పురందేరేశ్వరిపై ఆశలు పెంచుకుంటున్న తూర్పుగోదావరి?
posted on Oct 29, 2012 @ 3:30PM
ఎన్నో ఏళ్ల కల ఇప్పుడు నెరవేరుతుందని తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా పురందరేశ్వరి తాజాగా బాధ్యతలు చేపట్టడంతో ఆమె తమ జిల్లాకు సహకరిస్తుందని పలువురు ఇప్పటికే తమ ఆశను వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా విశాఖ వరకూ పారిశ్రామికకారిడార్ కలను ఆమె నెరవేర్చగలరని నమ్ముతున్నారు. విశాఖ పార్లమెంటేరియన్‌గా ఉన్న ఆమెకు అనుకోకుండా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో దక్కిన అవకాశం ఉపయోగించుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమల కోసం ఈ రెండు జిల్లాల్లో భూములను సేకరించినా అవి ప్రారంభం కాలేదు. వీటి విషయం ఆమె ఒకసారి ఆలోచించి ఔత్సాహికపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటం ద్వారా కొత్తగా పారిశ్రామికకరణ ఊపందుకోగలదని కాంగ్రెస్ నాయకులు విశ్లేషిస్తున్నారు. అలానే పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి కూడా ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్థికి తొలిప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన జన్మస్థలానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ తరువాత తనకు ఆదరణ ఎక్కువ ఉండే తూర్పుగోదావరి జిల్లాకు పూర్తిస్థాయి సహకారమందిస్తారని పీఆర్పీనేతలు వెల్లడిస్తున్నారు. అలా కనుక చిరంజీవి చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు జిల్లాల్లో మంచి ఆదరణ లభిస్తుందని కూడా భావిస్తున్నారు.