తెలంగాణ వాదుల రభస
posted on Apr 5, 2011 @ 1:57PM
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ వాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవలె తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బహిష్కరించబడిన శాసనసభ్యుడు కావేటి సమ్మయ్య అనుచరులు అదిలాబాద్ జిల్లాలో బైక్ ర్యాలీని నిర్వహించారు. వీరు తమ బైకులపై తెలంగాణ గుర్తుతో గల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అయితే వీరి బైక్ ర్యాలీని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణకు నమ్మక ద్రోహం చేసిన ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అనుచరులు తెలంగాణ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించడాన్ని వారు ఆక్షేపించారు. బైక్ ర్యాలీని తెలంగాణవాదులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా గత శాసనసభా కోటా శాసనమండలి ఎన్నికలలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సమితి నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయకుండా అధికార కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయనను టిఆర్ఎస్ బహిష్కరించింది.