తెలంగాణపై అధిష్టానానికి మేమే రూటు చూపిస్తాం
posted on Feb 23, 2012 @ 2:34PM
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ పార్టీని కాపాడేందుకు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకట రెడ్డి, రాంరెడ్డి దామోదర రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు శాశ్వత పరిష్కారం కోసం తాము ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. అధిష్టానానికి మేమే తెలంగాణపై పరిష్కారం చూపించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ అంశంపై మేము సంపూర్ణంగా చర్చించిన తర్వాత మిగతా వారితో చర్చిస్తామని, పార్టీలో అసంతృప్తులు నిజమేనని, తెలంగాణకు రెండేళ్లు సీమాంధ్రకు మూడేళ్లు సిఎం పదవి అని గతంలో జెసి చెప్పారని దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. త్వరలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రధాన అంశంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రెండు ప్రాంతాలలో పార్టీ నష్టపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.