించే అమ్మాయిలు, మహిళలు ఈరోజున తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. పూజలో తెలుపు రంగు దుస్తులు ధరించడానికి వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. రెగులర్ దుస్తులలో కూడా తెలుపురంగు దుస్తులలో అనార్కలీ, లెహంగా, పరికిణీ వంటి దుస్తులు బాగుంటాయి. ఎంబ్రాయిండరీ.. స్టోన్ వర్క్, నెట్టెడ్ వర్క్ తో కూడిన తెలుపు రంగు చీరలు కూడా చాలా ఆకర్షణగా ఉంటాయి. చూడగానే లెహంగా ధరించారా అన్నట్టుగా ఉండే షరారా కూడా ఇప్పటి ఫ్యాషన్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇకపోతే తెలుపు రంగు స్వచ్చతకు, తెలివితేటలకు ప్రతీకగా చెబుతారు. ఈరోజున తెలుపు రంగు దుస్తులు ధరించి, తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే అమ్మాయిల కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి కరుణ అమ్మవారిపై ఉంటుంది. *నిశ్శబ్ద.
మెడలో ముత్యాల గణపతి హారం..!! విఘ్నాలను తొలగించి...విజయాలను ఇచ్చే వినాయకుడి ప్రతిమను సెంటిమెంట్ గా భావించేవారంతా ఇప్పుడు ఆ రూపాన్ని ఆభరణాల్లో చేర్చుకుంటున్నారు. ముత్యాలు, పచ్చలు, పగడాలు, బంగారు పూసలు ఇలా ఒకటేమిటి ఏ ఆభరణాల్లోనూ ఇట్టే ఒదిగిపోతుంది. వీటిని ధరించిన వారి అందాన్ని కూడా రెట్టింపు చేస్తోంది. అలాంటి డిజైన్లు ఇప్పుడు కొన్ని చూద్దాం.
మహిళలూ.. జీన్స్ కొనుగోలులో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఇది మీకోసమే.. జీన్స్ వేసుకోవడం అబ్బాయిల నుండి అబ్బాయిల వరకు అందరికీ ఇప్పుడు సాధారణం అయిపోయింది. అయితే అబ్బాయిలు జీన్స్ కొనడానికి వెళ్ళినప్పుడు పెద్ద కష్టపడకుండానే సెలెక్ట్ చేసుకుంటారు. నచ్చిన రంగు, నచ్చిన ధర ఫిక్స్ అయితే చాలు. వారికి పెద్ద కంప్లైంట్స్ ఉండవు. కానీ మహిళల విషయానికి వస్తే, జీన్స్ కొనుగోలు చేయడం పెద్ద ఛాలెంజే. ఎందుకంటే ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా ఉంటుంది. కొందరికి చిన్న నడుము, కొందరికి పెద్ద నడుము. స్త్రీలు దాదాపు 30కి పైగా వెరైటీ నడుము కొలతలు కలిగి ఉంటారు. ఇలాంటి సందర్భంలో మహిళలు ఎవరు ఎలాంటి జీన్స్ కొంటె బాగుంటుంది? ఎలాంటి జీన్స్ ధరిస్తే టాప్స్ నుండి టీ-షర్టు వరకు ప్రతిదీ మెరుగ్గా కనిపిస్తుంది. తెలుసుకంటే.. స్ట్రైట్ కట్ జీన్స్.. స్కిన్నీ జీన్స్ వంకరగా ఉన్న శరీరాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తుంది. అందుకే కొందరు ఈ జీన్స్ ను ఇష్టపడరు. అలాంటి మహిళల కోసం స్ట్రెయిట్ కట్ జీన్స్ ఖచ్చితంగా సరిపోతాయి. స్ట్రెయిట్ కట్ కారణంగా దిగువ భాగంలో వంకరలు బాగా కవర్ అవుతాయి. ఇక ఇది షర్ట్ తో ఆఫీసులకు వెళ్లడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. హై రైజ్ జీన్స్.. వెడల్పాటి హిప్ లైన్స్ ఉన్న మహిళలు తక్కువ ఎత్తున్న జీన్స్ వేసుకుంటే ఎంత అసౌకర్యానికి గురవుతారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి హిప్ లైన్స్ జీన్స్ బదులుగా ఎత్తైన జీన్స్‌ను ఎంచుకుంటే హిప్ లైన్స్ ఉన్న మహిళలకు సౌకర్యాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి మంచి ఆకృతిని ఇస్తుంది. మమ్ జీన్స్.. మమ్ జీన్స్ అనేది జీన్స్ లో ఉన్న మరొక సౌకర్యవంతమైన రకం. ఇది కొంతవరకు స్ట్రెయిట్ కట్ జీన్స్ కేటగిరీలోకి వస్తుంది. ఒక తేడా ఏమిటంటే కాలు వెడల్పు కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది సాధారణంగా ఎత్తుగా లేదా నడుము మధ్యలో ఉంచబడుతుంది. 30 ప్లస్ నడుము ఉన్న క్రాస్ ఫిగర్ మహిళలకు ఇది సరైన ఎంపిక అవుతుంది. బూట్ కట్ జీన్స్.. ఫిట్టింగ్ టాప్ కావాలంటే దిగువన ఓపెన్ హెమ్‌లైన్ ఉంటే, ఫ్లేర్డ్ లేదా బూట్ కట్ జీన్స్ మంచి ఆప్షన్. ఈ రకమైన జీన్స్‌లో కర్వ్‌లు అందంగా హైలైట్ గా ఉంటాయి. ఇవి కొంచెం సెక్సీ టచ్‌ని కూడా జోడిస్తాయి. దిగువ భాగం విశాలంగా ఉన్న కారణంగా ఇది బూట్లు లేదా హీల్స్‌తో చాలా బాగా సెట్ అవుతుంది. ఇది షేప్ ను కవర్ చేయడంలో బాగా పనిచేస్తుంది. మిడ్ రైజ్ జీన్స్.. ఎత్తుగా కనిపించడం ఇష్టం లేకపోయినా 30-35 నడుము సైజ్ ఉన్న మహిళలకు మిడ్ రైజ్ జీన్స్ మంచి ఎంపిక. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో రంగుల సెలక్షన్ చాలా బాగుంటుంది. *నిశ్శబ్ద.
ముడతలు పడిన జీన్స్ ను మామూలుగా చేయడానికి బెస్ట్ ఐడియాస్.. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అని సినిమా పాట అన్నేళ్ళ కిందట రాసిన కారణమో ఏమో కానీ నేటికాలం అమ్మాయిలు జీన్స్ లేనిదే ఇంట్లో నుండి కదలరు. పట్టణాలు, నగరాలలో నివసించే ఎంతోమంది రోజువారీ డ్రెస్సింగ్ లో జీన్స్ ఒక భాగం. అయితే కాలేజీలలో అయినా, ఆఫీసులలో అయినా జీన్స్ వేసుకుని గంటలు గంటలు కూర్చోవడమే జరిగేది. ఇలా చేయడం వల్ల ప్యాంటు నడుము, మోకాళ్లు, తొడల పై భాగంలో ముడుతలు పడతాయి. వీటిని సరిచేయడం కష్టంగా అనిపిస్తుంది. కొందరికి సహనం పోతుంది. కానీ వీటిని కొన్ని పద్దతుల ద్వారా సులువుగా సరిచేయవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. డ్రై ఐస్.. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో డ్రై ఐస్ వేయాలి. ఇంకొక బ్యాగ్ లో ముడుతలు పడిన ప్యాంట్ పెట్టాలి. ప్యాంట్ ఉన్న బ్యాగ్ ను డ్రై ఐస్ ఉన్న బ్యాగ్ లో పెట్టాలి. రెండుగంటల పాటు దీన్ని ఇలాగే వదిలేయాలి. ఆ తరువాత తీసి చూస్తే ప్యాంటు మీద ముడుతలు అన్ని మంత్రించినట్టు మాయమవుతాయి. అయితే ముడుతలు ఎక్కువ లేని దుస్తులకు ఈ టిప్ ఫాలో అయితే దుస్తులు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఐరన్.. ఐరన్ ఎంత చేసినా జీన్స్ ప్యాంటు మీద ముడతలు పోలేదా? అయితే ఈ చిట్కా ఉపయోగించాలి. జీన్స్ ప్యాంటు మీద ముడతలు ఉన్నచోట బాగా నీటిని చిలకరించాలి. ప్యాంటు కాస్త తడిగా ఉన్నప్పుడు బాగా రుద్దితే ముడుతలు చాలా వరకు సెట్ అయిపోతాయి. అయితే ముడుతలు పోవాలని ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు ఐరన్ బాక్స్ తో రుద్దకండి. స్నానం.. జీన్స్ ప్యాంటుకు స్నానమా అని ఆశ్చర్యం వేస్తుందా? పూర్తీగా తెలుసుకోండి. జీన్స్ ప్యాంటు వేసుకుని అలాగే దుస్తులతోనే నీరు నిల్వ ఉన్న బాత్ టబ్ లేదా నీటి తొట్టెలలో కూర్చోవాలి. అయితే సబ్బు, షాంపూ గట్రా ఉపయోగించకుండా కేవలం అలా నీటిలో కూర్చోవాలి అంతే.. వేడినీటిలో ఇలా కూర్చుని నీరు చల్లగా మారిపోగానే బయటకు వచ్చేయాలి. ఈ జీన్స్ ను జాగ్రత్తగా తీసి ఆరేయాలి. లేదంటే అలాగే ఒంటి మీద ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకుంటే ఒక్క ముడుత లేకుండా ప్యాంట్ ఐరన్ చేసినట్టు మారిపోతుంది. అయితే ఇది ఎలాంటి ఇతర మార్గాలు లేని సమయంలో దూరప్రాంతాలలో వసతులు సరిగా లేని చోట ఫాలో అయితే మంచిది. ఎందుకంటే తడిబట్టలతో అలా ఉండటం ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఫ్రీజర్.. ప్యాంటును ప్రిజ్ లో పెట్టడం గురించి విన్నారా? సమ్మర్ లో కొందరు సరదాగా వీడియోస్ కోసం బట్టలు ఫ్రీజర్ లో పెట్టడం చూసి ఉంటారు. కానీ ముడుతలు పడిన జీన్స్ ను ఒకరోజంతా ఫ్రీజర్ లో ఉంచితే అదిరిపోయేలా ఒక ముడుత కూడా లేకుండా సెట్టయిపోతుంది. అయితే కాటన్ జీన్స్ మాత్రం ఇలా చేయకూడదు. *నిశ్శబ్ద.