సర్వోన్నత న్యాయస్థానం తీర్పులూ చట్టాలే.. సుప్రీంకోర్టు
posted on May 3, 2023 @ 9:48AM
దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే తీర్పులు ఈ దేశ చట్టాల వంటివేనని, వాటిని ఎవరూ ధిక్కరించడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది జులైలో వెలువరించిన ఓ తీర్పు అమలుకు సంబంధించి దాఖలైన కేసులో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ ఎ. అమానుల్లా తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పులు అమలుకావడం లేదనే కేసులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నాయని కోర్టు పేర్కొంది.
తమ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచడం సముచితమని భావిస్తున్నామని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదని దాఖలు చేసే కేసులను స్వీకరించబోమని పేర్కొంది. అలాంటి కేసులను తమ ముందుకు తీసుకురావద్దని కోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థాన తీర్పులు సక్రమంగా అమలుకాని పరిస్థితుల్లో హైకోర్టులు అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
తమ పర్యవేక్షణలోని సబ్ ఆర్డినేట్ కోర్టులు... చట్ట నిబంధనల ప్రకారం పనిచేసేలా చూడాల్సిన బాధ్యత హైకోర్టులపైనే ఉంటుందని గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు ఇచ్చే ఆదేశాలు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను అతిక్రమించేలా ఉంటే వాటిని ఉపసంహరించుకునేలా చేయాలని, అటువంటి మేజిస్ట్రేట్లను మెరుగైన శిక్షణ కోసం జ్యుడీషియల్ అకాడమీకి పంపించాలని కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. నిందితులకు బెయిల్ మంజూరు నిబంధనలు క్రమబద్ధం చేయడం గురించి పలు మార్గదర్శకాలను అప్పుడు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురావడాన్ని పరిశీలించాలని కేంద్ర
ప్రభుత్వానికి సూచించింది. సుప్రీం కోర్టు వెలువరించే తీర్పులు..ఈ దేశ చట్టాల వంటివే, వాటి నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కోర్టు ఆదేశాలను పాటించకుండా, అమలు చేయకుండా ఉల్లంఘించే ప్రభుత్వాలకు విస్ఫష్ట హెచ్చరిక వంటివేననడంలో సందేహం లేదు.