
ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. అవకాశాలు పెరుగుతాయని, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వస్తుందని కొత్తగా వచ్చిన నటులు ఆశిస్తారు. కానీ విజయంతో పాటు విమర్శలు, అవమానాలు, ఒత్తిళ్లు కూడా ఎదురైతే? ఇప్పుడు నటుడు మౌళి తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఓ యాంకర్ తనను తక్కువ చేసి మాట్లాడటంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌళి.. తాజాగా ‘దొంగ నా కొడుకు’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన గురించి యాంకర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని తెలిపాడు. “పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడైతే ఇలాగే మాట్లాడేవారా?” అంటూ తన ఆవేదనను బయటపెట్టాడు.
అసలు మౌళి ఎవడు? ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తర్వాత మౌళి కనిపించాడా? మరో సినిమా రాకపోతే అతడిని ఎవరు గుర్తుపెట్టుకుంటారని ఒక ఇంటర్వ్యూలో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ కామెంట్స్ చేశాడు. ఆ మాటలు చూసినప్పుడు చాలా బాధ కలిగిందని మౌళి చెప్పాడు. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ ని అయితే అలా అనేవాళ్ళా? అని ప్రశ్నించాడు. వీడేం చేస్తాడు.. బచ్చాగాడు అనే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేసి ఉంటారు. నిజంగానే నేనేం చేయలేను అని మౌళి అన్నాడు.
‘లిటిల్ హార్ట్స్’ విజయం తర్వాత ఏడాది కాలంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని, కొందరి నుంచి అసూయ, ద్వేషాన్ని చూశానని మౌళి వెల్లడించాడు. అయితే జరిగిన ప్రతిదాన్నీ బయటకు చెప్పలేనని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
మౌళి చెప్పిన మరో సంఘటన మరింత చర్చకు దారితీసింది. ‘లిటిల్ హార్ట్స్’ విడుదలైన తర్వాత ఓ న్యూస్ ఛానెల్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఒక ప్రోగామ్ కి రావాలని ఆహ్వానించారని తెలిపాడు. అయితే అప్పట్లో తనకు జ్వరం ఉండటంతో మరోసారి తప్పకుండా వస్తానని చెప్పినట్లు వివరించాడు.
అయితే, తాను ప్రోగ్రామ్ కి రాకపోతే.. తన తదుపరి సినిమాకి నెగటివ్ అయ్యేలా చూస్తామన్న అర్థంలో మాట్లాడారని మౌళి ఆరోపించాడు. ఆ మాటలకు భయపడి, ఒంట్లో బాగోలేకపోయినా చివరకు ఆ ప్రోగ్రామ్ కి వెళ్లానని చెప్పాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఇలాంటి పరిస్థితులను కూడా భరించాల్సి వచ్చిందని వెల్లడించాడు. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా ఎదుర్కొంటానని చెప్పాడు.
ఇది కూడా చదవండి: డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్.. ట్విస్ట్ కనిపెడితే కోటి రూపాయలు ఇస్తా.!
[Actor Mouli Emotional Comments, Donga Naa Koduku Teaser, Little Hearts Movie, Actor Mouli, Emotional, Mouli Talks, Telugu Film News]






