ఆ విగ్రహ నిమజ్జనమే బాబాకు కీడు?
posted on Apr 5, 2011 9:22AM
ధర్మవరం: పుట్టపర్తి గ్రామ దేవత అయిన సత్తెమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసి, కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే ప్రస్తుతం సత్యసాయి ఆరోగ్యం ఆందోళనకరంగా మారడానికి కారణమని పలువురు స్థానికులు భావిస్తున్నారు. దీంతో సత్తెమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన బుక్కపట్నం చెరువు వద్దకు చేరుకుని.. విగ్రహాన్ని వెతికి తీసే పనిలో పడ్డారు. పుట్టపర్తి గ్రామదేవత సత్తెమ్మ విగ్రహం దెబ్బతిన్నదంటూ దాని స్థానంలో నూతన విగ్రహాన్ని ఆరు నెలల క్రితం సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ప్రతిష్ఠ చేయించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి సత్యసాయి కుటుంబంలో అరిష్టం చోటు చేసుకుందన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం సత్యసాయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడానికి ఇది కూడా ఒక కారణమన్న భావన పలువురు భక్తుల్లో వ్యక్తమవుతోంది. నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు పురాతన విగ్రహాన్ని బుక్కపట్నం చెరువులో పడేశారు. దీంతో సోమవారం ఒక మహిళకు సత్తెమ్మ దేవత ఆవహించి తన పూర్వపు విగ్రహాన్ని తొలగించినందువల్లనే పుట్టపర్తిలో అరిష్టాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నట్టు భక్తుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 10గంటల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు బుక్కపట్నం చెరువు వద్దకు చేరుకుని జనరేటర్ల ద్వారా లైట్లు అమర్చుకుని చెరువులోకి దిగి పురాతన విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.