నీలం తెచ్చిన జలప్రళయం

 

 

నీలం తుపాను వల్ల కురిసిన కుంభవృష్టి రాష్ట్రంలో జలప్రళయాన్ని తీసుకొచ్చింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి జిల్లాలకు జిల్లాలు జలమయమయ్యాయి. ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయ్. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయ్.

 

తూ.గో జిల్లాలో తాండవ నది ప్రవాహ ఉద్ధృతి అంతకంతకీ పెరిగిపోతోంది. తుని చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రహదారులమీద వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయ్. చాలాజిల్లాల్లో పంటలు నీట మునిగిపోయాయ్. కలెక్టర్లు ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.

 

రైల్వేట్రాక్ ల మీద నీళ్లు చేరడంతో రాష్ట్రంలో చాలా మార్గాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయ్. విశాఖ, విజయవాడ మధ్య చాలా సర్వీసులు రద్దయ్యాయ్. దాదాపు 1200 గ్రామాలు పూర్తి అంథకారంలో రాత్రంతా మగ్గాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లోకి వరదనీరు భారీగా చేరుతోంది. చాలా ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో సహాయచర్యలుకూడా ఆలస్యమవుతున్నాయని జిల్లా కలెక్టర్లు చెబుతున్నారు.