వామ్మో ఈ బ్యాగు కొనే డబ్బుతో మాంచి బుల్లెట్ బైకు కొనేయచ్చు.. అసలు దీని ధరెంతంటే..!

ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తగా, ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా అమ్మాయిలు, సెలబ్రిటీలు తాము ప్రత్యేకంగా కనిపించాలని కొత్తగా తయారవుతారు, కొత్త వస్తువుల మీద ఆసక్తి చూపిస్తారు. ఈ ఆసక్తి కొందరికి లాభంగా మారుతుంది. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్ అయిన లూయిస్ విట్టన్ కూడా దీనికేం తీసిపోదు. ఎప్పటికప్పుడు కొత్త తరగా హ్యాండ్ బ్యాగులను ఫ్యాషన్ ప్రపంచంలోకి విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాస్త డబ్బున్న కుటుంబాలకు చెందిన అమ్మాయిల నుండి సెలబ్రిటీల వరకు లూయిస్ విట్టన్  హ్యాండ్ బ్యాగులు భుజాన వేసుకుని తళుక్కున మెరుస్తుంటారు. ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తూ మరో కొత్త రకం హ్యాండ్ బ్యాగ్ విడుదల చేసింది ఈ దిగ్గజ బ్రాండ్.. ఈ బ్యాగు కొనే డబ్బుతో మాంచి బుల్లెట్ బైకు కొనేయచ్చట. దీని గురించి ఓ లుక్కేస్తే..

సహజంగానే లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగులకు క్రేజ్ ఎక్కువ. దానికి తగ్గట్టే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూంటారు ఇందులోని డిజైనర్లు. తాజాగా శాండ్విచ్ బ్యాగ్ ను తయారుచేసి దాని ధర చెప్పి అందరికీ పెద్ద ఝులక్ ఇచ్చింది. తోలుతో తయారుచేసిన ఈ బ్యాగ్ ధర 3000వేల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా 2లక్షలా 80వేలు.

ఈ ఏడాది జనవరి 4న అమ్మకానికి ఈ బ్యాగ్ అందుబాటులోకి వచ్చింది.  ఈ బ్యాగ్ ను ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ చీప్ క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ డిజైన్ చేశారు. ఈ బ్యాగ్ చూడానికి కాగితంతో చేసిన శాండ్విచ్ బ్యాగ్ ను పోలి ఉంటుంది. సడన్ గా చూస్తే అందరూ అదే అనుకుంటారు కూడా. ఈ బ్యాగ్ పొడవు 30 సెం.మీ, ఎత్తు 27సెం.మీ, వెడల్పు 17సెం.మీ ఉంటుందట. ఈ బ్యాగ్ మీద లూయిస్ విట్టన్  అనే బ్రాండ్ నేమ్ మాత్రమే కాకుండా మాసన్ ఫోండి N 1854  అని కూడా రాసి  ఉంటుంది. మొత్తానికి చూడ్డానికి ఓ శాండ్విచ్ బ్యాగ్ లా ఉండే బ్యాగ్ తయారుచేసి అందరినీ అయోమయానికి గురిచేయడం లూయిస్ విట్టన్ కే చెల్లిందని ఫ్యాషన్ ప్రపంచంలో పలువురు గుసగుసలాడుతున్నారు.

                                         *నిశ్శబ్ద.