శశికళ విన్నపాలు జయలలిత వినేనా..?
posted on Nov 21, 2016 @ 10:43AM
రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ పుష్ప మళ్లీ సొంత పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దపడుతున్నారా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ నుండి శశికళ పుష్పను బహిష్కరించిన సంగతి తెలిసిందే. సొంత పార్టీపైనా ఆమె ఆరోపణలు చేసినందుకుగాను ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు ముఖ్యమంత్రి జయలలిత. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో నాలుగు నియాజక వర్గాలకు ఉపఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె అన్నాడీఎంకే తరపున ప్రచారాన్ని ప్రారంభించారు. రెండాకుల గుర్తుకు ఓటు వేసి ఏఐఏడీఎంకేను గెలిపించాలని వాట్స్ యాప్ ద్వారా ఆమె ఓటర్లను కోరారట.
ఇక శశికళ చేసిన దానికి పార్టీ నేతలు స్పందించి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి ద్వారా ఆ పార్టీలో చేరాలనుకున్న శశికళ ప్రయత్నాలను ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్ అడ్డుకున్నారని... కాంగ్రెస్, బీజేపీల్లో చేరడానికి ఢిల్లీలో ఆమె చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని... అందుకే మళ్లీ అన్నాడీఎంకేలో చేరడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. జయలలిత ఎట్టి పరిస్థితుల్లో క్షమించరని చెబుతున్నారు. మరి, శశికళ చేస్తున్న విన్నపాలను జయలలిత మన్నిస్తారా? లేదా? తెలవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.