రోజంతా తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు!

ఉదయం లేచి స్నానం చేసి తయారయ్యాక సాయంత్రం లేదా రాత్రి వరకు కూడ అదే ప్రెష్ నెస్ తో ఉండటం దాదాపు అసాధ్యం. సాయంత్రం వరకు ఎందుకు ఇంటినుండి ఆఫీసుకో, కాలేజీకో వెళ్లేసరికే దుస్తులు చాలావరకు చెమటతో తడిసిపోతాయి. ఇక వేసవికాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.  చలికాలంలో అయితే దుస్తులు కాస్త ముతకవాసన కూడా వస్తుంటాయి. అయితే కాలంతో సంబంధం లేకుండా ఉదయం తయారైనప్పటి నుండి తిరిగి ఇల్లు చేరేవరకు శరీరం తాజాగా ఉండాలన్నా, ఇతరులకు మన నుండి ఫ్రెష్ స్మెల్ రావాలన్నా కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. అప్పుడే విరబూసిన పువ్వులా తాజాగా ఉండొచ్చు.

చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం..

సాధారణంగానే శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మాన్ని కాపాడటమే కాకుండా  అంతర్గత శరీరం సరిగా పనిచేయడానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది. అయితే ఉదయం స్నానం చేసిన తరువాత మేలురకం మాశ్చరైజర్ ను రాసుకోవడం వల్ల చర్మం మరింత ఎక్కువసేపు తాజాగా ఉండటమే కాదు, ఎంత సమయం గడిచినా శరీరం  తాజా సువాసన  వెదజల్లుతూ ఉంటుంది.

దుస్తుల ఎంపిక..

రోజంతా తాజాగా ఉండాలంటే దుస్తుల పాత్ర కూడా ఎంతో ముఖ్యం. వదులుగా, గాలి ప్రసరణ బాగా ఉండే దుస్తులు ఎంచుకోవాలి. బిగుతుగా ఉన్న దుస్తులు వేసుకుంటే చాలా తొందరగా చెమట ఉత్పత్తి కావడం, దుస్తులు చెమటవాసనకు లోనవడం జరుగుతుంది. తేలికగా ఉండే కాటన్ దుస్తులు అన్నివిధాలా మంచి ఎంపిక.

ఆహారం..

ఆహారానికి శరీరం తాజాగా ఉండటానికి లింకేటని చాలామందికి అనిపించవచ్చు. కానీ ఘాటు వాసన కలిగిన, తొందరగా వదిలించుకోలేని వాసనలు కొన్ని ఉన్నాయి. వాటిలో పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి చాలా ముఖ్యమైనవి. వీటిని ఆహారంలో తీసుకోకుండా ఉంటే నోటి దుర్వాసన ఇబ్బంది  ఉండదు. అదే విధంగా తాజా ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవాలి. ఇకపోతే సిట్రస్ పండ్లైన బత్తాయి, నారింజ, నిమ్మ మొదలైనవి బాగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల అవి శరీరంలో శోషించబడి ఆ తరువాత చర్మం నుండి కూడా విడుదల అవుతాయి. ఈ కారణంగా ఇవి శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచడంలో సహాయపడతాయి.

నోటి ఆరోగ్యం..

శరీరం ఎంత తాజాగా ఉన్నా నోటి దర్వాసన ఉంటే మాత్రం అందరూ ఆమడ దూరం పారిపోతారు. అందుకే నోటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రించే ముందు ఖచ్చితంగా పళ్లు తోముకోవాలి. నోటి దుర్వాసన సమస్య ఎదుర్కొంటుున్నట్టు అయితే మౌత్ ఫ్రెషనర్, బ్రీత్ మింట్స్, చూయింగ్ గమ్, ఇలాచి, లవంగం మొగ్గ వంటి ప్రత్యామ్నాయాలు ఉపయోగించడం ద్వారా నోటి దుర్వాసన అధిగమించవచ్చు.

పెర్ఫ్యూమ్..

ఇప్పట్లో పెర్ప్యూమ్ లేకుండా బయటకు వెళ్లేవారు తక్కువేనని చెప్పవచ్చు. అయితే రోజంతా తాజాగా ఉండటానికి పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువకాలం పాటు ఉండేలా జాగ్రత్త పడితే దీనికి మించిన సులువైన, పెద్ద పరిష్కారం మరొకటి లేదనే చెప్పవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దుస్తులు ఉతకడానికి ఉపయోగించే సబ్బు, డిటర్జెంట్, లిక్విడ్స్, అలాగే శరీర శుభ్రతకు ఉపయోగించే సబ్బు, బాడీ వాష్, బాడీ లోషన్లు మొదలైనవి మీరు వాడే పెర్ప్యూమ్ కు సమానమైన సువాసన కలిగినవై ఉండాలి. అలా ఉంటే రోజంతా తాజాగా ఉండటం సాధ్యమవుతుంది.

మ్యాజిక్ చేసే చిట్కా..

శరీరం రోజంతా తాజాగా అనిపించాలంటే ఉపయోగించే పెర్ప్యూమ్ విషయంలో ఒక మ్యాజిక్ చిట్కా ఫాలో అవ్వాలి. అదే పెర్ప్యామ్ స్ప్రే చేసే ప్రదేశం.  శరీరంలో వెచ్చని ప్రాంతాలు, పల్స్ పాయింట్ల దగ్గర పెర్ఫ్యూమ్ ను స్ప్రే చేయడం వల్ల అది దీర్ఘకాలం సువనాసనను నిలిపి ఉంచుతుంది. చెమట పట్టనీయదు. మణికట్టు, గొంతువెనుక భాగం, చెవుల వెనుక భాగం, మోకాళ్ళ వెనుక బాగం, చంకలు మొదలైన ప్రదేశాల్లో పెర్ప్యూమ్ స్ప్రే చేయడం వల్ల  చెమట బెడద తగ్గుతుంది.

కాఫీ స్క్రబ్..

శరీరాన్ని కాపీ స్ర్కబ్ తో శుభ్రం చేయడం వల్ల శరీరం మంచి సువాసన వెదజల్లుతుంది.  కనీసం వారానికి ఒకసారి కాఫీ స్క్రబ్ ఉపయోగించాలి. ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది. సువాసనలు గ్రహించడంలో సహాయపడుతుంది.

పాత షూస్ తో జాగ్రత్త..

చాలావరకు పాత షూస్ లేదా చెప్పులువాసన వస్తూంటాయి. ఈ వాసన తాజాగా ఉన్న శరీరాన్ని డామినేట్ చేస్తుంది. అందుకే చెప్పులు, షూస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

                                                         *నిశ్శబ్ద.