ఈరోజు శ్రీలంక మరి రేపు ..?!
posted on Jul 11, 2022 @ 11:32AM
ఇప్పుడు శ్రీలంకలో ఏమి జరుగుతోంది? ప్రజాగ్రహం వెల్లువెత్తి, అరాచకం విలయతాడవం చేస్తోంది. ప్రజలు రాష్టపతి భవనాన్ని ముట్టడించారు. రాష్ట్రపతి గొటబయ రాజపక్స దేశం వదిలి పారిపోయారు. ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె రాజీనామా చేశారు. అజ్ఞాతంలో ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు. ప్రధాన మంత్రి అధికార నివాసానికి ప్రజలు నిప్పు పెట్టారు.ఇంతకూ మించిన విధ్వసం, అరాచకం మరెక్కడా ఉందదేమో అనే విధంగా లంకలో పరిస్థితులు దిజారి పోయాయి.
దీనికంతటికీ కారణం, ఆర్థిక సంక్షోభం. ఆర్థిక సంక్షోభానికి కారణం పాలకుల అనాలోచిత నిర్ణయాలు. సంక్షేమం పేరిట, అప్పులు చేసి మరీ జనాకర్షక పథకాలను అమలు చేయడం వలన, ఆర్థిక క్రమశిక్షణ పట్టాలు తప్పింది. దేశం అప్పుల ఉబిలో కూరుకు పోయింది. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది. ప్రజలు తిరగబడ్డారు. దేశం ప్రమాదంలో పడింది. ప్రభుత్వం పలాయనం చిత్తగించింది.ఈ పరిణామాలు శ్రీలంక సంక్షోభాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. శ్రీలంక పరిణామాల నేపధ్యంలో, సహజంగానే మన దేశం పరిస్థితి ఏమిటి? అనే, ప్రశ్న చర్చకు వచ్చింది.
నిజానికి, శ్రీలంక ఆర్ధిక వ్యవస్థ కంటే, మన దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉందని నమ్మే రాజకీయ ప్రముఖులే కాదు, ఆర్థిక రంగ నిపుణులు కూడా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయితే, ఒకటికి పదిసార్లు శ్రీలంక ఆర్థిక ప్రగతిని, శ్రీలంక పాలకుల ముందు చూపును మెచ్చుకున్నారు. తెలంగాణనే కాదు, మొత్తం దేశాన్నే శ్రీలంక దిశగా తీసుకుపోయేందుకు నడుం బిగించారు. భారత దేశం దశ, దిశ మార్చేస్తానని శపథం కుడా చేశారు. కేంద్ర ప్రభుతాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆర్థిక విధానలను విమర్శించే క్రమంలో సంతోష సూచీ, స్థూల జాతీయ ఉత్పతి, ఆకలి సూచి, ఆర్థిక అభివృద్ది సూచి ఇలా అనేక, సూచీలలో శ్రీలంక భారతదేశం కంటే చాలా ముందుందని అనేక సందర్భాలలో మీడియా సమావేశాల్లో పేర్కొన్నారు. మన దేశానికి శ్రీ లంక ఆదర్శం కావాలనే ఆకాంక్ష కూడా వ్యక్త పరిచారు. ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల చేత కాని తనం వలన ఈ పరిస్థితి వచ్చిందని, అందుకే జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అఫ్కోర్స్ తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో శ్రీలంగ విషయాన్ని ఆ కోణంలో ప్రస్తావించలేదనుకోండి అది వేరే విషయం.
అయితే, అదలా ఉంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ వంటి నాయకులు ఏమి మాట్లాడినా అది అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. నిజానికి, ప్రజలు కూడా పట్టించికోవడం లేదు, కానీ, కౌశిక్ బసు వంటి పేరొందిన ఆర్థిక వేత్తలు సూచీలను చూపించి సూచీల అదారంగా చేసిన ఆర్థిక విశ్లేషణలు ఇప్పుడు ప్రశ్నార్ధకం అవుతున్నాయి. ఆర్థిక నిపుణులు కూడా, రాజకీయ వేత్తల స్థాయికి దిగ జారుతున్నారా, అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
నిజానికి, కౌశిక్ బసు మాములు చిన్నా చితకా ఆర్థిక వేత్త కాదు. 2012 నుండి 2016 వరకు ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్ గా పనిచేశారు. అలాగే, 2009–2012 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలందించారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. అయితే, ఆయన ప్రపంచ బ్యాంక్ వివిధ దేశాలకు వివిధ ప్రామాణికాల ఆధారంగా ఇచ్చే గ్రేడింగ్ విషయంలో ఆయన, ముఖ్యమంగా భారత దేశం విషయంగా తమ రాజకీయ దృక్పథాన్ని, బయట పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి.
అంతటి విలువైన ఆర్థిక వేత్త, ఎప్పుడో కాదు, కొద్ది నెలల క్రితమే, శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా వుందని కితాబు నిచ్చారు. లంక చిన్నదేశమే అయినా ఆ దేశం హ్యాపీనెస్ ఇండెక్స్ ( సంతోష సూచి) భారతక దేశం కేంటే ముందుందని, సంతోషం వ్యక్త పరిచారు. అలాగే ఆకలి సూచి, స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదలలో కూడా శ్రీలంక భారత దేశం కన్నా మెరుగైన స్థితిని సూచిస్తున్నదని కౌశిక్ బసు తెలిపారు. అలాగే, పాకిస్థాన్ బంగ్లా దేశ్ సహా భారత దేశ ఇరుగు పొరుగు దేశాలు అన్నీ అద్భుతంగా సూచీల వెంట పరుగులు తీస్తున్నాయని, ఒక్క భారత దేశం మాత్రమే మెల్లగా అడుగులో అడుగులు వేస్తూ నత్తనడక సాగిస్తోందని, తమ, మేధావిత్వం మొత్తం వొలక పోశారు.
ఆ వొలక పోతలను పట్టుకునే కావచ్చును, కేసీఆర్ వంటి రాజకీయ మేథావులు, శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్ బాటాలో అప్పులు చేసి సూచీలను సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. అయితే, సూచీల సోకుల కంటే ప్రజల వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని శ్రీలంక తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. సో .. ఇప్పటికైనా ఆర్థిక వేత్తల మేధావిత్వం ( డంబ్ ఇంటలెక్టువల్స్) అసలు రంగును, కేసీఆర్ వంటి రాజకేయ మేథావులు గుర్తిస్తే మంచిది, లేదంటే ఈ రోజు శ్రీలంక రేపు తస్మాత్ జాగ్రత్త అని క్షేత్ర సూచీలు హెచ్చరిస్తున్నాయని అంటున్నారు.