జ‌గ‌న్ స‌ర్కారుపై హైకోర్టు సీరియ‌స్‌.. రెండు వారాలు డెడ్‌లైన్‌..

ఏపీ అప్పుల కుప్ప‌గా మారింది. జీతాలు, బిల్లులు చెల్లించ‌లేక అవ‌స్థ‌లు ప‌డుతోంది. నిధుల‌న్నీ సంక్షేమ ప‌థ‌కాల‌కే ఊడ్చేసి.. ప్ర‌భుత్వ ఖ‌జానా ఖాళీ చేసేశారు. ఎడాపెడా అప్పులు తెచ్చి.. ప‌ప్పుబెల్లాల్లా పంచేస్తున్నారు. కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసి.. అన్నిశాఖ‌ల సొమ్ములూ అటే మ‌ళ్లిస్తున్నారు. వివిధ ప‌థ‌కాల కోసం కేంద్రం ఇచ్చే సొమ్మంతా కూడా స్వాహా చేసేస్తున్నారు. మ‌ళ్లీ ఫ‌స్ట్ తారీఖు రాగానే.. ఒక్క‌డ అప్పు దొరుకుతుందాన‌ని కిందామీదా ప‌డుతున్నారు. ఇలా ఏపీ ప్ర‌భుత్వ అడ్డ‌గోలు విధానాల‌తో ఉపాధి హామీ ప‌థ‌కం బిల్లులు కొండ‌ల్లా పేరుకుపోయాయి. ఎప్ప‌టి నుంచో బిల్లులు చెల్లించ‌కుండా కాంట్రాక్ట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది స‌ర్కారు. దీంతో.. వారంతా ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ అనంత‌రం హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఏపీ స‌ర్కారుపై హైకోర్టు మండిపడింది. నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో బిల్లులు చెల్లించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్ల జీవించే హక్కును హరించడమేనని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వ్యాఖ్యానించారు. రెండు వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చెల్లించాల్సిన డబ్బుకు వడ్డీ, 20 శాతం మినహయింపును ప్రధాన పిటిషన్ విచారణలో పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించడమని కోర్టు వ్యాఖ్యానించింది. చేసిన పనులకు బిల్లులు చెల్లించమని ఇప్పటికే చెప్పినప్పటికీ.. ప్రభుత్వం ఖాతరు చేయలేదని న్యాయస్థానం తప్పుబట్టింది. కేంద్రం నరేగా పనులకు నిధులు చెల్లించామని.. తమ ద‌గ్గ‌ర‌ బకాయిలు లేవని అఫిడవిట్‌లో చెప్పిందని కోర్టు తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నుంచి డబ్బులు రాలేదని చెబుతోందని, ఈ రెండు పరస్పర విరుద్ధమైన అంశాలని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో బిల్లులు చెల్లిస్తామని అడ్వకేట్ జనరల్ హమీ ఇచ్చినప్పటికీ చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది. రెండు వారాల్లోగా బ‌కాయిల‌న్నీ చెల్లించాలంటూ జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు.    

వైసీపీకి 50 స్థానాలు మాత్ర‌మే.. ర‌ఘురామ స‌ర్వేలో సంచ‌ల‌నం..

ఇప్పుడంతా స‌ర్వేల హ‌వా న‌డుస్తోంది. ఇండియా టుడే-- మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వే సీఎం జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చిన‌ప్ప‌టి నుంచీ ఏపీలో స‌ర్వేల‌పై ఇంట్రెస్ట్ పెరిగింది. జ‌గ‌న్ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. కేవ‌లం 6 అంటే 6శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అని చెప్ప‌డం ప్ర‌జ‌లు వైసీపీ పాల‌నపై ఎంత విర‌క్తితో ఉన్నారో అర్థం అవుతోంది. ఇక‌, ఇటీవ‌ల లోక‌ల్ యాప్ నిర్వ‌హించిన స‌ర్వేలోనూ ఇలాంటి సంచ‌ల‌న విష‌యాలే వెలుగుచూశాయి. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీదే గెలుపంటూ లోక‌ల్ స‌ర్వే తేల్చేసింది. ఇలా వ‌రుస స‌ర్వేలు వైసీపీ ప‌త‌నాన్ని సూచిస్తుండ‌టం అధికార పార్టీలో క‌ల‌వ‌రం చెల‌రేగుతోంది. తాజాగా, న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ సైతం రంగంలోకి దిగారు. తాను కూడా స‌ర్వే చేయించానంటూ ఆ వివ‌రాలు వెల్ల‌డించారు. ర‌ఘురామ స‌ర్వే ఫ‌లితాలు సైతం ఆస‌క్తిక‌రంగా ఉంది.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 50 స్థానాలు మించి రావని తెలిపారు ర‌ఘురామ‌. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డిలు మ‌ళ్లీ గెలుస్తార‌ని.. వారికి 60శాతం మంది ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌న్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరిద్దరు తప్ప వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇక ప‌నిలో ప‌నిగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన న‌ర్సాపురం స‌ర్వే వివ‌రాల‌నూ వెల్ల‌డించారు. అయితే.. న‌ర్సాపురంలో త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా జ‌గ‌న్ పోటీ చేస్తే.. తానే గెలుస్తానంటూ స‌ర్వే ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. స‌ర్వేలో జ‌గ‌న్ కంటే త‌న‌కు 19శాతం ఎక్కువ ప్రజాధార‌ణ ల‌భించింద‌ని తెలిపారు. ర‌ఘురామ స‌ర్వేలో జ‌గ‌న్ ఓడిపోవ‌డం.. పెద్దిరెడ్డి, చెవిరెడ్డిలాంటి వాళ్లు గెల‌వ‌డం లాంటి ఫ‌లితాలు రావ‌డం ఆస‌క్తి రేపుతోంది.  మ‌రోవైపు.. వైఎస్ వివేకా హ‌త్య కేసుపైనా స్పందించారు ఎంపీ ర‌ఘురామ‌. వివేకా హత్యలో ఎవరి ప్రమేయం ఎంత ఉందోనని ప్రజలకు అనుమానం ఉందన్నారు. ముందుగా ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇక‌, ప్ర‌భుత్వం అమ‌ర‌రాజా కంపెనీ కాలుష్యం గురించి మాట్లాడుతోంద‌ని.. మ‌రి, నాసిర‌కం మ‌ద్యం వ‌ల్ల పాడ‌వుతున్న ప్ర‌జ‌ల ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడ‌ర‌ని ప్ర‌శ్నించారు ర‌ఘురామ‌.   

కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఫిక్స్! కేసీఆర్ నుంచి ఊహించని ట్విస్ట్? 

తెలంగాణ కేబినేట్ లో మార్పులకు రంగం సిద్ధమైందా? సీఎం కేసీఆర్ ఊహించని ట్విస్టు ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కేసీఆర్ కేబినెట్ లో మార్పులు ఉంటాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని అంతా భావించారు. కాని జరగలేదు. తాజాగా మళ్లీ కేబినెట్ మార్పుల అంశం తెరపైకి వస్తోంది. ఆగస్టు 24 మంగళవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనన్నారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారని చెబుతున్నారు. అయితే త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించడానికే గులాబీ బాస్.. ఈ సమావేశం ఏర్పాటు చేశారనే చర్చ సాగుతోంది. పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో కేబినెట్ మార్పులపై కేసీఆర్ సిగ్నల్ ఇస్తారని అంటున్నారు.  తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీల కార్యక్రమాలు కూడా హుజురాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో మంత్రివర్గంలో మార్పులు జరిగినా.. అది హుజురాబాద్ కు లింక్ అయి ఉంటుందనే చర్చ  రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. దళిత బంధు పథకాన్ని ఇటీవలే ప్రకటించారు కేసీఆర్. పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ లో అమలు చేస్తున్నారు. విపక్షాలు మాత్రం హుజురాబాద్ లో ఉన్న 50 వేల దళితుల ఓట్ల కోసమే  దళిత బంధు స్కీం తెచ్చారని అంటున్నాయి. దళిత బంధు స్కీం ప్రకటించగానే మరికొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. దళితులను కేసీఆర్ మోసం చేశారని, మంత్రివర్గంలో మాదిగలకు చోటు లేదనే విమర్శలు వచ్చాయి.  సీఎంవోలో దళిత అధికారిని ఎందుకు నియమించలేదని కొందరు ప్రశ్నించారు. ప్రస్తుత కేబినెట్ లో కొప్పుల ఈశ్వర్ ఉన్నా ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన వారు. తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువ. అందుకే విపక్షాలు ఈ అంశాన్ని లెవనెత్తుతూ  కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాయి. దళిత బంధు స్కీం తెచ్చినా అనుకున్న ఫలితం కనిపించకపోవడం, విపక్షాల విమర్శలతో సీఎం కేసీఆర్ మరిన్ని చర్యలకు ఉపక్రమించారు. సీఎంవోలో దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ రాహుల్ బొజ్జాను నియమించారు. ఇక కేబినెట్ ను విస్తరించి మరో దళిత ఎమ్మెల్యేను తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. ఈటలతో ఖాళీ అయిన మంత్రిపదవిని దళితుడితో పూరించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ఈ లెక్కన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన చోటు ఖాయమైందని చెబుతున్నారు.  తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  2018 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచే విజయం సాధించారు. సండ్రతో పాటు అశ్వారావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు. సీఎం కేసీఆర్ తో సండ్రకు మంచి సంబంధాలున్నాయి. అందుకే కేసీఆర్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే సండ్ర.. టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. గత మార్చిలో మచ్చా నాగేశ్వరరావు కూడా కారెక్కారు. దీంతో టీడీడీఎల్పీ అధికారికంగా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయింది. కేసీఆర్ పురమాయించడం వల్లే.. మచ్చాతో మాట్లాడి ఆయన టీఆర్ఎస్ లో చేరేలా సండ్ర పావులు కదిపారని అంటున్నారు. అప్పటి నుంచే సండ్రకు కేబినెట్ బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.  హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత కీలకం కావడంతో మాదిక వర్గానికి చెందిన సండ్రను కేబినెట్ లోకి తీసుకుంటే తమకు కలిసివస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. సండ్రతో పాటు కేబినెట్ లో మరికొందరిని కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ దిశగా కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రితో పాటు ఓ బీసీ మంత్రికి గండం ఉందనే చర్చ  తెలంగాణ భవన్ లో సాగుతోంది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందే కేబినెట్ విస్తరణతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటారని తెలుస్తోంది. 

30ఏళ్లుగా తాలిబ‌న్ల‌కి చిక్క‌ని పంజ్‌షిర్‌‌.. తాజాగా 300 మంది హ‌తం.. ఏమిటీ స్పెషాలిటీ?

తాలిబ‌న్లు ఎంతటి బ‌ల‌వంతులో.. అఫ్ఘ‌నిస్తాన్‌లో వారిప‌ట్టు ఎంత ఉందో తాజా ప‌రిణామాలు తెలుపుతున్నాయి. అమెరికా బ‌ల‌గాలు ఇలా వెనుదిర‌గానే.. రోజుల వ్య‌వ‌ధిలోనే అలా అఫ్ఘ‌న్‌ను ఆక్ర‌మించేసుకున్నారు ముష్క‌రులు. అప్ప‌టి వ‌ర‌కూ ఎక్క‌డ న‌క్కారో.. స‌డెన్‌గా ఎక్క‌డి నుంచి ఊడిప‌డ్డారో తెలీదు కానీ.. వ‌చ్చీరాగానే కాబూల్‌ను హ‌స్త‌గ‌తం చేసేసుకున్నారు. రాజ‌ధానే వారి గుప్పిట్లోకి రావ‌డంతో.. ఇక అఫ్ఘ‌న్ తాలిబ‌న్ల రాజ్యమైపోయింది. యావ‌త్ అఫ్ఘ‌నిస్తాన్‌ను కైవ‌సం చేసుకున్న తాలిబ‌న్ల‌కు.. అదే దేశంలోని ఓ ప‌ర్వ‌త‌లోయ మాత్రం ఇప్ప‌టికీ వారి చేతికి చిక్క‌నేలేదు. ఇప్పుడ‌నే కాదు.. గ‌త 30 ఏళ్లుగా తాలిబ‌న్ల‌కు కొరుకుడుప‌డ‌ని కొయ్య‌లా మారింది ఆ ప్రాంతం. అదే పంజ్‌షిర్‌. దాని అర్థం ఐదు సింహాలు. ఆ ఏరియాకు రారాజు.. అహ్మ‌ద్ మ‌సూద్‌.  కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ఉంది. జ‌నాభా సుమారు లక్ష. వారంతా పోరాట యోధులు.. అక్క‌డి ప‌ర్వ‌తాలు వారికి పెట్ట‌ని కోట‌లు. శతాబ్దాలుగా పంజ్‌షిర్‌‌లో అటు విదేశీ బలగాలు, ఇటు తాలిబన్లు కాలుమోపలేకపోయారు. మిలటరీ కమాండర్‌ అహ్మద్ షా మసూద్.. 1979-1989 మధ్య సోవియట్ సేనలను తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ తర్వాత నుంచి తాలిబ‌న్లతో పోరాడారు. అయితే,  తాలిబన్లు, ఆల్‌ఖైదా ఉగ్రవాదులు కలిసి జర్నలిస్ట్‌లుగా మారు వేషాల్లో వచ్చి.. అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ అటాక్‌కు రెండు రోజుల ముందు 2001 సెప్టెంబరు 9న ఆత్మాహుతి దాడి చేసి అహ్మ‌ద్ షా మ‌సూద్‌ను చంపేశారు. ఆ త‌ర్వాత.. అమెరికా, నాటో దళాలు అఫ్గన్‌పై దాడి చేయడం, మసూద్‌ దళాలతో ఆ బలగాల స్నేహానికి దారితీసింది. అప్ప‌ట్లో అధికారంలోకి వచ్చిన హమీద్‌ కర్జాయ్‌.. అహ్మద్‌ షా మసూద్‌ను నేషనల్‌ హీరోగా ప్రకటించడంతో పాటు ఆయన చనిపోయిన‌ రోజును హాలిడేగా డిక్లేర్ చేశారు. ప్రస్తుతం పంజ్‌షిర్‌ ప్రాంతానికి అహ్మద్‌ షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్ చీఫ్‌గా ఉన్నారు, 9000 మంది సైన్యంతో.. అఫ్గన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌తో క‌లిసి తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. పంజ్‌షీర్‌ను ఆక్రమించుకోడానికి తాలిబన్‌లు చేస్తున్న‌ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. తాజాగా, 300 మంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు పంజ్‌షీర్ సైన్యం ప్రకటించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వ‌చ్చాయి.  పంజ్‌షీర్ వైపు వందలాది వాహనాల్లో, భారీ ఆయుధాలతో తాలిబన్లు కదులుతున్నారు. అఫ్గన్ ప్రభుత్వ మాజీ సైన్యం, పంజ్‌షిర్‌ మిలీషియా బృందం సంయుక్తంగా తాలిబన్లను ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షిర్ లోయకు సమీపంలోని మూడు జిల్లాలను అఫ్గన్ ప్రభుత్వ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్‌లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లాహ్ మహ్మద్ ట్విట్టర్‌లో తెలిపారు. మ‌రోవైపు, త‌మ‌కు స‌రిప‌డా ఆయుధాలు అందించాలంటూ అమెరికాను కోరారు. పంజ్‌షిర్‌పై ఎలాగైనా ప‌ట్టుసాధించాల‌ని తాలిబ‌న్లు ప‌ట్టుద‌ల‌గా ఉండ‌టంతో యుద్ధం వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారింది.  

బుల్లెట్ సాంగ్‌ డ్యాన్స‌ర్‌కి ఫుల్‌ స‌పోర్ట్‌.. 20 కోట్ల స్కామ్ వ‌దిలేసి న‌ర్సుపై చ‌ర్య‌లా?

బుల్లెట్ బండెక్కి వచ్చేస్తప.. అందాల దునియానే చూపిస్తపా.. సోష‌ల్ మీడియాను షేక్ చేసిన పెళ్లికూతురు డ్యాన్స్ ఓ నర్సు ఉద్యోగానికి ఎస‌రు పెట్టిన విష‌యం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పిహెచ్‌సిలో బుల్లెట్ బండి పాటకు ఆస్పత్రి ప్రాంగణంలో నర్సు డ్యాన్స్ చేయ‌డం.. ఆ వీడియో సైతం వైర‌ల్‌గా మార‌డం.. కలెక్టర్ ఆదేశాలతో డ్యాన్సు చేసిన నర్సుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేయ‌డం.. కాంట్ర‌వ‌ర్సీగా మారింది. డ్యూటీలో ఉన్న‌ప్పుడు డ్యాన్స్ ఎలా చేసార‌నేది అధికారుల ప్ర‌శ్న‌. ఏం చేస్తే త‌ప్పా? ఆగ‌స్టు 15 హాలిడే రోజున స‌ర‌దాగా డ్యాన్స్ చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటారా? అంటూ తోటి ఉద్యోగులు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. సోష‌ల్ మీడియాలో సైతం ఆ న‌ర్సుకు మ‌ద్దుతుగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా, న‌ర్సుకు మెమో ఇవ్వ‌డంపై ఓ సీనియ‌ర్ న‌ర్సు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అక్క‌డితో ఆగ‌లేదామె.. 20 కోట్ల స్కాము చేసిన నిందుతుల‌పై చ‌ర్య‌లు తీసుకోరు గానీ, అణ‌గారిన వ‌ర్గానికి చెందిన న‌ర్సును మాత్రం శిక్షిస్తారా? అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ వీడియో పెట్ట‌డంతో మ‌రింత‌ ర‌చ్చ జ‌రుగుతోంది.  డ్యాన్స్ చేసిన‌ నర్సుకి మెమో జారీ చేయడంపై హెల్త్ డిపార్ట్‌మెంట్‌కే చెందిన ఓ సీనియర్ నర్సు నేరుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌‌ని నిలదీసిన వీడియో సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌‌కి ఆమె ప‌లు ప్రశ్నలు సంధించారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ అవినీతి గురించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే పట్టించుకోని మీరు.. డ్యాన్స్ చేసిందని ఓ నర్సుపై చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు. ఆ అమ్మాయి ఏమైనా డ్యూటీలో డ్యాన్స్ చేసిందా.. పంద్రాగస్టు సెలవు రోజు ఆనందంగా డ్యాన్స్ చేస్తే తప్పా? అని నిల‌దీశారు. ఆమెకిచ్చిన మెమోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే నర్సులందరం సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు.  నర్సులంటే చిన్నచూపు ఉందని ఆ సీనియ‌ర్ న‌ర్సు ఆవేదన వ్యక్తం చేశారు. 20 కోట్ల రూపాయల అవినీతి చేసినోడిపై చర్యలు తీసుకోకుండా డ్యాన్స్ చేస్తే చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. డైరెక్టర్‌పై ఫిర్యాదు చేస్తే సీఎం, మంత్రి, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ ఎవరూ పట్టించుకోలేదన్నారు. అతను కలెక్షన్ చేసి మీకు వాటాలిస్తున్నారు కాబట్టే ఆయన్ను ప్రొటెక్ట్‌ చేస్తున్నారని అంతా అనుకుంటున్నారంటూ మ‌రింత అగ్గి రాజేశారు.  మ‌రోవైపు, డ్యాన్స్ చేసిన‌ నర్సుకి ప‌లువురు స్థానిక‌ బీజేపీ నేతలు మ‌ద్ద‌తుగా నిలిచారు. పదేళ్లకు పైగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి.. ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోందని.. కరోనా కాలంలోనూ ప్రాణాలకు తెగించి పనిచేసిందని చెప్పారు. అలాంటి అణగారిన వర్గానికి చెందిన పేద మహిళకు ఇచ్చిన మెమోని వెనక్కి తీసుకోవాలని బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేశారు.  డ్యాన్స్ చేసిన న‌ర్సుకు అన్నివ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు పెర‌గ‌డంతో జిల్లా అధికారులు సైతం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మొదటి తప్పుగా భావించి మెమోతో సరిపెట్టాలని భావిస్తున్నార‌ట‌. చ‌ర్య‌లు తీసుకుంటే.. అన‌వ‌స‌ర ర‌చ్చ అవుతుంద‌ని.. అందుకే ఆ ఇష్యూని ఇక్క‌డితో వ‌దిలేయాల‌ని అనుకుంటున్నార‌ని అంటున్నారు.   

హ‌రీశ్‌రావు అర్థ‌రాత్రి వ్యూహాలు.. ఈట‌ల‌కు ఊహించ‌ని షాకులు..

త‌న్నీరు హ‌రీశ్‌రావు. కేసీఆర్‌కు అల్లుడు. టీఆర్ఎస్ ఆవిర్భావంతో రాజ‌కీయ అరంగేట్రం చేశారు. కేసీఆర్ డైరెక్ష‌న్‌లో ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించారు. గులాబీ బాస్‌ వెన్నంటే ఉంటూ.. మామ నుంచి జిత్తుల‌మారి వ్యూహాలు, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు అన్నీ బాగా ఒంట‌బ‌ట్టించుకున్నారు. మామ త‌ర్వాత మామ అంత‌టోడు అయ్యారు. అలాంటిది, త‌న‌యుడు కేటీఆర్ కోసం అల్లుడు హ‌రీశ్‌ని అట‌కెక్కించేశారు కేసీఆర్‌. చాన్నాళ్ల త‌ర్వాత ఇప్పుడు త‌న‌కు ప‌క్క‌లో ఈటెలా మారిన రాజేంద‌ర్ కోసం ట్ర‌బుల్ షూట‌ర్‌ను అట‌క మీద‌నుంచి దించి.. బూజు దులిపి.. ప‌దును పెట్టి.. హుజురాబాద్‌లో ఈట‌ల‌పై ప్ర‌యోగించారు. హ‌రీశ్ ఎంట్రీతో హుజురా..వార్ మ‌రింత రంజుగా మారింది. ఒక్క దుబ్బాక మిన‌హా గ‌త 20ఏళ్ల‌లో హ‌రీశ్‌రావుకు అప్ప‌గించిన ఏ ఒక్క ప‌నిలోనూ విఫ‌లం అయింది లేదు. ఇప్పుడు హుజురాబాద్‌లోనూ బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా కంప్లీట్ చేసేందుకు త‌న అనుభ‌వాన్నంతా వాడేస్తున్నారు హ‌రీశ్‌రావు. త‌న పాత మిత్రుడు ఈట‌ల‌కు కొత్త‌గా చుక్క‌లు చూపిస్తున్నారు.  ముస‌లికి నీటిలో బ‌ల‌మున్న‌ట్టు.. ఈట‌ల రాజేంద‌ర్‌ హుజురాబాద్‌లో అత్యంత బ‌ల‌వంతుడు. ఆ విష‌యం తెలిసే.. ముస‌లిని బ‌ల‌హీనం చేసేందుకు దాని చుట్టూ ఉన్న నీటినంత‌టినీ మోట‌ర్లు పెట్టి తోడేస్తున్నారు హ‌రీశ్‌రావు. ఈట‌ల‌కు అండాదండాగా ఉన్న ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుల‌ను టీఆర్ఎస్‌లోకి లాగేశారు హ‌రీశ్‌రావు. ఈట‌ల‌ సామాజిక వర్గానికే చెందిన, ఆయ‌న‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జిల్లా సహకార బ్యాంకు వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌తో పాటు మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు చుక్కా రంజిత్‌ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు చెందిన పలువురు బీజేపీని వీడి కారెక్క‌నున్నారు.  హరీష్‌రావు శనివారం రాత్రి ఆకస్మికంగా హుజూరాబాద్‌కు వచ్చి సింగాపురంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు వసతి గృహంలో మ‌కాం వేశారు. హుజూరాబాద్‌ నియోజక వర్గానికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన విడివిడిగా సమావేశమై చ‌ర్చించారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఈటలతోపాటు బీజేపీలోకి వెళ్లిన వారి గురించి ఆరా తీశారు. ఈట‌ల వెంట కీల‌కంగా ఉంటున్న‌.. పింగిలి ర‌మేశ్ ముదిరాజ్‌, చుక్కా రంజిత్‌గౌడ్‌ల‌పై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీశారు. ఆ మార్నాడే తాము బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్టు ఆ ఇద్ద‌రు ప్ర‌క‌టించేశారు. ఈ పరిణామం ఈట‌ల రాజేంద‌ర్‌కు ఊహించ‌ని షాక్‌. కోలుకోలేని దెబ్బ అంటున్నారు.  మ‌రోవైపు.. హుజురాబాద్ వ్యాప్తంగా త‌న మ‌నుషుల‌ను మోహ‌రిస్తున్నారు హ‌రీశ్‌రావు. ఒక్కో గ్రామానికి 10-15 మంది చొప్పున తన నమ్మిబంట్లకు బాధ్యతలు అప్పగించారు. స్థానిక నేతలను ప్రచారానికి వాడుకుంటూనే గ్రౌండ్ లెవల్‌లో మాత్రం తన సొంత కేడర్‌‌ని రంగంలోకి దించారు. స్థానికంగా ఎవ‌రు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లో, ఎవ‌రు ఈట‌ల అభిమానులో తెలీని క‌న్ఫ్యూజ‌న్ ఉంది. గులాబీ కండువా క‌ప్పుకున్న‌ అనేక‌మంది.. ఈట‌ల కోసం ప‌ని చేస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. ఆ అనుమానంతోనే హ‌రీశ్‌రావు స్థానికులెవ‌రినీ న‌మ్మ‌కుండా.. సిద్ధిపేట నుంచి త‌న మ‌నుషుల‌ను ర‌ప్పించి.. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామ‌గ్రామాన మోహ‌రించార‌ని అంటున్నారు. మొదట్లో హుజురాబాద్‌లో గెలుపు ఈజీ అని భావించిన టీఆర్ఎస్.. ఆ త‌ర్వాత ఈట‌ల‌కే ఎడ్జ్ ఉందంటూ స‌ర్వేల‌లో తేల‌డంతో ఖంగుతిన్న‌ట్టుంది. ఆ స‌ర్వే రిపోర్టుల త‌ర్వాతే హ‌రీశ్‌రావు మ‌రింత యాక్టివ్ అయ్యారు. ఇప్ప‌టికే దుబ్బాక‌తో త‌న ఇమేజ్‌కు దారుణ‌మైన డ్యామేజ్ జ‌రిగింది. హుజురాబాద్‌లో ఎలాగైన టీఆర్ఎస్‌ను గెలిపించి.. పోయిన ప‌రువు, ప‌ర‌ప‌తి తిరిగి సంపాదించుకోవాల‌నేది హరీశ్‌రావు క‌మిట్‌మెంట్‌. మామ‌కు ఈట‌ల ఓట‌మిని బ‌హుమ‌తిగా ఇచ్చి.. కేసీఆర్‌కు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యే గోల్డెన్ ఛాన్స్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిస్ చేసుకోవ‌ద్ద‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారట‌ హ‌రీశ్‌రావు. మ‌రి,  హ‌రీశ్ వ్యూహాలను ఈట‌ల చిత్తు చేస్తారా? చిత్తైపోతారా? చూడాలి....

సొంత జిల్లాలో జగన్ కు షాక్! టీడీపీలోకి సీనియర్ నేత జంప్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులుగా ప్రభుత్వ  వ్యతిరేకత భారీగా పెరిగిపోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం, అభివృద్ది పనుల ఊసే లేకపోవడం, మహిళలలపై అఘాత్యాలు పెరిగిపోవడం వంటి అంశాలతో జగన్ రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లోనూ ఇదే తేలింది. జాతీయ స్థాయి సంస్థలతో పాటు లోకల్ ఏజెన్సీ సర్వేల్లోనూ టీడీపీ వైపే ఏపీ ప్రజలు చూస్తున్నారనే సంకేతం వచ్చింది. దీంతో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఇటీవల ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం ఉధృతం చేయడంతో.. ఆ పార్టీకి జనాల నుంచి మంచి స్పందన వస్తోంది. జగన్ రెడ్డి సర్కార్ పై జనాలు కోపంగా ఉండటం, టీడీపీ ప్రజా పోరాటాలతో దూకుడుగా వెళుతుండటంతో  నాయకుల చూపు కూడా ఇప్పుడు టీడీపీ వైపు పడినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే చాలా మంది నేతలు సైకిల్ ఎక్కేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కొందరు టీడీపీలోచేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేతలు కూడా కొందరు తిరిగి సొంత గూటికి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. కడప జిల్లాలోనూ వైసీపీకి షాగ్ తగలనుందని తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం  కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గతంలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. అయితే ఆయన అధికార పార్టీలో ఇమడటం లేదని తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమస్య లేకపోయినా నియోజకవర్గ స్థాయిలో అధికార పార్టీ నేతలు అవమానించే రీతిలో వ్యవహరిస్తుండడంతో తమ నాయకుడు మనస్తాపం చెందినట్టు రామసుబ్బారెడ్డి అనుచరులు చర్చించుకుంటున్నారు. దీనితో  టీడీపీ నుంచి వైసీపీలో చేరి తప్పు చేశామనే అంతర్మథనం చెందుతు న్నట్టు తెలుస్తోంది. వైసీపీ పెద్దలు కొన్ని నెలల క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పి.రామసుబ్బారెడ్డిని కూర్చోపెట్టి చర్చించి క్లారిటీ ఇచ్చారు. 2024లో తిరిగి జమ్మలమడుగు అభ్యర్థిగా సుధీర్ రెడ్డే ఉంటారని అధిష్టానం పెద్దలు తేల్చి చెప్పారు. రామసుబ్బారెడ్డికి తగిన గౌరవం ఇస్తామని చెప్పి పంపారు. సీఎం జగన్ సూచనలతో రామసుబ్బారెడ్డి సైలెంటుగానే ఉంటున్నా... ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయేలా కొందరు పొగపెడుతున్నారని రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రామసుబ్బారెడ్డి మాటను ఎవరూ పట్టించుకోవద్దని అధికారులకు సదరు ప్రజాప్రతినిధి అనధికార ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో ఇక పార్టీలో ఉండి ప్రయోజనం ఏంటనే ప్రశ్న రామసుబ్బారెడ్డిని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వలేమని చెప్పినందున ఇక వైసీపీలో కొనసాగడం ఎందుకుని కొందరు ఒత్తిడి తెస్తున్నారట. అంతేకాదు టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పెరిగిపోతుండటం, వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉండటంతో రామసుబ్బారెడ్డి కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు.  వైసీపీలో అవమానాలు భరించే కంటే.. రాజకీయ భవిష్యత్ కి పునాది వేసిన టీడీపీలో కి మళ్లీ వెళ్లాలనే ఆలోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేర డంతో జమ్మలమడుగులో ప్రతిపక్ష పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని తనను గౌరవించే టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచనలో  ఆయన ఉన్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రే స్వయంగా ఆదిరించినా స్థానిక నేతలతో విభేదాల వల్ల పార్టీ వీడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  శివారెడ్డి హత్యానంతరం ఆయన అన్న కుమారుడు రామసుబ్బారెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. 1994 , 99లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ , చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 2004 నుంచి ఆయన వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. 

రాఖీలు క‌ట్టి నిర‌స‌న‌.. సీఎం జ‌గ‌న్‌కు మ‌హిళా ఉద్యోగుల డెడ్‌లైన్‌..

రాఖీలు ఎవ‌రైనా ప్రేమ‌తో క‌డ‌తారు.. అభిమానం క‌డ‌తారు.. ఆప్యాయ‌త‌తో క‌డ‌తారు.. అదేంటి.. ఆ మ‌హిళ‌లు జ‌గ‌న‌న్న‌కు అలా నిర‌స‌న తెలుపుతూ రాఖీలు క‌ట్టారేంటి! ఇదే ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌ణీయాంశ‌మైంది. రాఖీ పండ‌గ సంద‌ర్భంగా ఏపీ మ‌హిళా ప్ర‌భుత్వ ఉద్యోగులు సీఎం జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌కు రాఖీలు క‌ట్టి నిర‌స‌న తెలిపారు. ప‌నిలో ప‌నిగా ఓ డెడ్‌లైన్ పెట్టి సీరియ‌స్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అన్న అన్నే.. డిమాండ్లు డిమాండ్లే అన్న‌ట్టు.. పండ‌గ పూట ఏపీ వ్యాప్తంగా మ‌హిళా ఎంప్లాయిస్ చేసిన నిర‌స‌న కార్య‌క్ర‌మం జ‌గ‌న‌న్న ప‌రువును బ‌జారు పాలు చేసింది. మ‌హిళల‌తో క‌న్నీళ్లు పెట్టించిన ఏ ముఖ్య‌మంత్రీ బాగుప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లోనే లేదంటూ సీఎం జ‌గ‌న్‌కు అల్టిమేటం జారీ చేశారు.  సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యమిస్తున్న మహిళా ఉద్యోగులు రాఖీ నాడు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జ‌గ‌న్‌రెడ్డి చిత్రపటాలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం చిత్రపటాలకే కాకుండా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, జిల్లా కలెక్టర్లకు సైతం రాఖీలు కట్టి నిరసన తెలిపారు.  ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఉద్యమ కార్యాచరణలో ప్రకటించిన ‘రక్షాబంధన్‌ - మహిళా పోరుబాట’ కార్యక్రమం ఏపీలో పెద్ద ఎత్తున జ‌రిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌  విధానం రద్దు చేసి పాత పెన్షన్‌  విధానం పునరుద్ధరించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ‘జగనన్నా.. పెన్షన్‌ రక్ష కల్పించన్నా’ అంటూ మహిళా ఉద్యోగులు నినదించారు. ‘జగనన్నా.. సీపీఎస్‌ ఎప్పుడు రద్దు చేస్తావన్నా’ అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మ‌హిళా ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ నెల 31లోగా సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తెలియజేయకపోతే.. సెప్టెంబరు 1న అన్ని జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో, ఏపీసీపీఎస్‌  ఆధ్వర్యంలో మహా నిరసన ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.   

హుజూరాబాద్ ఓటర్లు డిసైడై పోయారా? ఎవరేం చేసినా  ఫలితం అదేనా? 

హుజూరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క తప్పుతోందా?  అనుకున్నదొకటి, అయినది ఒకటి అన్నట్లుగా, ఏదో ఆశించి తీసుకుంటున్న నిర్ణయాలు బూమ్రాంగ్ అవుతున్నాయా? అందుకేనా, ఏమి చేయాలో పాలుపోకనే ముఖ్యమంత్రి రోజుకో సమీక్ష నిర్వహిస్తున్నారా? నియోజక వర్గం నాయకులను పిలిపించుకుని, అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది? ఆళ్ళే మంటున్నరు, వీళ్ళేమంటున్నరు? అని ఆరాతీస్తోంది అందుకేనా, చివరకు అధికారులు వండి వడ్డించిన ‘వంటింటి’ సర్వేలు కూడా ఆయన ఆశలు మీద నీళ్ళు చల్లుతున్నారా?  అందుకేనా, ముఖ్యమంత్రి ఏమి చేద్దాం, ఎలా బయట పడదాం,అని మేథోమథనం సాగిస్తోంది అందుకేనా? అంటే,అంతర్గత వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.  నిజానికి ఒక్క దళిత బంధుతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించవచ్చని, ముఖ్యమంత్రి లెక్కలేశారు. ఆ ఉద్దేశంతోనే పైలట్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ నియోజక వర్గాన్ని ఎంపిక చేశారు. నియోజక వర్గం పరిధిలోని దళిత కుటుంబాల లెక్కలు తీశారు. నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలున్నాయి. (హుజూరాబాద్ మండలంలో 5,323, కమలాపూర్ మండలంలో 4346, వీణవంక మండలంలో 3678, జమ్మికుంట మండలంలో 4996,ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలు). నియోజక వర్గంలోని అన్ని దలిత కుతుబాలకు ఒకేసారి పథకాన్ని వర్తింప చేయాలని, తద్వారా దళిత ఓట్లను గంపగుట్టగా తమ వైపుకు తిప్పుకుంటే, ఈటలను ఇట్టే సునాయాసంగా ఇంటికి పంపించవచ్చని ఆశించారు. ఇందుకోసంగా  రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్’ లో పథకం అమలుకు కేటాయించిన, రూ. 1200 కోట్లకు అదనంగా మరో రూ.2000 కోట్లు కేటాయించేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. అంటే, ఈ పథకం మీద ముఖ్యమంత్రి ఎంతగా ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చును. నిజానికి, ఆ నిజాన్ని అయన దాచుకోలేదు. హుజూరాబాద్’లో గెలిచేందుకే దళిత బంధు పథకం, అని బహిరంగంగా ప్రకటించారు.  కానీ, దళిత బంధు పథకం నుంచి ఆశించిన ఫలితాలు రాకపోగా వ్యతిరేక ఫలితాలు స్పష్టమవుతున్నాయని, కొంచెం ఆలస్యంగా అర్థమైందని సన్నిహత వర్గాల తాజా సమాచారం. అందుకే మళ్ళీ ఓల్డ్ ట్రిక్స్ ప్లే  చేస్తున్నారని అంటున్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ కథ వినిపించడంతో పాటుగా ఈటల వెంట ఉన్న నాయకులను తమ వైపుకు తిప్పుకోవడంపై మరో మారు దృష్టిపెట్టాలని శుక్రవారం అర్థరాత్రి వరకు నిర్వహించిన సమావేశంలో నిర్ణయించినట్లు, తెలుస్తోంది.  ఇందులో భాగంగానే, ఇప్పటకే సమాదానదండోపాయాలను ప్రయోగించి  ఈటల అనుచరులు చాలా వరకు తమవైపుకు తిప్పుకున్న అధికార పార్టీ, ఇప్పుడు మరో మారు, ఆయన  అనుచరులకు వల విసురుతోంది. అందులోనూ ముఖ్యంగా ఇంతవరకు ఎలాంటి ప్రలోభాలకు లొంగని ఈటల సన్నిహిత అనుచరులను కారెక్కిచేందుకు,గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే, ఈటలకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటున్న పింగిలి ర‌మేష్‌, చుక్కా రంజిత్’లు తాజాగా కారెక్కి గులాబీ గూటికి చేరారు.  అయితే, గుర్రాన్ని బలవంతంగా రేవు వరకు తీసుకు పోవచ్చును, కానీ, నీళ్ళు తాగించడం సాధ్యం కాదు. అలాగే, అదిరించో బెదిరించో, ఈటల అనుచరులను తమ వైపుకు తిప్పుకోవచ్చును కానీ, మనసులను మార్చడం అయ్యే పని కాదని, అటు వెళ్ళిన వారే అంటున్నారు. నిజానికి, ఇప్పటికే, హుజూరాబాద్ ఓటర్లు, ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటు ఈటల అటు కేసీఆర్ ఏ ఒడ్డున నిలవాలో జనం డిసైడై పోయారని, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సెప్టెంబ‌ర్‌లో థ‌ర్డ్ వేవ్ ప‌క్కా.. రోజుకు 5 లక్షల కేసులట‌.. నీతి ఆయోగ్ హెచ్చరిక..

థ‌ర్డ్ వేవ్ లేదు ఏమీ లేదు. జ‌నాలు చూడు ఎంత బిందాస్‌గా తిరుగుతున్నారో. కేసులు కూడా పెద్ద‌గా ఏమీ రావ‌ట్లేదు. ప్ర‌జ‌ల్లో సైతం క‌రోనా భ‌యం లేదు. సెకండ్ వేవ్ ముగిసింద‌ని తెలంగాణ‌ అధికారికంగానే ప్ర‌క‌టించింది. ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో బోనాల పండ‌గ జోరుగా జ‌రిపారు. అయినా, కేసులు అంతంతే ఉన్నాయి. ఏపీలో స్కూల్స్ కూడా తెరిచారు. ఇలా మొత్తం అన్‌లాక్ అవుతోంది. రాబోవు వినాయ‌క చ‌వితి సైతం పెద్ద ఎత్తున జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రాల తీరు ఇలా ఉంటే.. కేంద్రం మాత్రం క‌రోనా క‌ట్ట‌డిపై ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తోంది. మీరు చేస్తున్న‌ది త‌ప్పు.. ఇంకా కొవిడ్ ముప్పు పోలేదంటూ ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు చేస్తోంది. అయినా, రాష్ట్రాలు ప‌ట్టించుకుంటేగా. తాజాగా, నీతి ఆయోగ్ మ‌రో వైర‌స్ బాంబ్ వ‌దిలింది. క‌రోనా ఎక్క‌డికీ పోలేద‌ని.. థ‌ర్డ్ వేవ్‌కు రెడీ అవుతోంద‌ని.. మూడో ముప్పు మ‌రింత డేంజ‌ర‌స్‌గా ఉంటుంద‌ని గ‌ట్టి వార్నింగ్ ఇస్తోంది. సెప్టెంబ‌ర్‌లోనే ముహూర్తం అంటూ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి మరోమారు వికృతరూపం చూపనుంది. లేటెస్ట్‌గా నీతి ఆయోగ్ కరోనా థర్డ్ వేవ్‌పై హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబరులో ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని అల‌ర్ట్ చేస్తోంది. కరోనా బారిన పడిన ప్రతీ 100 మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయ‌ని అంచనా వేసింది. ఆ పరిస్థితులకు త‌గ్గ‌ట్టు ముందుగానే దేశంలో రెండు లక్షల ఐసీయూ బెడ్లు సిద్ధంగా ఉంచాలని సూచింది.  2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్ ఐసోలేషన్ కేర్ బెడ్లు సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. గ‌తంలొ సెకండ్ వేవ్ గురించి కూడా నీతి ఆయోగ్ క‌రెక్ట్‌గా అంచ‌నా వేసింది. ఇప్పుడు మూడో ముప్పు గురించి తెల‌ప‌డంతో ప్ర‌భుత్వం, అధికారులు అల‌ర్ట్ అవుతున్నారు.  ఆగ‌స్టులో కొవిడ్ కేసులు నియంత్ర‌ణ‌లోనే ఉన్నాయి. దేశంలో గత‌ 56 రోజులుగా 50 వేలకు దిగువగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 30,948 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 403 మంది చ‌నిపోయారు. 

మెగాస్టార్ ప‌వ‌ర్‌స్టార్ అయ్యేనా? ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు?

హ్యాపీ బ‌ర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి. బ‌ర్త్‌డే విషెష్‌తో తెలుగురాష్ట్రాలు హోరెత్తిపోతోంది. ఆదివారం మొత్తం మెగా సంద‌డే. ఆచార్య‌, గాడ్‌ఫాద‌ర్‌, భోళాశంక‌ర్‌ల చ‌ర్చే. ప్ర‌ముఖులంతా చిరంజీవికి శుభాకాంక్ష‌లు చెప్పారు. ఫ్యాన్స్ అంతా పోస్టులు, స్టేట‌స్‌లు, పాట‌లతో త‌మ అభిమానం చాటుకున్నారు. సోష‌ల్ మీడియా మొత్తం మెగాస్టార్ మేనియానే. గ్రీన్ ఛాలెంజ్‌తో సోష‌ల్ కాజ్ సైతం పెద్ద ఎత్తున కొన‌సాగింది. అంతా బాగుంది.. మెగాస్టార్ పుట్టిన‌రోజు వేడుక‌లు బ్ర‌హ్మాండంగా సాగాయి. అంతేనా.. అస‌లైన ఫ్యాన్స్ ఇంతే కోరుకుంటున్నారా? ఆచార్యతో అడ్జ‌స్ట్ అయిపోతారా? గాడ్‌ఫాద‌ర్‌తో గ‌మ్మున ఉండిపోతారా? భోళాశంక‌ర్ భ‌జ‌న చేసుకుంటూ రిలాక్స్ అవుతారా? కానే కాదు.. సినీ ఫ్యాన్స్ అలా కాంప్ర‌మైజ్ అవుతారేమో కానీ.. పొలిటిక‌ల్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవిని ఇంకెక్క‌డో చూడాల‌నుకుంటున్నారు.. అన్న‌య్య‌ను అంద‌నంత ఎత్తున ఊహించుకుంటున్నారు.. ఆయ‌న్ను ఎక్క‌డికో తీసుకెళ్లాల‌నుకుంటున్నారు కానీ.. మెగాస్టార్ మాత్రం అందుకు ఇప్పుడే సిద్ధంగా లేనంటున్నారు. సినిమాల‌తో య‌మా బిజీగా ఉంటున్నారు. మ‌రి, మెగాస్టార్ ప‌వ‌ర్ కేవ‌లం సినిమాల వ‌ర‌కేనా? పాలిటిక్స్‌లో మ‌ళ్లీ 'ప‌వ‌ర్‌' చూపించే రోజులు రావంటారా? కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌. కేంద్ర మాజీమంత్రి. టాలీవుడ్ బిగ్‌బాస్‌. తెలుగు రాష్ట్రాల‌లో ఫుల్ క్రేజ్‌. దేశంలోనూ మంచి పాపులారిటీ. అభిమాన‌గ‌ణం మెండు. రాజ‌కీయాల్లో రాణించ‌డానికి అన్ని అర్హ‌త‌లూ ఉన్నాయి. అయినా, ఏవో కార‌ణాలతో ఆయ‌న పొలిటిక‌ల్ కెరీర్ క‌న్ఫ్యూజ‌న్‌గా మారింది. ప్ర‌జారాజ్యంతో ఉద‌యించే సూర్యుడిగా వెలుగొందుతార‌ని అనుకున్నారంతా. వైఎస్సార్ ఆప‌రేష‌న్‌కు కాంగ్రెస్‌లో క‌లిసిపోయి కేంద్ర మంత్రి అయ్యారు. క‌ట్‌చేస్తే.. రాష్ట్ర విభ‌జ‌న‌తో పాటూ ఆయ‌న రాజ‌కీయ ఉన్న‌తీ ముక్క‌లుచెక్క‌లైంది. ఆ త‌ర్వాత చిరంజీవి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో మెరిశారు. వ‌రుస హిట్‌ల‌తో మునుప‌టి చ‌రిష్మా సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న టెక్నిక‌ల్‌గా కాంగ్రెస్‌లోనే ఉన్నా.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.  చిరంజీవి పాలిటిక్స్‌లో యాక్టివ్ లేకున్నా.. సినీ పాలిటిక్స్‌లో మాత్రం అంద‌రిక‌న్నా ముందున్నారు. టాలీవుడ్ స‌మ‌స్య‌లపై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో సినీ కార్మికుల‌ను ఆదుకున్నారు. ప‌రిశ్ర‌మ అభివృద్ధికి చొర‌వ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇటు తెలంగాణ స‌ర్కారు, అటు ఏపీ ప్ర‌భుత్వానికి అత్యంత స‌న్నిహితుడిగా మారారు. క‌ల్వ‌కుంట్ల‌-కొణిదెల ఫ్యామిలీల మ‌ధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి-జ‌గ‌న్ క్లోజ్ రిలేష‌న్ మెయిన్‌టెన్ చేస్తున్నారు. అపాయింట్‌మెంట్ లేకుండానే ఇద్ద‌రు సీఎంల‌ను క‌లిసేంత సాన్నిహిత్యం ఏర్ప‌డింది. తెలంగాణ పాలిటిక్స్‌లోకి చిరంజీవి వ‌చ్చే అవ‌కాశం లేకున్నా.. ప‌రోక్షంగా కేసీఆర్‌కు స‌పోర్ట్‌గా ఉంటున్నారు. ఇక‌, ఏపీ రాజ‌కీయాల్లో మెగాస్టార్ రోల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్ప‌టికీ మెగాస్టార్.. ట్రంప్‌కార్డ్‌గానే ఉన్నారు. ఏపీ రాజ‌కీయాల‌ను శాసించ‌లేక‌పోయినా.. ప్ర‌భావితం మాత్రం చేయ‌గ‌ల‌రు. అందుకే, చిరంజీవిని ట్రాప్ చేసేలా జ‌గ‌న్ ఆయ‌న‌తో ఈమ‌ధ్య కాలంలో రాసుకుపూసుకు ఉంటున్నార‌ని అంటున్నారు.. త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాన్ జ‌న‌సేన పార్టీ నుంచి కాచుకోడానికి.. అన్న‌య్య చిరంజీవితో న‌రుక్కొస్తున్నార‌ని భావిస్తున్నారు. కావాల‌నే చిరంజీవిని ప‌లుమార్లు క‌లుస్తూ.. ఏపీ టాలీవుడ్‌పై చ‌ర్చిస్తూ.. చిరంజీవి-జ‌గ‌న్ మంచి ఫ్రెండ్స్ అనే మెసేజ్ ప‌బ్లిక్‌లోకి వెళ్లేలా చూసుకుంటున్నారు. ఇదంతా జ‌గ‌న్ ఆడుతున్న మైండ్‌గేమ్ అంటున్నారు. చిరంజీవిని వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు పంపుతార‌నే ప్ర‌చారానికీ తాడేప‌ల్లి వ‌ర్గాల లీకులే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. జ‌న‌సేన నుంచి ర‌క్ష‌ణ‌కే మెగాస్టార్‌ను సేఫ్‌గార్డ్‌గా ముందుంచుతున్నార‌ని విశ్లేషిస్తున్నారు.  ఇక ఈసారి ప్ర‌ధాని కావాల‌ని ఆశ‌ప‌డుతున్న రాహుల్‌గాంధీ సైతం ఏపీలో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ను మ‌ళ్లీ పట్టాలెక్కించాల‌ని భావిస్తున్నారు. అందుకోసం ఏపీ మొత్తం సెర్చ్ లైట్ పెట్టి వెతికితే.. ఒక్క చిరంజీవి మాత్ర‌మే వారికి ఆశాకిర‌ణంలా క‌నిపిస్తున్నారు. అందుకే, చిరంజీవిని మ‌ళ్లీ కాంగ్రెస్‌లో యాక్టివ్ చేసే బాధ్య‌త‌ను రాహుల్‌గాంధీ.. ఉమెన్‌చాందీకి అప్ప‌గించార‌ని చెబుతున్నారు. తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి మాదిరిగా.. చిరంజీవిని ఏపీపీసీసీ చీఫ్ చేసి.. ప‌త్తా లేకుండా పోయిన కాంగ్రెస్‌కు ఓ రూపు తీసుకురావాల‌ని చూస్తున్నారు. అక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్‌రెడ్డి జైలుక వెళితే.. వైసీపీలో ఉన్న‌వారంతా ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ వాదులే కాబ‌ట్టి.. వారిని మ‌ళ్లీ వెన‌క్కి లాగి.. చిరంజీవి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌కు మ‌ళ్లీ ప్రాణం పోయాల‌నేది రాహుల్ అండ్ టీమ్ ఐడియా. మ‌రి, అది సాధ్య‌మా? అంటే... అనుమాన‌మే. వ‌చ్చే రెండేళ్ల వ‌ర‌కూ సినిమా షెడ్యూళ్ల‌తో బిజీగా ఉన్నారు మెగాస్టార్‌. ప్ర‌స్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న ఆయ‌న‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్ లైట్‌లోకి వ‌స్తారా? ఏపీ పాలిటిక్స్‌లో ఫుల్ జోష్ మీద‌ త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉండ‌గా.. మ‌ళ్లీ ఈ అన్న‌య్య ఎంట్రీ అవ‌స‌ర‌మా? సినిమాల్లో మెగాస్టార్‌.. మ‌ళ్లీ పొలిటిక‌ల్‌గా యాక్టివ్ అయి 'ప‌వ‌ర్‌'స్టార్‌గా మారుతారా? ఏమో......  

కేటీఆర్ కు కవిత రాఖీ కట్టలేదా? ఇద్దరి మధ్య మాటల్లేవా? ప్రగతి భవన్ లో ఏంటీ పరేషాన్? 

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్. దేశ వ్యాప్తంగా రాఖి పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కాచెల్లెళ్లు తమ అన్నా దమ్ముళ్లకు రాఖీలు కట్టి ప్రేమను చాటుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు  నివాసం, తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ సీఎం జగన్ కు మంత్రులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీడీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు.  తెలంగాణ సీఎం నివాసం ప్రగతి భవన్ లోని రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఆయ‌న సోద‌రీమ‌ణులు రాఖీ క‌ట్టారు. అక్కాచెల్లెళ్లు ల‌క్ష్మ‌మ్మ‌, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు నివాళి హార‌తి ప‌ట్టి, రాఖీలు క‌ట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వ‌దించారు. సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగినా.. ఒక వెలికి మాత్రం కనిపించింది. రాఖీ వేడుకల్లో ఎప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే సీఎం కేసీఆర్ కూతురు, మంత్రి కేటీఆర్ సోదరి.. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఈసారి ఎక్కడా కనిపించడకపోవడం అందరిని షాకింగ్ కు గురి చేసింది. ఎమ్మెల్సీ కవిత .. ఆయన సోదరుడు కేటీఆర్ కు ప్రతి ఏటా రాఖీ కడుతుంది. గత కొన్నేండ్లుగా ఎప్పుడు ఆమె ఈ ఈవెంట్ ను మిస్ చేయలేదు. గత ఏడేండ్లుగా ప్రగతి భవన్ లో రాఖీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కాని ఈసారి మాత్రం ప్రగతి భవన్ లో కవిత కనిపించకపోవడం చర్చగా మారింది.  సంతోష్ సోదరి,  మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, మేయర్ గద్వాల విజయలక్ష్మి  సహా చాలా మంది నేతలు కేటీఆర్ కు రాఖీ కట్టారు. ఆ ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అందులో ఎంపీ సంతోష్ సోదరి కేటీఆర్ రాఖీ కట్టిన ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూడగానే అందరికి ఎమ్మెల్సీ కవిత గుర్తుకు వస్తోంది. ఎందుకంటే గత కొన్నేండ్లుగా ఎంపీ సంతోష్ సోదరితో కలిసి కేటీఆర్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టేది కవిత. వాళ్లందరు కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది. కాని ఈసారి ప్రగతి భవన్ లో ఆ సీన్ కనిపించలేదు. ఎంపీ సంతోష్ సోదరి ఒక్కతే కేటీఆర్ కు రాఖీ కట్టారు. ఆ ఫోటోనే కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ఫోటోను చూసిన వారంతా ఎమ్మెల్సీ కవిత ఎక్కడ? ,అన్న కేటీఆర్ కు సొదరి కవిత రాఖీ కట్టలేదా? కట్టకపోతే ఎందుకు కట్టలేదు? అని చర్చించుకుంటున్నారు.  ప్రతి ఏటా రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనే ఎమ్మెల్సీ కవిత.. ఈసారి ఎక్కడికి వెళ్లారన్నది ఎవరికి తెలియడం లేదు. ఆమె అసలు హైదరాబాద్ లో ఉన్నారా లేక బయటికి వెళ్లారా అన్న చర్చలు కూడా సాగుతున్నాయి. రాఖీ పౌర్ణమి రోజున  తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అలాంటిది కవిత ఎందుకు లేదన్నది ప్రశ్నగా మారింది. అందులోనూ రాఖీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనే కవిత.. ఈసారి ఫెస్టివల్ ను ఎందుకు మిస్ చేశారన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. కేటీఆర్ కు కవిత రాఖీ కట్టకపోవడం తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లోనూ తీవ్ర చర్చగా మారింది.  కేసీఆర్ ఫ్యామిలీలో విభేదాలున్నాయని గతంలో ప్రచారం జరిగింది. అన్న కేటీఆర్ తో కవితకు పడటం లేదనే  చర్చ కూడా ఉంది.  ముఖ్యమంత్రి మార్పు విషయంలో వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. తాజాగా రాఖీ వేడుకల్లో కవిత కనిపించకపోవడంతో వాళ్లిద్దరి మధ్య విభేదాలు నిజమేనా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాఖీ కట్టలేనంత గ్యాప్ ఇద్దరి మధ్య వచ్చిందా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. మొత్తంగా ప్రగతి భవన్ లో జరిగిన రాఖీ వేడుకల్లో కవిత కనిపించకపోవడం, అన్న కేటీఆర్ కు ఆమె రాఖీ కట్టకపోవడం తెలంగాణలో పెద్ద చర్చగానే మారిపోయింది.. 

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్.. ఎలా వచ్చిందో తెలుసా? 

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు.  రాఖీ వెనక బలమైన చరిత్ర ఉండేది. పూర్వం యుద్ధాలకు వెళ్లినప్పుడు... ఆ యుద్ధంలో గెలవాలని అన్నలకు సోదరీమణులు... రాఖీలు కట్టేవాళ్లు. ఆ రాఖీలతో వెళ్లే సైనికులు... తమకు తమ సోదరి అండగా ఉన్నట్లు భావించేవారు. అదే ధైర్యంతో యుద్ధంలో పోరాడి గెలిచేవారు. యుద్ధం మధ్యలో రాఖీకి ఏదైనా అయితే... రెచ్చిపోయి... శత్రువుల్ని చీల్చి చెండాడేవాళ్లు. అలా రాఖీ వారిలో ఎక్కడ లేని ఉత్సాహాన్నీ, ధైర్యాన్నీ, తెగువనూ తెచ్చేది. పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.  యముడు సోదరి అయిన యుమన ప్రతి శ్రావణ పౌర్ణిమ రోజున ఆయనకు రాఖీ కట్టేది. దీనికి బదులుగా యమధర్మరాజు తన సోదరితో ఎవరైతో రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం కలుగుతుందని వరం ఇచ్చాడు.రాజపుత్ర వనిత, చిత్తోర్‌గఢ్ రాణి కర్ణావతి అప్పటి ఢిల్లీ చక్రవర్తి హుమయూన్‌కు రాఖీని పంపి గుజరాత్ పాలకుడు బహదూర్ షా దండయాత్రలను నుంచి తమ రాజ్యాన్ని రక్షించాల్సిందిగా కోరారని, అప్పటి నుంచే రక్షా బంధన్ లేదా రాఖీ ప్రారంభమైందని అంటారు. అయితే ఈ సంప్రదాయం కొన్న వేల ఏళ్ల కిందటే ఉన్నట్లు హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా వేదకాలంలో దీనికి విశేష ప్రాచుర్యం లభించింది. వేదకాలంలో ఈ పండుగను కేవలం సోదరి, సోదరుల బంధంగానే కాదు, భార్యాభర్తలకు సంబంధించింది కూడా అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి పురాణంలో ఓ కథ ఉంది. రాక్షసులతో యుద్ధానికి బయలుదేరిన దేవలోకాధిపతి ఇంద్రుడికి భార్య సచీదేవి రక్షణగా రాఖీ కట్టింది. అయితే ప్రస్తుతం ఇది భార్యభర్తల నుంచి వైదొలగి కేవలం సోదరి-సోదరుల బంధానికి ప్రతీకగా జరుపుకునే ఉత్సవంగా మారిపోయింది. అలాగే యమధర్మరాజు సోదరి యుమన ప్రతి శ్రావణ పౌర్ణిమకు యుముడికి రాఖీ కట్టేది. తన సోదరితో ఎవరైతో రాఖీ కట్టించుకుంటారో వారికి అమరత్వం సిద్ధిస్తుందని యుముడు ప్రకటించాడు. అప్పటి నుంచి మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి చిరాయువుగా జీవించాలని కోరుకుంటారు. అలాగే సోదరులు కూడా తమ సోదరికి అశీసులు అందించి ప్రేమను చాటుకుంటారు. వాస్తవానికి పసుపులో దారాన్ని ముంచి, దాన్ని మూడు పొరలుగా చేతికి కట్టిన రాఖీ రక్షణగా ఉంటుంది. రాణి కర్ణావతి హుమయూన్‌కు రాఖీ పంపిన రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో మేవార్‌లో రక్షా బంధన్ తొలిసారిగా ప్రారంభమై, తర్వాత రాజస్థాన్ అంతటా వ్యాపించింది. అక్కడ నుంచి దేశమంతటా జరుపుకుంటున్నారు. వేడుకల పరంగా రక్షాబంధన్ కాలంతోపాటు మారుతూ వస్తుంది. రాఖీని సోదరి తన సోదరుడు కుడిచేతికి కట్టాలి. రాఖీలో దారం బంధానికి చిహ్నం. అలాగే మంచి చెడులు, వైఫల్యాల నుంచి సోదరుని ఇది కాపాడుతుంది. ఎరుపు రంగు దారం అగ్నికి ప్రతీక... అంటే ఇది శక్తికి, రక్షణకు, భద్రతకు బలం. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.  చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చఁపవద్దని రోకా్సనా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చఁపకుఁడా విడిచిపెడతాడు. మనదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో రాఖి జరుపుకుంటారు. ఒడిశాలో రాఖీ పండుగను 'గ్రహ్మ పూర్ణిమ' అని పిలుస్తారు. ఆ రోజున వారు దైవాల్లా భావించే ఆవులు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, అలంకరిస్తారు. 'పితా' అని పిలిచే మిఠాయిలు చేసి ఇరుగుపొరుగుకి పంచుతారు.మహారాష్ట్ర, గుజరాత్‌, గోవాలలో ఈ రోజును 'నారియల్‌ పూర్ణిమ' అంటారు. బాగా వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణుడు, సముద్రుణ్ని పూజిస్తారు. జాలరులు ఈ రోజు నుంచే చేపలు పట్టే కాలం ప్రారంభమైనట్టు భావిస్తారు.ఉత్తరాఖండ్‌లోని ప్రజలు 'జనోపున్యు' పేరుతో రాఖీ పండుగను చేసుకుంటారు. తమ పవిత్రమైన జంధ్యాన్ని మారుస్తారు. చంపావత్‌ అనే జిల్లాలో బగ్వాల్‌ పేరుతో పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తారు.మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, బీహార్‌లలో 'కజరి పూర్ణిమ' అని పిలుస్తారు. ఇది రైతులకి, కొడుకులున్న తల్లులకి చాలా ముఖ్యమైన పండగ. గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో 'పవిత్రోపన' పేరుతో పండుగను నిర్వహిస్తారు. ఈ రోజున శివుని గురించి ప్రజలందరూ పూజ చేస్తారు. 

కేసీఆర్ బాటలో యోగీ.. యూపీలో దళిత బంధుకు ప్లాన్

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం, దేశానికే ఆదర్శం అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్,పలు సందర్భాలలో ప్రకటించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి అమలుచేస్తున్న రైతు బంధు, తదితర పథకాలు ఏ విధంగా అయితే, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శమయ్యాయో, అదే విధంగా దళిత బంధు కూడా దేశానికి ఆదర్శం అవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి అన్నట్లుగానే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం చర్చకు వచ్చింది. ఇందుకు సంబంధించి అధికార బీజేపీ  సభ్యుడు సురేష్ కుమార్ త్రిపాఠి లేవనెత్తిన ప్రశ్నకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనూ దళిత బంధు తరహ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.అయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి దళిత ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు ఇచ్చే ప్రస్తావన యోగీ చేయలేదు. ఆయన స్టైల్లో  ఆయన, యూపీ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల విలువైన  దళితుల భూములను అమ్మి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయిస్తే, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, రాష్ట్ర వ్యాప్తంగా భూ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో దళితులు, పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.  ఉత్తర ప్రదేశ్ లో  2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం భూకబ్జాలపై ప్రత్యేక దృష్టిని కేరీకరించింది. ముఖ్యంగా, గత ప్రభుత్వాల హయాంలో  రాజకీయ మాఫియా ముఠాలు కబ్జా చేసిన వేల ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ఇప్పటి వరకు 67,000 ఎకరాల రెవెన్యూ శాఖ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించిందని ముఖ్యమంత్రి యోగీ తెలిపారు. రాజకీయ, భూమాఫియా నుంచి, స్వాధీనం చేసుకున్న ఈ భూముల్లో దళితులు, పేదలకు ఇళ్లు నిర్మించడంతో పాటుగా, క్రీడా మైదానాలకూ ప్రాధాన్యత ఇస్తామని, యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు.  అదలా ఉంటే కేవలుం ఒకే ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రకటించిన ఒక లక్షా 70 వేల  కోట్ల రూపాయల దళిత బందుకు, మరో ఆరేడు నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్ లో దళితులకు కేవలం ఇళ్లు మాత్రమే కట్టించే ఆ రాష్ట్ర దళిత బంధు పథకానికి పోలిక లేదని తెరాస నాయకులు అంటున్నారు. అయితే, భూములు అమ్మి పదిలక్షలు పంచడం, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఇళ్ళ నిర్మాణం చేపట్టడం ఒకటి కాదని బీజేపీ  నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. అంతే కాదు, కబ్జాలకు గురైన భూములను రక్షించలేక అమ్మేస్తున్నామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి , వేల ఎకరాల కబ్జా భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న యూపీ సర్కార్’కి పోలిక పొంతన లేదని బీజేపీ నాయకులు వ్యగ్య అస్త్రాలు సంధిస్తున్నారు. మరి, ప్రజలేమంటారో..

మిత్ర పక్షానికి మమత షాక్.. సోనియా ప్ర‌య‌త్నాలు ఫలించేనా? 

కాంగ్రెస్ పార్టీ తాత్కలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్షాల ఐక్యత కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రెండు రోజుల క్రితం, ఆగష్టు 19 న రాజీవ్ గాంధీ జయంతి రోజున, ఆమె 19 పార్టీల నాయకులతో ఐక్యత సమావేశం నిర్వహించారు.వర్చువల్’గా సమావేశంలో తృణమూల్ సహా 19 పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆమె, మనందరి లక్ష్యం 2024 సార్వత్రిక ఎన్నికలే కావాలని పిలుపు నిచ్చారు. అందుకోసంగా ప్రణాళికగా బద్దంగా పని చేయాలని, అన్నారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్దవ్ థాకరే, స్టాలిన్, ఇంకా మరి కొందరు కీలక నేతలు కూడా  ఈ సమావేశంలో  పాల్గొన్నారు.అందరి లక్ష్యం ఒక్కటే, మోడీని ఓడించడమే కావాలని తీర్మానించారు.   అయితే, ఓవంక విపక్షాల ఐక్యతా ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనే, కూటమి నాయకత్వం కోసం, తృణమూల్ కాంగ్రెస్’ తో  పోటీ పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులు తున్నాయి. కాంగ్రెస్ నాయకులు ఒకరొకరు, పార్టీకి గుడ్ బై చెప్పి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం క్రితం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అంతకు కొద్దిరోజుల ముందు  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా కాంగ్రెస్’ను వదిలి మమతా దీదీ గూటికి చేరారు.తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,  త్రిపుర పీసీసీ అధ్యక్షుడు పీజూష్ కాంతి బిస్వాస్, పీసీసీ అధ్యక్ష పదవికి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన అదే ట్వీట్ ’లో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో సుస్మితా దేవ్’కు సన్నిహితంగా ఉండే పీజూష్, కూడా ఆమె బాటలోనే తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరతారని స్థానిక మీడియాలో వర్గాలు పేర్కొంటున్నాయి. పీజూష్ పార్టీని వదిలి పోవడంతో, ఈశాన్య రాష్టాలలో అసలే అంతంత మాత్రంగా ఉన్న హస్తం పార్టీ మరింతగా కుదేలవుతుందని, విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్ది నెలల క్రితం అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవ సారి ఓడి పోయింది. అలాగే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, లెఫ్ట్ ఫ్రంట్ ‘తో జట్టు కట్టినా ఫలితం లేక పోయింది. కాంగ్రెస్, లెఫ్ట్ కూటమికి కనీసం ఒక్క సీటు  కూడా రాలేదు. నిజానికి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కూడా,ఈశాన్య రాష్ట్రాలలో కమల దళానికి ఉనికే లేదు.కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్, తృణమూల్  పార్టీలదే పై చేయిగా ఉంది. అయితే, కాంగ్రెస్ ను ఓడించి అస్సాంలో, సీపీఎం గద్దె దించి త్రిపురలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మెల్లమెల్లగా ఈశాన్య బారత దేశంలో గట్టిగానే జెండా పాటింది. అస్సాం, త్రిపురతో సహా వచ్చే సంవత్సరం (2022) ఎన్నికలు జరిగే మణిపూర్’లోనూ ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. మరో వంక, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉనికిని కోల్పోయిన్ నేపధ్యంలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి ప్రత్యాన్మాయ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ దూసుకోస్తోంది. అందుకే కాంగ్రెస్ నాయకులు ఒకరొకరు తృణమూల్ గూటికి చేరుతున్నారని రాజేకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నాయకులూ క్యూ కట్టి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జాతీయ స్థాయిలో జరుగతున్న విపక్షాల ఐక్యతా యత్నాలఫై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది, ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 JNTU గెస్ట్ హౌస్ లో ఫస్ట్ నైట్! ఏపీలో మరో దారుణం..

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణ ఘటన జరిగింది. చదువుల తల్లి సరస్వతీ దేవి నిలయమైన విశ్వవిద్యాలయాన్ని అపవిత్రంగా మార్చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ JNTU యూనివర్శిటీ  గెస్ట్ హౌస్ ను ఓ ప్రొఫెసర్ హనీమూన్ సెంటర్ గా మార్చేశారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర కలకలం రేపుతోంది.  కాకినాడలోని JNTU గెస్ట్ హౌస్ లో నవ దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. మొత్తం మూడు గదులు బుక్ చేయగా.. ఒక గదిలో శోభనం ఏర్పాటు చేశారు. మిగిలిన రెండు గదుల్లో పెళ్లి వేడుకలు జరిపినట్లు సమాచారం. వర్సిటీకి చెందిన మహిళా ప్రొఫెసర్ పేరుతో గదులు బుక్ చేశారు. ఆగస్టు 18న ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.స్వర్ణ కుమారి గెస్ట్ హౌస్ లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. అందులో 201 గదిలో ఆగస్టు 18వ తేదీ రాత్రి నవ దంపతులకు అట్టహాసంగా శోభనానికి ఏర్పాట్లు చేశారు.సాధారణంగా ప్రైవేటు కార్యక్రమాలకు యూనివర్శిటీలో అనుమతి ఇవ్వరు. అయితే నిబంధనలకు అతిక్రమిస్తూ.. శోభనానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్ర సపరివార సమేతంగా హజరయ్యారు.  నిబంధనలకు విరుధ్దంగా యూనివర్సిటీ యాజమాన్యం గెస్ట్‌హౌస్‌లో శోభనానికి అనుతివ్వటంతో ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రఖ్యాతిగాంచిన జె ఎన్ టి యు యూనివర్సిటీని అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించడం పట్ల పలు ఉద్యోగ,విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నాయి.  

ఏపీలో టీడీపీదే అధికారం.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై తేల్చేసిన మ‌రో సర్వే..

2019లో ఏపీలో వార్ వ‌న్‌సైడ్‌. టీడీపీకి దిమ్మ‌తిరిగేలా 151 స్థానాల‌తో ఘ‌న విజ‌యం సాధించింది వైసీపీ. ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జ‌గ‌న‌న్న‌ను న‌మ్మి జ‌నం గెలిపించారు. ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. కొత్త మురిపం పోయింది. మ‌రి, జ‌గ‌న‌న్న‌కు సెకండ్ ఛాన్స్ ఇస్తారా? జ‌గ‌న్ పాల‌న‌పై జ‌నం సంతృప్తిగా ఉన్నారా? మ‌రోసారి గెలిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇలా ఆస‌క్తిక‌ర స‌ర్వే ఒక‌టి జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన ఇండియా టుడే-- మూడ్ ఆఫ్ ది నేష‌న్ పోల్‌లో సీఎం జ‌గ‌న్ ర్యాంక్ 11కి ప‌డిపోగా.. కేవ‌లం 6 అంటే 6 శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అన్నారంటే ఆయ‌న గ్రాఫ్ ఏ రేంజ్‌లో ప‌త‌న‌మైందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆ క‌ల‌వ‌రింత నుంచి కోలుకోక‌ముందే.. లోక‌ల్ యాప్ స‌ర్వే మ‌రింత షాకింగ్ రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించింది. ఆ స‌ర్వేలో జ‌గ‌న‌న్న గెలుపు అంచున వేలాడి.. ఓట‌మి వైపు జారిపోయారు. వైసీపీతో టీడీపీ హోరాహోరీ పోరాడి.. ఒక్క‌టంటే ఒక్క శాతం ఓటింగ్‌తో విజ‌యం కైవ‌సం చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆనాడు జ‌గ‌న్ ఒక్క ఛాన్స్‌తో గ‌ట్టెక్కితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అవుతార‌ని లోక‌ల్ స‌ర్వే తేల్చి చెప్పింది.  రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రశ్నకు టీడీపీకే ఎక్కువ ఓట్లు వేశారు ఏపీ జనాలు. టీడీపీ అధికారంలోకి వస్తుందని 44 శాతం మంది చెప్పగా..  వైసీపీ అధికారంలోకి వస్తుందని 43 శాతం మంది భావించారు లోక‌ల్ యాప్ యూజ‌ర్లు. ఇక‌, బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తుందని 13.05 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 51 శాతానికి పైగా ఓట్లు రాగా టీడీపీ 37 శాతం ఓట్లు వచ్చాయి. అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీకి 14 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. అయితే రెండేళ్లలోనే సీన్ మారిపోయింది. 14 శాతం ఓట్లతో వెనకబడిన టీడీపీకి.. తాజా సర్వేలో లీడ్ రావడం షాకింగ్ గా మారింది. రానున్న రోజుల్లో వైసీపీ ఓట్ల శాతం  మరింతగా తగ్గవచ్చని సర్వే నిర్వహించిన ప్రతినిధులు అంచనా వేశారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నది లోకల్ యాప్ సర్వే ద్వారా స్పష్టమవుతోంది. ఇటీవ‌లి ఇండియా టుడే స‌ర్వేలో సైతం కేవ‌లం 6శాతం మంది మాత్ర‌మే జ‌గ‌న్ బెస్ట్ సీఎం అని చెప్ప‌డం.. ప్ర‌జ‌ల్లో దారుణంగా ప‌డిపోయిన జ‌గ‌న్ ప‌ర‌ప‌తికి నిద‌ర్శ‌నం.  ఏపీలో ఏ ఒక్క‌రిని క‌దిలించినా అప్పుల‌పైనే చ‌ర్చ‌. మ‌ద్య‌పాన నిషేధం ఏమైంద‌ని ప్ర‌శ్న‌. ఉచిత ఇసుక ఎక్క‌డికి పోయిందంటూ నిల‌దీత‌. క‌రోనా క‌ట్ట‌డిలో ఎందుకు విఫ‌ల‌మ‌య్యార‌ని మండిపాటు. ఒక‌టో తారీఖు జీతాలు ఏవంటూ ఉద్యోగుల క‌డుపుమంట‌. ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ఆల‌యాలు, ద‌ళితులు, మ‌హిళ‌ల‌పై దాడులేంటంటూ ఆగ్ర‌హం. తిట్లు, కేసులు, అరెస్టుల‌పై అస‌హ్యం. కొవిడ్ టైమ్‌లో ప‌రీక్ష‌లు, పాఠ‌శాల‌లపై ఆక్రోషం. ఇలా, సీఎం జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌పై ఏ ఒక్క వ‌ర్గం కూడా సంతృప్తిగా లేద‌రే విష‌యం ఇండియా టుడే, లోక‌ల్ యాప్ స‌ర్వేల‌తో తేలిపోయింది. వ‌చ్చే అసెంబ్లీలో జ‌గ‌న్‌కు గ‌ట్టి బుద్ధి చెప్ప‌నున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఒక్క ఛాన్స్ అంటే అమ‌రావ‌తిని న‌ట్టేట ముంచి.. ప్ర‌జ‌ల‌ను ఆగ‌మాగం చేస్తున్న జ‌గ‌న్ పాల‌న‌పై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ వ్య‌తిరేక‌తే ఇలా స‌ర్వేల రూపంలో బ‌య‌టికొస్తోంది.  అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు పాల‌న‌ను, జ‌గ‌న్ ఆగ‌డాల‌ను పోల్చి చూసుకుంటున్నారు ప్ర‌జ‌లు. చంద్ర‌బాబు హ‌యాంలో అంత‌ర్జాతీయ కంపెనీలు ఏపీకి క్యూ క‌డితే.. జ‌గ‌న్ ఏలుబ‌డిలో కొత్త ప‌రిశ్ర‌మ‌లు కాదుక‌దా, ఉన్న ప‌రిశ్ర‌మ‌లే పారిపోయే ప‌రిస్థితి దాపురించింద‌ని మండిప‌డుతున్నారు. జాబ్ లెస్ క్యాలెండ‌ర్‌పైనా నిరుద్యోగులు క‌డుపుమంట‌తో ర‌గిలిపోతున్నారు. సంక్షేమం పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని సంక్షోభంలోకి నెట్టేసిన జ‌గ‌న్ పాల‌న‌పై పెద‌వి విరుస్తున్నారు. అందుకే, మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తే.. టీడీపీకే ఓటు వేస్తామ‌ని.. చంద్ర‌బాబునే సీఎం చేస్తామ‌ని.. స‌ర్వేల్లో తేల్చి చెబుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు. జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్స్ మాత్ర‌మే ఇచ్చామ‌ని.. మ‌రో ఛాన్స్ ఇచ్చే స‌మ‌స్యే లేద‌ని స‌ర్వేలతో స్ప‌ష్టం చేస్తున్నారు. ఇండియా టుడే.. లోక‌ల్ యాప్‌.. వ‌రుస‌ స‌ర్వేల‌ ఫ‌లితాలు టీడీపీలో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. తెలుగు త‌మ్ముళ్ల‌లో స‌రికొత్త‌ జోష్ క‌న‌బ‌డుతోంది. అదే స‌మ‌యంలో వైసీపీలో ఆందోళ‌న‌, తాడేప‌ల్లి ప్యాలెస్‌లో క‌ల‌క‌లం చెల‌రేగుతోంది.

కొంప ముంచిన బుల్లెట్ సాంగ్.. ఉద్యోగం ఊస్టింగ్? 

బుల్లెట్ బండెక్కి వచ్చేస్తప.. అందాల దునియానే చూపిస్తపా..  ఈ సాంగ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మంచిర్యాలకు చెందిన పెళ్లికూతూరు చేసిన ఈ డ్యాన్స్ వైరల్ గా మారింది. మంచిర్యాల జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి అనే నవవధువు పెళ్లి అనంతరం భర్తను సర్‌ప్రైజ్ చేసేందుకు బరాత్‌లో ‘బుల్లెట్టు బండి’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారడం.. సాయి దంపతులకు ఫుల్‌ క్రేజ్‌ రావడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. ఇంతటి క్రేజ్‌ సొంతం చేసుకున్న ‘బుల్లెట్టు బండి’ పాట ఇప్పుడు మరొకరి కొంప ముంచింది. ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పి హెచ్ సి లో బుల్లెట్ బండి పాట పై ఆస్పత్రి ప్రాంగణం లో ఓ నర్సు నృత్యం చేసింది. నవ వధులు చేసినట్లుగానే పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసింది. హాస్పిటల్ లోని మిగితా సిబ్బంది అంతా కూర్చుని ఉండగా.. వాళ్ల మధ్యలో నర్సు బుల్లెట్ బండి సాంగ్ కు స్టెప్పులు వేసింది. ఆమె డ్యాన్స్ చేస్తుండగా మిగితా సిబ్బంది అంతా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. నర్సు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్యూటీలోనే నర్సు నృత్యాలు చేయడం వివాదంగా మారింది నర్సు డాన్స్ కు నెటిజన్లు ప్రశంసలు ఇవ్వగా.. మరికొందరు ఆస్పత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శలు చేశారు. దీంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్  సీరియస్ గా స్పందించారు. విచారణకు ఆదేశించారు.కలెక్టర్ ఆదేశాలతో డ్యాన్సు చేసిన నర్సుకు జిల్లా వైద్యాధికారి సుమన్ రావు మెమో జారీ చేశారు. ఆస్పత్రికి వెళ్లి ఆయన విచారణ జరిపారు. విచారణ తర్వాత చర్యలు ఉంటాయని తెలిపారు. దీంతో ఆ నర్సు కొలువుకు గండం వచ్చిందనే అనుకుంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాను షేక్ చేసిన బుల్లెడ్ బండి సాంగ్ క్రేజీ ఓ ఉద్యోగి పొట్ట కొట్టేదిగా మారిందనే చర్చ సాగుతోంది. 

5 లక్షలు కాదు కోటి రూపాయలు ఇవ్వాలి! వివేకా కేసులో జగన్ కు రఘురామ ట్విస్ట్.. 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా దూకుడు పెంచిన సీబీఐ అధికారులు.. అనుమానితులందరిని ప్రశ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరిని శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను పలుమార్లు ప్రశ్నించారు.  తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ప్రకటన చేసింది. వివేకా హత్యపై నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు తెలిపింది. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ చేసిన ప్రకటనపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో సీబీఐ ప్రకటన ఇచ్చిందని, నిజాలు తెలిపిన వారికి రూ.5 లక్షలు అంటున్నారని చెప్పారు, ఆ లెక్కన సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి సీఎం జగన్ కోటి రూపాయల బహుమానం ఇవ్వాలని అన్నారు. "ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే వెంటనే పట్టుకుంటున్నారు. మరి వివేకా హత్యకేసులో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు?" అని రఘురామ ప్రశ్నించారు. ఈ కేసులో ఉన్న శ్రీనివాసరెడ్డి గతంలోనే హత్యకు గురయ్యాడని వెల్లడించారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని తెలిపారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నట్టు రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసినవారు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరుతూ సీబీఐ  శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. నమ్మకమైన, కచ్చితమైన, నమ్మదగిన సమాచారం కలిగిన వారు  డిఎస్పీ దీపక్ గౌర్ (011-24368646, 9474256974), ఎస్పీ రామ్‌సింగ్ (011-24368649, 9988272709) లను కార్యాలయంలో కానీ, ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది.