చలికాలంలో చేతులను వెచ్చగా ఉంచుకోవడం ఎలాగంటే..!

చలికాలంలో వాతావరణం అందరికంటే ఎక్కువగా మహిళలనే ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మహిళలు వంట, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం నుండి చాలా పనులు చేయడానికి నీళ్ళలో ఎక్కువగా చేతులు పెడుతుంటారు. ఇది మాత్రమే కాకుండా శరీరాన్ని మొత్తం దుస్తులతో కప్పి ఉంచినా చేతులు, పాదాలు మాత్రం వాతావరణానికి గురవుతాయి. ఈ కారణంగా మహిళలు చేతులు చల్లగా ఉన్నాయంటూ ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా మహిళల చేతులు ఈ చలికాలంలో వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుంటే..

చలికాలంలో కూడా ఉదయం సాయంత్రం సమయాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కుళాయి ఆన్ చేస్తే ఆ నీళ్లు కూడా ఐస్ లా చాలా చల్లగా అనిపిస్తాయి. అందుకే బట్టలు ఉతకడం, అంట్లు తోమడం వంటి పనులు ఉదయం, సాయంత్రం కాకుండా మధ్యాహ్నం సమయంలో చేసుకుంటే మంచిది.  ఉదయాన్నే ఇల్లు ఊడవడం వంటి పనులు చేసేటప్పుడు చేతులు వెచ్చగా ఉండటానికి గ్లౌజులు ఉపయోగించవచ్చు.

ఇంట్లో అన్ని వసతులు ఉండి ఇబ్బంది లేదనుకుంటే ఎమర్జెన్సీ సామాన్లు కడగడానికి హీటర్ సహాయంతో నీటిని వేడి చేసి వెచ్చని నీళ్లతో పని ముగించేయవచ్చు.  నీళ్లలో చేతులు పెట్టి పనులు ముగించాక తప్పనిసరిగా చేతులను బాగా తుడిచేసుకోవాలి. నీరు చేతుల మీద ఎక్కువసేపు ఉంటే చేతులు చాలా చల్లగా మారిపోతాయి.  

చేతులకు  వెచ్చదనం అందించడానికి గ్లౌజులు మంచి పరిష్కారం. సాధారణ సమయంలో రోజంతా గ్లౌజులు ధరిస్తే   బాగుంటుంది. ఈ గ్లౌజులను కూడా ధరించని సమయంలో ఎక్కడంటే అక్కడ పెట్టకుండా వెచ్చగా ఉండే అల్మారా లేదా బట్టల మధ్యలో పెడితే ఇవి కూడా వెచ్చగా  వేసుకోగానే చలి నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి.

వ్యాయామాలు శరీరాన్ని వేడెక్కించినట్టే చేతి వ్యాయామాలు చేతులను వెచ్చగా ఉంచుతాయి. అరచెతులు రెండూ కలిపి చేసే బోలెడు వ్యాయామాలు ఉంటాయి. వాటిని చేస్తే శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది. చలి దరిచేరదు.

చలికాలంలో వెచ్చని ఫీల్ ఇవ్వడానికి వేడి ఆహారాలు బాగా సహాయపడతాయి. అలాగే శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు కూడా తీసుకోవాలి. హాట్ చాక్లెట్, కాఫీ, అల్లం పాలు, గ్రీన్ టీ, సూప్ వంటివి తీసుకుంటూ ఉంటే చేతులకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా ఊరట లభిస్తుంది.

చలిని ఎదుర్కోవడానికి మరొక మార్గం  దానికి దూరంగా ఉండటమే. అవసరమైన పనులకోసం మాత్రమే చలికాలంలో బయటకు వెళ్లడం మంచిది. చీటికి మాటికి బయటకు వెళ్ళి ఇబ్బంది పడకూడదు.

వేసవిలో ఇల్లు చల్లగా ఉండటానికి కూలర్లు, ఏసీ లు ఎలాగైతే వాడతారో అలాగే చలికాలంలో కూడా ఇల్లు వెచ్చగా ఉండటానికి హీటర్లు వాడాలి. ఇది ఇంటిని వెచ్చగా ఉంచుతుంది. అలాగే ఇంట్లో సువాసనతో కూడిన క్యాండిల్స్, ఎసెంటియల్ ఆయిల్ సహయంతో  దీపాలు వెలిగిస్తే  ఇల్లంతా మంచి సునాసనతో ఉండటమే కాదు వెచ్చగా ఉంటుంది.

చలిగా ఉంది కదా అని బాగా బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తుంటారు చాలా మంది. అయితే బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడం వల్ల శరీరంలో రక్తప్రసరణ దెబ్బ తిని శరీరం మరింత చల్లగా మారుతుంది. కాబట్టి మందంగా ఉన్న దుస్తులు ధరించాలి.

                    *నిశ్శబ్ద.