ఆకలి చావుల తరఫున.. షర్మిల ఆర్బాటపు దీక్షలా?
posted on Jul 29, 2021 @ 6:48PM
వాళ్లు ఆకలితో అలమటించారు. వాళ్లు ఉద్యోగం కోసం ఏళ్ల పాటు ఎదురుచూశారు. కష్టాలు పెరుగుతున్నాయి. కన్నీళ్లు ఇంకుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మాత్రం రావటం లేదు. నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఆకలి చావులే మిగిలాయి. ఇక తమ వళ్ల కాదంటూ.. ఇక సెలవంటూ పలువులు విద్యావంతులు ప్రాణాలు వదులుతూ తెలంగాణ తల్లికి కడుపుకోత కలిగిస్తున్నారు.
బంగారు తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పోరుబాట పట్టారు. నిరుద్యోగ సమస్యలపై నిరసన తెలుపుతున్నారు. ప్రతీ మంగళవారం దీక్షకు దిగుతున్నారు. ఒక్కో వారం ఒక్కో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. వారిని ఓదారుస్తున్నారు. అక్కడే ఒక్కరోజు దీక్ష చేపట్టి సర్కారుకు నిరసన జ్వాల తాకేలా చేస్తున్నారు. కొన్ని వారాలుగా సాగుతోంది షర్మిల నిరుద్యోగ దీక్ష.
ఇంత వరకూ బాగానే ఉంది. ఆయా కుటుంబాలను పరామర్శించడం.. ఓదార్చడం వరకూ ఓకే. కానీ, ఆమె దీక్ష చేస్తున్న విధానమే అదోలా ఉందంటున్నారు. శిథిలమైన ఇండ్లు.. చితికిన బతుకులు.. ఆకలి మంటలు వాళ్ల ఆత్మహత్యలకు కారణమైతే.. షర్మిల వాళ్ల ఇళ్ల దగ్గరే లగ్జరీగా దీక్షలు చేస్తుండటాన్ని తప్పుబడుతున్నారు కొందరు. అట్టహాసంగా దీక్షా శిబిరం వేసుకొని.. మందీమార్బలం పోగేసుకొని.. బాడీగార్డులను వెంటేసుకొని.. అదేదో ప్రైవేట్ ఈవెంట్‌లా.. క్లాస్‌గా, కాస్ట్‌లీగా దీక్షలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షర్మిల దీక్షలపై సోషల్ మీడియాలో మరింత కామెంట్లు వినిపిస్తున్నాయి. దీక్ష అంటే ఏదో ఒక టెంటు వేసుకొని.. కింద ఓ కార్పెట్ పరుచుకొని.. సింపుల్‌గా దీక్ష కానిచ్చేస్తుంటారు. ఇన్నాళ్లూ తెలంగాణ ప్రజలు అలాంటి దీక్షలే చూశారు. వాటికే అలవాటుపడ్డారు. కానీ, షర్మిల రాకతో దీక్షల్లోనూ రిచ్‌నెస్ చూపించవచ్చని అనిపిస్తోందని అంటున్నారు. ఎన్ని లక్షలు పెట్టి కొన్నారో.. అత్యంత మందంగా ఉండే స్పింగ్ కాయిల్ పరుపుపై మేడమ్ ఆసీనులవుతున్నారు. ఆ పరుపు మధ్యలో దిండ్లతో మరో సింహాసనం లాంటి సెటప్. రెండు చేతులు ఆనించేందుకు రౌండ్ పిల్లోస్.. వెనక్కి ఒరిగేందుకు నాలుగైదు మెత్తని దిండ్లు.. చిక్కని నీడ.. చక్కని గాలివీచే ఏర్పాట్లతో.. లగ్జరీగా దీక్షాశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విలాసవంతమైన సెటప్‌ను.. ఆ గ్రామస్తులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఇంత కులాసవంతమైన దీక్షావేదికపై దొరసానిలా కూర్చొని.. కేసీఆర్ దొరతనం గురించి ప్రశ్నిస్తే.. ప్రజలు రిసీవ్ చేసుకుంటారా?
ఇదంతా అన్న జగనన్న నుంచి కాపీ కొట్టిన స్టైల్. కొల్లగొట్టిన వేల కోట్ల అవినీతి సొమ్ముతో.. ప్రతిపక్ష నేతగా జగన్ సైతం ఇలాంటి ఖరీదైన దీక్షలే చేసేవారని గుర్తు చేస్తున్నారు. అట్టహాసంగా దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి.. డబ్బులిచ్చి జనాలను తరలించి.. జెండాలతో, మైకులతో హోరెత్తించేవారని అంటారు. అచ్చం.. అన్న అడుగుజాడల్లో నడుస్తూ.. చెల్లెమ్మ షర్మిలమ్మ కూడా అలాంటి లగ్జరీ దీక్షలే చేస్తున్నారని అంటున్నారు. అయితే.. అది ఆంధ్ర. అక్కడ అలాంటివి ఆమోదిస్తారేమో కానీ.. పేదరికం ఆనవాళ్లు అధికంగా ఉండే తెలంగాణలో ఇలాంటి ఫోజులు కొడితే షర్మిల రాజకీయ సినిమా సరిగ్గా ఆడకపోవచ్చు. దీక్షలు అట్టర్‌ఫ్లాప్ అయ్యే అవకాశమూ ఉంది. తెలంగాణ కోడలినని వాదిస్తే సరిపోదు.. ముందు తెలంగాణ మట్టి వాసన గ్రహించాలని.. చెమట పట్టిన బతుకులను అర్థం చేసుకోవాలని.. కొత్తగా వచ్చిన పాత కోడలికి సూచిస్తున్నారు అసలైన తెలంగాణవాదులు. ఇందిరాపార్కు దగ్గర ఉన్న దీక్షా స్థల్‌ని ఆదర్శంగా తీసుకొని.. లోటస్ పాండ్ పోకడలను పక్కన పెట్టాలని అంటున్నారు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజలతో కలిసిపోయేలా దీక్షలు చేస్తేనే వర్కవుట్ అవుతుందని.. లేదంటే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదని హితవు పలుకుతున్నారు