Mother's Day Special Recipes

 

 

 

 

 

 

 

అమ్మ చేతి పిండివంటలు

 

పిండివంటలంటే గుర్తొచ్చేది అమ్మ చేసే జంతికలు, చేగోడీలు, సున్నుండలు. ఇంట్లో అమ్మ చేతితో చేసి పెట్టే ఈ పిండివంటల రుచే వేరబ్బా. బయట స్వీట్ షాప్ లో ఎంత డబ్బు పెట్టి నేతి వంటకాలు కొనుక్కుని తిన్నా ఆ రుచి మాత్రం రాదు కదా. అలాంటి సాంప్రదాయ పిండివంటలు మరోసారి గుర్తుతెచ్చుకుందామా.

జంతికలు

 

కావాల్సిన పదార్థాలు:


మినప పప్పు - 1 గ్లాసు
బియ్యం - 3 గ్లాసులు
నువ్వులు - 1/2 కప్పు

తయారి విధానం:


మినపప్పు, బియ్యం రెండిటిని కలిపి పిండి ఆడించాలి. ఒక బేసిన్లో పిండి వేసి అందులో ఉప్పు కారం నువ్వులు వేసి నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి. పిండి పలచన అవ్వకుండా చేతితో ఉండ చేసే విధంగా ఉండాలి. ఆ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో పెట్టి వేడి వేడి నూనెలో పిండుకుని వేగాకా తీసేయ్యటమే. కావాలనుకుంటే ఇందులో వాము వేసుకోవచ్చు. కొంతమంది అయితే  అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు.


చేగోడీలు


కావాల్సిన పదార్థాలు:


వరిపిండి - 2 గ్లాసులు
పెసరపప్పు - 1/2 గ్లాసు
నువ్వులు లేదా జీలకర్ర  

తయారీ విధానం:


ఒక గ్లాసు వరిపిండికి ఒక గ్లాసు నీళ్ళు కావల్సి వస్తుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసుడు నీళ్ళు పొయ్యాలి. ఆ నీళ్ళల్లో పెసర పప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఉప్పు కారం రుచికి తగినంత వేసుకుని నీళ్ళని మరగనివ్వాలి. కావాలనుకున్న వాళ్ళు నువ్వులు పెసర పప్పు కూడా వేసుకోవచ్చు. నీళ్ళు బాగా మరిగాకా అందులో మూడు చెంచాల నూనె  వేసి అప్పుడు ఒక గ్లాసు వరిపిండి కలిపుకోవాలి. స్టవ్ ఆపి ఆ మిశ్రమం  కాస్త చల్లారాకా పిండిని బాగా మెదపాలి. అలా మెదిపిన పిండిని చిన్న ఉండలుగా తీసుకుని వాటిని తాడుల్లాగా చేత్తో సాగదీసి గుండ్రంగా చుట్టాలి. వాటిని కాగే నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే చేగోడీలు రెడీ అయినట్టే.


సున్నుండలు:

 


కావాల్సిన పదార్థాలు:


మినప పప్పు - ఒక గ్లాసు
పంచదార - ఒక గ్లాసు
నెయ్యి - 1/2 గ్లాసు

తయారి విధానం:


మినప పప్పుని కడాయిలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఘుమఘుమలాడే వాసన వచ్చాకా దించి ఒక ప్లేటులో చల్లారనివ్వాలి. చల్లారిన పప్పుని మెత్తగా మిక్సి పట్టుకోవాలి. అలాగే పంచదారని కూడా మిక్సి పట్టి ఉంచాలి. ఇప్పుడు రెండింటిని కలిపి అందులో నెయ్యి పోస్తూ కలపాలి. ఉండకట్టే లాగా తయారయ్యేవరకు నెయ్యి పోస్తూ ఉండాలి. ఆ మిశ్రమాన్ని కావల్సిన సైజులో ఉండలుగా చేసుకుంటే చాలు సున్నుండలు రెడీ.


ఇలా ఈ పిండివంటలని చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు అమ్మ చేతి పిండివంటలు తిందామా అని అనిపిస్తుంది కదూ.

--కళ్యాణి