రక్షాబంధన్‌కు ఈ అందమైన మెహందీ డిజైన్లు..మీరూ ట్రై చేయండి! మీరు రక్షా బంధన్ రోజున మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా? ఈ కథనంలో మీకోసం అందించిన ఈ అందమైన మెహందీ డిజైన్‌లను ఓ సారి ట్రై చేయండి. భారతీయ పండుగలలో మెహందీ ఒక ముఖ్యమైన భాగం. అది ఏ పండగైనా, ఫంక్షన్ అయినా, పెళ్లి అయిన రెండు చేతులకు మెహందీ ఉండాల్సిందే. త్వరలోనే రాఖీ త్వరలో రాబోతోంది. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ మెహందీ డిజైన్‌లను వేసుకోవాలనుకుంటే.. ఈ కథనంలో అందించిన అందమైన మెహందీ డిజైన్‌లపై ఓ లుక్కేయండి. వైన్ మెహందీ: రక్షాబంధన్ రోజున వైన్ మెహందీ డిజైన్ చాలా ఇష్టం. ఎందుకంటే.. ఈ డిజైన్‌ను వేయడానికి మీకు ఎక్కువ సమయం, డబ్బు అవసరం లేదు. మీరు చేతి నుండి వేలు వరకు డిజైన్‌ను తయారు చేసి, ఆకులు, పువ్వులతో డిజైన్ ను అలంకరించాలి. చిన్న వేళ్లపై అద్భుతంగా కనిపిస్తాయి. బ్రాస్లెట్ డిజైన్: బ్రాస్లెట్ డిజైన్ చాలా ట్రెండ్‌లో ఉంది. మీరు కూడా ఈ మెహందీని మీరే అప్లై చేసుకోవచ్చు. మణికట్టు దగ్గర బ్రాస్లెట్ తయారు చేసి, వేళ్లపై చిన్నచిన్న డిజైన్లు వేసి చేతికి ప్రత్యేక లుక్ ఇస్తారు. మెష్ మెహందీ డిజైన్ : మెష్ మెహందీ డిజైన్ వేయడం చాలా సులభం. మీరు చేయవలసిందల్లా మీ చేతులకు నెట్‌ను తయారు చేసి, ఒక బాక్సులో కాకుండా మరొక బాక్సులో చుక్కను ఉంచడం. నెట్‌తో పాటు, మీరు మూలలో పువ్వులు లేదా చిన్న తీగలు కూడా చేయవచ్చు. ఫ్లవర్ మెహందీ డిజైన్ : త్వరగా మెహందీని వేసుకోవాలనుకుంటే..మీరు ఫ్లవర్ మెహందీని కూడా ప్రయత్నించవచ్చు. ఈ తరహా డిజైన్‌ల కోసం చేతికి మధ్యలో పువ్వును తయారు చేసి, చేతి వేళ్లను గోరింటతో కప్పుకుంటే సరిపోతుంది. బాక్స్ మెహందీ డిజైన్ : ఈ డిజైన్లన్నీ కాకుండా, మీరు సాధారణ బాక్స్ మెహందీని డిజైన్ కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ కోసం, మీరు చేయాల్సిందల్లా పెద్ద బాక్సు వేసి అందులో చిన్న బాక్సులను తయారు చేయండి.
ఫంక్షన్లకోసం వేలాదిరూపాయలు పెట్టి బట్టలు కొనలేకపోతున్నారా? ఇదిగో అద్దెకు తెచ్చుకోండిలా.. దుస్తులు మనిషి దర్పాన్ని ప్రదర్శిస్తాయి. ఏదైనా ఫంక్షన్, పెళ్ళి, బర్త్ డే, రిసెప్షన్ ఇలా వేడుకలు ఏవైనా సరే ఆహ్వానం అందితే అక్కడికి వెళ్లాల్సి వస్తే అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వెలిగిపోవాలని అనుకుంటారు మహిళలు. ప్రతి ఫంక్షన్ లో కొత్తగా కనిపించాలని ఉవ్విళ్లూరుతారు. కానీ ప్రతి చోటుకు కొత్త దుస్తులు వేసుకుని వెళ్ళాలన్నా, కొత్త బట్టలు కొనాలన్నా కుదిరేపని కాదు. వేసుకున్నవే రిపీటెడ్ గా మార్చి మార్చి వేసుకోవాల్సి వస్తుంది. అటు కొత్తవి కొనలేక, ఇటు కొత్తగా కనిపించలేక ముఖం చిన్నబుచ్చుకునే చిన్నమ్మలు ఎందరో.. అయితే ఇప్పుడు ఆ బెంగ అక్కర్లేదు. ఫంక్షన్లు అయినా ఇతర వేడుకలు ఏవైనా వేలాది రూపాయలు ఖర్చుపెట్టి బట్టలు కొనాల్సిన పని లేదు. జస్ట్ అద్దెకు తెచ్చుకోవచ్చు. ఫంక్షన్ జరిగినంతసేపు ధరించవచ్చు. వాటిని మళ్లీ తిరిగి ఇచ్చేయచ్చు. నచ్చిన దుస్తులు, నచ్చిన రంగులు, సాదాసీదాగా కాదు సెలబ్రిటీ రేంజ్ దుస్తులు తెచ్చుకోవచ్చు. ఇవి కూడా ఆన్లైన్ లోనే తీసుకోవచ్చు. ఇదేదో బాగుందే అనిపిస్తోందా? అయితే ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండి మరి.. ట్రెండ్ ఫాలో కావాలన్నా, ఫ్యాషన్ గా కనిపించాలన్నా కొత్త దుస్తులు కొనాలి. అయితే కొత్త దుస్తులు కొనాలంటే మాట కాదు. ఇలాంటి వారి కోసం కొన్ని ఆన్లైన్ సైట్లు గ్రాండ్ గా ఉన్న దుస్తులను అద్దెకిస్తున్నాయ్. వీటిని ధరించి సెలబ్రిటీలా వెలిగిపోవచ్చు. ఫ్లై రోబ్ వెబ్సైట్.. ఫ్లై రోబ్ అనేది భారతదేశపు అతిపెద్ద ఫ్యాషన్ రెంటల్ స్టోర్. ఇందులో దుస్తులను ప్రముఖులు కూడా ఉపయోగించడం విశేషం. ఈ ముంబై ఆధారిత సేవ మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, ఇతర మెట్రో నగరాలకు కూడా దాని సేవలు విస్తరించింది. బట్టలు, నగలు నుండి బ్యాగ్‌లు, బూట్ల వరకు అద్దెకు లభిస్తాయి. అది ఆఫీసు పార్టీ అయినా, సూట్ అయినా, ఫార్మల్ వేర్ అయినా, డేట్ నైట్ కోసం వేసుకునే డ్రెస్ అయినా, సంగీత్ అయినా లేదా మెహందీ అయినా, డిజైనర్ దుస్తులు లేదా కోచర్, రన్‌వే, లేదా బోటిక్ కలెక్షన్‌లు ఇలా మొత్తం ఫ్లై రోబ్‌లో ఉన్నాయి. ఇందులో అద్దెకు తీసుకోవాలని అనుకుంటే వారు కొలతలు తీసుకోవడానికి ఒక ప్రొఫెషనల్‌ని పంపుతారు. దుస్తులు సరిపోయేలా మారుస్తారు. వీటిని కొన్ని రోజులు ఉంచుకోవచ్చు సమయం పూర్తైన తర్వాత పికప్ సర్వీస్ కూడా ఉంది. స్విస్ లిస్ట్ స్విష్‌లిస్ట్ ఒక అద్బుతమైన సర్వీస్. ఇందులో డ్రీమ్ అనుకోగలిగిన దుస్తులన్నీ ఉంటాయి. వీటిని ఇంటి వద్దకే డెలివరీ చేయడం, ఇంటి గుమ్మం నుండి మళ్లీ పికప్ చేసుకుంటారు. ఇందులో రాబోయే వేడుకల కోసం ముందుగానే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని విష్ లిస్ట్ లో ఉంచుకోవచ్చు. ఆ తరువాత సమయం వచ్చినప్పుడు దాన్ని అద్దెకు తీసుకుని వాడుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదు. అన్ని రకాల వేడుకలకు తగిన దుస్తులు ఇందులో ఉంటాయి. ర్యాప్డ్.. Wrapd సుమారు ఆరు సంవత్సరాల క్రితం బట్టలు అద్దెకు ఇచ్చే ఆలోచనను ప్రారంభించారు. కానీ ఆ సమయంలో ఈ ఆలోచన వారి చుట్టూ ఉన్న వ్యక్తులకు అసంబద్ధంగా ఆలోచనలేనిదిగా, ఆచరణాత్మకమైనది కాదని అనిపించింది. చాలా మంది దానిని అప్పటికి అంగీకరించలేదు,దీంతో ఇది ఆఫ్ లైన్ స్టోర్ లా ఏర్పడింది. తరువాత ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దాని పేరును మార్చింది. ఢిల్లీలోని పెద్ద స్టోర్‌లకు వెళ్లడం నుండి జైపూర్, హైదరాబాద్‌లకు బ్రాంచ్ చేయడం వరకు పెద్ద ఆన్‌లైన్ కస్టమర్ బేస్‌ను నిర్మిస్తూ ర్యాప్డ్ చాలా విస్తరించింది. Wrapd ప్రధానంగా వివాహాలు, పెళ్లి కార్యక్రమాలకు , అందులో పాల్గొనాలనుకునే వారికి దుస్తులను అద్దెకు ఇస్తుంది. మొదటగా ఎంచుకున్న డ్రెస్ నచ్చకపోతే 48గంటల్లోపు వేరేవాటిని మార్చుకోవచ్చు. లిబరెంట్ ప్లస్ సైజ్, ప్రెగ్నెన్సీ, పెటైట్ ఇలా ఏదైనా, లిబరెంట్ మహిళలను, వారికున్న బోలెడు అవసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రతి కేటగిరీలో ఎంచుకున్న దుస్తులతో ఇది అన్నింటినీ అందిస్తుంది. ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ కోసం A-లైన్ డ్రెస్, లేదా సంగీత్ కోసం గౌను లేదా పెళ్లికి లెహంగా కావాలంటే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న కలెక్షన్‌తో డిజైనర్ వేర్‌లను అద్దెకు ఇవ్వడంలో Liberent దూసుకుపోతోంది. భారతదేశంలోని అన్ని ప్రధాన మెట్రోలలో ఇది ఏర్పాటుచేయబడింది. స్టేజ్ 3 .. స్టేజ్ 3 అనేది ఏ వెబ్సైట్ ఇవ్వలేని అత్యుత్తమ సేవ. ఇది మార్కెట్‌లో అంతరాన్ని తగ్గించడానికి ప్రారంభించబడింది. ప్రముఖ ప్యాషన్ డిజైనర్లు సబ్యసాచి ముఖర్జీ, అంజు మోడీ, మనీష్ మల్హోత్రా, రిధి మెహ్రా వంటి ఫ్యాషన్ పరిశ్రమలోని వారు డిజైన్ చేసిన దుస్తుల మీద ఆసక్తి ఉంటే అందుకు స్టేజ్ 3కి మంచి వేదిక. డిజైనర్ దుస్తులను అద్దెకు ఇవ్వడం నుండి సెలబ్రిటీల రూపాన్ని ప్రతిబింబించే వరకు, ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. *నిశ్శబ్ద.
గోళ్లు అందంగా...పొడవుగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! అందమైన వేళ్లు..వాటికి పొడవాటి గోళ్లు పెంచుకోవడం ప్రతి అమ్మాయి కల. వాటిని అందంగా కనిపించేలా నెయిల్ పాలిష్ లతో, నెయిల్ ఆర్ట్ వేసి...ఇంకా ఆకర్షణీయంగా రెడీ చేస్తారు. గోళ్లను పొడవుగా అందంగా పెంచండం ఒకరోజుల్లో అయ్యేది కాదు. వాటికోసం అతివలు..నెలల తరబడి శ్రమిస్తుంటారు. విరగకుండా జాగ్రత్త వహిస్తుంటారు. అయినా కూడా కాస్త పొడవు పెరిగిన తర్వాత విరిగిపోతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. స్టైలీష్ హెయిర్ కట్, గ్లోయింగ్ స్కిన్, ఎట్రాక్ట్ చేసే గోళ్లతో ఇలా అందంగా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. జుట్టు సంరక్షణ, స్కిన్ కేర్ వీటి గురించి పక్కన పెడితే.. గోళ్లు పెంచడం అంత సులభం కాదు. మనం రోజులో 90 శాతం పనులు చేతితోనే చేస్తుంటాం. ఈ సమయంలో గోళ్లు విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరి అమ్మయిలకు అందమైన పొడవాటి గోళ్ల కల నెలవేరడం ఎలా?గోళ్లు పెంచడం గొప్ప విషయమేమీ కాదనుకోండి. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే అందమైన గోళ్లు పెంచడం చాలా సులభం. ఈ టిప్స్ ఫాలో అయితే...అందంగా, బలంగా మారుతాయి. ఉప్పునీరు: గోర్లు పెరగడానికి ఉప్పునీరు వాడటం గురించి వినే ఉంటారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఉప్పు నీరు నేరుగా గోళ్ల పెరుగుదలను ప్రోత్సహించదు కానీ అది మీ గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ గోళ్ల పెరుగుదలకు ఇది మంచిదని వైద్యనిపుణులు అంటున్నారు. ఉప్పు మీ గోళ్ల ఆరోగ్యానికి దోహదపడుతుంది, తద్వారా మీ గోర్లు నిరంతరం పెరగడానికి సహాయపడుతుంది. ఒక గోరు నెలలో ఎన్ని అంగుళాలు పెరుగుతుంది? వేలుగోళ్లు నెలకు 0.14 అంగుళాలు, కాలిగోళ్లు 0.063 అంగుళాలు పెరుగుతాయి. వేలుగోళ్లు పూర్తిగా తిరిగి పెరగడానికి 3 నుండి 6 నెలల సమయం పడుతుంది, అయితే గోళ్ళకు 12 నుండి 18 నెలల సమయం పడుతుంది. గోరు పెరుగుదల ఆహారం, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. వయస్సు, లింగం, జన్యుపరమైన అంశాలు ఇందులో పాత్ర పోషిస్తాయి. గోళ్లపై పసుపు రంగును ఎలా తొలగించాలి? మీ గోళ్ళపై మరకలను వదిలించుకోవడానికి మీరు బేకింగ్ సోడా, నిమ్మరసంతో ఉప్పు నీటిని ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో 1.5 కప్పుల వెచ్చని నీరు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా , 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. కొద్దిగా పేస్ట్ చేసి, మిశ్రమాన్ని మీ గోళ్లపై అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత మృదువైన బ్రష్‌తో మీ గోళ్లను సున్నితంగా స్క్రబ్ చేయండి. మీ చేతులు, గోళ్లను నీటితో శుభ్రం చేసుకోండి.
పొట్టకొవ్వు కనిపంచకుండా కవర్ చేయాలంటే డ్రస్సింగ్ స్టైల్ ఇలా ఉండాలి! స్లిమ్ గా కనిపించకూడదని అనుకునే అమ్మాయిలు బహుశా అరుదుగా ఉంటారు. కాలేజీ అమ్మాయిల నుండి పిల్లల తల్లుల వరకు తీరైన శరీర సౌష్టవం కోసం ఎంతో కష్టపడతారు. ఎన్ని డైట్ లు ఫాలో అయినా, ఎన్ని వర్కౌట్ లు చేసినా ఫలితం మాత్రం ఆశించిన విధంగా ఉండదు. అయితే వీటితో శరీరం ఫిట్ గా తయారు కాకుంటే ఆ తరువాత ఉన్న గొప్ప ఆప్షన్ డ్రస్సింగ్ స్టైల్. చాలావరకు శరీరంలో ఎబ్బెట్టుగా కనిపించేది, శరీర రూపాన్ని పాడుచేసేది, ఉన్నదానికంటే బరువున్నట్టు చూపెట్టేది పొట్ట. పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వు వల్ల వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ పొట్ట కొవ్వు కవర్ చేయడానికి మంచి డ్రస్సింగ్ స్టైల్ ఫాలో కావాలి. పొట్ట కొవ్వు ఉన్నవారు ఏ డ్రస్సులు ధరించకూడదో, ఎలాంటివి ధరించాలో తెలుసుకుంటే.. పొట్ట కొవ్వు ఉన్నవారు ఏ దుస్తులు ధరించాలంటే.. పొట్ట ఉన్న అమ్మాయిలు పొట్ట కవర్ కావడానికి నడుము పైభాగం వరకు ఉన్న జీన్స్ ధరించవచ్చు. దీనివల్ల పొట్ట ఉన్నట్టు అనిపించనే అనిపించదు. ఈ జీన్స్ వల్ల కేవలం పొట్ట కవర్ కావడమే కాదు పొట్టిగా ఉన్నవారు పొడవుగా కూడా కనబడతారు. ఫలితంగా లావుగా ఉన్నట్టు కూడా కనిపించరు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పార్టీలలో గ్రాండ్ లుక్ కోసం లెహంగా, చీర లేదా సూట్ వంటివి ధరించాలని చాలామందికి ఇష్టంగా ఉంటుంది. కానీ పొట్ట కారణంగా ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. వీటిని ధరిస్తే లావుగా కనబడతారని అనుకుంటారు. పోనీ వీటిని నడుము పై భాగంలో ధరిద్దామా అనుకుంటే డ్రస్సింగ్ లుక్ మొత్తం పాడైపోతుంది. ఇందుకు బెస్ట్ ఆప్షన్ బాడీ షేపర్. బాడీ షేపర్ ధరించడం వల్ల పొట్ట భాగం చాలా కవర్ అవుతుంది. బాడీ షేప్ చక్కగా కుదురుతుంది. అయితే బాడీ షేపర్ కొనుగోలు చేసేటప్పుడు పరిమాణం చూసుకోవడం చాలా ముఖ్యం. పొరపాటున చిన్న సైజు బాడీ షేపర్ కొనుగోలు చేస్తే, దాన్ని ధరిస్తే లుక్ మొత్తం ఇంకా ఎబ్బెట్టుగా తయారవుతుంది. స్లిమ్ గా కనిపించడానికి కుర్తా ధరించాలని అనుకునేవారు క్యాజువల్ వేర్ లో ప్లేర్డ్ కుర్తీలను ధరించవచ్చు. అలాగే వివాహ వేడుకలో కుర్తీ ధరించాలని అనుకుంటే అనార్కలీ డ్రస్ ను బాడీ షేపర్ మీద ధరించవచ్చు. ఈ రెండింటికీ కూడా మంచి పొంతన కుదురుతుంది. పొట్ట కొవ్వును కవర్ చేయడానికి రఫిల్ చీర చాలా మంచి ఆప్షన్. ఈ చీర కట్టు పొట్ట కొవ్వును కవర్ సమర్థవంతంగా కవర్ చేస్తుంది. లుక్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ చీరలోకి బెల్ స్లీవ్ లు ఉన్న బ్లౌజ్ లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్లీటెడ్ డిజైన్ పైన కూడా చీర ధరించవచ్చు . ఇది స్టైలిష్ లుక్ ను మాత్రమే కాదు పొట్ట కొవ్వును కూడా దాచిపెడుతుంది. పొట్ట ఉన్న అమ్మాయిలు ఈ దుస్తులు మాత్రం ధరించకూడదు.. పొట్ట కొవ్వు అధికంగా ఉండి పొట్ట పైకి కనబడుతూ ఉంటే చీర, లెహంగా మొదలైనవి బాడీ షేపర్ లేకుండా ధరించే సాహసం చేయకండి. బిగుతుగా ఉన్న దుస్తులు, వేడి గుణం కలిగిన దుస్తులు ధరిస్తే లావుగా, పొట్ట ఉన్నవారు మరింత ఎబ్బెట్టుగా కనిపిస్తారు. కాబట్టి వీలైన వరకు బిగుతు దుస్తులకు దూరంగా ఉండటమే మంచిది. పొట్ట పైకి కనిపస్తూ ఉంటే నడుము కిందకు వేసుకునే జీన్స్ ధరంచకూడదు. ఇది పొట్టను హైలెట్ చేసి చూపిస్తుంది. పొరపాటున కూడా బాడీకాన్ దుస్తులు ధరించకూడదు. *నిశ్శబ్ద.
ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు .. ఎన్నేళ్ళయినా ఆభరణాల మెరుపు చెక్కు చెదరదు.. ఆభరణాలు భారతీయ మహిళలకు ఎంతో ఉష్టమైనవి. నిజం చెప్పాలంటే చాలామంది మహిళలు ఆభరణాల పేరున బంగారం మీద పెట్టుబడి పెడుతుంటారు. బంగారం అనే కాన్సెప్ట్ మినహాయిస్తే.. వెండి, ఇత్తడి, బంగారం, డైమండ్ ఇలా చాలా రకాల ఆభరాలే ఉంటాయి మహిళల దగ్గర. సాధారణంగా అందరూ ధరించే ఇలాంటి ఆభరణాలు కొన్ని సార్లు వాడిన తరువాత కాస్త మెరుపు కోల్పోతాయి. అదంతా కామన్ అని కొందరు అనుకుంటారు. మరికొందరు మెరుగు పెట్టేవాళ్ల దగ్గరకు వెళ్ళి ఆభరణాలు కొత్తగా ఉండేలా చూసుకుంటారు. అయితే ఇంటి దగ్గరే ఆభరణాలు కొత్తవాటిలా కనిపించేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కేవలం మూడే మూడు స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఆభరణాలు అప్పుడే కొన్నవాటిలా చెక్కు చెదరకుండా, మెరుపు కోల్పోకుండా ఉంటాయి. ఇంతకూ అవేంటో తెలుసుకుంటే.. జాగ్రత్త.. నగలను జాగ్రత్త చేయడం ఒక కళ. సాధారణంగా నగలను జాగ్రత్త చేయడానికి చాలామంది ప్లాస్టిక్ బాక్సులను, జిప్ లాక్ బ్యాగులను వాడుతుంటారు. కొన్నిసార్లు ఒకేదాంట్లో ఎక్కువ నగలు పెడుతుంటారు. దీనివల్ల నగలు ఒకదానికొకటి రాసుకుని గీతలు పడతాయి. నగలు మెరుపు కూడా కోల్పోతాయి. అందుకని నగలు జాగ్రత్త చేయడం మొదటి స్టెప్. నగలను ఎప్పుడూ గాలి చొరబడని, తేమ, వెలుతురు సోకని బాక్సులలో జాగ్రత్త చెయ్యాలి. నగలు ఒకదానికొకటి రాసుకోకుండా, దూరదూరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. నగలు ఉపయోగించిన తరువాత వాటిని జాగ్రత్త చేసేముందు మెత్తని పొడి వస్త్రంతో జాగ్రత్తగా తుడవాలి. 2. శుభ్రం.. నగలు మెరుపు కోల్పోయినప్పుడు వాటికి తిరిగి కొత్తవాటిలా రూపం తీసుకురావడానికి సోప్, సర్ఫ్ వంటి వాటిలో నానబెడతారు. ఆ తరువాత బ్రష్ తో రుద్దేస్తుంటారు. దీనివల్ల ఆభరణాలు వాటి కళ కోల్పోతాయి. దీనికి బదులుగా ప్రస్తుతం మార్కెట్లో చాలా లిక్విడ్ క్లీనర్ లు దొరుకుతున్నాయి. తేలికపాటి లిక్విడ్ క్లీనర్లు ఆభరణాలను చాలా సులువుగా శుభ్రం చేయడానికి సహాయపడతాయి. పైపెచ్చు ఇవి ఆభరణాల రంగును చెక్కుచెదరనివ్వవు. అయితే ఈ లిక్విడ్ క్లీనర్లు కూడా మరీ భీభత్సంగా ఉపయోగించకూడదు. 3. పాలిషింగ్ క్లాత్.. చాలామందికి పాలిషింగ్ క్లాత్ గురించి తెలియదు. ఈ పాలిషింగ్ క్లాత్ లు తిరిగి వినియోగించుకోదగినవిగా కూడా ఉంటాయి. ఇవి ఆభరణాల మీద ఉన్న మచ్చలు, వేలిముద్రలు, దుమ్ము, ధూళి, గీతలు, నూనె పదార్థాలు, మేకప్ సారాలు మొదలైనవన్నీ చాలా సులువుగా శుభ్రం చేయగలవు. ఇవి బంగారం, వెండి, ఇత్తడి, ఇతర ఫ్యాన్సీ జ్యువెలరీని కూడా శుభ్రం చేయడంలో ది బెస్ట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా రత్నాలు, డైమండ్స్ మొదలైనవాటి మీద మచ్చలు, గీతలు, దుమ్ము శుభ్రం చేయడానికి వీటినే వాడాలి. ఇది కూడా గట్టిగా కాకుండా సున్నితంగా, స్లో మోషన్ లో తుడవాలి. ఈ మూడు స్టెప్స్ ఫాలో అయితే ఆభరణాలు ఏళ్లకేళ్ళు వాడినా కొత్తవాటిలానే మెరుస్తుంటాయి. *నిశ్శబ్ద.
కార్వింగ్ స్టోన్స్ తో స్పెషల్ లుక్ సహజంగా ఫుడ్ ఐటమ్స్ అందంగా కనిపించడానికి మనం కార్వింగ్ చేస్తాం. మరి మనం అందంగా కనిపించాలంటే... సాధారణంగా ఆడవాళ్లు చెప్పులు, గాజులు, చెవిరింగులు వంటి వాటిపైన ఆసక్తి చూపిస్తారు. కానీ మెడలో వేసుకొనే వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టరు. రోజూ ఒకే మోడల్ చైన్ వేసుకుంటే ఏం బావుంటుంది. అప్పడప్పుడు ఫ్యాషన్ కు తగట్టు మారుస్తూ ఉండాలి. అలా ఫ్యాషన్ గా ఉండే చైన్స్ లో కార్వింగ్ స్టోన్ డిజైన్ చైన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి చాలా ఫ్యాషనబుల్ గా ఉంటాయి. రకరకాల ఆకారాలలో రంగు రాళ్లతో చెక్కే ఈ డిజైన్స్ జీన్స్, డ్రస్ ల పైకే కాదు చీరల పైన కూడా వేసుకోవచ్చు. మోడ్రన్ గా ఉండే కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే బాగా నప్పుతాయి. నలుగురిలో ప్రత్యేకంగా కనపడతారు. అయితే మీరు కూడా అలా కనిపించాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి.
కాటుక పెట్టుకునే మగువలందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్ ఇవే.. మహిళలు ఎంత అందంగా ముస్తాబైనా కళ్ళకు కాటుక లేకపోతే బాగుండదు. ఆ ముఖం చూడు ఏడ్చినట్టుంది, కాటుక పెట్టుకో అని పెద్దవాళ్లు అరుస్తుంటారు. అయితే కాటుక కూడా రూపాంతరం చెందుతూ పేస్ట్ నుండి ఇప్పుడు పెన్సిల్ వరకు వచ్చిచేరింది. అయితే ఇప్పట్లో మేకప్ చేసుకునేటప్పుడు ప్రతి విషయానికి ప్రాధాన్యత ఉన్నట్టు కాటుకకు కూడా చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. కాటుక పెట్టుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మేకప్ మొత్తం ఖరాబ్ అవుతుంది. కాజల్ పెట్టుకునేటప్పుడు ఈ చిట్కాలు తప్పక పాటించాలి. అలా చేస్తే మేకప్ అవుట్ లుక్ అధిరిపోతుంది. పెన్సిల్ తో కాటుకను అప్లై చేసేటప్పుడు కంటి రేఖ మీద పదేపదే రుద్దకూడదు. ఇలా చేయడం వల్ల కాటుక ముద్దగా కంటి రేఖ మీద అతుక్కుపోయి అది కాస్తా కంటి కింద నలుపును ఏర్పరుస్తుంది. దీని కారణంగా మేకప్ చాలా సులువుగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాటుకను కళ్ల కింది వాటర్ లైన్ పైన మాత్రమే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కళ్ళు ఆకర్షణగా కనిపిస్తాయి. కాటుక పెట్టుకునేటప్పుడు కొందరు ఎక్కువ మొత్తం కంటి రేఖమీద మెత్తేస్తుంటారు. ఇది కళ్ళ ఆకారం మొత్తాన్ని పాడుచేస్తుంది. కాబట్టి ఓ మోస్తరు లైన్ గా కాటుక అప్లై చేయాలి. కాటుక పెట్టుకునేటప్పుడు దానికి వాడే పెన్సిల్ విషయంలో జాగ్రత్త పడాలి. కాజల్ పెన్సిల్ షార్ఫ్ గా లేకపోతే కాటుక అప్లై చేయడంలో ఇబ్బంది తలెత్తుతుంది. కాటుక కంటి రేఖ మీద కాకుండా కింది చర్మం భాగంలో సులువుగా అతుక్కుంటుంది. కాజల్ సెలక్షన్ విషయంలో ఎప్పుడూ తప్పు చేయద్దు. కళ్లకు ఎంపిక చేసుకునే కాటుక వాటర్ ప్రూఫ్ అయితే మేకప్ పాడైపోకుండా ఉంటుంది. కాబట్టి వాటర్ ప్రూప్ ఎంపిక చేసుకోండి. పైన చెప్పుకున్న సింపుల్ చిట్కాలు ఫాలో అయితే కళ్ళు అందంగా, ఆకర్షణగా ఉంటాయి. కంటి అందం మిగిలిన ముఖ మేకప్ ను కూడా అద్భుతంగా ఎలివేట్ చేస్తుంది. *నిశ్శబ్ద.
జీన్స్ కొనేముందు తప్పనిసరిగా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి! ఇప్పటికాలం అమ్మాయిలు వస్త్రాధరణ విషయంలో అబ్భాయిలకు ఏమీ తీసిపోవడం లేదు. అబ్బాయిలతో సమానంగా చక్కగా జీన్స్ ధరిస్తున్నారు. చాలామంది అమ్మాయిలు రెగులర్ గా ధరించడానికి జీన్స్ నే ఎంచుకుంటున్నారు. అయితే జీన్స్ కొనేముందు చాలా సందేహాలు వస్తాయి. వాటిలో జీన్స్ నాణ్యత నుండి కంఫర్ఠ్, ఫ్యాషన్ వరకు బోలెడు ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా జీన్స్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలివీ.. సైజ్.. జీన్స్ కొనుగోలు చేసినప్పుడు, సైజ్ ను బట్టి జీన్స్ ఎంచుకోవడానికి ముఖ్యం.అయితే ఈ సైజ్ జీన్స్ బ్రాండ్లు, శైలులను బట్టి మారుతుంటుంది, కాబట్టి మీ సైజ్ కొలవడానికి టేప్ కొలతను ఉపయోగించాలి. దీనికి అనుగుణంగా జీన్స్‌ని ఎంచుకోవాలి. స్టైల్ స్టైల్ ఎప్పుడు ట్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే జీన్స్ వివిధ స్టైల్స్, కటింగ్స్లో లభిస్తున్నాయి. మీ స్టైల్ ను బట్టి జీన్స్ ను ఎంచుకోవడం మరచిపోకండి. క్వాలిటీ.. జీన్స్ కొనుగోలు చేసేటప్పుడు , దాని నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖరీదైన జీన్స్ ఎప్పుడూ మంచి నాణ్యతతో ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే చవకగా దొరికే జీన్స్ ను తీసిపారేయాల్సిన అవసరం లేదు. కాబట్టి డబ్బు, నాణ్యత రెండింటినీ గుర్తుంచుకోవాలి. క్వాలిటీ జీన్స్ ధరించడం ద్వారా మాత్రమే మీరు సౌకర్యాన్ని పొందవచ్చు. కలర్స్ క్రష్.. మీరు జీన్స్ కు ఇచ్చే ప్రాధాన్యత, ఉపయోగించే విధానం ప్రకారం ముదురు నీలం, లేత నీలం, నలుపు, స్టోన్‌వాష్ వంటి జీన్స్ రంగులను ఎంచుకోవచ్చు. వాషింగ్ విధానం.. ప్రతి రకం వస్త్రానికి ఒకో విధమైన వాషింగ్ స్టైల్ ఉంటుంది. జీన్స్ కొనుగోలు చేసేటప్పుడు, వాటిని ఎలా వాష్ చేయాలో తెలుసుకోవాలి. కొన్ని జీన్స్‌ని చేతితో ఉతకవచ్చు, మరికొన్ని డ్రై క్లీన్ చెయ్యాల్సి ఉంటుంది. చాలా జీన్స్‌లో వాషింగ్ మెషీన్లో ఉతకడం సాధ్యం కాదు. కాబట్టి కొనుగోలు చేయబోయే జీన్స్ ఎలా వాష్ చేయాలో ముందే తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది. *నిశ్శబ్ద.
మహిళలు కుర్తా కొనడానికి కొన్ని లెక్కలున్నాయి! ప్రస్తుత కాలంలో దుస్తుల ఎంపిక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళలు దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు బోలెడు విషయాలు దృష్టిలో ఉంచుకుంటారు. మహిళలు ధరించే దుస్తులలో కుర్తాలు ప్రసిద్ధి చెందాయి. కుర్తాలు ధరించడం అటు ఫ్యాషన్ గానూ, మరోవైపు నిండుగానూ ఉంటుంది. అయితే కుర్తా కొనుగోలు చేసేటప్పుడు, కుర్తా గురించి అనేక విషయాలు అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా కుర్తాను కేవలం ప్యాంటుతో ధరించే కాలం కాదు ఇది. ఈ కారణంగా ప్లాజో, జీన్స్, స్కర్టులు, ప్యాంటులలో దేనితో కుర్తాను ధరిస్తారు అనే విషయాన్ని బట్టి కుర్తాను ఎంపిక చేసుకోవాలి. . లేటెస్ట్ ట్రెండ్ లో ఎక్కువగా ఇష్టపడుతున్న కుర్తా ఏదైనా ఉందంటే అది A-లైన్ కుర్తా. ఇది చాలా క్లాసిక్ లుక్ ఇస్తుంది. అలాగే మహిళలు చాలా సౌకర్యంగా ఉంటారు. కుర్తా కొనుగోలు చేసే ప్రతి మహిళ.. ఎలాంటి కుర్తా కొనాలని అనుకుంటుందో ముందే నిర్ణయించుకోవడం ముఖ్యం. నిజానికి, పర్ఫెక్ట్ కుర్తా మహిళల రూపాన్ని మెరుగుపరుస్తుంది. మరోవైపు, కుర్తా సరిగ్గా లేకుంటే అది మహిళల రూపాన్ని పాడు చేస్తుంది. కుర్తా సరైన విధంగా ఎంపిక చేసుకోవడానికి ఈ విషయాలు తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. ఫాబ్రిక్.. కుర్తాను కొనుగోలు చేసేటప్పుడు, దాని ఫాబ్రిక్‌పై విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుర్తా ఎల్లప్పుడూ వాతావరణానికి అనుగుణంగా కొనుగోలు చేయాలి. కుర్తా ఫాబ్రిక్ చాలా తేలికగా ఉంటే అది ఎక్కువ కాలం ఉండదు. అదే సమయంలో, అది చాలా మందంగా ఉంటే, అది వేడెక్కుతుంది. స్టైల్.. కుర్తాల షేప్స్ చాలా విభిన్న రకాలు ఉన్నాయి. స్టేట్‌మెంట్ లుక్ కావాలంటే, సింపుల్ ఎ-లైన్ కుర్తా బెస్ట్. అయితే, ఎవర్ గ్రీన్ లుక్ కావాలనుకునే మహిళలు క్లాసిక్ అనార్కలీ లేదా అంగ్రాఖా స్టైల్‌ను ఎంచుకోవచ్చు. ఇవి చాలా క్లాస్ గా కనిపిస్తాయి. పొడవు.. కుర్తాలు చూడటానికి వేసుకోవడానికి బానే అనిపించినా తీరా కుర్తా తో ధరించే ప్యాంట్, లేదా ప్లాజో మొదలైన వాటి కారణంగా దాని అందమంతా చెడిపోతుంది. కాబట్టి కుర్తా దేనికి సెట్ గా తీసుకుంటున్నారో ముందే దృష్టిలో ఉంచుకుని కొనుగోలు చేయాలి. పొడవాటి కుర్తా ప్లాజో లేదా స్ట్రెయిట్ ప్యాంట్‌తో వెళ్తే, సల్వార్‌తో చాలా వింతగా కనిపిస్తుంది. ఫిట్టింగ్‌ని నిర్లక్ష్యం చేయవద్దు కుర్తా ఫిట్టింగ్‌ను లైట్ తీసుకుంటే చాలా పెద్ద తప్పు జరిగిపోయినట్టే. కుర్తా డిజైన్ ఎంత బాగున్నా, దాని ఫిట్టింగ్ బాలేకుంటే మాత్రం వింతగా కనిపిస్తుంది. రంగు కుర్తా రంగు ఎప్పుడూ తటస్థంగా ఉండాలి. ప్రకాశవంతమైన కుర్తా ధరించడం మేకప్, నగల రూపాన్ని డామినేషన్ చేస్తుంది. ◆నిశ్శబ్ద.
స్త్రీల వేళ్లకు హంగులు... కాక్ టెయిల్ రింగులు ఆడవాళ్ల చేతివేళ్లు చూడటానికి చాలా మృదువుగా అందంగా ఉంటాయి. అలాంటి చేతివేళ్లు ఇంకా అందంగా కనిపించాలంటే వాటికి నెయిల్ పాలిష్ వేసుకోవడమో, రింగులు పెట్టుకోవడమో చేస్తాం. ఇంకా కొంచెం మోడ్రన్ గా కనిపించాలంటే... ఇప్పుడు కాక్ టెయిల్ రింగులు దొరుకుతున్నాయి. ఇవి స్టోన్స్ తో ఉండి చాలా అందంగా ఉంటాయి. వివిధ రంగుల్లో, ఆకారాల్లో దొరుకుతున్నాయి. ఇవి ఆకారంలో పెద్దగా ఉండి కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.ఈ రింగులు ట్రెడిషనల్ వేర్ గా కంటే పార్టీ వేర్ కి చాలా బాగా నప్పుతాయి. స్టోన్స్ తో పెద్దగా ఉండటం వలన మధ్య వేలుకి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇవి పూర్వం ఎప్పటినుంచో ఉన్నా ఇప్పుడు మళ్లీ కొత్తగా వివిధ హంగులతో మార్కెట్ లోకి వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
చక్కనైన ముఖానికి ఐకానిక్ మేకప్ ఇదిగో… చక్కనైన ముఖాకృతి అందరు అమ్మాయిలకూ ఒక కల. ఈ కాలంలో ముఖాకృతి అనేది ముఖంలో సరిగా స్పష్టంగా లేకపోయినా దాన్ని మేకప్ సహయంతో తీసుకొస్తున్నారు. అయితే మఖం చక్కని ఆకృతిలో కనిపించడానికి వేసే మేకప్ ను ఫాషన్ పరిభాషలో కాంటూరింగ్ అని అంటారు. కాంటూరింగ్ అందరికీ సాధ్యం కాదు. అందులో ఫెయిల్ అయ్యేవారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ముఖం చక్కని ఆకృతి రావడానికి మేకప్ వేయడంలో దేన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి?? ముఖం మీద ఏ ప్రాంతంలో ఎలాంటి షేడ్ వాడాలి?? ఎక్కడ ముఖ చర్మాన్ని సమర్థవంతంగా కవర్ చేయాలి?? వంటి విషయాలు తెలిసి ఉండాలి. ఈ ట్రిక్స్ తెలియకపోతే ఎంత ఖరీదైన మేకప్ సామాగ్రి ఉన్నా అది వ్యర్థమే. కొందరికి ముక్కు, మరికొందరికి బుగ్గలు, ఇంకొందరికి గడ్డం ఇలా ఒక్కొక్కరికి ఒకో ప్రాంతంలో ముఖం అందాన్ని పాడుచేసేలా ఉంటుంది. అయితే దాన్ని మేకప్ సహాయంతో సవరించడం వల్ల ముఖం మొత్తం చక్కని అకృతిలోకి మారుతుంది. మరీ ముఖ్యంగా బొటాక్స్ లిఫ్ట్ షేప్ అనేది చాలామంది ఫాలో అవుతున్నారు. దీన్ని పొందడానికి చాలామంది ప్రయత్నాలు చేసి విఫలం అవుతున్నారు. మేకప్ వేయడంలో ఎంతో పట్టు ఉంటే తప్ప దాన్ని సరైన క్రమంలో వేయలేరు అని ఎంతో మంది అంటూ ఉంటారు. అయితే ఇలాంటివి సులువు చేయడానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ముఖాన్ని చక్కని ఆకృతిలో తీసుకురావడానికి ట్రేండింగ్ లో ఉన్నది టేప్ ట్రిక్:- టేప్ ముక్కని ముఖం మీద నిర్ణీత ప్రాంతంలో అతికించి మేకప్ వేయడం ద్వారా చక్కని ఆకృతి తీసుకురాగలుగుతారు. ఇది ఎలా వేయాలంటే… బొటాక్స్ లిఫ్ట్ షేప్ కోసం మొదట టేప్ ను తీసుకోవాలి. ఈ టేప్ ను కుడివైపు చెవి దగ్గర మొదలు పెట్టి దాన్ని క్రాస్ గా తీసుకుని పెదవుల మూలల మీదుగా అంటే టేప్ కాస్త పెదవుల లోపలికి వెళ్ళాలి. ఇలా కొనసాగించి దాన్ని మళ్ళీ ఎడమ చెవి వైపుకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల టేప్ ఎడమ చెవి నుండి పెదవుల మీదుగా కుడి చెవి వరకు పరచుకుంటుంది. ఇవి రెండు వైపులా ఓకేవిధంగా ఉండేలా చూసుకోవాలి. ఏ వైపు అయినా కాస్త వంకరగా ఉందంటే మేకప్ తరువాత షేప్ కూడా వంకరగా కనిపించే అవకాశం ఉంటుంది. టేప్ ను సరిగ్గా సెట్ చేసిన తరువాత బుగ్గల మీద కాంటూర్ క్రీమ్ ను అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేటప్పుడు ఆ క్రీమ్ పొరపాటున కూడా టేప్ కిందుగా వెళ్లకుండా చూసుకోవాలి. కాంటూర్ క్రీమ్ అప్లై చేసుకున్న తరువాత టేప్ ను మెల్లగా తొలగించాలి. ఇప్పుడు టేప్ తీసివేసి రివర్స్ లో మేకప్ వేయాలి. సాధారణంగా ఉపయోగించే బ్లష్, పౌడర్, హైలెట్ మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. సీక్రెట్ టిప్:- ఈ కాంటూరింగ్ మేకప్ వేసేటప్పుడు మెఙ్ఖమ్ మీద టేప్ అప్లై చేయడానికి రెండు రకాల టిప్స్ వాడచ్చు. ఒకటి కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు నోటి భాగం లోకి టేప్ జోప్పిస్తూ టేప్ అతికించడం. టేప్ నోట్లోకి వెళ్లడం ఇష్టం లేనివారు టేప్ ను చెవి నుండి పెదవి మూలల వరకు ఒకటి, ఆ తరువాత రెండు భాగం వైపు కూడా అలాగే రెండవ ముక్కను అతికించవచ్చు. ఈ టేప్ జిగురు ఇబ్బంది పెట్టకుండా మాశ్చరైజర్ రాయవచ్చు. ◆నిశ్శబ్ద.
వేసవిని బీట్ చేయాలంటే ఈ లిప్స్టిక్ రంగులు బెస్ట్ ఆప్షన్! సమ్మర్ కాస్తా హమ్మర్ తో మోదుతున్నట్టు ఉంది. ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఎవరి స్థాయికి తగ్గట్టు వారు తేలికగా, సౌకర్యవంతంగా ఉండే బట్టలు వేసుకోవాడనికి ప్రయత్నం చేస్తారు. చాలామంది సమ్మర్ షాపింగ్ అంటూ కాటన్ దుస్తులు కొనుగోలు చేస్తారు. వేసవికి తగ్గట్టు ఫేస్ వాష్ దగ్గర నుండి ఎన్నెన్నో మార్పులు వస్తాయి. అమ్మయిలలో దుస్తులతో పాటు మేకప్ కూడా సీజన్‌కు అనుగుణంగా మారే ముఖ్యమైన అంశం. ఈ సీజన్‌లో మేకప్ ఎక్కువ కాలం నిలువదు. అందుకే ఛేంజెస్ చేసుకుంటారు. ఈ మేకప్ కిట్ లో ఏదున్నా లేకపోయినా లిప్స్టిక్ మాత్రం కచ్చితంగా వాడతారు అమ్మాయిలు. సింపుల్ గా ఉండాలి అనుకునేవారు కూడా లిప్స్టిక్, కాజల్ తో సరిపెట్టుకుంటారు. అయితే వేసవి సీజన్లో ఏ కలర్ లిప్స్టిక్ బాగుంటుంది అనే విషయం మీకు తెలుసా?? అమ్మాయిలు అందంగా కనిపించాలి అని, వాతావరణం కు తగ్గట్టు మార్పులు కూడా చేసుకుంటారు. కానీ లిప్స్టిక్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోకపోతే ఎంత బాగా తయారైనా లుక్ మొత్తం పాడైపోతుంది. వేసవిని బీట్ చేయడానికి అద్భుతమైన లిప్స్టిక్ రంగులు ఏవో తెలుసుకుంటే.. పీచ్ కలర్ పీచ్ కలర్ దాదాపు ప్రతి అమ్మాయికి ఇష్టం. ఈ సమ్మర్ సీజన్‌లో ఈ కలర్ లిప్‌స్టిక్‌ను అప్లై చేయడం వల్ల మీ ముఖం వెలిగిపోతుంది. బయటకు వెళ్ళేటప్పుడు ముదురు రంగు దుస్తులు వేసుకునేట్టు అయితే తో పీచ్ కలర్ లిప్స్టిక్ను భలేగా ఉంటుంది. న్యూడ్ కలర్ న్యూడ్ కలర్ ఈ రోజుల్లో ట్రెండ్ లో ఉంది. మెటాలిక్ దుస్తులలో బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే, ఖచ్చితంగా న్యూడ్ కలర్ లిప్స్టిక్ ను అప్లై చేయండి. ఈ రంగు చాలా అందంగా, ఆకర్షణగా ఉంటూ సహజత్వంగా కూడా అనిపిస్తుంది. బ్రౌన్ కలర్ ఈ కలర్ లిప్ స్టిక్ అన్ని రకాల స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలు అప్లై చేయవచ్చు. అయితే దీన్ని అప్లై చెయ్యడానికి కొందరు ఇష్టపడరు. కానీ సమ్మర్ లో ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అందుకే వేసవిలో ఈ రంగు బెస్టు. ప్లం కలర్ ప్లం కలర్ నిజంగా అద్బుతమైనది. ఈ రంగు లిప్స్టిక్ ను విదేశీ దుస్తుల నుండి భారతీయ వస్త్రధారణ వరకు అన్నిటికీ అనువుగా అట్రాక్షన్ గా ఉంటుంది. పింక్ షేడ్ కొన్ని లిప్స్టిక్ రంగులు చిన్నవారికి బాగుంటే, మరికొన్ని పెద్దవారికి నప్పుతాయి. అయితే పింక్ షేడ్ లిప్ స్టిక్ అన్ని వయసుల మహిళలు అప్లై చేయవచ్చు. దీన్ని అప్లై చేయడం వల్ల ముఖం గ్లో సాధారణం కంటే ఎక్కువ పెరుగుతుంది. లిప్స్టిక్ అలవాటు ఉన్న వారు ఈ సమ్మర్ ను బీట్ చేయడానికి ఈ రంగులు ఎంచుకుంటే ఎండలో కూడా అదరహో అనిపిస్తారు. ◆నిశ్శబ్ద.
పెళ్లిళ్లు, ఫంక్షన్ల సమయంలో కలిగే ఇబ్బందులకు భలే పరిష్కారాలు! ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నిజం చెప్పాలి అంటే పెళ్లిళ్లలో సందడి అంతా ఎక్కువ భాగం అమ్మాయిలదే.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో అమ్మాయిలు దగ్గరి బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్లిళ్లకు తప్పనిసరిగా వెళతారు. ఇక పెళ్లిలో అట్రాక్షన్ గా కనబడటానికి చేయని ప్రయత్నాలు ఉండవు. పెళ్లికూతురుని తలదన్నేలా తయారయ్యే అతివలు ఎందరో.. ఇందుకోసం ముందుగానే దుస్తుల నుండి నెయిల్ పాలిష్ వరకు ప్రతిదీ కొనిపెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు డిజప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. దుస్తులకున్న జిప్పులు ఇరుక్కుపోవడం, బట్టలు మీద ఏదైనా పడటం, వేసుకునే చెప్పుల వల్ల అసౌకర్యం ఏర్పడటం జరుగుతాయి. దీనివల్ల మూడ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అయితే కొన్ని టిప్స్ ఉపయోగించడం వల్ల ఈ టెన్సన్స్ ను సులువుగా అధిగమించవచ్చు. దుస్తుల జిప్ లు ఇరుక్కుపోయినప్పుడు.. పెళ్లి సమయంలో చివరిగా డ్రస్సప్ అయ్యేటప్పుడు ఒక్కోసారి దుస్తులకున్న జిప్పులు ఇరుక్కుపోతుంటాయి. అలాంటి సమయంలో ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఆ కోపంతో జిప్పును పదేపదే గట్టిగా లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలా చేస్తే జిప్ ఊడొచ్చే ప్రమాదం ఉంది. ఆ తరువాత ఏమీ చేయలేము. అందుకే అలాంటి సమయాల్లో జిప్ లాగకుండా కొవ్వొత్తి తీసుకుని జిప్ మీద రుద్దాలి. దీనివల్ల జిప్ స్మూత్ గా అవుతుంది. దీంతో జిప్ మూవ్ అవుతుంది. బట్టలపై నూనె చిమ్మితే.. బట్టలపై నూనె చిమ్మితే వచ్చే సావు అంతా ఇంతా కాదు. జిడ్డు తగిలిన దుస్తులు వేసుకుని తిరగడం చాలా ఇబ్బంది. నూనె పడగానే దాన్ని రబ్ చేసి, సోప్ వేసి వాష్ చేయడానికి ప్రయత్నించకూడదు. నూనె పడగానే దానిమీద టాల్కమ్ పౌడర్ చల్లి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. పౌడర్ పొడి బట్టల నుండి నూనెను పీల్చుకుంటుంది. ఆరిన తర్వాత దులిపేస్తే పౌడర్ తో పాటు జిడ్డు పోతుంది. జుట్టు పలుచగా ఉందని బెంగా.. కొంతమందికి జుట్టు మరీ పలుచగా ఉంటుంది. తలమీద పాపిడి, మాడు ఎత్తినట్టు కనిపిస్తుంటాయి. నిజం చెప్పాలంటే దీన్ని మహిళల్లో బట్టతల సమస్యగా చెప్పొచ్చు. దీనికోసం మాట్ ఐషాడో బాగా పనిచేస్తుంది. జుట్టుకు దీన్ని అప్లై చేయడం వల్ల . జుట్టు ఒత్తుగా కనబడుతుంది. హైహీల్స్ తో తంటాలా.. హైహీల్స్ అంటే అమ్మయిలకు ఇష్టం. అవి వేసుకుని హొయలు పోతుంటే పెళ్లి వేడుక అంతా హైలైట్ అవుతుంది. కానీ అటు ఇటు బాగా తిరుగుతున్నప్పుడు మడమలు లాగేస్తాయి. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కాలి వేళ్లపై స్ప్రేని చల్లుకోవచ్చు. ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. పాదాలకు ఎక్కువగా చెమట పట్టినట్లయితే ఇప్పట్లో ఉన్న ఫ్యాషన్ చెప్పులు బోలెడు. వీటిలో పాదాలు కవర్ అయ్యేలా ఉన్నవి ఉంటయై. ఇవి వేసుకున్నప్పుడు వేళ్ళ మధ్య చెమట పడుతుంది. దీనివల్ల చర్మ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి చెప్పులుధరించే ముందు కాలి వేళ్లపై పౌడర్‌ను చల్లుకోవాలి. ఇలా చేస్తే సమస్య తొలగిపోతుంది. ◆నిశ్శబ్ద.
పొట్టిగా ఉన్న అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో చేసే తప్పులివే! ఇప్పటికాలం అమ్మయిలలో పొట్టి వాళ్లకు ఉన్న కష్టాలు మరెవ్వరికీ ఉండవు. ట్రెండీగా, ఫాషన్ గా ఉండాలని అనుకుంటారా?? దుస్తుల దగ్గర నుండి ఎన్నో విషయాలు వారి పొట్టిదనాన్ని మరింత ఎత్తినట్టు చూపిస్తుంటాయి. ఇది అందరికీ జరుగుతుందా అంటే ఉహు లేదు. అవగాహన లేకపోవడం వల్ల కొందరి విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. పొట్టిగా ఉన్న అమ్మాయిలు హీల్స్ వేసుకుంటే పొడుగ్గా కనిపించవచ్చు అనుకుంటారు. కానీ హీల్స్ వేసుకోవడమే పరిష్కారం కాదు. దుస్తుల సెలక్షన్ లో చేసే పొరపాట్లు గమనించుకోవాలి. పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొరపాటున కూడా ఈ కింద చెప్పే విధంగా దుస్తులు ధరించకూడదు. చాలా వదులుగా ఉన్న దుస్తులు నేటి కాలం ఫ్యాషన్ లో భాగం. అయితే ఇలాంటి దుస్తులకు పొట్టిగా ఉన్న అమ్మాయిలు దూరంగా ఉండటమే మంచిది. బాగా వదులుగా ఉన్న దుస్తుల్లో అమ్మాయిలు చిన్న పిల్లల్లా కనబడతారు. స్కర్టులు వేసుకోవడానికి అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. కానీ పొట్టిగా ఉన్న అమ్మాయిలు మోకాళ్ళ వరకు ఉన్న స్కర్టులు వేసుకుంటే మరింత పొట్టిగా కనిపిస్తారు. కేవలం ఇవే కాదండోయ్ మోకాలి కంటే కాస్త పొడవునా దుస్తులను ధరించినా ఇదే సమస్య ఎదురవుతుంది. పొట్టిగా ఉన్న అమ్మాయిలకు ఉన్న మరొక ముప్పు లోవెయిస్ట్ జీన్స్. ఇలాంటి జీన్స్ వేసుకుంటే ఎంత పొడవున్నారో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ కారణంగా పొట్టిదనం ఎక్కువగా అప్పియర్ అవుతుంది. కార్గో ప్యాంట్లు కూడా అమ్మాయిల పాలిట శత్రువులనే చెప్పవచ్చు. ఇవి వదులుగా ఉండటం వల్ల పొడవు తక్కువగా కనబడేలా చేస్తాయి. పొడవుగా కనబడాలనే ఆలోచనతో హై హీల్స్ వేసుకున్నా పైన చెప్పిన దుస్తులను సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఎంత ఎత్తు చెప్పులేసినా పొడవు కనబడకపోగా.. మరింత పొట్టిగా కనిపిస్తారు. ◆నిశ్శబ్ద.
హై హీల్స్ తో ఇబ్బందా.. ఇవి తెలుసుకుంటే సమస్య దూరం! ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది. వెతుక్కున్నంత కొత్తదనం అందులో ఉంటుంది. ప్రతి అమ్మాయి హైహీల్స్ ధరించడానికి ఇష్టపడుతుంది. వీటిని ధరించడం వల్ల అమ్మాయిలకు తాము ప్రత్యేకం అనే భావం కలగడమే కాకుండా ఫ్యాషన్‌గా కనిపిస్తారు. అమ్మాయిలు పొడవున్నారా లేదా పొట్టిగా ఉన్నారా అనే విషయంతో సంబంధం లేకుండా హీల్స్ ధరించడానికి ఇష్టపడతారు. అయితే ఎంత స్టైలిష్ గా ఉన్న అమ్మాయిలు అయినా హీల్స్ వేసుకోవడం కచ్చితంగా కష్టమే. బయటకు కనిపించే అందం, ఆనందం లోపల ఉండదు. హీల్స్ ధరించడం వల్ల పాదాలలో నొప్పి వస్తుంది. మరోవైపు, శరీరానికి అనుగుణంగా ఉన్న హీల్స్ ధరించకపోతే, ఈ సమస్య మరింత పెరుగుతుంది. చాలామంది అమ్మయిలకు హీల్స్ వేసుకున్నప్పుడు నొప్పి ఎందుకు వస్తుందంటే.. రోజూ హీల్స్ వేసుకోకపోవటం వల్ల హైహీల్స్ వేసుకోవడం అలవాటు చేసుకోకపోవటం చాలామందిలో కనిపిస్తుంది. అంటే ప్రత్యేక సందర్భాల్లో, పార్టీలకు వెళ్ళాల్సినప్పుడు మాత్రమే హీల్స్. వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాటు ఉన్నవారు హైహీల్స్ ధరించడం వల్ల, పాదాలు నొప్పి పుడతాయి. పాదాలు సాగదీసినట్టుగా అనిపిస్తాయి. దీని కారణంగా అమ్మాయిలు అప్పుడప్పుడు హై హీల్స్ వేసుకున్నప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలవుతారు. మరికొందరు హైహీల్స్ ధరించడానికి దూరంగా ఉంటారు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలిమ్ అప్పుడు హీల్స్ వేసుకోవడం ఎంతో ఈజీ.. హీల్స్ కొనుగోలు చేసేటప్పుడు మడమల పరిమాణాన్ని గుర్తుంచుకోండి హీల్స్ కొనుగోలు చేసేటప్పుడు దాని పరిమాణాన్ని గుర్తుంచుకోండి. హీల్స్ వదులుగా ఉంటే.. కాలు మళ్లీ మళ్లీ తిరగడం ప్రారంభమవుతుంది. మరోవైపు, మడమలు గట్టిగా ఉంటే, అసౌకర్యానికి గురవుతారు. కాబట్టి కాలి మడమలకు సరిగ్గా సరిపోయేలా హీల్స్ ఉండాలి. మడమ ప్రాంతాల్లో మెత్తగా ఉండే హీల్స్ కొనుగోలుచేయాలి. ముందుగానే ప్రాక్టీస్ బెస్ట్.. ఏదైనా ఈవెంట్ కు వెళ్లాలని అనుకున్నప్పుడు ఈవెంట్‌కు ముందే హీల్స్ ధరించడం, నడవడం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఈవెంట్ సమయానికి బాగా నడవడం అలవాటు అయిపోతుంది. అలాగే హీల్స్ వేసుకున్నప్పుడు పాదాలలో నొప్పి ఉంటే, ఖచ్చితంగా ఫుట్ వ్యాయామాలు చేయాలి. బ్లాక్ హీల్స్‌తో మొదలు... ఇప్పటి వరకు ఎప్పుడూ హీల్స్ ధరించకపోతే, ముందుగా బ్లాక్ హీల్స్ ప్రయత్నించాలి. ఇవి పూర్తిగా బ్యాలెన్స్ ఇవ్వడానికి సపోర్ట్ అవుతాయి. మొదటిసారి పెన్సిల్ హీల్స్ ధరించకూడదు. పంప్ హీల్స్ ప్రయత్నించవచ్చు. పెన్సిల్ హీల్స్ ధరించకూడదనుకుంటే, పంప్ హీల్స్ ధరించడంతో ప్రారంభించడం మంచిది. . 2-3 అంగుళాల పొడవైన హీల్స్ కంటే పొడవైనవి మొదట్లోనే ఉపయోగించద్దు. ఇవి పాటిస్తే.. హీల్స్ వేసుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మీరూ చక్కగా మోడల్ లాగా వాక్ చేయొచ్చు. ◆నిశ్శబ్ద.
మేకప్ బ్రష్ వాడే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి! ఇప్పటికాలం అమ్మాయిలకు మేకప్ సర్వసాధారణం అయిపోయింది. బయటకు వెళ్లాలంటే కచ్చితంగా మేకప్ వేసుకునే వెళ్ళాలి. ఒకప్పటిలా కాసింత పౌడర్ చేతుల్లో వేసుకుని ముఖానికి రుద్దుకుని వెళ్లే కాలం కాదిది. మేకప్ యుగంలో మేకప్ వేసుకోవాడనికి చాలా మేకప్ ప్రొడక్ట్స్, మేకప్ బ్రష్ లు వాడుతూ ఉంటారు. అయితే ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం, వాటిని వాడటం ఒక ఎత్తు అయితే మేకప్ బ్రష్ లను శుభ్రపరచం మరొక ఎత్తు. మేకప్ బ్రష్ లను కనీసం వారానికి ఒకసారి శుభ్రపరుస్తూ ఉండాలట. లేకపోతే యాక్… చీ.. అంటున్నారు. ఇంతకూ అసహ్యించుకోవలసినంత దారుణం అందులో ఏముంది తెలుసుకుంటే.. ముఖానికి మేకప్ వేసుకునే అమ్మాయిలు వాటిని ఎన్ని సార్లు ఎప్పుడు శుభ్రం చేస్తారో వారికే ఎరుక. మేకప్ వేసుకుని తరువాత అలా వదిలేస్తే.. ఆ బ్రష్ లలో దారుణమైన క్రిములు చేరిపోతాయట. పరిశోధనల ప్రకారం టాయిలెట్ సీట్ లో ఉన్నంత దారుణమైన బాక్టీరియా మేకప్ బ్రషులో కూడా ఉంటుందని, వాటిని రోజుల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తే అంతకంటే ఎక్కువ దారుణంగానే ఉంటాయని తెలిసింది. మేకప్ బ్రష్ గురించి పరిశోధనలు చేసినవారు మేకప్ బ్రష్ శుభ్రం చేయకపోతే.. ఎన్నోరోజుల పాటు శుభ్రం చేయకుండా వదిలేసిన టాయిలెట్ సీట్ అంత దారుణంగా ఉంటుందట. ఈ మేకప్ బ్రష్ ల ద్వారా బాక్టీరియా, మృతచర్మం తాలూకూ కణాలు, బ్రష్ లో పేరుకుపోయిన నూనెలు మేకప్ తో పాటు ముఖాన్ని ఆవరించి చాలా తొందరగా ముఖాన్ని పాడుచేస్తాయని తెలిసింది. చాలామంది అమ్మాయిలకు ముఖం మీది చర్మం ఇన్ఫెక్షన్లు, మొటిమలు, దద్దుర్లు వంటివి రావడం వెనుక ఈ మేకప్ బ్రష్లు శుభ్రంగా లేకపోవడం కూడా ఒక కారణం అని అంటున్నారు. ఈ సమస్య నుండి దూరంగా ఉండాలంటే.. వారానికి ఒకసారి తప్పకుండా మేకప్ బ్రష్ లు శుభ్రం చేసుకోవాలి. కాబట్టి మేకప్ వేసుకునే మగువలు మేకప్ సెలక్షన్, బ్రష్ ల సెలక్షన్, మేకప్ తొలగించడం వీటి గురించి మాత్రమే కాదు. కాస్త ఆ బ్రష్ గురించి కూడా పట్టించుకుంటూ ఉండాలి. ◆నిశ్శబ్ద.
జీన్స్ తో పోటీ పడుతున్న ధోతీ రోజులు ఏలా మారుతున్నాయో దానికి తగ్గట్టు ఫ్యాషన్ పోకడలు కూడా రోజురోజుకూ మారిపోతున్నాయి. నిన్న చూసిన మోడల్ ఈ రోజు ఉండదు.. ఈరోజు చూసిన మోడల్ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ ఫ్యాషన్ రంగంలో రోజుకో రకం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్.. యూత్ ని ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల మోడల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ జీన్స్ ప్యాంట్ల్లు వాటిలోనే వేరే మోడల్స్ వచ్చాయి.. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెట్టి వాటితో పోటీపడే ధోతి ప్యాంట్లు వచ్చేశాయి. రకరకాల డిజైన్లలో ఈ ధోతి ప్యాంట్లు మార్కెట్ల్ హడావుడి చేస్తున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుండి కాలేజ్ గాళ్స్ వరకూ వీటికి అందరూ ఇష్టపడుతున్నారు. మీరూ ఒకసారి ట్రైచేయండి.. ఫ్యాషన్ పోకడను అనుసరించండి..