గొడవలు చేయండి, రెచ్చిపోండి.. కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల పిలుపు!?
posted on May 30, 2024 9:00AM
పద్ధతి పాడూ అక్కర్లేదు, తప్పు ఒప్పులతో పని లేదు. వైసీపీకి తన ప్రయోజనాలు నెరవేరితే చాలు. రాష్ట్రం, జనం సంగతి పట్టదు. ఐదేళ్ల పాటు ఇష్టారీతిగా, అడ్డగోలుగా అక్రమ మార్గాలలో రాష్ట్రాన్ని పాలించిన జగన్ సర్కార్.. ఇప్పుడు పోలింగ్ తరువాత అధికారం అందని ద్రాక్ష అన్న సంగతి తేలిపోయింది. నక్క కూడా అందని ద్రాక్ష పుల్లన అని భావించి వెళ్లిపపోతుంది. కానీ తమకు అందని దానిని కూడా అందుకుని పెత్తనం చెలాయించాలని చూస్తోంది వైసీపీ.
అందు కోసం నిబంధనలను తుంగలోకి తొక్కి దౌర్జన్యాలు, దాడులను ఆశ్రయించడానికి కూడా వెనుకాడటం లేదు. కౌంటింగ్ కేంద్రాలలో రూల్స్ విని కూర్చోవడం కాదు, గందరగోళం సృష్టించి రభస చేయండంటూ బాహాటంగానే పార్టీ ఏజెంట్లకు పిపులు నిస్తోంది. రూల్స్ మాట్లాడే వాళ్లు అసలు రావలసిన అవసరం లేదు. గందరగోళం సృష్టించి, వాదనలతో ఉద్రిక్తతలు నెలకొనేలా చేయగలిగే వారే ఏజెంట్లుగా కూర్చోండి అంటూ సకల శాఖల మంత్రిగా చెలామణి అయిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు బోధించారు. కాదు కాదు ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ఆరంభం నుంచీ మన ఆగడాలు సాగకుండా ఈసీ వ్యవహరించింది. ఇది చాలా అన్యాయం. ఐదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మనను ఈసీ నియంత్రించడం అన్యాయం. ఆ అన్యాయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. అందుకు అవసరమైతే పోలింగ్ రోజున పల్నాడులో జరిగిన హింసాకాండ వంటిది రగల్చడానికైనా వెనుకాడవద్దన్నది ఆయన పోలింగ్ ఏజెంట్లతో జరిపిన సమావేశంలో చేసిన ప్రసంగ సారాంశం.
ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని కౌంటింగ్ లో గందరగోళం జరుగుతుందని చెప్పేశారు. ఆ గందరగోళం ఎలా సృష్టించాలో సజ్జల ఏజెంట్లతో మీటింగ్ పెట్టి మరీ ఉద్బోధించారు. మళ్లీ అధికారంలోకి వైసీపీయే వస్తుందన్న నమ్మకంతో తెలుగుదేశం ఏజెంట్లను అడ్డుకోండి అని పిలుపునివ్వడం చూస్తుంటే.. కౌంటింగ్ సజావుగా, సక్రమంగా జరగకుండా అడ్డుకోవడానికి వైసీపీ కుట్రలు చేస్తున్నదన్న సంగతి ఇట్టే అవగతమౌతోంది.