జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రేవంత్ రెడ్డి..
posted on Sep 22, 2021 @ 12:59PM
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తన అనుచరులపై కేసులు పెట్టడంపై ఆయన పోలీసులను ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీఎస్ కు రావడంతో అక్కడికి కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు మంగళవారం టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు తక్కువగా ఉండటంతో కొంత సేపు రణరంగం నెలకొంది. చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి తరలించడంతో టెన్షన్ తగ్గింది.
అయితే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఈ విషయంపైనే పీఎస్ కు వచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడితే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కోరారు.