టీటీడీలో రివర్స్ టెండరింగ్ రద్దు!

Publish Date:Oct 5, 2024

తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా వకుళ మాత అన్నప్రదాస వంటశాలను ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తిరుమల పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం ఆయన వకుళ మాత వంటశాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆయన పద్మావతి అతిథిగృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.  అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పెంచాలని  ఇందుకోసం  ప్రణాళికతో పనిచేయాలన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్నారు.  ఇదిలా వుండగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ టిటిడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అనుసరించిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది.

మద్య నిషేధం ఎత్తివేత.. ప్రశాంత్ కిశోర్ హామీ మందుబాబుల ఓట్ల కోసమేనా?

Publish Date:Oct 3, 2024

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోన్ సొంత కుంపటి జన్ సురాజ్ ను ప్రారంభించేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి ఆయనే అధినేత, ఎన్నికల వ్యూహకర్త కూడా. ఆయన వ్యూహాల పదును పార్టీని ప్రారంభించిన మొదటి రోజే చూపారు. బీహార్ లో అత్యంత కీలకంగా మారిన మద్య నిషేధంపై ఆయన చేసిన ప్రకటన రాజకీయ పండితులను  సైతం విస్మయపరిచింది. బీహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో తన పార్టీ జన్ సురాజ్ విజయం సాధించి అధికారం చేపడితే.. వెంటనే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు.  సాధారణంగా ఏ పార్టీ అయినా సరే మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటిస్తారు. కానీ నలుగురూ నడిచే దారిలో నేనసలు నడవను అనే ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని తాను అధికారంలోకి రాగానే ఎత్తి వేస్తానని ప్రకటించారు.  మహిళల ఓట్ల కోసం రాజకీయ పార్టీలూ తరచూ ఎత్తుకునే మద్యపాన నిషేధం నినాదాన్ని కాదని ఆయన ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించడం రాజకీయంగా సాహసమనే చెప్పవచ్చు. మందుబాబుల ఓట్ల కోసమే ప్రశాంత్ కిశోర్ ఈ ప్రకటన చేశారా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తం అవుతున్నాయి. అయితే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తానని తాను  చేసిన ప్రకటన పూర్తిగా ఆర్థిక కారణాలతోనేనని ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు.  మద్యపాననిషేధం ఎత్తి వేయడం ద్వారా రూ.20వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ అవుతుందన్నారు.వాటిని విద్యావ్యవస్థ పటిష్టం చేయడానికి ఖర్చు చేస్తామన్నారు. రానున్న పదేళ్లలో ప్రపంచస్థాయిలో విద్యావ్యవస్థ అభివృద్ధి చేయడానికి ఐదులక్షల కోట్లు వ్యయం చేస్తానని చెప్పారు. జన సురాజ్ మార్టీకి మాజీ ఐఏఎస్ అధికారిణి ని కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా నియమించిన ప్రశాంత్ కిషోర్..  విద్యా,ఉపాధి రంగాలు అభివృద్ధే తన ఎన్నికల ఎజెండాగా చెప్పారు. ఆయన రాజకీయ ఎజెండా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? ఎలా ఉన్నాయన్నది పక్కన పెడితే మద్య నిషేధం ఎత్తివేత ప్రకటన ద్వారా ఆయన మందుబాబుల అభిమానానికి పాత్రుడయ్యారనడంలో ఎంత మాత్రం సందేహం లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.   ఇక జనసురాజ్ విషయానికి వస్తే.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 (బుధవారం ) ఆయన తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన తాను బీజేపీతో కలిసి పయనించే అవకాశం ఇసుమంతైనా లేదన్నారు. సొంతంగా, స్వతంత్రంగా జనసురాజ్ ఎదుగుతుందనీ, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత కాలం వేరే పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేసి వాటికి అధికారాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ తన పార్టీ జన సురాజ్ కోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తారన్న ఆసక్తి బీహర్ కే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ ద్వారా ఏ మేరకు సక్సెస్ అవుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

వరదల్లో  చనిపోయిన వారికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా: రేవంత్ రెడ్డి 

Publish Date:Sep 2, 2024

తెలంగాణలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. అనేక మంది మృత్యువాతపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్ష సూచన రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ అప్రమత్తం చేసుకోవాలని రేవంత్ సూచన చేశారు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వరద పోటెత్తింది. అనేక మంది మృత్యువాతపడ్డారు. వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రాన్ని సాయం కోరాలని రేవంత్  అధికారులను ఆదేశించారు. జరిగిన నస్టంపై అంచనా వేసి నివేదిక ఇవ్వాలని రేవంత్ సిఎం అధికారులకు హుకుం జారీ చేశారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. వ‌ర‌ద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్లు విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేస్తుంటారా? ఈ నిజాలు  తెలుసా?

Publish Date:Oct 4, 2024

సిట్టింగ్ వర్క్ ఈ కాలంలో చాలా సాధారణం.  ప్రతి ఒక్క చోట ప్రతి పనికి కంప్యూటర్లు ఉపయోగిస్తున్న కారణంగా అధిక శాతం మంది సిట్టింగ్ వర్క్ మోడ్ లోనే ఉంటారు. కేవలం కార్పోరేట్ ఆఫీసులు,  సంస్థలలోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు,  ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులలో కూడా ఇదే విధానమే ఎక్కువగా ఉంటోంది.  అయితే ఇలా సిట్టింగ్ పొజిషన్లో గంటల తరబడి పనిచేయడం వల్ల ఏం జరుగుతుందో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చుని పని చేయడం అంటే అనారోగ్యాలకు వెల్కమ్ చెబుతున్నట్టేనట.  ఇది శరీరం పై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే.. మెడ నొప్పి.. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి వస్తుంది. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే వెన్ను పాముపై ఒత్తిడి పడుతుంది.  ఇది కాస్తా వెన్నునొప్పికి,  మెడ నొప్పికి దారితీస్తుంది. భుజాలు.. చాలామంది భుజాలు బిగుసుకుపోయినట్టు ఉన్నాయని ఫిర్యాదు చేస్తుంటారు.  సిట్టింగ్ వర్క్ ఎక్కువ చేసే వారి నుండే ఈ ఫిర్యాదు ఎక్కువ ఉండటం కూడా గమనించవచ్చు. మొదట్లో భుజాలు బిగుసుకుపోవడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపించినా సిట్టింగ్ వర్క్ బాగా అలవాటు అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని అనుకుంటారు. కానీ  ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది శాశ్వత సమస్యగా మారుతుంది. ఊబకాయం.. ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల మనిషి శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి.  ముఖ్యంగా ఆఫీసు సమయాలలో ఆహారం తీసుకున్న తరువాత వెంటనే కూర్చుని పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారిలో కేలరీలు ఎక్కువగా పేరుకుపోయి  బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇది కాస్తా కాలక్రమంలో ఊబకాయానికి కారణమవుతుంది. టెన్షన్.. ఎక్కువసేపు సిట్టింగ్ వర్క్ చేసేవారిలో మానసిక ఒత్తిడి సమస్య వస్తుంది.  ఇది క్రమంగా టెన్షన్ కు దారితీస్తుంది.  ఈ కారణం వల్లనే సిట్టింగ్ వర్క్ చేసే చాలామందిలో  టెన్షన్ ఎక్కువగా ఉండటం గమనిస్తుంటాం. పరిష్కారాలు.. సిట్టింగ్ వర్క్ ఎక్కువగా చేసేవారు తమ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండకూడదు అంటే పని చేస్తున్నప్పుడు విరామాలు తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు  తీసుకోవడం వల్ల పని నుండి రిలాక్స్ అవ్వడమే కాకుండా శరీర కదలికలకు కూడా అవకాశం ఉంటుంది.  చిన్న విరామం సమయంలో ఆఫీసు లేదా ఇంట్లో అయినా కనీసం ఒక వంద అడుగులు అయినా నడుస్తుండాలి.  బాత్రూమ్ కు వెళ్లి రావడం, మంచి నీరు తెచ్చుకుని తాగడం, ఏదైనా సందేహం కారణంతో దూరంగా ఉన్న కొలీగ్ దగ్గరకు వెళ్ళి రావడం వంటివి చేయవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువ సేపు వర్క్ చేసేవారు తాము కుర్చునే కుర్చీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుమారు 7 నుండి 8 గంటల సేపు కూర్చుని వర్క్ చేస్తుంటారు కాబట్టి మంచి కుర్చీని ఎంపిక చేసుకోవాలి.  నడుము, వీపు, భుజాలు, మెడ మొదలైన వాటికి సపోర్ట్ ఉండేలా ఉన్న కుర్చీ ఎంచుకుంటే చాలా వరకు శరీర సమస్యలను అధిగమించవచ్చు.                                                        *రూపశ్రీ.
[

Health

]

ఈ డ్రింక్స్ తాగండి.. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి..!

Publish Date:Oct 4, 2024

  ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవాలు.  ఇవి శ్వాస వ్యవస్థకు మూలం.  మనం పీల్చేగాలిలో ఆక్సిజన్ ను గ్రహించి,  కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు పంపడంలో ఊపిరితిత్తులదే కీలక పాత్ర.  సాధారణంగా ఊపిరితిత్తులు ధూమపానం వల్ల చెడిపోతుంటాయి.  ధూమపానం చేయనివారు కూడా ఊపిరితిత్తులు పాడైపోయి సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. దీనికి కారణం పరోక్ష ధూమపానం, అలాగే వాతావరణ కాలుష్యం కూడా.  ఊపిరితిత్తులు పాడైపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.  కళ్లలో చికాకు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా ఉంటాయి.  అయితే ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే  కొన్ని పానీయాలు బాగా హెల్ప్ చేస్తాయి. తులసి నీరు.. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడతాయి.  రోజూ తులసి ఆకులను నీటిలో వేసుకుని తాగుతున్నా, తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకుంటున్నా మంచి ఫలితాలు ఉంటాయి. అల్లం టీ.. అల్లంలో కూడా యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఛాతీలో, గొంతులో పేరుకున్న కఫాన్ని బయటకు పంపడంలో అల్లం బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. అల్లాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుదీనా టీ.. పుదీనాలో మెంథాల్ ఉంటుంది.  ఇది శ్వాస గొట్టాలను తెరవడంలో,  శ్వాస బాగా ఆడటంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను క్లియర్ చేస్తుంది.  పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. లెమన్ వాటర్.. నిమ్మకాయ నీరులో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.  ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. నీళ్లలో నిమ్మరసం కలుపుకుని రోజూ తాగుతుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వాము నీరు.. వాము కూడా ఛాతీలోనూ, గొంతులోనూ పేరుకున్న కఫాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో కూడా సహాయపడుతుంది. వాము గింజలను నీటిలో వేసి మరిగించి అందులో కొద్దిగా బెల్లం కలిపి తాగితే మంచిది.                                                  *రూపశ్రీ.