విభజనే అభివృద్దా?
posted on Sep 13, 2013 @ 2:49PM
ఆంధ్ర తెలంగాణ అంటూ ఇరు ప్రాంత ప్రజలు గత 10సంత్సరాలుగా ఉద్యమాలతో ఊగిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి?తెలంగాణ ప్రాంతం అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉందని,ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే వాదనతో కె.సి.ఆర్ ఆధ్వర్యంలో 13 సంత్సరాల క్రితం టి.ఆర్.ఎస్ పార్టీ పుట్టింది. కాని వాస్తవానికి అప్పటికే తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అనేది కాదనలేని వాస్తవం.ఎన్.టి రామారావు పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం తెలంగాణలో,జరిగిన అభివృద్ధిని ఎవరైనా అంగీకరించవలసిందే. నిజానికి ఆ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అడ్డుకట్ట వేసింది అక్కడి దొరలే. కేవలం దొర పెత్తనం కారణంగానే ఆ ప్రాంతంలో వెనుకబాటుతనం తాండవించింది. ఆనాడు ఆ వెనుకబాటు తనం నుండి ఆ ప్రాంతాన్ని బయటకు తీసుకురావాలని కాని,ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కాని తెలంగాణ ప్రాంత నేతలెవరు ప్రయత్నించక పోవటం కడు బాధాకరం. కానీ ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఎందుకు గమనించలేదు?గుర్తించలేదు?
ఇక సీమాంద్ర ప్రాంత విషయానికి వస్తే అక్కడ కూడా అభివృద్ధి అంటే కేవలం వ్యవసాయం మాత్రమే. పారిశ్రామిక అభివృద్ధి కేవలం ఒక్క వైజాగ్ లోనే జరిగింది. అది కేవలం ఒక్క స్టీల్ ప్లాంట్ ద్వారా మాత్రమే జరిగింది. మిగతా ప్రాంతాలలో ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి కాని,
విద్యారంగ అభివృద్ధి కాని,వానిజ్యపరమైన అభివృద్ధి కాని వైద్య పరమైన అభివృద్ధి కాని జరుగలేదు.
దీనికి కారణం ఎవరు?ప్రజలా?నేతలా?రాజకీయముసుగులో ఉన్న పెట్టుబడిదారులు అనేది జగమెరిగిన సత్యం. ఆ ఒక్క కారణం గానే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. మరి ఈనాటికి యావత్ ఆంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు చాలా ఉన్నాయి. అరకు నుండి ఆదిలాబాద్ వరకు చాలా గిరిజన ప్రాంతం ఉంది. వారు ఈనాటికి నాగరికతకు ఆమడదూరంలో ఉన్నారు. దీనికెవరు బాధ్యులు?చేతకాని ఈ రాజకీయ నేతలు కాదా?ఒక ప్రాంతంలో అభివృద్ధి జరగలేదంటే,ఒక ప్రాంతం వెనుకబడి ఉందంటే దానికి పరిష్కార మార్గం ఆ ప్రాంతాన్ని రెండుగా విభజించటమేనని ఏ శాస్త్రం చెబుతోంది? ఆయా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటే ఏ ప్రజలు వద్దన్నారు వీళ్ళని?
స్వాతంత్ర్యం వచ్చి 67 సంత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉండటానికి ఎవరు బాధ్యులు?ప్రజాసంక్షేమం అభివృద్ధి చెందవలిసిన చోట లంచగొండితనం,అవినీతి,అక్రమాలు అన్యాయాలు అభివృద్ధి చెందాయి. ఇది ఎవరి అసమర్ధతకు తార్కాణం అనిచెప్పాలి. కాంగ్రెస్ ఉన్నతికి భిక్ష పెట్టింది ఆంద్ర రాష్ట్రం. దేశానికి అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రం. దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలలో ఆంద్ర రాష్ట్రం ఒకటి. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం,ఆంధ్రరాష్ట్రం. అలాంటి సమైక్య జాతిని రెండుగా చీల్చి ఒకేజాతి ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి ఈ కాంగ్రెస్ పార్టీ సాధించేదేమిటి?
ఒకనాడు ఒకరాజకీయ నేత రాజకీయ లబ్ధి కోసం పురుడుపోసుకున్న వాదం నేడు తెలుగుజాతిని విచ్చిన్నం చేసే దిశగా వెళ్తోంది. విభజన తర్వాత జరిగే అభివృద్ధి ఏమిటి?నేడు ఉన్న అభివృద్ధి కూడా నిలబడదు. ఆంద్ర రాష్ట్రం అంటే నిత్యం రావణకాష్టం అనే అభిప్రాయం యావత్ ప్రపంచానికి తెలిసింది. తద్వారా ఆంద్ర రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు,ఉపాధి అవకాశాలు వెనక్కు మళ్ళిపోతున్నాయ్. భవిష్యత్ మరింత ఆందోళనకరంగా మారనున్న ఈ తరుణంలో ప్రజలు చాలా తెలివిగా ఆలోచించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు మొదలైన ఈ విద్వేషాలు ఇక్కడితో ఆగే పరిస్థితి ఎంత మాత్రం లేదు. విభజన కనుక ఖచ్చితంగా జరిగితే నీటి విషయంలో ఇరు ప్రాంత ప్రజల మధ్య భయంకరమైన గొడవలు జరుగుతాయి. రాజధాని విషయంలో సీమాంద్ర ప్రాంత వాసులు నిత్యం కొట్టుకు చావాల్సిందే. దీనికి ఎవరు భాద్యులు?
ఈరోజున్న కాంగ్రెస్ కాని,తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న బి.జె.పి కాని రాబోయే భవిష్యత్తులో ఆంద్ర రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయాలో,అసలు న్యాయం అంటే ఎలా చేయాలో ఖచ్చితంగా తెలియదు. మరి ఏ అభివృద్ధి కోసం,ఏ న్యాయం కోసం ప్రజలు పోరాడాలి?అను నిత్యం ఇలా కొట్టుకు చావాలి. ఇప్పటికైనా ఈ నేతలు బుద్ధితెచ్చుకుని అభివృద్ధి అంటే విభజన కాదు అని తెలుసుకుంటారా?