మేకప్ వేసుకునేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..
 


మేకప్ ఒకప్పుడు సెలబ్రిటీలు, సినీ తారలు మాత్రమే వేసుకునేది. కానీ ఇప్పుడు అలా కాదు. సగటు ప్రజలకు కూడా మేకప్ వేసుకోవడం వచ్చు. దానికి తగినట్టుగానే వివిధ బ్యూటీ బ్రాండ్స్  తక్కువ ధరలో మేకప్ ఉత్పత్తులను అందిస్తున్నాయి.  ఈ కారణంగా అమ్మాయిలు చిన్న, పెద్ద శుభకార్యాలనే బేధం లేకుండా ఎంచక్కా మేకప్ వేసుకుని అందంగా తయారై వెళుతుంటారు. అయితే కొందరికి మేకప్ సామాగ్రిని పర్పెక్ట్ ఎలా వాడాలో తెలియదు. మేకప్ సామాగ్రి కొనుగోలు చేసినంత ఈజీగా దాన్ని ముఖానికి అప్లై చేయడం జరగదు. దాని గురించి వివరంగా తెలుసుకోవడం ముఖ్యం.  మరీ ముఖ్యంగా మేకప్ సామాగ్రిలో దేని తరువాత ఏది ఉపయోగించాలనే విషయం కూడా తెలియడం ముఖ్యం.  మేకప్ వేసుకునేటప్పుడు జరిగే ఈ చిన్న పొరపాట్లు మొత్తం ముఖాన్నే డల్  గా మార్చేస్తాయి. మేకప్ వేసుకునేటప్పుడు పొరపాటున చేయకూడని చిన్న మిస్టేక్స్ తెలుసుకుంటే..

ముఖానికి ఫౌండేషన్ రాసుకుంటే ముఖంలో మెరుపు వస్తుంది. అదే ఫౌండేషన్ విషయంలో తప్పులు చేస్తే మెరుపుకు బదులు ముఖమంతా  డల్ గా మారుతుంది.  మేకప్ వేసుకునేటప్పుడు చాలామంది ప్రైమర్ వేసుకోవడం అంత అవసరం లేదని అనుకుంటారు.  కానీ మేకప్ లో ప్రైమర్ ను చేర్చుకోవడం చాలా అవసరం.  మేకప్ కోసం మృదువుగా ఉండే బేస్ అవసరం అవుతుంది. దీనికోసం ప్రైమర్ అప్లై చేయడం తప్పనిసరి. ప్రైమర్ వేసుకోవడం వల్ల ముఖ చర్మం మీద తెరచుకున్న రంధ్రాలు కవర్ అవుతాయి.  ముఖ చర్మం మీద మొటిమల వల్ల ఏర్పడిన గుంటలు వంటివి  కూడా సెట్ అవుతాయి.  మేకప్ సమానంగా వేయడానికి ప్రైమర్ సహాయపడుతుంది.

చాలా మంది ముఖం మీద ఉన్న మచ్చలను, వాటి తాలూకు గుర్తులను కవర్ చేయడానికి ఫౌండేషన్ అప్లై చేయడానికి ముందు కన్సీలర్ అప్లై చేస్తుంటారు.  అయితే ఫౌండేషన్ కు ముందు కన్సీలర్ అస్సలు వేయకూడదు. కన్సీలర్ అప్లై చేసి, ఆ తరువాత ఫౌండేషన్ వేస్తే  ఫౌండేషన్ కన్సీలర్ తో మిక్స్ అయిపోతుంది.  దీని వల్ల ముఖం మీది మచ్చలు, వాటి గుర్తులు మళ్ళీ కనిపిస్తాయి.  కాబట్టి ఫౌండేషన్ తరువాత కన్సీలర్ అప్లై చేయాలి.

ప్రైమర్ వేసిన తరువాత ఫౌండేషన్, ఫౌండేషన్ తరువాత  కన్సీలర్ అప్లై చేయాలి. కన్సీలర్ అప్లై చేసిన తరువాత  అది సెట్ కావడానికి కొంత సమయం పడుతుంది.  దాన్ని చర్మం మీద ఎంత ఎక్కువ సేపు అలాగే వదిలేస్తే అది అంతబాగా సెట్ అవుతుంది.

ముఖంలో ముక్కు,  దవడలు ఎలా ఉన్నా వాటిని సింపుల్ గా ఎంతో తీరుగా ఉండేలా మేకప్ తో సెట్ చేస్తారు. దీనికోసం ఫౌండేషన్ ను, కన్సీలర్ ను ఈ రెండు భాగాలలో బాగా కలిసేవరకు బ్లెండ్ చేయాలి. చాలామంది మేకప్ ను కేవలం ముఖాకృతి వరకే అప్లై చేస్తుంటారు. కానీ మేకప్ ఎప్పుడు కూడా మెడ వరకు వేసుకోవాలి.

                                                       *నిశ్శబ్ద.