బాబా ఆరోగ్యం పై తాజా బులెటిన్
posted on Apr 5, 2011 @ 9:41AM
పుట్టపర్తి : సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి వాస్తవాలను వెల్లడించడం లేదని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను దాస్తున్నారని విమర్శిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు. దేశ, విదేశాల నుంచి భక్తులు పుట్టపర్తి వస్తున్నారు. కాగా, సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై తాజా బులిటెన్ విడుదల చేశారు. బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. హార్ట్ బీట్, బీపీ నార్మల్‌గానే ఉన్నట్లు వెల్లడించారు. ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని సఫాయా పేర్కొన్నారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈరోజు మధ్యాహ్నాం పుట్టపర్తి రానున్నారు. సత్య సాయిబాబాకు కిడ్నీకి సంబంధించిన వైద్యం జరుగుతోందని రాష్ట్ర మంత్రి గీతా రెడ్డి చెప్పారు. పుట్టపర్తి, ధర్మవరం గ్రామాల్లో నాలుగు వేల మంది పోలీసులను మోహరించారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రామాల్లోనూ 144వ సెక్షన్ విధించారు. పలువురు ప్రముఖులు పుట్టపర్తి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏర్పాట్లను, ప్రముఖుల తాకిడి వల్ల సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి నిజాలు దాస్తున్నారనే అనుమానాలను భక్తుల వ్యక్తం చేస్తున్నారు.