మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం

  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025 జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్ ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు.  విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. * ఏఐ రంగంలో రోల్ మోడల్ గా తెలంగాణ * మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు.  ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలోనూ మంత్రి శ్రీధర్ బాబు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేలా 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రశంసించారు. ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. * సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహాంతోనే ఈ గుర్తింపు : మంత్రి శ్రీధర్ బాబు  ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న మా ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే నాకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నూతన ఆవిష్కరణలకు సమానత్వాన్ని జోడించి, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.  

చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు జప్తు నోటీసు

  హైదరాబాద్‌లో చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు విద్యుత్ శాఖ అధికారులు జప్తు నోటీసులు జారీ చేశారు. రూ. 31,829  కరెంట్ బకాయి ఉన్నట్లు విద్యుత్ సంస్థ పేర్కొంది. 2015 జులై 23వ తేదీన మెట్రో పనుల కోసం విద్యుత్తు కనెక్షన్‌ను మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు ఏజెన్సీ తీసుకుంది. ఆ తర్వాత ఆ ఏజెన్సీ వెళ్లిపోయింది.  2021 డిసెంబరు నాటికి బకాయి పడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. మెట్రో కోసం పని చేసిన ఈ ఏజెన్సీ మెస్సర్స్ థేల్స్ చిరునామా, నంబరును గుర్తించడానికి జప్తు నోటీసును విద్యుత్ సంస్థ అధికారులు చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌‌లో అంటించారు. విద్యుత్ కనెక్షన్‌కు రూ.31,829 బకాయిలు తీసుకున్న థేల్స్ కంపెనీ అడ్రస్ తెలియకపోవటంతో  జప్తు నోటీసును మెట్రో స్టేషన్‌కు ఇచ్చారు  

డిసెంబర్ 31 లోగా జిల్లాల పేర్లు, సరిహద్దులు ప్రకటన

  అమరావతి  సచివాలయంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఇవాళ తొలిసారిగా సమావేశం నిర్వహించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది నివేదిక ఇవ్వాలని మంత్రుల భేటిలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజా ప్రతినిధులు, ప్రజల నుండి మంత్రుల బృందం వినతులు స్వీకరించనున్నారు. ఈలోపు కూడా ప్రజలు తమ వినతులను జిల్లా కలెక్టర్ కు పంపించవచ్చుని వారు తెలిపారు.  సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్వీభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల  మార్పులు ప్రక్రియ ముగిస్తామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు  కోసం కసరత్తు చేస్తామని వారు పేర్కొన్నారు.  రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల  బృందం పని చేస్తుందని వెల్లడించారు. నియోజకవర్గాల జోలికి వెళ్లబోమన్న మంత్రి అనగాని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని...అయితే పరిపాలనా సౌలభ్యమే గీటురాయి అన్న  మంత్రి అనగాని తెలిపారు.ఈ సమావేశానికి  మంత్రులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గోన్నారు.

ఏపీ లిక్కర్‌ కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

  ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ విజయవాడ  ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో వారి రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో నిందితులను సిట్‌ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. మరింత విచారణ జరపాల్సి ఉందని అధికారులు కోరడంతో నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రాజ్‌ కెసిరెడ్డి, చాణక్య, దిలీప్‌, సజ్జల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ .. గుంటూరు జిల్లా కారాగారంలో నవీన్‌ కృష్ణ, బాలాజీకుమార్‌ యాదవ్‌ రిమాండ్‌లో ఉన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో మిథున్‌రెడ్డి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ముగియటంతో మిథున్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. 

పులివెందులలో రీపోలింగ్.. తాడేపల్లిలో వైసీపీ అభ్యర్థి!

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. ఈ ఉప ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు రంగంలోకి దిగడంతోనే ఇంత కాలం మా కంచుకోట, అడ్డా.. ఇక్కడ మాకు ఎదురే లేదు అంటూ వైసీపీ పలుకులన్నీ ఉత్త డొల్లేనని అవగతమైపోయింది. మూడు దశాబ్దాలుగా ఏకగ్రీవం వినా ఎన్నిక అంటూ జరగని ఈ స్థానంలో ఎన్నిక జరగడమే ప్రజాస్వామ్య విజయంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. అసలు ఎన్నిక జరగడమే వింత అనుకుంటే ఉప ఎన్నిక ప్రచార పర్వం నుంచీ వైసీపీ బేలతనం అక్కడ ఆ పార్టీకి తిరుగులేని బలం ఉందన్నదంతా ఉత్తుత్తి ప్రచారార్భాటమే అని తేలిపోయిం దంటున్నారు. ఇక పోలింగ్ రోజున అక్రమాలు, అధికార పక్షం దాష్టీకం అంటూ ఆరోపణల పర్వానికి దిగడంతోనే అక్కడ వైసీపీ పరాజయాన్ని అంగీకరించేదిందని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అయినా దింపుడు కళ్లెం ఆశతో రీపోలింగ్ కు డిమాండ్ చేసి రెండు కేంద్రాలలో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేయించుకున్న వైసీపీ తీరా రీపోలింగ్ ప్రారంభమైన తరువాత బహిష్కరణ అంటూ చేతులెత్తేయడం వింతల్లోకల్లా వింతగా చెబుతున్నారు. అయితే వీటన్నిటికీ మించిన వింత ఏమిటంటే ఓ వైపు పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతుంటే అక్కడ వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నహేమంత్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యక్షమైపోయారు. అక్కడ జగన్ మీడియాతో మాట్లాడుతుంటే.. ఆయన పక్కన ఒదిగి ఒదిగి కూర్చోవడం కనిపించింది.  

గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై హాట్ హాట్ చర్చలు!

గత ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా‌ జయదేవ్ కుటుంబం మళ్ళీ తెలుగుదేశంలోకి  రీఎంట్రీ పై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. పాతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి ఏపి రాజకీయాలలో ఉద్దండుడు. రెండు సార్లు చిత్తూరు ఎంపీగా గెలిచారు. చంద్రబాబు నాయుడికి సైతం మొదట్లో రాజకీయంగా ఎదగడానికి సాయపడ్డారంటారు. అలాంటి రాజగోపాల్ నాయుడి వారసురాలిగా అయన ఎకైక కూమార్తె  గల్లా అరుణ 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్  నుంచి చంద్రగిరి  ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గల్లా అరుణ టిడిపి తరపున పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పట్లో పార్టీ మారి వచ్చిన ఆమెను తెలుగుదేశం వారే  ఓడించారనే ప్రచారం జరిగింది. తర్వాత తెలుగుదేశం రాష్ట ఉపాధ్యక్షురాలిగా , పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసినప్పటికీ ఎన్నికల్లో  పోటీకి గల్లా అరుణ దూరంగా ఉండిపోయారు.  అయితే ఆ కుటుంబానికి చెందిన అమె కూమారుడు గల్లా జయదేవ్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గానే కాకుండా సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా కూడా తనను తాను నిరూపించుకున్నారు . 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు మార్లు గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో మోడీ ని సూటిగా ప్రశ్నించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు గల్లా జయదేవ్. వైసీపీ తోనూ ఢీ అంటే ఢీ అనే లా జయదేవ్ పోరాడారు. అంత వరకు బాగానే ఉన్నా..  వైసీపీ హయాం సాగిన ఐదేళ్లూ  గల్లా కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.   ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లుతోందని అమర రాజా సంస్థపై వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. పొల్యూషన్ బోర్డు అధికారులు రంగంలోకి దిగి అమరరాజా సంస్థకు వరుస నోటీసులు ఇచ్చారు. ఈ సంస్థ వెదజల్లుతున్న కాలుష్యం ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని నీరు కలుషితం అవుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరోపణ.  చివరకు ఈ వ్యవహారం కాస్తా అమర్ రాజా సంస్థకు క్లోజర్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళింది. దీంతో అమరరాజా యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా తవణం పల్లి మండలం దిగువ మాఘం గల్లా కుటుంబం స్వగ్రామం. గల్లా కుటుంబంపై జగన్ హయాంలో అక్కడ భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. తమ భూములు ఆక్రమించారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారి తదితరులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది. గుంటూరులో కూడా ఎంపి జయదేవ్ ఉహించని విధంగా వైసీపీ కార్యకర్తలు, పోలీసుల దాడులతో జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని అంటున్నారు. మిస్టర్  ప్రై మినిస్టర్ అనేంత  ధైర్యం ఉన్న జయదేవ్ జగన్ ప్రభుత్వ కక్షసాధింపులతో విసిగిపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికలలో పోటికి సైతం  దూరంగా ఉన్నారు.  అయితే గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడంతో పాటు గుంటూరు నుండి గెలిచిన పెమ్మసాని ఎకంగా కేంద్ర మంత్రి అవ్వడంతో గల్లా జయదేవ్ మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారనే భావనలో గల్లా శ్రేయోబిలాషులు ఉన్నారంట. ఇదే విషయాన్నిసన్నిహితుల వద్ద గల్లా కూడా పలు మార్లు చెప్పుకొచ్చినట్లు సమాచారం. మరో ఏడాదిలో రాజ్యసభ స్థానాల భర్తీ ఉండటంతో ఇదే సరైన సమయంగా  భావించిన గల్లా జయదేవ్ పొలిటికల్ రీ ఎంట్రీపై తన కోరికను బయటపెట్టారనే ప్రచారం సాగుతోంది. గల్లా కుటుంబం రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతామంటే  తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాదనే పరిస్థితి లేదంటున్నారు. ఆ క్రమంలోనే తాజాగా కాణిపాకంలో  దేవుడి అనుగ్రహం, నా అవసరం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా, పార్టీ పెద్దలతో చర్చిస్తున్నానంటూ గల్లా జయదేవ్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జయదేవ్ వ్యాఖ్యలు తెలుగుదేశంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే రాజ్యసభ కు ఇప్పటికే పోటి ఎక్కవగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో పరిచయాలు ఉన్న జయదేవ్ వస్తే పార్టీకి మరింత మేలే జరుగుతుంది అనే భావన కొందరు పార్టీ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. అయితే జయదేవ్ ను వ్యతిరేకించే వాళ్ళు కూడా పార్టీలో లేకపోలేదు.  పార్టీ కష్ట సమయాల్లో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో దూరంగా ఉండడం పై గల్లా కుటుంబంపై కొద్ది మంది నేతలు విమర్శలు చేస్తున్నారు.  అప్పుడు వ్యాపార అవసరాల కోసం పూర్తి స్థాయిలో సైలెంటై,  ఇప్పుడు అధికారంలో ఉన్నామని తిరిగి ఎంట్రీ ఇవ్వాలనుకోవడంపై పార్టీ సీనియర్లు మండిపడుతున్నారంట.

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రెండు వేరు, వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఓ ఘటనలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయాడు. మృతుడ్ని 53వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్‌‌గా గుర్తించారు.  రెండవ ఘటనలో కూలిన చెట్టును ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. విజయవాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నది, బుడమేరు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు. ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇక, భారీ వర్షాల కారణంగా అచ్చంపేట-మాదిపాడు రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అమరావతి- విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బుధ, గురువారం రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అల‌ర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ప్రకటించారు. ఖమ్మం, భ‌ద్రాద్రి, మెద‌క్‌, వికారాబాద్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లాల‌కు రెడ్ క‌ల‌ర్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే కామారెడ్డి, జ‌న‌గామ‌, కుమురం భీం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌, మంచిర్యాల‌, న‌ల్గొండ‌, రంగారెడ్డి, సిద్ధిపేట‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, మ‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల జిల్లాల‌కు ఆరెంజ్ క‌ల‌ర్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలిపారు.  రాష్ట్ర‌ వ్యాప్తంగా రేపు కూడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇక‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డొచ్చ‌ని నాగ‌ర‌త్న తెలిపారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ ఏరియాలో 20 సెంమీటర్ల వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు  

వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి నీటి విడుదల

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది  వరద నీటితో పోటెత్తుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న అన్ని డ్యామ్ ల గేట్లనూ ఎత్తి అధికారులు లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఇప్పటికే మూడు సార్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తాజాగా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి మరోసారి కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో జూరాల 12, శ్రీశైలం 4, నాగార్జున సాగర్ 24, టైల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులుఎత్తివేశారు. దీంతో దిగువన విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజి వద్దకు భారీగా వరద నీరు చేరింది  బెజవాడ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ప్రకాశం బ్యారేజీ  గేట్లు ఎత్తివేసి దిగువకు విడుదల చేశారు.  దీంతో  విజయవాడ దిగువన ఉన్న లంక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికారులు  లంకగ్రామ ప్రజల  అలర్ట్ గా ఉండాలంటూ హెచ్చరించారు.  

ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం

  ఖమ్మంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఓ షాపు యజమానిపై  గంజాయి మత్తులో కొందరు పోకిరీలు దాడి చేశారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశారు. రోడ్డు పక్కన ఉన్న షాపులపైనా దాడి చేసి హల్‌చల్ చేశారు. అల్లరిమూక కిరాణం షాపు, టూ వీలర్లపై పెట్రోల్ పోసి తగలబెట్టడంతో దుకాణదారులు అడ్డుకోబోగా వారిపై దాడికి దిగారు.  ఈ దాడుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. గంజాయి మత్తులో పిల్లలు, మహిళల పైనా దాడికి యత్నించారు. గతంలోనూ ఇదే అల్లరి మూక దాడికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పటికైనా పోలీసులు  గంజాయి బ్యాచ్‌‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

జల దిగ్బంధంలో ఎల్గూర్ రంగంపేట

భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైపోతోంది. రహదారులు జలమయమై ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.  కొన్ని ప్రాంతాలకైతే బాహ్యప్రపంచంతో సంబం ధాలే తెగిపోయాయి. వరంగల్ ఎల్గూర్ రంగంపేట పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఓవైపు ఆండర్ బైపాస్ రోడ్డు ముని పోవడం, మరోవైపు ఎల్గుర్ రంగంపేట చెరువు గట్టు తెగి ప్రవహించడంతో ఎల్గూర్ రంగంపేటకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.  ఈ స్థితిలో గ్రామంలో పరశురాములు అనే వ్యక్తి  తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతడిని ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు నానా అగచాట్లూ పడ్డారు. కుటుంబ సభ్యులు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించేందుకు యత్నించినా  అండర్ బైపాస్ వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో గ్రామంలోకి అంబులెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతడిని గ్రామస్తుల సహాయంతో మంచంపై పడుకోబెట్టి రైల్వే ట్రాక్ మీదుగా  మోసుకుంటూ ఆసుపత్రికి తరలించారు.  

రెండు రోజులు అతి భారీ వర్షాలు..తెలంగాణకు రెడ్ అలర్ట్

  తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ‌, రేపు రెడ్ అల‌ర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ప్రకటించారు. రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, భ‌ద్రాద్రి, మెద‌క్‌, వికారాబాద్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లాల‌కు రెడ్ క‌ల‌ర్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అలాగే కామారెడ్డి, జ‌న‌గామ‌, కుమురం భీం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌, మంచిర్యాల‌, న‌ల్గొండ‌, రంగారెడ్డి, సిద్ధిపేట‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, మ‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల జిల్లాల‌కు ఆరెంజ్ క‌ల‌ర్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలిపారు.  రాష్ట్ర‌ వ్యాప్తంగా రేపు కూడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇక‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డొచ్చ‌ని నాగ‌ర‌త్న తెలిపారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ ఏరియాలో 20 సెంమీటర్ల వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు

వైసీపీది బహిష్కరణ కాదు పలాయనమన్న బీటెక్ రవి

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో రీపోలింగ్ కావాలని డిమాండ్ చేసి మరీ సాధించుకున్న వైసీపీ.. ఆ రీపోలింగ్ ను బహిష్కరించింది. కోరి సాధించుకున్న రీపోలింగ్ ను బహిష్కరించడానికి కారణం జనం వారి వైపు లేరని తెలిసిపోవడం వల్లనే అంటున్నారు పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పుణ్యాన వైసీపీయులకు  పులివెందులలో వారి పరిస్థితి ఏమిటో? వారి బలం ఏమిటో తెలిసివచ్చిందనీ, దీంతో దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందని బీటెక్ రవి అన్నారు. బుధవారం (ఆగస్టు 13) పులివెందులలో మీడియాతో మాట్లాడారు.  పులివెందుల చరిత్రలో దాదాపుగా ఎన్నడూ లేని విధంగా జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగిందన్నారు. ఆ ఎన్నిక కూడా చాలా ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగిందన్న బీటెక్ రవి.. వైసీపీ మాత్రం కొందరి చేత ఓట్లు వేయలేకపో యామంటూ చెప్పించి, వాటిని వీడియోలు తీసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రీపోలింగ్ కోరిందన్న బీటెక్ రవి.. వారు కోరినట్లు ఎన్నికల కమిషన్ రెండు కేంద్రాలలో రీపోలింగ్ కు ఆదేశించిందనీ, అయినా కూడా రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నామంటూ ప్రకటించడం పలాయనం కాక మరేమౌతుందని ప్రశ్నించారు.   ఇప్పుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తాము 15 కేంద్రాలలో రీపోలింగ్ కావాలని అడిగితే.. ఎన్నికల కమిషన్ రెండు చోట్లే రీపోలింగ్ కు ఆదేశించిందంటూ కొత్త వాదనకు తెరతీస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకముంటే.. రీపోలంగ్ లో పాల్గొనాలని సవాల్ చేశారు.   ప్రజలు తమ వెంట లేరని తెలియడం వల్లనే వైసీపీ రీపోలింగ్ ను బహిష్కరించి పలాయనం చిత్తగించిందని బీటెక్ రవి అన్నారు. 

ఆర్జీవీ అరెస్టు విడుదల.. విషయమేంటంటే..?

వివాదాలతో నిత్యం సహవాసం చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు పోలీసులు మంగళవారం (ఆగస్టు 12) అరెస్టు చేశారు. ఆ వెంటనే ఇద్దరు వ్యక్తుల సూరిటీతో స్టేషన్ బెయిలు ఇచ్చి విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. వైసీపీ హయాంలో  రామ్ గోపాలవర్మ ఇష్టారీతిగా, అడ్డగోలుగా తెలుగుదేశం, జనసేన నేతలపై సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అలాగే  ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ నుచి అక్రమంగా  రెండు కోట్ల రూపాయలు  పొందడం సహా మరికొన్ని కేసులు కూడా రామగోపాల్ వర్మపై నమోదయ్యాయి. వాటిపై ఒంగోలు పోలీసులు రామగోపాల్ వర్మను మంగళవారం (ఆగస్టు 12) దాదాపు 11 గంటల పాటు విచారించారు.  అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు సహకరించలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన తెలియదు, గుర్తులేదు అన్న సమాధానాలే ఇచ్చారు. అంతే కాకుండా..  తన ట్విట్టర్ అకౌంట్ ను తాను మాత్రమే కాకుండా మరికొందరు కూడా వాడారనీ, పోలిటికల్ పోస్టులన్నీ వారు పెట్టినవేననీ రామ్ గోపాల్ వర్మ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన ట్విట్టర్ అక్కౌంట్ ను వాడిన మరి కొందరి పేర్లు మాత్రం ఆయన వెల్లడించలేదని తెలిసింది. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అక్కౌంట్ ను వైసీపీకి కిరాయికి ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అదలా ఉంచితే.. గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఇప్పటి వరకూ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఖాతాలో పోలిటికల్ పోస్టు అన్నదే కనిపించలేదు. అలాగే మీడియా, సోషల్ మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారు. అరెస్టు భయంతోనే ఆర్జీవీ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇక ఒంగోలు పోలీసులు విచారణ అనంతరం రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసి ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన ఫోన్ ను సీజ్ చేశారు.   

అమరావతిలో బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి బాలయ్య శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావలితో  బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్   నిర్మాణానికి హందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం (ఆగస్టు 13) శంకుస్థాపన చేశారు.  ఆ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తదితరులు హాజరయ్యారు.  ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం  సీఆర్డీయే  21 ఎకరాల భూమిని కేటాయించింది.  ఈ ఆస్పత్రిని రెండు దశలలో నిర్మించనున్నారు. తొలి దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించి మలి దశలో వెయ్యిపడకలకు విస్తరించనున్నారు. వాస్తవానికి 2014-19 మధ్య కాలంలోనే అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అప్పట్లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయించింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆస్పత్రి నిర్మాణం ముందుకు సాగలేదు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ఆస్పత్రి నిర్మాణం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి.   బసవరామతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ హైదరాబాద్ లో సేవలందిస్తున్నది. క్యాన్సర్ చికిత్సలో విశ్వసనీయతకు పేరుగాంచింది. ఇప్పుడు అమరావతిలో  బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు సిద్ధమైంది. అమరావతి క్యాపిటల్ రీజియన్ లోని తుళ్లూరులో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ అభివృద్ధి చేయనుంది.  క్యాన్సర్ చికిత్సను ఇతర ప్రాంతాలకు విస్తరించడమే కాకుండా అవసరమైన చోట ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్  రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ సంకల్పించింది. అమరావతిలో  21 ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న బసవరామ తారకం క్యాన్సర్ హాస్లిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్  సమగ్రమైన క్యాన్సర్ చికిత్స, పరిశోధనతో పాటూ క్యాన్సర్ పేషెంట్  కేంద్రీకృత సంరక్షణ కోసం ఒక ఎక్స్ లెన్సి సెంటర్ గా తీర్చిదిద్దాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతోంది.     750 కోట్ల రూపాయల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు,  క్లినికల్ ఎక్స లెన్స్‌పై దృష్టి పెట్టింది. అలాగే , అధునాతన రేడియేషన్, ఆపరేషన్,  టెక్నాలజీతో  ఖచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్సా వ్యవస్థల ఏర్పాటు చేయనుంది.  క్యాన్సర్ నివారణ,   ముందస్తు గుర్తింపు, చికిత్స, పునరావాసం ఇలా  ఇంటిగ్రేటెడ్ కేర్ మోడల్ ను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇక అమరావతిలో ఏర్పాటు కానున్న బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో 2028 నాటికి ఆపరేషన్లు ప్రారంభమౌతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 

పులివెందులలో ఎన్నిక జరిగితే.. ప్రజాస్వామ్యం ఖూనీ అంటారేంటి?

గత ఏడాది ఎన్నికలలో ఈవీఎంల వల్ల ఓడిపోయాం.. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక జరిగినా రిగ్గింగ్ చేసుకునే అవకాశం లేక ఓడిపోతున్నాం అంటున్నారు వైసీపీ నేతలు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని ఆరోపణలు గుప్పించి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేసిన వైసీపీ.. ఇప్పుడు ఆ పార్టీ అడ్డాగా చెప్పుకునే పులివెందుల ఉప ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో జరిగినా చేతులెత్తేసింది.  ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలోనే జరిగిందిగా అన్న ప్రశ్నకు   సమాధానం చెప్పలేక గుటకలు మింగుతోంది. వాస్తవానికి పులివెందులలో ఎన్నిక.. అదీ బ్యాటెల్ పద్ధతిలో అంటే.. వైపీపీ నేతలు విజయంపై ధీమాగా ఉండాలి. అయితే అలా లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగితే ఎలా గెలుస్తాం అనుకున్నారో ఏమో పోలింగ్ రోజున కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తమ అనుచరులతో రెచ్చిపోయారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడాన్ని అడ్డుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నించారు.  పోలీసులు ఇద్దరినీ అదుపులోనికి తీసుకుని గృహనిర్బంధం చేసినా తప్పించుకుని మరీ వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేసి, పోలింగ్ బూత్ లలోకి చొచ్చుకుపోయి, పోలీసులతో వాగ్వాదానికి దిగి నానా హడావుడీ చేశారు.  జగన్ అడ్డా ఇక్కడ తిరుగేలేదు అంటూ ఇంత కాలం విర్రవీగిన వైసీపీయులు అదే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటమి భయంతో వణికిపోయారు. మా అడ్డాలో మమ్మల్ని రిగ్గింగ్ చేసుకోనివ్వరా, పోలింగ్ బూత్ లను కబ్జా చేయనియ్యరా? ఇదెక్కడి చోద్యం అన్నట్లుగా వారు గలాటా చేసైనా సరే బూత్ లను కబ్జా చేయాలని ప్రయత్నించారు.  ఓటమి భయంతో వణికిపోయారు. వాస్తవానికి పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కోల్పోతే అది తెలుగుదేశం విజయం అనికానీ, వైసీపీ ఓటమి అని కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ భావించరు. దానికి వైఎస్ జగన్ ఓటమి అనే అంటారు. అంతే కాదు.. ఈ ఓటమి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై పడుతుంది. దింపుడు కళ్లెం ఆశతో ఇంకా ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన క్యాడర్ చెల్లాచెదురైపోతుంది. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో జగన్ పలచన అయిపోతారు. అందుకే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో వైపీపీ గాభరాపడుతోంది.   సొంత అడ్డాలో ఇంత చిన్న ఎన్నికలను ఎదుర్కోలేకపోతే రేపు సార్వత్రిక ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కొంటామని క్యాడర్ నీరుగారిపోతుందనీ, పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని బెంబేలెత్తి పోతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. కానీ జనం మాత్రం 11 మంది బరిలో నిలిచి ఎన్నిక  జరిగితే.. ఆ ఎన్నికలో 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైతే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లినట్లౌతుంది కానీ ఖూనీ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. 

పులివెందులలో వైపీపీది బలం కాదు వాపేనా?

కంచుకోట అనుకున్న పులివెందుల పేకమేడ అని తేలిపోయిందా? వైసీపీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఫలితాల వెల్లడికి ముందు.. కాదు కాదు పోలింగ్ కు ముందే కాడి వదిలేసిందా? అడలేక మద్దెలు ఓడు అన్న చందంగా పులివెందులలో తమ పరిస్థితికి పోలీసులే కారణం అంటోందా? అంటే వైసీపీ నేతల వ్యాఖ్యలు, హెచ్చరికలు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తోంది.   పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో  పోలీసులు వ్యవహరించిన తీరుపై వైసీపీ నేత, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. మూడు దశాబ్బాలకు పైగా జడ్పీటీ స్థానానికి ఎన్నిక అంటే ఏమిటో తెలియని పులివెందుల జనాలకు ఇప్పుడు తోలిసారిగా ఓటు వేస్తున్నామన్న ఆనందం కలిగింది. అదే సమయంలో పటిష్ట బందోబస్తుమధ్య ఎన్నికల నిర్వహణతో వైసీపీయులకు రిగ్గింగ్ కు అవకాశం లేకుండా పోయింది. ఇదే వారి ఆగ్రహానికి కారణమైంది. మా అడ్డాలో ప్రజాస్వామ్యం ఏమిటి? అంటూ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసులపై నిప్పులు చెరుగుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాకీ మీ ఉద్యోగాలు తీసేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు.  మళ్లీ మేం అధికారంలోకి వస్తాం.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడపీకుతాం..అంటూ  ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. అయితే వాస్తవంలో పోలీసులు తెలుగుదేశం, వైసీపీ నేతల పట్ల సమంగానే వ్యవహరించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు పార్టీలకు చెందిన నేతలను ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. అయినా వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వందల మందితో ప్రదర్శనలు నిర్వహించారు. పోలింగ్ బూతులలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేశారు. అయితే వాటన్నిటినీ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగా లుండవు జాగ్రత్త అంటూ హెచ్చరికలకు దిగుతున్నారు. మొత్తం మీద పులివెందులలో వైసీపీది బలం కాదు, వాపు మాత్రమేనని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రుజువు చేసిందని పరిశీలకులు అంటున్నారు.  

రీపోలింగ్ ను బహిష్కరించిన వైసీపీ

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ లో అవకతవకలు జరిగాయంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గగ్గొలు పెట్టారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం ఆయన ఆరోపించిన రెండు పోలింగ్ కేంద్రాలలోనూ ఈ బుధవారం ( ఆగస్టు 13) రీపోలింగ్ కు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు రీపోలింగ్ ప్రారంభమైంది. అయితే వైసీపీ మాత్రం ఈ రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి మూడు దశాబ్దాలపై పైగా పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగిన చరిత్రలేదు. ఎప్పుడూ ఇక్కడ ఏకగ్రీవమే. తొలి సారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతోంది. బరిలో 11 మంది అభ్యర్థులు నిలిచారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు. అయితే వైసీపీ మాత్రం పోలింగ్ ప్రారంభానికి ముందే చేతులెత్తేసి నియోజకవర్గంలో గలాభా సృష్టించి, పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవడానికి శతధా ప్రయత్నించింది. అయితే పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో వైసీపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. సరే అదలా ఉంచితే.. వైసీపీ ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు రెండు కేంద్రాలలో రీపోలింగ్ జరుగుతుంటే.. ఆ రీపోలింగ్ ను కూడా బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుని ఓటమిని ముందే అంగీకరించేసింది. ఇలా ఉండగా రీపోలింగ్ జరుగుతున్న కేంద్రాలలో భారీ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాది.  

పులివెందులలో నేడు రీ-పోలింగ్

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మంగళవారం (ఆగస్టు 12)న జరిగిన ఉప ఎన్నికలో రెండు పోలింగ్ కేంద్రాలలో అక్రమాలు, రిగ్గింగ్ జరిగాయన్న ఆరోపణలతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆ రెండు పోలింగ్ కేంద్రాలలో బుధవారం (ఆగస్టు 13) రీపోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ సాగుతుంది. రీపోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం (ఆగస్టు 14) కడపలో జరగనుంది.