పాండిచేరీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మల్లాడి
posted on Oct 17, 2012 9:23AM
పాండిచేరీ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామాను పాండిఅసెంబ్లీ స్పీకర్ ఆమోదించలేదు. రెండువారాలవుతున్నా ఈ రాజీనామా గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. అసలే యానాంలో చిన్న సమస్య మిగిలి ఉన్నా వదలకుండా పోరాడేతత్వం ఉన్న కృష్ణారావు రాజీనామా ఆమోదిస్తే తమ రాష్ట్ర ప్రభుత్వ మనుగడకే పెద్ద సవాల్ తలెత్తగలదని స్పీకర్ భావిస్తున్నారు. అందుకే ఆయన రాజీనామా లేఖను చదివినా పక్కనపెట్టేశారు. అయితే యానాంకు సంబంధించిన ఆ ఎనిమిది డిమాండ్ల గురించి మాత్రం అసెంబ్లీలో చర్చిస్తున్నారు. ఆ డిమాండ్లను ఆమోదించి ఆ లేఖను వెనక్కి పంపించేందుకు స్పీకర్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. అందుకే ఆయన ఎమ్మెల్యే మల్లాడితో టచ్‌లో ఉన్నారట. అంతేకాకుండా మధ్యంతరంగా రాజీనామా చేయటం వల్ల పాలన కుంటుపడుతుందని, తాము సమస్యలు పరిష్కరించేందుకు సహకరించాలని స్పీకర్ కోరుతున్నారట. ఏమైనా సమస్యలు పరిష్కారం కోసమే తాను రాజీనామా చేశానని, వాటిని పరిష్కరిస్తే తాను ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఎటువంటి అభ్యంతరమూ ఉండబోదని కృష్ణారావు కూడా స్పష్టం చేశారట. దీంతో వాటిపై కసరత్తులు చేస్తున్నారు. రాజకీయంగా యానాం వంటి చిన్న ప్రాంతాల్లో అభివృద్ధి రాష్ట్రానికే ఆదర్శంగా ఉంటుందని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వాసులు తనను మంచినాయకునిగా ఆదరిస్తున్నారని మల్లాడి ఈసందర్భంగా స్పీకర్‌కు తెలిపారు. దీంతో స్పీకర్ కూడా రాజీనామా లేఖను సమస్యలు పరిష్కరించాక తిప్పిపంపుతామని మల్లాడికి తెలియజేశారు. ప్రతీచిన్న సమస్యను క్షుణ్ణంగా పరిశీలించే మల్లాడి కూడా స్పీకర్ ప్రతిపాదనకు అంగీకరించారు. 30ఏళ్ల మల్లాడి రాజకీయజీవితంలో యానాం అభివృద్ధి ముడిపడి ఉందని పాండిఅసెంబ్లీ గుర్తించినందుకు అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.