సీఎం మేడమ్ పిచ్చ క్లాస్! విజయసాయికి ఫుల్ షంటింగ్స్! అసలేం జరిగిందంటే..
posted on Jul 14, 2021 @ 4:42PM
ఇంట్లోకి రానిస్తే ఇల్లంతా నాదేనన్నాడట. మనోడని చంకనెక్కించుకుంటే.. ఏకంగా నెత్తినెక్కి తైతక్కలాడుతున్నాడట. విశాఖను సెట్ చేయమని పంపిస్తే.. విశాఖ అంతా తనదేనంటున్నాడట విజయసాయి. ఉత్తరాంధ్రకు సామంత రాజులా విర్రవీగుతూ.. విజయసాయి చేస్తున్న ఓవరాక్షన్ మామూలుగా లేదంటున్నారు. అన్నిట్లోనూ వేలు, కాలు, ఏది పడితే అది పెడుతూ.. విశాఖ కేంద్రంగా రచ్చ రంబోలా చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఏదో జైల్లో సహచరుడని ఓ ఛాన్స్ ఇస్తే.. తనకే ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నాడని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కన్నెర జేశారని తెలుస్తోంది.
చెప్పాపెట్టకుండా.. విజయసాయి చెత్త పనులన్నీ చేస్తుండటం.. ఉత్తరాంధ్రకు తానే ముఖ్యమంత్రినన్నట్టు బరితెగిస్తుండటాన్ని.. జగన్‌రెడ్డి సైతం సహించలేకపోతున్నారని అంటున్నారు. వరుసగా జరుగుతున్న కొన్ని ఘటనలు.. తాడేపల్లికి చేరిన అనేక ఫిర్యాదులతో.. ఈసారి ఏకంగా సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డినే స్వయంగా రంగంలోకి దిగారట. విజయసాయిని చెడామడా వాయించిపెట్టారట. మాటలతో తోలువలిచేశారట. కొవ్వు మొత్తం కరిగించేశారట. తోక కట్ చేసేశారట. ఇంకోసారి హద్దు దాటితేనా.. అంటూ విజయసాయిరెడ్డి భరతం పట్టారట భారతమ్మ.
ఇంతకీ విశాఖలో అంతలా ఏం జరిగింది? విజయసాయి చేస్తున్న ఓవరాక్షన్ ఏంటి? నేరుగా భారతిరెడ్డినే ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే చాలానే ఇంట్రెస్టింగ్ పరిణామాలు జరిగాయని తెలుస్తోంది. ఆ మేరకు విశాఖ, తాడేపల్లి వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి ఆసక్తికర సమాచారం అందుతోంది. కీలక హోదాలో ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన నేత.. ఏదో పని మీద విశాఖ జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేశారట. కాస్త ఆ పని చేసిపెట్టమని అడిగారట. అందుకు అ అధికారి నుంచి వచ్చిన రిప్లై విని.. ఆయనకు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయిందని అంటున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డిని అడిగి చెప్పానంటూ విశాఖ ఉన్నతాధికారి సెలవియ్యడంతో సదరు కీలక హోదాలోని నేతకు చిర్రెత్తుకొచ్చిందని చెబుతున్నారు. తానే స్వయంగా ఫోన్ చేసి పని చేయమని చెబితే.. తన ఆదేశాలను పాటించకుండా.. ఓ ఎంపీ అయిన విజయసాయిని అడిగి చెప్తానని అనడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఉండు మీ సంగతి చెప్తానంటూ ఫోన్ పెట్టేసి.. సీఎం జగన్‌కు ఘాటుగా లేఖ రాశారని తెలుస్తోంది. అందులో, విశాఖ కేంద్రంగా విజయసాయి చేస్తున్న అరాచకాల బండారమంతా బయటపెట్టారని అంటున్నారు.
విశాఖపట్నంను విజయసాయిపట్నంగా మార్చేసిన తీరు.. జగన్‌నే లెక్క చేయకుండా.. సొంతంగా తన ఇమేజ్‌ను పెంచుకుంటున్న వైనాన్ని లేఖలో వివరించారట. ఆయన బర్త్‌డే రోజున.. విశాఖ మొత్తం విజయసాయి ఫోటోలతో, ఫ్లెక్సీలతో నింపేసి.. విశాఖకు నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు జగన్ ప్రాధాన్యతను తగ్గించేస్తున్న తీరును సవివరంగా లేఖలో ప్రస్తావించారట. ఇలాంటి పైపైన విషయాలే కాకుండా.. తెరవెనుక విజయసాయి చేస్తున్న చీకటి కుట్రలను సైతం పూసగుచ్చినట్టు లేఖలో రాసి.. తాడేపల్లి ప్యాలెస్‌కు పోస్ట్ చేశారని చెబుతున్నారు. కీలక హోదాలో ఉన్న వ్యక్తే ఇంతటి ఆరోపణలు చేయడం.. అప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అనేక నివేదికలు రావడం.. పార్టీ వర్గాల నుంచి కూడా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు రావడంతో.. ఇక విజయసాయి తోక కట్ చేయాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ డిసైడ్ అయిపోయారట. విషయం తెలిసిన వైఎస్ భారతిరెడ్డి.. విజయసాయిపై ఝలిపించాల్సిన కొరడాను జగన్ నుంచి తన చేతిలోకి తీసుకున్నారట.
ఇక భారతమ్మ కోపం మామూలుగా లేదట. విజయసాయితో సిట్టింగ్ పెట్టి శివాలెత్తిపోయారట. నాన్‌స్టాప్‌గా క్లాస్ పీకారని అంటున్నారు. విశాఖ కేంద్రంగా విజయసాయి చేస్తున్న నేరాలు-ఘోరాలు తమకంతా తెలుసని.. కబ్జాల జాబితంతా ఎప్పటికప్పుడు తమ టేబుల్ మీదకు వస్తోందని హెచ్చరించారట. పార్టీ నాయకులతో విభేదాలు.. మిగతా నేతలను తొక్కేసే ప్రయత్నాలు.. పార్టీతో పాటు పాలనా వ్యవహారాల్లో విపరీత జోక్యం.. జగన్ ఇమేజ్‌ను భ్రష్టు పట్టించే కార్యక్రమాలు.. ఇలా అన్నిటిపైనా విజయసాయిని గట్టిగా నిలదీశారట భారతిరెడ్డి. విజయసాయి ఎప్పుడెప్పుడు.. ఏ హోటల్‌లో.. ఎవరెవరిని కలిశారో.. ఏం మాట్లాడారో.. ఎలాంటి కుట్రలు చేశారో.. అన్నీ బయటపెట్టడంతో.. విజయసాయికి గొంతు తడారిపోయిందట. మేడమ్.. మేడమ్.. అనడం మినహా.. విజయసాయికి సౌండ్ లేదట.
ఇటీవలే జరిగిన ఈ పరిణామంపై ఇప్పుడిప్పుడే సమాచారం బయటకు వస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఇప్పుడితే హాట్ టాపిక్‌గా మారింది. భారతిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో సాయిరెడ్డికి దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయిందని అంటున్నారు. ఈ విషయం బయటకు చెప్పుకోలేక.. అలాగని ఏమీ జరగనట్టు మామూలుగా ఉన్నట్టు నటించలేక.. విజయసాయి తనలో తాను తెగ ఇదైపోతున్నారని ఆయన సన్నిహితుల మాట. పైస్థాయి వర్గాలకు మాత్రమే తెలిసిన ఈ అంతరంగిక సమాచారం.. ఇప్పుడిప్పుడే నాలుగు గోడలు దాటి బయటకు వస్తోంది. సీఎం గారి మేడమ్.. సీఎంలా బిల్డప్ కొడుతున్న విజయసాయి భరతం పట్టిన తీరుపై గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ నెత్తినెక్కించుకుంటే ఓవరాక్షన్ చేస్తున్న విజయసాయికి మంచిగైందంటూ.. బాగానే క్లాస్ పీకారంటూ.. పార్టీ నేతలు కొందరు పండగ చేసుకుంటున్నారు. మేడమ్ పిచ్చ క్లాస్ పీకాకైనా.. విజయసాయి దారికోస్తారా? లేక, ఎప్పటిలానే డోంట్‌కేర్ అంటారా? అన్నీమూసుకొని పడుంటారా? లేక, అవకాశం కోసం ఎదురుచూస్తారా? లేదా... తనదారి తాను చూసుకుంటారా? చూడాలి.. ఏం జరుగుతుందో.