తెలంగాణలో టార్గెట్ రాజకీయాలు
posted on Jul 11, 2022 @ 12:56PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్ధ ప్రధాని అంటూ నేరుగా మోడీని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీయేమో నియంత, అవినీతి, కుటుంబ పాలన అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. ఇక కాంగ్రెస్ కేసీఆర్ నూ, కేంద్రంలో బీజేపీ పాలననూ ఏక కాలంలో టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి అంతకంతకూ పెరిగిపోతోంది.
రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడినా రాజకీయ ఉష్ణోగ్రతలు మాత్రం రోహిణీకార్తెను మించి పోతున్నాయి. ఏప్రిల్ లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలతో మొదలైన ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల.. మేలో వరంగల్ లో జరిగిన రాహుల్ బహిరంగ సభతో మరింత పెరిగి.. తాజగా గత వారం హైదరాబాద్ వేదికగా జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాలతో తార స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత కూడా రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోందే కానీ తగ్గే పరిస్థితే కనిపించడం లేదు. సభలు, సమావేశాలు,మీడియా సమావేశాల ద్వారా ప్రధాన రాజకీయ పార్టీలు మూడూ తమతమ బలప్రదర్శనలకు దిగుతుండటంతో రాజకీయ వేడి పరిమితుల్లేకుండా పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
గతానికి భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో ‘టార్గెట్’ రాజకీయాలు జోరుమీద ఉన్నాయి. టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో దాదాపు 13 తీర్మానాలు చేసింది. వరంగల్ లో జరిగిన సభలో రాహుల్ గాంధీ తెలంగాణకు ఓ డిక్లరేషన్ ఇచ్చారు. బిజెపి సంకల్ప సభలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం అందిస్తున్న సహాకారం, చేస్తున్న అభివృద్దిని వెల్లడించింది. ఇలా తెలంగాణ ప్రజల దృష్టిని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలను మూడు ప్రధాన పార్టీలూ శక్తి వంచన లేకుండా చేశాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో మరో భారీ బహిరంగ సభకు రెడీ అవుతున్నారు.
ఏప్రిల్ లో జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేంద్రంపై, బిజెపి పాలనపై సిఎం కెసిఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అనంతరం వరంగల్ సభలో టిఆర్ఎస్ పై, సిఎం కెసిఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఆ తరువాత బిజెపి విజయ సంకల్ప సభలో తెలంగాణ ప్రభుత్వంపైనా, సిఎం కెసిఆర్ పైనా పలు రాజకీయ అస్త్రాలను సంధించారు. మోడీ మాత్రం తన ప్రసంగంలో తెలంగాణకు కేంద్రం అందించిన సహాయాన్ని ప్రస్తావించడానికే పరిమితమై వ్యూహాత్వకంగా వ్యవహరించారు.
ప్లీనరీ అనంతరం మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూటిగా సిఎం కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయనపైనే పోటీ చేసి ఓడిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై రాజకీయ చర్చోపచర్చలు సద్దుమణగక ముందే.. సిఎం కెసిఆర్ ఆదివారం మీడియా సమావేశంలో నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ అసమ్మర్థ పాలన అంటూ దుయ్యబట్టారు. ఇలా ఒకరి పార్టీ తరువాత మరో పార్టీ రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలను పెంచేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
తేదీ చెప్పండి అసెంబ్లీ రద్దుకు రెడీ అంటూ సీఎం సిఎం కెసిఆర్ బంతిని బీజేపీ కోర్టులో పడేయడంతో రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువగా ముందస్తు ఎన్నికలు చర్చ జోరందుకుంది. కేసీఆర్ పార్టీ సవాల్ ను బీజేపీ స్వీకరించి సై అంటూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా తానే ముందుగా ముందస్తు నగారా మోగిస్తే.. అసెంబ్లీ రద్దు వరకూ మౌనంగా ఉండి ఆ తరువాత ముందస్తుకు కాకుండా బీజేపీ రాష్ట్రపతి పాలనకు మార్గంసుగమం చేస్తుందన్న అనుమానం కేసీఆర్ దిఅని పరిశీలకులు చెబుతున్నారు. ముందస్తు వచ్చినా, రాకున్నా.. ప్రస్తుత రాజకీయ వేడి ఎన్నికల వరకూ కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చే నెలలో మంత్రి కేటీఆర్ ఇలాకాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ అనంతరం రాజకీయ వేడి, విమర్శల దాడి మరింత పెచ్చరిల్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.